అలలపై తేలియాడే ఓ వారసత్వ కట్టడం ఆ చర్చ్!

నీళ్లపై తేలియాడే చర్చ్… ఎక్కడుంది..?

ప్రతీవర్షాకాలంలో నీటిలో మునిగిపోతుంది. కానీ, ఆ తర్వాత వరద తగ్గాక నీటి ఉపరితలంపై తేలియాడుతూ పర్యాటకులను ఆకట్టుకుంటుంది 160 ఏళ్ల చరిత్ర కల్గిన శెట్టిహళ్లి గోథిక్ చర్చ్. శిలలపై శిల్పాలు చెక్కినారు మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు అని పాడుకునేవారు.. ఈ గోథిక్ శైలి చర్చ్ నిర్మాణాన్నీ, నీటిపై తేలియాడటాన్ని చూసి అలలపై శిల్పాలు చెక్కినారని పాడుకుంటారు. అలాంటి ఓ వారసత్వ కట్టడం గురించి కాస్త తెలుసుకుందాం పదండి.

కర్నాటకకు వెళ్లితే పర్యాటకులు ఇష్టపడి సందర్శించేవాటిలో శెట్టిహళ్లీ రోసరీ చర్చ్ ఒకటి. ఎందుకంటే, భారతదేశంలోనే అత్యంత ప్రత్యేకమైన వారసత్వ కట్టడాల్లో ఇదొకటి. క్రీస్తుశకం 12 నుంచి 16వ శతాబ్దపు మధ్యయుగంలో యూరప్ లోని ఉత్తర ఫ్రాన్స్ ప్రాంతంలో రోమన్స్ ద్వారా పరిచయమైన గోథిక్ శిల్పకళా నైపుణ్యంతో ఈ చర్చ్ నిర్మించారు. అయితే, ప్రతీ వర్షాకాలం హేమావతీ నది జలాశయంలో వచ్చే వరదలకు ఈ చర్చ్ మునిగి, కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత కాలంలో నీటిపై తేలియాడుతూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అందుకే దీన్ని ఫ్లోటింగ్ చర్చ్ అనీ.. లేదా, సబ్ మర్జ్డ్ చర్చ్ అని కూడా పిలుస్తుంటారు.

సాధారణంగా చరిత్ర పరిశోధకులు, ఫోటోగ్రాఫర్స్, పర్యాటకులు పోటెత్తే ఈ చర్చ్.. హాసన్ జిల్లాలోని శెట్టిహళ్లి గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. వలస పాలకుల కాలపు చరిత్రను, శిల్పకళా వైభవాన్ని వానాకాలం మినహా మిగిలిన కాలాల్లో గుర్తు చేసే ఓ డంబ్ ఆర్కిటెక్చరల్ మోనూమెంట్ గా పలకరిస్తుంది. 1860ల కాలంలో ఫ్రెంచ్ మిషనరీలు ఈ చర్చ్ ను నిర్మించారు. నాటి సంపన్న బ్రిటీష్ తోటల యజమానుల కోసం ఈ చర్చ్ ను నిర్మించినట్టు చెబుతారు.

గోథిక్ శిల్పకళలో ఓ అపూర్వమైన ఆకృతితో దర్శనమిచ్చే చర్చ్!

రోసరీ చర్చ్ గోథిక్ శిల్పకళకు ఓ అద్భుతమైన ఉదాహరణ. ఎత్తైన వంపు తిరిగిన గోడల నిర్మాణశైలి.. నాజూకైన రాతితో చేసిన పనితనం.. విశాలమైన స్తంభాలు.. ఇవన్నీ వలసకాలం నాటి యూరోపియన్స్ చర్చ్ నిర్మాణశైలిని ప్రతిబింబిస్తాయి. అయితే, ఇన్నేళ్లుగా హేమావతీ నదిలో ప్రతీ వర్షాకాలంలోనూ మునిగిపోతున్నప్పటికీ.. ఇప్పటికీ ఈ చర్చ్ చెక్కు చెదరకుండా నీటిపై తేలియాడుతూ ఆ తర్వాతి కాలంలో దర్శనమివ్వడం విశేషం. అలాగే, నాటి ఆర్కిటెక్చర్ నిర్మాణ కౌశల్యానికి నిదర్శనం.

1960 వరకూ కూడా ఈ చర్చ్ ఉపయోగంలో ఉండేదట. కానీ, హేమావతి నదిపైన డ్యామ్ నిర్మాణం, జలాశయం ఏర్పాటుతో ఈ చర్చ్ తో పాటు, పరిసర ప్రాంతాలూ ముంపుకు గురయ్యాయి. దాంతో ఈ చర్చ్ ఇక ఉపయోగించడానికి వీల్లేకుండా పోయింది.

ప్రతీ ఏటా ఎందుకు మునుగుతోంది..?

హేమావతీ నదికి ప్రతీ ఏటా భారీగా వరద వస్తుంటుంది. ఇక్కడ డ్యాం నిర్మించి, జలాశయం ఏర్పాటు చేయడంతో.. ట్యాంక్ ఫుల్ చేసే యత్నంలో భాగంగా ఈ చర్చ్ పూర్తిగా మునిగిపోతుంది. అలా వరద తీవ్రంగా ఉన్న సమయంలోనూ ఈ ఎత్తైన కట్టడం పైకప్పు భాగంతో పాటు, చర్చ్ గోడలు కూడా బయటకు దర్శనమిస్తుంటాయి.

ఆ తర్వాత డిసెంబర్ నుంచి మే వరకు నీరు తగ్గినప్పుడు చర్చ్ పరిసరాలు, ఆనవాళ్లన్నీ మళ్లీ బయటకొస్తాయి. ఆ సమయంలోనే ఇక్కడ పర్యాటకుల సంఖ్య ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడి అవశేషాల మధ్య నడిచి చర్చ్ ను దగ్గర చూసే వీలుంటుంది. అలా రుతువులు తెచ్చే మార్పులతో… నీటిలో కొంతకాలం మునిగిఉన్న చర్చ్.. ఆ తర్వాత మరింత ప్రత్యేకంగా కనిపించి ఆకట్టుకుంటోంది.

కర్నాటక రాష్ట్రంలో ఓ ప్రధాన ఆకర్షణగా రోసరీ చర్చ్!

శెట్టిహళ్లి రోసరీ చర్చ్ చారిత్రకంగా, శిల్పకళాపరంగా, ప్రకృతి సౌందర్యంగా కనిపిస్తూ పర్యాటక ప్రదేశాలపై ఆసక్తి ఉన్నవారిని ఆకట్టుకుంటోంది. చాలామంది పర్యాటకులు వర్షాకాలంలో నీటిలో మునిగిపోయినప్పుడొకసారి.. ఆ తర్వాత సమ్మర్ టైంలో బయటకు తేలినతర్వాత మరోసారి వెళ్లి అప్పుడూ, ఇప్పుడని సరిపోల్చుకుంటూ ఈ చర్చ్ ను సందర్శించడం ఇక్కడ ఆనవాయితీ.

శెట్టిహళ్లికి ఎలా చేరుకోవాలంటే..?

బెంగళూరు నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శెట్టిహళ్లి. కర్నాటకలోని అన్ని ప్రధాన నగరాల నుంచీ ఇక్కడికి బస్సులు నడుస్తుంటాయి. మంచి నేషనల్ హైవేస్ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక రైల్వే మార్గంలో అయితే హాసన్ రైల్వేస్టేషన్ 40 కిలోమీటర్ల దూరంలో శెట్టిహళ్లికి సమీపంలో ఉంటుంది. నిత్యం బెంగళూరులోని యశ్వంత్ పూర్ నుంచి హాసన్ వరకూ రైళ్లు నడుస్తుంటాయి కాబట్టి రైల్వే మార్గంలోనూ ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.

ఈ రోసరీ చర్చ్ ఎందుకు ప్రత్యేకం..?

ఇప్పుడు ఈ చర్చ్ ఓ వారసత్వ కట్టడం. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్స్ అత్యధికంగా ఫోటోలు తీసుకునే ఒక ఆర్కిటెక్చరల్ మోనూమెంట్. ప్రకృతి సిద్ధంగా కనిపిస్తూ.. గత వలసకాలపు కథను చెబుతుంది. నాటి చరిత్రకు దృశ్యరూపంగా మనల్ని ఆకట్టుకుంటుంది. అందుకే. శెట్టిహళ్లి రోసరీ చర్చ ఒక మతపరమైన కట్టడంగానే కాకుండా.. కాల ప్రవాహానికి ఎదురొడ్డిన నిల్చిన కథగా.. మారుతున్న భూభాగాలకు ప్రతీకగా కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకే, కర్నాటకలో పర్యాటక స్థలాల కోసం అన్వేషించేవారు.. చరిత్ర, ఒకింత ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యాల కలబోతను ఆస్వాదించేవారూ ఈ రోసరీ చర్చును తప్పకుండా సందర్శిస్తారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles