ఆటిజాన్ని జయించాడు.. అత్యున్నత ఆటగాడిగా ఎదిగాడు!

ఆటిజం నుంచి గోల్ఫ్ ఛాంపియన్ గా!

2 ఏళ్లు వచ్చేసరికి ఆటిజంతో రణ్ వీర్ పై చాలామంది సానుభూతి చూపేవారు. ఆటిజంతో ఇవాళ డిపెండేబుల్ గా బతుకుతున్నవారెందరినో చూస్తున్న రోజుల్లో… రణ్ వీర్ దీ అదే పరిస్థితి అని సాధారణంగానే అంతా ఊహించి ఉంటారు. కానీ, అందుకు భిన్నమైన కథే రణ్ వీర్. ఇప్పుడు రణ్ వీరు గోల్ఫ్ ఛాంపియన్.. ప్రపంచ విజేత. బంగారు పతకాలు గెల్చుకుంటున్న లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులోకెక్కిన ఇన్స్పిరేషన్. సంకల్పం, పట్టుదలతో.. అడ్డంకులను విజయాలుగా మల్చుకున్న క్రీడాకారుడు.

ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది జీవితానికి పరిమితి ఏమాత్రం కాదు. ప్రపంచాన్ని చూసే, అనుభవించే విధానంలో తేడా మాత్రమే. ఒకరికి శబ్దంలా భళ్లుమని వినిపించేది.. ఇంకొకరికి లయలా వినిపించవచ్చు. కొందరికొకటి గందరగోళంగా కనిపిస్తే… ఇంకొకరికి అదో మాడల్ కావచ్చు. కొందరికి ఇతరులతో బంధం కష్టంగా అనిపిస్తే.. మరికొందరు బలమైన బంధాలను తయారు చేసుకోవచ్చు.

నిజమైన సవాల్ అసలు ఆటిజం కానే కాదు… సరైన మద్దతు, నమ్మకం లభిస్తే అపారమైన ప్రతిభావంతులు వెలుగులోకి రావచ్చు. మన సమస్యలే మనల్ని నిర్వచిస్తాయని.. ప్రభావితం చేస్తాయని తరచూ బాధపడేవాళ్లుంటారు. ఒక వైఫల్యం, ఒక నిర్ధారణ, ఒక లేబుల్ మనల్ని ఒక పరిమితికి కుదింపజేస్తాయని భావిస్తాం. కానీ, ఆత్మస్థైర్యమే మనిషి ప్రయాణాన్నిమలుస్తుంది. పరిస్థితులు కాదు… పట్టుదలే మనం ఏంత దూరం ప్రయాణం చేయగలమో నిర్ణయిస్తుంది.

ఈ విషయాలన్నీ రణ్ వీర్ సింగ్ సైనీ జీవిత ప్రయాణం మనకు చెబుతుంది.

మారుమూల నుంచి గోల్ఫ్ మైదానానికి!

రణ్ వీర్ ది హర్యానా గుర్ గ్రామ్. కేవలం 2 ఏళ్ల వయస్సులో ఆటిజం ఉన్నట్టు నిర్ధారణైన రణ్ వీర్.. చిన్నప్పట్నుంచీ సమాజంలో కలవకపోయేవాడు. ఒంటరిగానే గడిపేవాడు. అతడెవరన్నది పక్కనబెడితే.. అతడిపైన సానుభూతితో కూడిన ఊహాగానాలే చుట్టుపక్కలా వినిపించేవి. ఫ్రెండ్స్ ఎవ్వరూ పెద్దగా పట్టించుకోక పాఠశాల జీవితమూ ఒంటరితనంగానే మారింది. దాంతో కుటుంబమే ప్రపంచమైపోయింది. ఆ సమయంలో తల్లిదండ్రులు, సోదరుల మద్దతే రణ్ వీర్ కు బలమై నిల్చింది.

జీవితాన్ని మార్చేసిన గోల్ఫ్!

ఆటిజంతో బాధపడుతూ, సమాజంతో కలవలేక, దోస్తులెవ్వరూ పెద్దగా దగ్గరకు రాని సమయంలో… అదిగో అప్పుడే రణ్ వీర్ జీవితంలోకి గోల్ఫ్ ఎంటరైంది. తల్లిదండ్రులు గోల్ఫ్ ఆడటంతో వారితో పాటే ఆడేందుకు యత్నించేవాడు. 9 ఏళ్ల వయస్సులో హాబీగా మొదలైన ఆట.. ఆ తర్వాత ఓ హ్యాబిట్ గా మారిపోయింది. గుర్ గ్రామ్ లోని డీఎల్ఎఫ్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ లో శిక్షణ పొందాడు. ఆ తర్వాత అదే జీవితమైపోయింది.

గోల్ఫ్ లోనే కొనసాగాలని రణ్ వీర్ డిసైడ్ అయ్యేనాటికి.. అందుకు కావల్సిన ఏకాగ్రత, సమన్వయం, ఓర్పు ఇవన్నీ సాధ్యమయ్యే పనులేనా అంతా సందేహించారు. కానీ, రణ్ వీర్ కు ఆ గోల్ఫే శాంతినిచ్చింది. జీవితానికో లయనిచ్చింది. జీవితంలో తానేం చేయాలో ఓ స్పష్టతను ఏర్పర్చింది. గోల్ఫ్ ఆటలో ప్రాక్టీస్ సెషన్ లో.. ప్రతీ మలుపు అతని నైపుణ్యాన్ని పెంచుకోవాడనికే కాకుండా.. తన ఆత్మవిశ్వాసం పెరిగేందుకు ఉపయోగపడింది.

పరాజయాలను శక్తిగా మల్చుకున్నవాడు!

2019లో రణ్ వీర్ ఆడిన ఒక టోర్నమెంట్ లో తనకు అనుకూలమైన ఫలితం రాలేదు. సాండ్ బంకర్ లో మూడు షాట్స్ వృథా కావడంతో బంగారు పతకం చేజారింది. రణ్ వీర్ ఉన్న సందర్భానికైతే.. చాలామందికి అదే చివరిదశ అయ్యుండేదేమో. కానీ, రణ్ వీర్ ఆ ఓటమినే సవాల్ గా మార్చుకున్నాడు. తల్లిదండ్రులు, కోచ్ ప్రోత్సాహంతో అతడు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు.

అసాధారణ విజయాలతో దూకుడు!

ఓటమి చవిచూసిన చోట ఎందుకలా జరిగిందో విశ్లేషించుకున్నాడు. అంతకంతకూ ప్రాక్టీస్ చేశాడు. అనేక జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్ షిప్స్ లో గెలిచాడు. స్పెషల్ ఒలింపిక్స్ గోల్ఫ్ లో భారతదేశం నుంచి తొలి గోల్డ్ మెడలిస్ట్ గా నిల్చాడు. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో ఎనిమిది రికార్డులు సృష్టించాడు. 2023లో మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ కూడా రణ్ వీర్ స్టోరీని ప్రస్తావించారు. ఒకనాడు అనుమానించినవారి నుంచి ప్రతీ విజయంలోనూ, ప్రతీ మలుపులోనూ చప్పట్లందుకుంటున్నాడు.

తన విధానమే విజయానికి సోపానం!

రణ్ వీర్ కథ మనకు ఇచ్చే మెస్సేజేంటంటే.. మనకు మనం పరిమితులు విధించుకున్నప్పుడే అవి మనల్ని అడ్డుకుంటాయి. కంఫర్ట్ జోన్ వదిలి పరిగెడితే కచ్చితంగా లక్ష్యాన్ని ముద్దాడొచ్చు. ఆటిజం రణ్ వీర్ ను ఆపలేకపోయింది. జీవితాన్ని భిన్నంగా చూడటం, పట్టుదలగా ప్రయత్నించడం, ఆటంకం ఏర్పడిన ప్రతీ చోట కొత్త శక్తితో ముందడుగు వేయడం రణ్ వీర్ సక్సెస్ స్టోరీ చెప్పే పాఠం.

ఏ ఆటంకం మనకు అడ్డంకి కాదు.. అవేవీ మన ప్రయాణాల్ని నిర్ణయించవు.. వాటిని ఎదుర్కొనే మనోబలముంటే.. రణ్ వీర్ సైనీలా ఆత్మవిశ్వాసంతో ఛాంపియన్ గా అవతరించవచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles