అది 2014 జూలై 31. మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి… గంటకు 130 మైళ్ల వేగంతో సాగిన 65 మైళ్ల దూరం పాటు.. మూడు పోలీస్ బృందాలు ఛేజింగ్ చేస్తున్నై. కట్ చేస్తే.. యూఎస్ లోని అన్ని టీవి ఛానల్స్ లో ఒకే ఒక్క బ్రేకింగ్ కనిపిస్తోంది. ఎఫ్బీఐని సైతం ముప్పుతిప్పలు పెడుతోంది ఆ నేరస్తురాలు. ఆమె ఆచూకీ కోసం ప్రజలనూ.. నిఘా శాఖలు అర్థించేలా చేస్తోంది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి సంస్థతో.. ఏకంగా బాంబ్ షెల్ బ్యాండిట్ అని పిలిపించుకుంది. ఓ సినిమా స్టోరీని తలపిస్తోంది కదూ! అవునూ.. 2017లో రిలీజైన కంగనా రనౌత్ సిమ్రన్ సినిమాకు.. మూలకథే ఇది. ఓ ఇండియన్ లేడీ.. అమెరికా నిఘా సంస్థలకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన వాస్తవికత.. హాలీవుడ్ సినిమాలనే తలదన్నే ట్విస్టులతో సాగే కథ ఇది! .

ఆమె పేరు సందీప్ కౌర్. పంజాబ్ రాష్ట్రం ఛండీగడ్ స్వస్థలం. ఏడేళ్ల వయస్సులో తల్లి, సోదరుడితో కలిసి అమెరికాలోని కాలిఫోర్నియాలో తన తండ్రి జతీందర్ వద్ద అడుగుపెట్టింది. ఆమె తల్లిదండ్రులిద్దరూ వేర్వేరు వ్యాపారాల్లో మునిగితేలడంతో… సోదరుడితో పాటు, ఆమె కూడా కాస్తా తల్లిదండ్రుల లాలనకు గురైంది. ఆ చేదు అనుభవాలు ఆమెలో ఒకింత నైరాశ్యాన్ని నింపాయి. దాంతో విసిగిపోయింది. పైగా.. అప్పటికే న్యూయార్క్ నగరంలో 2001, 9/11 ఉగ్రదాడుల అనంతరం జాతుల మధ్య ఉద్రిక్తతలూ పెరిగిపోయిన సమయం. స్కూల్ లో తోటి పిల్లలు తన తండ్రిని ఉగ్రవాదా అని అడగటం వంటివి కూడా సందీప్ కౌర్ పై కొంత ప్రభావం చూపాయి. దాంతో తన కుటుంబం పైనే సందీప్ కౌర్ కు ఏదో తెలియని వెలితి… ఒకింత దురభిప్రాయంతో పెరిగుతూ వచ్చింది. సరిగ్గా ఆ సమయంలోనే సందీప్ కౌర్ కు బాగా దగ్గరైంది సమీప బంధువు, స్నేహితురాలైన అమున్ దీప్ కౌర్. అప్పటికే అమెరికాలో స్థిరపడ్డ అమున్ దీప్ కౌర్.. సందీప్ కౌర్ ను సినిమాలు, షికార్లకు తిప్పుతూ బయట కొత్త ప్రపంచాన్ని చూపించింది. అలవాటు చేసింది.
అలా సాగుతున్న ప్రయాణంలో సందీప్ కౌర్ తల్లి అనారోగ్యం పాలైంది. ఆ సమయంలో పొందిన ఒకింత పరివర్తనతో.. ఓ నర్స్ స్ఫూర్తితో నర్సింగ్ కోర్సులో జాయిన్ అయి.. 19 ఏళ్లకే కోర్సును పూర్తి చేసింది. పంజరంలోని రామచిలుక ఎప్పుడెప్పుడు బయటపడుతానా అన్నట్టుగా తన కుటుంబంలో ఉన్నప్పుడు భావించిన సందీప్ కు.. అదే సమయంలో నెలకు 6వేల డాలర్లు సంపాదించే ఉద్యోగం దొరికింది. ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న తపనతో పగలూ, రాత్రి కష్టపడి ఆ తర్వాత మూడు ఉద్యోగాలు చేసింది కౌర్. డబ్బుపై మరింత ఆశ పెరగడం.. అమెరికన్ వాణిజ్యరంగంలో వస్తున్న మార్పులతో షేర్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది.
2 మిలియన్ డాలర్స్ డబ్బును షేర్ మార్కెట్ లో సంపాదించుకోగల్గింది. ఇంకేం, తానేం చేస్తే అది సక్సెస్ అవుతున్న వేళ.. అమెరికన్ కల్చర్ కు అలవాటు పడ్డ ఓ రెక్కల గుర్రంలా తనను తాను మర్చిపోయే హోష్ లో నడుస్తున్న జీవితకాలమది.

సరిగ్గా అది 20 ఏళ్ల వయస్సు. అసలే అమెరికా పబ్బులు, క్లబ్బులు, క్యాసినోలు… ఇక ఆ కల్చర్ అలవాటైనోళ్లకు కళ్ళు మిరుమిట్లు గొలిపే భూతల స్వర్గం! ఆ వయస్సులో మందు పుచ్చుకోవడానికీ లీగల్ గా అమెరికా చట్టాల ప్రకారం ఇక లైసెన్సూ వచ్చేసినట్టే! అందుకు కావల్సిన డబ్బూ ఉంది! అవన్నీ చవిచూడాలన్న ఆశా ఉంది! అదిగో అలాంటి సమయంలోనే.. 20 నుంచి 21 ఏళ్ల వయస్సులో అడుగుపెట్టే పుట్టినరోజు వేళ 2010 నవంబర్ 21నాడు కౌర్ జీవితం ఊహించని మలుపు తిరిగింది.
ఇంట్లో ఏదో ఓ అబద్ధం చెప్పి బయటపడ్డ కౌర్… రెక్కలొచ్చిన గువ్వలా క్యాసినోలకు పేరొందిన లాస్ వేగాస్ లో వాలిపోయింది. ఇంకేం చేతులో బోలెడంత డబ్బు, షాపింగ్… అసలే ఫ్యాషన్స్ కు పుట్టినిల్లులా హొయలతో కనిపించే అమెరికాలో పొట్టి దుస్తుల్లో అలా స్నేహితులతో కలిసి మొట్టమొదటిసారి క్యాసినోలోకి ఎంట్రీ ఇచ్చింది కౌర్. ఆ క్యాసినోల్లో బ్లాక్ జాక్ జూదానికి అలవాటు పడింది. ప్రతీ నెలా ల్యాస్ వేగాస్ కు వెళ్లడం… జేమ్స్ బాండ్ సినిమాల్లో తరహాలో జూదమాడటం సందీప్ కౌర్ ప్రవృత్తిగా మారిపోయింది. ఆ జూదమాటలో కౌర్ కు హ్యాండ్ కలిసివచ్చింది. ఆ విషయం తన తల్లికి తెలియడంతో… నచ్చజెప్పి మాన్పించాల్సిన తల్లి కూడా మారుమాట్లాడలేదు. అంటే, పరోక్షంగా ప్రోత్సహించింది. డబ్బుపైనున్న మమకారం, ఓ మంచి భవంతి కొనాలన్న తల్లికున్న అత్యాశతో.. అప్పటికే ఆకాశమంతెత్తు కలలు కంటున్న కౌర్ జూదమాట పీక్ కు చేరిపోయింది.
జూదమాటలో డబ్బు పోగొట్టుకుని.. చివరకు కొన్నిసార్లు ఆమె చెక్స్ బౌన్సైనా… క్యాసినోలు మాత్రం ఆమెకు అడ్డుచెప్పలేదంటే కౌర్ జీవితం క్యాసినోలతో ఎంత కనెక్టైపోయిందో అర్థం చేసుకోవచ్చు. కానీ, విధి ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదు! అదృష్టం జీవితమంతా తన వెంటే.. తన క్యాసినోల వెంట తిరిగినట్టు గా రాదు! అదిగో అలా డబ్బు పోగొట్టుకోవడం ప్రారంభమైంది. ఏకంగా ఒక దశలో 60 వేల డాలర్లను పోగొట్టుకుంది. తన ఫ్రెండ్ అమున్ దీప్ కు మాత్రం.. ఆ డబ్బు షేర్ మార్కెట్ లో పోయినట్టు అబద్ధమాడింది. కానీ, తన సోదరుడు ఆ విషయాన్ని అమున్ దీప్ కు తెలియజేశాక అప్పుడుగానీ తానేవిధంగా డబ్బు పోగొట్టుకుంది… జాదామాటకు బానిసై ఎలా తన చదువులను సందీప్ కౌర్ వదిలేసిందో అమున్ కు అర్థమవుతూ వచ్చింది. కానీ, అప్పటికే అమున్ కాదుగదా.. ఆ దేవుడే దిగివచ్చినా క్యాసినో జూదం నుండి కౌర్ ను కాపాడలేనంత పీక్ కు వెళ్లిపోయింది. తాను బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బు కూడా అయిపోయి.. చివరకు క్యాసినోలకే ఆమె బాకీ డబ్బులు కట్టాల్సిన స్థితికి దిగజారిపోయింది.
సాధారణంగా జూదరులందరూ ఆలోచించే తీరులోనే మళ్లీ పోగొట్టుకున్న చోటే డబ్బు సంపాదించాలన్న కౌర్ కు.. మరికొందరు పరిచయమయ్యారు. మీ ఆట చూశాం మీకు అప్పిస్తామన్నారు. మళ్లీ అప్పులు ప్రారంభించింది. అవి ఇంతింతై వటుడింతై అన్నట్టు పేరుకుపోయిందేగానీ… ఈసారి క్యాసినోల్లో జూదమాట మాత్రం కౌర్ కు కలిసిరాలేదు. దాంతో అప్పులోళ్ల బాధలు పెరిగిపోయాయి. వాటికి వడ్డీలు, చక్రవడ్డీలు కలిసి బారెడయ్యాయి. ఇక చేసేది లేక.. తల్లిని తీసుకుని తన ఠికాణా మార్చింది. అయినా అడ్రస్ వెతుక్కుంటూ వచ్చిన అప్పులోళ్లు… కుటుంబాన్నే లేకుండా చేస్తామని బెదిరించారు. ఎలాగైనా అప్పు తీర్చాలన్నారు.
ఆ క్రమంలో బ్యాంకులకు కన్నం వేయడం ఒక్కటే మార్గమమన్న దొంగబుద్ధులు సూచించారు కొందరు. అలా ఓ నర్స్ గా అమెరికాలో జీవితాన్ని ఓ ఇండియన్ లేడీ… అమెరికా పోలీస్ వ్యవస్థనే ముప్పుతిప్పలు పెట్టే ఓ బ్యాంక్ దోపీడి దొంగగా రూపాంతరం చెందింది. పలు బ్యాంకులకు కన్నం వేసి.. తప్పించుకుని తిరిగింది. చాలామంది దొంగలు బ్యాంకు దొంగతనాల్లో పోలీసుల కాల్పుల్లో మరణించిన సంఘటనలు తన కళ్లముందు కదలాడినా… తానిక బ్యాంక్ దొంగతనాలు చేస్తేనేగానీ… తాను, తన కుటుంబం బతికి బట్టకట్టలేమని భావించింది. ఒక దశలో ఆత్మహత్యే శరణ్యమనుకున్న కౌర్… ఆ తర్వాత ఏకంగా అమెరికా పోలీస్ వ్యవస్థలోనే అత్యధిక బ్యాంక్ రాబరీలకు పాల్పడ్డ ఓ ఆడ గజదొంగగా గజగజలాడించింది.
అప్పటికే ఆరురోజుల్లో రెండు బ్యాంకుల్లో దోపిడీ చేసిన కౌర్ వద్ద 8 వేల డాలర్లు మాత్రమే ఉండగా అది అప్పులోళ్లకిచ్చేందుకు సరిపోకపోవడంతో… మూడో బ్యాంక్ రాబరీకి ప్లాన్ చేసింది. ఉటాలోని సెయింట్ జార్జ్ బ్యాంకులో రాబరీకి సరిగ్గా 2014, జూలై 31, సోమవారం రోజు పక్కా ప్రణాళికను రచించింది. కానీ అమెరికా ఎఫ్బీఐ లెక్కల ప్రకారం సోమవారాలు అక్కడ అంతకుముందు కూడా పలు బ్యాంకు దోపిడీలు జరిగిన సంఘటనలుండటంతో… అప్పటికే కౌర్ గురించి వెతుకుతున్న పోలీస్ శాఖ అప్రమత్తమైంది. అనుకున్నట్టే కౌర్ ఆ బ్యాంకుకు వచ్చింది.
కానీ మారువేషంలో… కళ్లకు గాగుల్స్ తో పాటు… విగ్ ధరించిన ఆమె రూపం పోల్చుకోలేకుండా ఉంది. కానీ, ఆమె కదలికలు బ్యాంకులో అనుమానాస్పదంగా కనిపించాయి. పైగా క్యాషియర్ ను డబ్బు ఇవ్వమని బెదిరించి గుంజుకెళ్లుతుండగా… తన క్యాబిన్ లోంచి చూసిన మేనేజర్ పోలీసులకు సమాచారమిచ్చాడు. దాంతో… కౌర్ సుదీర్ఘ ఛేజింగ్ అనంతరం పోలీసులకు చిక్కింది. ఆ సమయంలో అక్కడున్న తీవ్ర తుఫాన్ పరిస్థితులు కూడా కౌర్ ను పోలీసులకు పట్టించాయి. చివరాఖరకు అమెరికా పోలీసులకు చేతికి చిక్కి… 66 నెలల జైలు శిక్షగా న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుతో.. తన జీవితకాల పరుగుకు ఓ విచారకరమైన, విషాదకరమైన ఎండింగ్ తో జైలు ఊచలు లెక్కిస్తోంది.
ఒక పంజాబీ మహిళ బ్యాంకు దోపిడీలతో అమెరికా ఎఫ్బీఐనే గజగజలాడించిన ఒకే ఒక్క కేసుగా సందీప్ కౌర్ ది ఓ హిస్టరీ అని ఏకంగా ఎఫ్భీఐ ఉన్నతాధికారులే వెల్లడించారు.
ఎక్కడ భారత్.. ఎక్కడి అమెరికా..? సముద్రాల ఆవల.. వలస వెళ్ళి.. ఓ నర్సుగా ఎందరికో సేవచేసి డబ్బు తెచ్చిన పేరాశతో షేర్ మార్కెట్, క్యాసినోల బాట పట్టి.. చివరకు అప్పులపాలై, బ్యాంకు దొంగతనాలకే అలవాటు పడటమంత పరాకాష్ఠ.. ఓ భారతీయ మహిళ జీవితంలో.. అదీ దేశం కాని అమెరికా వంటి నిఘా సంస్థలు చురుకుగా పనిచేసే దేశంలో చుడగలమా..? అమెరికా పోలీస్ వ్యవస్థనే ఓ కుదుపు కుదిపి.. సంచలనమైన సందీప్ కౌర్ స్టోరీ ప్రతీ మలుపులో ఓ సంచలనమే కనుకే.. ఏకంగా సినిమా తెరపై కే ఎక్కేసింది.



