అరంగేట్రంతోనే అదరగొట్టిన హిర్వాణీ గుర్తున్నాడా?

కరేబియన్ దిగ్గజాలను ఓ కుర్రాడు మాయ చేసిన ఈ చరిత్ర గుర్తుందా?

కొన్ని విజయాలు క్రికెట్ లో కేవలం పరుగులు, వికెట్ల లెక్కలతో ఇమిడిపోవు. స్కోర్‌కార్డు ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుంది.

అది 1988 జనవరిలో చెన్నై చెపాక్‌ స్టేడియంలో భారత్ సాధించింది. అందుకు కారకుడు నరేంద్ర హిర్వాణీ. 19 ఏళ్ల వయస్సులో సృష్టించిన ఆ స్పిన్ సంచలనమే ఓసారి గుర్తు చేసుకోవాల్సిన ఆ చరిత్ర.

భారత్ – వెస్టిండీస్ మ్యాచులో ఏం జరిగింది?

వెస్టిండీస్‌పై భారత్ 255 పరుగుల భారీ విజయం సాధించింది. అప్పటికే 17 టెస్టుల్లో వరుసగా ఆ జట్టుపై ఓటమిపాలవుతూ వస్తున్న భారత్ కు ఉప్పొంగిపోయే విజయాన్నందించాడు నరేంద్ర హిర్వాణీ. అది భారత్‌కు కేవలం ఒక గెలుపు మాత్రమే కాదు.. ప్రపంచ క్రికెట్‌లో అప్పటికి అత్యంత భయంకరమైన జట్లలో ఒకటిగా పేరున్న వెస్టిండీస్‌ను ఒక యువ భారత జట్టు మానసికంగా కూడా వెనక్కి నెట్టిన సందర్భమది.

ఆ విజయానికి కేంద్ర బిందువు హిర్వాణి!

అద్దాలు పెట్టుకున్న ఆ యువ లెగ్‌స్పిన్నర్‌ను చూస్తే చాలా మందిలాగే తాను ఒకడిగా వచ్చాడు, పోతాడు అనుకున్నారంత. కానీ, ఎలాంటి ప్రత్యేకత కనిపించని ఆ యువకుడే.. తన బంతితో ఒక గందరగోళం సృష్టించాడు.

అరంగేట్రంతో అదరగొట్టిన లెగ్ స్పిన్నర్!

టెస్ట్ అరంగేట్రం చేసిన హిర్వాణి.. ఆ మ్యాచ్‌లో 136 పరుగులు ఇచ్చి.. ఏకంగా 16 వికెట్లు తీశాడు. టెస్ట్ అరంగేట్రంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆస్ట్రేలియాకు చెందిన బాబ్ మాసీ నెలకొల్పిన ప్రపంచ రికార్డును.. నరేంద్ర హిర్వాణీ సమం చేశాడు.

భారత లెగ్ స్పిన్ ప్రతాపాన్ని చూపించిన మ్యాచ్ అది!

భారత క్రికెట్‌లో లెగ్‌స్పిన్‌కు ఉన్న ప్రత్యేకమైన మాయాజాలాన్ని ప్రపంచానికి మరోసారి చూపించాడు హిర్వాణి. బ్యాట్స్ మన్ ను ముప్పు తిప్పలు పెట్టాడు. అడుగడుగునా ఆధిక్యం సాధించాడు.

కెప్టెన్ గా తొలి మ్యాచులోనే.. శాస్త్రి వ్యూహాత్మక నిర్ణయం!

చెపాక్ పిచ్ తొలి రోజునుంచే స్పిన్నర్లకు సహకరించేలా కనిపించింది. బంతి పిచ్ అయిన తర్వాత అనూహ్యంగా తిరుగుతోంది. సాధారణ పేస్ బౌలింగ్‌కు అలవాటు పడిన బ్యాటర్లకు అది పూర్తిగా భిన్నమైన పరీక్ష. ఆ సమయంలో భారత కెప్టెన్‌గా తొలిసారి టెస్ట్ మ్యాచ్‌కు నాయకత్వం వహిస్తున్న రవిశాస్త్రి.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణయమే ఆ మ్యాచ్‌లో మరో కీలకాంశం.

పిచ్ క్రమంగా దెబ్బతింటుందని అర్థం చేసుకున్న భారత్.. ముందుగా భారీ స్కోరు సాధించాలన్న ప్లాన్ తో బ్యాటింగ్ కే మొగ్గు చూపింది. ఒకసారి పరుగుల ఆధిక్యం చేతిలోకి వస్తే.. అదే పిచ్‌పై భారత స్పిన్నర్లు మరింత స్వేచ్ఛగా దాడి చేయగలరన్నది శాస్త్రి విశ్వాసం. ఆ విశ్వాసమే వాస్తవమైంది.

చేతులెత్తేసిన విండీస్!

విండీస్ రెండో ఇన్నింగ్స్‌ కు వచ్చేసరికి.. పిచ్ కండిషన్ మరింత కష్టంగా మారింది. భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం ఓ సవాల్ గా మారింది.

వెస్టిండీస్ అప్పటికే ఢిల్లీలో భారత్‌పై గెలిచింది. బాంబే టెస్టులో కూడా విజయం దాదాపు చేతికి రాగా ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ తర్వాత కోల్కత్తాలోనూ మ్యాచ్ డ్రా అయింది. అప్పటికే విండీస్ 1 మ్యాచ్ గెల్చిన జట్టుగా ఆధిక్యంలో ఉంది. అదే ఆత్మవిశ్వాసంతో ఆ జట్టు చెపాక్‌ లో అడుగు పెట్టింది.

లెగ్ స్పిన్ తో విండీస్ ను అడ్డుకోవచ్చన్న వ్యూహమూ భారత్ కు కలిసొచ్చింది!

వెస్టిండీస్ బ్యాటర్లను నాణ్యమైన లెగ్‌స్పిన్ ఇబ్బంది పెట్టగలదు. పాకిస్థాన్‌కు చెందిన అబ్దుల్ ఖాదిర్ స్పిన్‌ను ఎదుర్కొన్నప్పుడు కూడా ఆ బలహీనత వాళ్లలో కనిపించింది. దానికి తోడు అనుభవజ్ఞుడైన ఓపెనర్ గార్డెన్ గ్రీనిడ్జ్ బొటనవేలి గాయం కారణంగా ఆ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దాంతో భారత వ్యూహం ఫలించింది.

చెపాక్‌లో జరగబోయేది కేవలం క్రికెట్ మాత్రమే కాదు.. ఒత్తిడినీ జయించే పోరాటం!

ఎవరు ఒత్తిడిని బాగా ఎదుర్కొంటారనేదే చెపాక్ లో ఇండియా వర్సెస్ విండీస్ మ్యాచులో ప్రధాన పరీక్ష.

కలిసొచ్చిన కపిల్ దూకుడు!

స్కోర్ బోర్డ్ చూస్తే 156/5. అక్కడి నుంచే కపిల్ దేవ్ దూకుడు ప్రదర్శించాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ అంత సులభంగా ఏం సాగలేదు. అరుణ్ లాల్ 69 పరుగులతో నిలదొక్కుకున్నప్పటికీ.. భారత్ ఒక దశలో 156 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.
అప్పుడు క్రీజులోకి ఆల్ రౌండర్ వచ్చాడు కపిల్ దేవ్. ఆ తర్వాత మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. కపిల్ కేవలం 119 బంతుల్లో 109 పరుగులు చేశాడు. 17 ఫోర్లు బాదాడు. పిచ్ ప్రమాదకరంగా మారుతున్న సమయంలో జాగ్రత్తగా ఆడటమే సరైన మార్గమని చాలామంది భావించే స్థితిలో.. కపిల్ మాత్రం బౌలర్లపై ఎదురుదాడితో విధ్వంసం సృష్టించాడు. అది నిర్లక్ష్యపు బ్యాటింగ్ కాదు. ఒత్తిడిని తిరిగి విండీస్ బౌలర్లపైకి నెట్టే మరో వ్యూహం. ఆ మ్యాచుతోనే అరంగేట్రం చేసిన అజయ్ శర్మ.. కపిల్ కు మంచి సహకారం అందించాడు. ఇద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. చివరకు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 382 పరుగులు చేసింది. ఆ పిచ్‌పై చాలా అది అప్పటికి అధిక స్కోర్. అప్పుడు హిర్వాణికి కావాల్సిందీ.. కాస్త పరుగుల భరోసానే. కపిల్ ఆ భరోసానిచ్చాడు.

బంతిని మంత్రదండంగా మార్చిన మాంత్రికుడు!

లెగ్‌స్పిన్‌లో అసలు అందం బంతి ఎంత తిరుగుతుందనే దానిపైనే ఉండదు. బ్యాట్స్ మన్ ను తప్పుడు నిర్ణయం తీసుకునేలా చేయడంలో కవ్వింపూ ఆటలో భాగమే. బంతిని గాల్లోకి ఎత్తి వేయడంతో బ్యాట్స్ మన్ ను క్రీజు దాటించి ముందుకు వచ్చేలా ప్రలోభపెట్టడం..చివరి క్షణంలో బంతిని డిప్ చేయడం.. పిచ్‌పై పడిన తర్వాత ఊహించిన దిశకు భిన్నంగా తిప్పడం.. ఇవన్నీ కలిపి బ్యాట్స్ మన్ మనసులో సందేహాన్ని సృష్టించాయి. అదే నాటి టెస్టులో హిర్వాణి బలమైంది. అతను బంతిని ధైర్యంగా ఫ్లైట్ చేశాడు. బ్యాటర్లను ముందుకు వచ్చి ఆడేలా ప్రలోభపెట్టాడు. బంతి ఎక్కడ పడుతుందో, ఎంత తిరుగుతుందో అంచనా వేయడం కష్టంగా మార్చాడు.

హిర్వాణి ఎందుకు ప్రత్యేకం?

ఆ మ్యాచ్‌లో ఒక గణాంకం.. హిర్వాణి ప్రదర్శన ప్రత్యేకతను చెబుతుంది. హిర్వాణి కాకుండా మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన మరో ఏడుగురు స్పిన్నర్లు కలిపి.. 154 ఓవర్లు వేశారు. కానీ వాళ్లందరూ కలిపి తీసింది కేవలం 7 వికెట్లు మాత్రమే. కానీ, హిర్వాణి ఒక్కడే తీసింది 16 వికెట్లు. అంటే పిచ్‌లో టర్న్ ఉండటం ఒక్కటే కారణం కాదు. ఆ టర్న్‌ను వికెట్లుగా మార్చే కళను తన లెగ్ స్పిన్ తో హిర్వాణి చూపించాడు.

వివ్ రిచర్డ్స్ నూ మాయ చేశాడు!

వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో వివ్ రిచర్డ్స్ 68 పరుగులు చేశాడు. ఎనిమిది ఫోర్లతో అతని సహజమైన దూకుడు కనిపించింది. కానీ చెపాక్ పిచ్‌లో ప్రతి షాట్‌కు ఒక ప్రమాదం పొంచి ఉందనే ఆందోళన విండీస్ ను ఇబ్బంది పెట్టింది. మూడో రోజు హిర్వాణి రిచర్డ్స్‌ను బౌల్డ్ చేయడంతో.. ప్రతిఘటించాలనుకున్న వెస్టిండీస్ ను దెబ్బ తీసింది. హిర్వాణి కేవలం 7.3 ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి.. మిగిలిన ఐదు వికెట్లు పడగొట్టాడు. అలా వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 184 పరుగులకు ఆలౌట్ అయింది.భారత్‌కు 198 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దాంతో మ్యాచ్ పగ్గాలు పూర్తిగా భారత్ చేతుల్లోకి వచ్చాయి.

కపిల్ దూకుడు తర్వాత రమణ్ ప్రశాంతత!

రెండో ఇన్నింగ్స్‌లో కూడా భారత్ బ్యాటింగ్ లో తడబడింది. 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. వెస్టిండీస్ తరఫున మరోసారి కోర్ట్నీ వాల్ష్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మ్యాచ్‌లో అతను మొత్తం 140 పరుగులకు.. 7 వికెట్లు తీసుకున్నాడు. అయితే మరో అరంగేట్ర ఆటగాడు భారత్‌ను నిలబెట్టాడు. అతడే.. వూర్కేరి రమణ్. రమణ్ 257 నిమిషాలు క్రీజులో ఉండి.. 83 పరుగులు చేశాడు. కపిల్ దేవ్ ఇన్నింగ్స్ భారత్‌కు వేగాన్నిస్తే.. రమణ్ ఇన్నింగ్స్ భారత్ ఆధిక్యాన్ని నిలబెట్టింది. అజారుద్దీన్‌తో కలిసి అతడు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరకు రమణ్ 83 పరుగుల వద్ద వాల్ష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఒక దశలో 82 పరుగులతో నాటౌట్‌గా ఉన్న అతను.. మరుసటి రోజు కేవలం ఒక్క పరుగు మాత్రమే జోడించగలిగాడు.

217/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన శాస్త్రి!

వెస్టిండీస్ ముందు లక్ష్యం.. 416 పరుగులు. అది సాధించడం దాదాపు అసాధ్యంగా కనిపించింది. కరేబియన్ బ్యాటింగ్‌లో అయోమయం నెలకొంది.
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్సులో పోరాటం కంటే.. మానసిక కుప్పకూలిపోయింది. భారీ లక్ష్యం ఓవైపు.. స్పిన్ కు అనుకూలిస్తూ..తిరుగుతున్న పిచ్ మరోవైపు.. ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత ఫీల్డింగ్ కూడా బాగా చేసింది. హిర్వాణి స్పిన్ ఇంకోవైపు.. వెస్టిండీస్ బ్యాటర్లు తమ సహజమైన దూకుడును ప్రదర్శించడం పక్కనబెడితే.. ఆత్మరక్షణలో పడిపోయారు.

హిర్వాణి తన ఐదో బంతికే ఫిల్ సిమన్స్‌ను ఔట్ చేశాడు. ఫుల్ టాస్‌ను కొట్టే ప్రయత్నంలో మిడ్-ఆన్‌లో మొహిందర్ అమర్‌నాథ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత వికెట్లు వరుసగా పడిపోయాయి. వివ్ రిచర్డ్స్, కార్ల్ హూపర్, జెఫ్ డుజాన్.. ఒక్కొక్కరు తప్పుడు నిర్ణయాలతో పెవిలియన్ చేరారు. రిచర్డ్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో ఔటవడం ఈ మ్యాచ్ స్వరూపం ఇక ఎలా ఉండబోతోందో చెప్పింది. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన రిచర్డ్స్‌ను కూడా.. హిర్వాణి తనకు కావాల్సిన షాట్ ఆడేలా ప్రేరేపించాడు. బంతి కంటే ముందు.. బ్యాటర్ మనసును పసిగట్టడం.. అదే ఆ మ్యాచులో హిర్వాణి కనబర్చిన కళ.

లోగి ఎదురుదాడి చేసినా తప్పని వైఫల్యం!

వెస్టిండీస్ తరఫున గస్ లాగీ మాత్రం అద్భుతంగా పోరాడాడు. కేవలం 62 బంతుల్లో 67 పరుగులు చేశాడు. రెండు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లు కొట్టాడు. క్లైడ్ బట్స్ కూడా హిర్వాణిపై మూడు సిక్సర్లు కొట్టి కాసేపు వినోదం పంచాడు. కానీ, అప్పటికే మ్యాచ్ భారత్ చేతికొచ్చేసింది. హిర్వాణి లోగీని స్టంపౌట్ చేయించాడు. చివరి వికెట్‌గా విన్‌స్టన్ డేవిస్‌ను కూడా స్టంపౌట్ చేశాడు. వెస్టిండీస్ 160 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో భారత్ 255 పరుగుల భారీ విజయం సాధించింది. మ్యాచ్‌కు ఇంకా ఒక రోజు కంటే ఎక్కువ సమయం మిగిలే ఉండగానే గెలుపు భారత్ వశమైంది.

హిర్వాణి వెనుక మరో హీరో.. కిరణ్ మోరే!

హిర్వాణి 16 వికెట్లు తీసుకున్నాడని అందరూ గుర్తుంచుకున్నారు. కానీ ఆ వికెట్ల వెనుక నిలబడ్డ మరో కీలక వ్యక్తి గురించి కూడా చెప్పుకోవాలి. అతడే వికెట్ కీపర్ కిరణ్ మోరే.

తిరుగుతున్న పిచ్‌పై వికెట్ కీపింగ్ చేయడం అంత సులభం కాదు. బంతి ఎటు మళ్లుతుందో అంచనా వేయడం కష్టం. బంతి బ్యాట్స్ మన్ ను దాటిన తర్వాత కూడా ఊహించని దిశలో వెళ్లొచ్చు. అలాంటి పిచ్‌పై మోరే అద్భుతమైన కీపింగ్ చేశాడు. చెపాక్ మ్యాచ్‌లో అతను ఆరు స్టంపింగ్స్ చేశాడు. అందులో రెండో ఇన్నింగ్స్‌లోనే ఐదు ఉన్నాయి. అది అప్పట్లో టెస్ట్ క్రికెట్ లో మరో రికార్డ్. హిర్వాణి బంతిని గాల్లోకి విసిరి బ్యాటర్‌ను క్రీజు దాటి బయటకు రప్పిస్తే.. మోరే వెనుక నుంచి ఆ అవకాశాన్ని వికెట్‌గా మార్చాడు. ఇద్దరి మధ్య ఏర్పడిన అవగాహన హిర్వాణి విజయానికి కీలకమైంది.

హిర్వాణి లెగ్ స్పిన్ మంత్రదండానికి.. కపిల్, రమణ్, కిరణ్ మోరే, అజయ్ శర్మ వీరంతా జట్టుగా రాణించడంతో పాటే.. కెప్టెన్ గా మొట్టమొదటి మ్యాచులోనే టాస్ గెలిచి రావిశాస్త్రి తీసుకున్న నిర్ణయంతో..చెపాక్ మ్యాచ్, భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓ సువర్ణధ్యాయంగా గుర్తుండిపోయింది.

టైంలెస్ సాంగ్ గా అందరి మన్ననలు పొందిన మిలే సుర్ మేరా తుమారా పాటలోనూ జాతీయస్థాయి ప్రసిద్ధ వ్యక్తులతో కలిసి కనిపించే అవకాశం హిర్వాణీ సొంతమైంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles