అభిషేక్ మెరుపుల వెనుక యువరాజ్ శిక్షణ!

ఫిబ్రవరి 2, 2025న సాయంకాలం, ఆదివారం పూట చాలామంది టీవీ సెట్లకే అతుక్కుపోయారు. ఎందుకంటే, మళ్లీ ఒక యువరాజు చెలరేగిపోతున్నాడు. ఇండియా టీంలో ఆడింది ఒకే ఒక్క యువరాజు కదా.. ఆ మరో యువరాజెవరంటారా…? అచ్చూ ఆ కుర్రాడు యువరాజంత ధాటితో ఆడేందుకు కారకుడు యువరాజ్ సింగే కాబట్టి. ఆ హీరోనే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా లాస్ట్ ఐదో టీ 20లో 37 బాల్స్ లోనే సెంచరీతో దుమ్మురేపిన అభిషేక్ శర్మ. అసలు యువరాజు, అభిషేక్ గురుశిష్యుల బంధానికి సంబంధించి… అభిషేక్ ను యువరాజ్ ట్రైన్ చేస్తున్న తీరుపై గతంలోనే ఒక వీడియో తెగ వైరలైంది. యువరాజ్ అనే గురువుతో తన బంధమెలాంటిది, యువరాజ్ ఇచ్చిన శిక్షణెలాంటిదో ఆ శిష్యుడు అభిషేక్ మాటల్లోనే ఓసారి వినొద్దాం పదండి.

ఇంగ్లాడ్-వర్సెస్ ఇండియా చివరి టీ 20లో భారత్ 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. అందులో సగానికెక్కువ పరుగులు అంటే 135 రన్స్ చేసిన మిషన్ పేరు అభిషేక్ శర్మ. ఎంత బ్యాటింగ్ పిచ్ అయినా.. ప్రత్యర్థిపై క్రీజులోకి వచ్చినప్పట్నుంచే ధాటిగా దాడి చేయడమంటే… కోలుకోలేకుండా, ఆరంభంలోనే ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నమే. అదే చేశాడు అభిషేక్. అందుకే అభిషేక్ పేరు ఇప్పుడు మళ్లీ మారుమ్రోగుతోంది.

అభిషేక్ జర్నీ!

మనం ఈమధ్య కాలంలో ఇండియన్ క్రికెట్ గ్రేట్ వాల్ రాహూల్ ద్రవిడ్ తయారుచేసిన మెరికలను చూశాం. వారిగుంచి విన్నాం. కానీ, భారత క్రికెట్ లో ఓ పెను సంచలనం, కెప్టెన్ కావల్సిన అర్హత ఉండీ కాలేనివాడు, ఆరు బాల్స్ లో ఆరు సిక్సులు కొట్టి ఔరా అనిపించినవాడు.. నాట్ వెస్ట్ సీరీస్ లో ఇంగ్లాండ్ వంటి టీమ్ ను సొంతగడ్డపైనే మట్టికరిపించినవాడు.. క్రికెట్ లో ప్రత్యర్థులతో ఆడి తుత్తునియలు చేసినవాడు.. వన్ డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఇండియా గెలిచిన అన్ని ఫార్మాట్స్ లోనూ సభ్యుడు. 2011 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్. బ్లడ్ వామ్టింగ్స్ చేసుకున్నా పట్టువదలని విక్రమార్కుడై వెస్ట్ ఇండీస్ తో 113 రన్స్ చేసిన నాటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. దేశం కోసం చిత్తశుద్ధితో ఆడినవాడు.. చివరకు క్యానర్ పైనా పోరాటం చేసి గెల్చినవాడు యువరాజ్ సింగ్. అలాంటి యువరాజంటే అభిషేక్ శర్మ కు పిచ్చి క్రేజ్. అదే అభిషేక్ ను యువరాజ్ కు శిష్యుడిగా మార్చింది. యువరాజ్ అభిషేక్ కు శిక్షణ ఇచ్చేలా చేసింది.

యువరాజ్ సింగ్ వద్ద శిక్షణ తన ఆలోచనా విధానాన్నే మార్చేసిందంటాడు అభిషేక్. తన ఆత్మవిశ్వాసం ఇనుముడించడంలో యువరాజ్ ఎంత ప్రత్యేకమో ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ చెప్పుకొచ్చాడు.

భారత క్రికెట్లో ఇప్పుడు 25 ఏళ్ల అభిషేక్ భవిష్యత్ సూపర్ స్టార్. తన ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్ నే ఎంతో ఆకట్టుకునేలా ఆరంభించి దూకుడు ప్రదర్శిస్తున్న గడుగ్గాయి. టెస్ట్, వన్డే, టీ20 ఇలా మూడు ఫార్మాట్లలోనూ కీలకపాత్ర పోషించే స్థాయిలో స్టేబుల్ క్రికెటర్ గా భవిష్యత్ భారతపు అంచనాల్లో అభిషేక్ పేరు తప్పకుండా ఉంటుంది. పైగా బౌలర్ గా కూడా రాణించగల్గిన సత్తా అభిషేక్ ను ఆల్ రౌండర్ గా నిలబెట్టేది. ఫీల్డింగ్ లోనూ అభిషేక్ నైపుణ్యం అబ్బురపరుస్తుంది. 2016లో ఇండియా అండర్ 19 జట్టుకు ప్రాతినిథ్యం వహించడంతో అభిషేక్ ప్రొఫెషనల్ క్రికెట్ లైఫ్ జర్నీ పట్టాలెక్కింది. ప్రృథ్వీషా నేతృత్వంలో న్యూజిలాండ్ లో కప్పు గెల్చుకున్న ఆ జట్టులో అభిషేక్ కీలక ఆటగాడు.

2018లో అభిషేక్ ఆటకు ఫిదా అయిన ఢిల్లీ డేర్ డేవిల్స్ అతణ్ని 55 లక్షలకు కొనుగోలు చేసింది. అలా ఐపీఎల్ ఆరంగ్రేటంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ పై 19 బంతుల్లోనే 46 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ తో జట్టు కట్టాడు.

“Well played @IamAbhiSharma4! That’s where I want to see you! 🔥 Proud of you 👊🏻💯” Yuvraj reacted on X.

ఇక యువరాజ్ తో అభిషేక్ బంధం, శిక్షణ!

ఇదీ యువరాజ్ సింగ్ తాజాగా ఇంగ్లాండ్ పై ఆదివారం రోజు 13 సిక్సులు, 7 ఫోర్లతో చెలరేగి 135 రన్స్ బాదిన తన శిష్యుడు అభిషేక్ గురించి చేసిన తాజా పోస్ట్. తాను ఏవిధంగానైతే అభిషేక్ ను చూడాలనుకున్నాడో ఆ విశ్వరూపాన్ని ఇప్పుడు అభిషేక్ చూపిస్తున్నాడంటూ కొనియాడాడు యువరాజ్ సింగ్.

ఆసక్తికరమైన మరో విశేషమేంటంటే అభిషేక్ 17 బాల్స్ లో 50 రన్స్ కొట్టిన సెకండ్ బెస్ట్ అయితే.. గతంలో ఇదే ఇంగ్లాండ్ తో 2007 టీ20 వరల్డ్ కప్ లో యువ రాజ్ సింగ్ 12 బంతుల్లోనే 50 రన్స్ బాదిన ఫస్ట్ బెస్ట్. అలా ఈ రికార్డ్స్ రెండూనూ గురు, శిష్యుల పేరుపైనే నమోదయ్యాయి.

యువరాజ్ కుంటే ముందు రాహూల్ ద్రవిడే అభిషేక్ కూ మెంటార్. తాను అండర్ 19 జట్టులో ఆడుతున్నప్పుడు నీ సహజసిద్ధమైన ఆటనే ఆడాలి. దాన్నే మెరుగుపర్చుకోవాలి. నీ బ్యాటింగ్, బౌలింగ్ శైలిలో ఎలాంటి లోపాలు లేవు. కాకపోతే నిన్ను నువ్వు ఎంత మెరుగుపర్చుకుంటే నీకంత లైఫ్ ఉంటుందని రాహూల్ ద్రవిడ్ హితబోధ చేసేవాడట. ఆ మాటలు ఎప్పటికీ గుర్తుంటాయంటాడు అభిషేక్.

అది కరోనా కాలం. దేశమంతా లాక్ డౌన్. అదిగో ఆ సమయంలో యువరాజ్ తో జట్టు కట్టాడు అభిషేక్. యువరాజ్ సింగ్ అభిషేక్ శర్మను ట్రైన్ చేస్తున్న జిమ్, మైదానంలోని వీడియో క్లిప్ గత కొన్నేళ్ల క్రితం వైరల్ గా మారింది. దాన్ని యువరాజ్ సింగ్ కూడా తన ట్విట్టర్ ప్రస్తుత X ఖాతాలో పోస్ట్ చేశారు. అభిషేక్ యువరాజ్ దగ్గర నాల్గేళ్లపాటు తీవ్రమైన శిక్షణ పొందాడు. తన దృష్టిలో యువరాజ్ సింగ్ ఓ లెజెండ్ అంటాడు అభిషేక్. ఆ నమ్మకంతోనే యువరాజ్ ను ఒప్పించి ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నాడు.

తనలో ఉన్న బలాన్ని తనకు గుర్తు చేస్తూనే.. తనలో ఉన్న బద్ధకాన్ని, జాఢ్యాన్నీ పారద్రోలినవాడు యువరాజ్. అలా తన క్రికెట్ నైపుణ్యంలోనూ, ఫిట్ నెస్ లోనూ యువరాజే తన ప్రధాన గురువంటాడు అభిషేక్.

అయితే, యువరాజ్ సింగ్ వద్ద శిక్షణ ఏం ఆషామాషీగా జరగలేదు. అభిషేక్ సోమరితనానికి నిత్యం తిట్ల దండకం తప్పేది కాదు. ఆ వీడియోసూ గతంలో వైరలయ్యాయి.

2024లో హరారేలో జింబాబ్వేపై టీ20లో 47 బంతుల్లోనే అభిషేక్ సాధించిన సెంచరీ తర్వాత యువరాజ్ సోషల్ మీడియా ద్వారా ఆ వీడియో షేర్ చేశాడు.

ఆ క్రమంలో.. రోమ్ ఒక్కరోజులో నిర్మించబడలేదు. నీ మొదటి అంతర్జాతీయ సెంచరీ ప్రయాణంలో అభిషేక్ కు అభినందనలు. ఇంకా చాలామంది అభిషేక్ లు ఇండియన్ టీమ్ లోకి రాబోతున్నారంటూ ఆ వీడియోను Xలో షేర్ చేశాడు యువరాజ్.

అంతకుముందు తొలి టీ20లో అదే జింబాబ్వేపై అభిషేక్ డకౌట్ అయ్యాడు. ఆ మ్యాచ్ లో భారత్ జింబాబ్వేపై 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కానీ, యువరాజ్ సింగ్ తో మాట్లాడితే.. తాను మాత్రం సంతోషంగానే ఉన్నట్టు చెప్పాడు. తన కుటుంబీకుల్లాగానే అది మంచి ప్రారంభమే.. అధైర్యపడకు, నీ సహజమైన ఆట ఆడుతూ వెళ్లంటూ భుజం తట్టాడని అభిషేక్ చెప్పుకొచ్చాడు ఆ తర్వాత.

2011 ప్రపంచకప్ విజయపు హీరోగా యువరాజ్ అంటే అభిషేక్ కు ఆరో ప్రాణం. అలా అంతగా యువరాజ్ పై క్రేజ్ కనబర్చిన అభిషేక్ అదే యువరాజ్ శిక్షణలో రాటుదేలి.. మళ్లీ అదే యువరాజ్ ఫామ్ స్పిరిట్ ను రిపీట్ చేస్తూ సిక్సర్లతో చెలరేగడంతో ఇప్పుడు వీరి గురు, శిష్యబంధం ఓసారి చర్చించుకోవాల్సి వస్తోంది.

బ్రెట్ లీ, మోర్కెల్ వంటి బౌలర్లను ఎదుర్కోవడాన్ని ఛాలెంజింగ్ గా భావించే అభిషేక్ కు.. కేన్ విలియమ్సన్ నాయకత్వమంటే ఇష్టం. అన్ని కాలాల్లోనూ కేన్ విలియమ్సన్ కెప్టెన్సీ అంటే ముచ్చటపడతాడు. ఐపీఎల్ లో కేన్ విలియమ్సన్ తో పని చేయడంతో.. ఆయనలోని నిగ్రహం, ప్రశాంతత వంటివి చూసి చాలా నేర్చుకున్నానంటాడు ఈ 25 ఏళ్ల భారత యువ కెరటం.

మొత్తంగా ఇప్పుడు భారత యువ సంచలనంగా ఇంగ్లాండ్ తో చివరి టీ20లో దుమ్మురేపి భవిష్యత్ తారగా ట్రెండింగ్ స్టారయ్యాడు అభిషేక్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles