ఢిల్లీలో భారతీయ జనతాపార్టీ గెలుపు.. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై ఇంకా పోస్ట్ మార్టమ్ జరుగుతూనే ఉంది. లిక్కర్ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై జైలు ఊచలు లెక్కబెట్టడమనే ప్రధాన కారణం నుంచి.. తన మంత్రి వర్గంలో, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో పలువురి అరెస్టుల పర్వం వెరసి కర్ణుడి చావుకి వేయి కారణాలన్నట్టు ఆప్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఇదంతా సరే.. కానీ, బీజేపీ విజయం వెనుక ఓ పెద్దమనిషి కీలకపాత్ర పోషించాడు. ఆయన గురించే మనమిప్పుడు చెప్పుకోబోతున్నాం.
బైజయంత్ జై పాండా. ఒడిశాకు చెందిన బై జయంత్ పాండా ఐదుసార్లు ఎంపీగా గెల్చారు. ఢిల్లీ గద్దెను జయించడంలో ఈయనే నిశ్శబ్ద వ్యూహకర్త.
ఎవరీ పాండా…?

27 ఏళ్లు అంటే సుమారు 3 దశాబ్దాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న బీజేపీలో.. గత సాధారణ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకొచ్చిన దానికంటే ఎక్కువ ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. దశాబ్దంపాటు అధికారంలో ఉన్న ఆప్ ను ఊడ్చేసిన బీజేపీలో ఈ ఆత్మవిశ్వాసం ఇనుముడించడం సర్వసాధారణమైన విషయమే.
70 మంది సభ్యుల అసెంబ్లీలో 48 సీట్లతో సగం మార్కును దాటిన గెలుపు కచ్చితంగా బీజేపీ ఖాతాలో ఓ చారిత్రత్మక విజయమే. దీనికి ఆప్ ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత, డబుల్ ఇంజిన్ సర్కార్ అనే నినాదం, ఢిల్లీ ఎన్నికలకు ముందే మధ్యతరగతిని ప్రభావితం చేసిన ఆదాయపు పన్ను అంశాలు వంటివన్నీ బీజేపీకి కచ్చితంగా కలిసొచ్చాయనే చెప్పుకోవాలి.
అయితే, ఢిల్లీ పీఠంపై గట్టి పట్టు సాధించి దేశ రాజకీయాల్లోనే ఓ పెను సంచలనంగా ఎదిగిన ఐఆర్ఎస్ అధికారైన కేజ్రీవాల్ వంటివాణ్ని ఢీకొట్టడమంటే కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు అంతకుమించిన వ్యూహరచన కూడా చేయాల్సిందే. అదే పాండా చేశాడు.
61 ఏళ్ల బైజయంత్ జై పాండా ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందే ఢిల్లీలో ప్రచారానికి నాయకత్వం వహించాడు. ఢిల్లీ ప్రచారపర్వంలో కీలక బాధ్యత వహించిన పాండా.. తన రాజకీయ చతురత, ఐదుసార్లు ఎంపీగా గెల్చిన తన అనుభవంతో పాటు.. ఎక్కడా ఎక్స్ పోజర్ లేకుండానే నిశ్శబ్దంగా ఉంటూ పార్టీ ప్రచార పర్వాన్ని ఉరకలెత్తించాడు. బీజేపీ గెలుపు ఎందుకు ముఖ్యమో చెబుతూనే.. ఆప్ ను ఎందుకు వద్దనుకోవాలో కూడా కచ్చితంగా ఓటర్లు ఆలోచించేలా ప్రణాళికలు రచించాడు పాండా.
స్వయానా ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోడీనే హామీలిచ్చాడంటే.. కచ్చితంగా అవి నెరవేర్చి తీర్చాల్సిన బాధ్యత బీజేపీపై ఉంటుందనే విషయాన్ని ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లాడు. , అటు కేంద్రంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం మద్దతు రాష్ట్రానికీ ఉండాలంటే కచ్చితంగా ఢిల్లీలోనూ బీజేపీ గద్దెనెక్కాల్సిందేనన్న విశ్వాసాన్ని ఓటర్లలో పాదుగొల్పాడు.
నిత్య సంఘర్షణతో ఇటు ఢిల్లీలో ఒక ప్రభుత్వం.. అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటం వల్ల ఢిల్లీకి ఒరిగేదానికంటే.. నష్టమేనన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాడు బైజయంత్ జై పాండా.
జై పాండా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా, అస్సాం, ఢిల్లీ బీజేపీ యూనిట్స్ కు ప్రభారి అంటే ఇంఛార్జ్ గా వ్యవహరించిన అనుభవశీలి.
గత 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఢిల్లీ ఎన్నికల ఇంఛార్జ్ పాత్రను కూడా పోషించిన పాండా ఆ సమయంలో ఆప్ గెలుపుకు, బీజేపీ ఓటమికి గల కారణాలను సరైన దిశలో విశ్లేషించుకోగల్గాడు.
మిషిగాన్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ చదువుల్లో పట్టభద్రుడైన బైజయంత్ జై పాండా.. రాజకీయాల్లోకి రాకమునుపు కార్పోరేట్ రంగంలో పనిచేశాడు.
2019 వరకూ బైజయంత్ జై పాండా నవీన్ పట్నాయక్ ముఖ్య అనుచరుల్లో ఒకడిగా ఉండేవాడు. కానీ, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో బిజూ జనతాదళ్ వదిలి కాషాయకండువా కప్పుకున్నాడు.
గత లోక్ సభ ఎన్నికల సందర్భంలో ఉత్తరప్రదేశ్ ఇంఛార్జ్ గా వ్యవహరించారు పాండా. మధ్యతరగతి ఆదాయపు పన్ను పెంపుకు సంబంధించి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న తరుణంలో ఆ బిల్లు పార్లమెంట్ కు వచ్చే ముందు దాన్ని క్షుణ్నంగా పరిశీలించేందుకు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా నియమించిన 31 మంది కీలక సభ్యుల కమిటీకి నాయకత్వం వహించిన ఎంపీ బైజయంత్ జై పాండా.
2024 అక్టోబర్ నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యే క్రమంలో బీజేపీ బైజయంత్ జై పాండాకు ఢిల్లీ బాధ్యతలప్పగించింది. 1998 నుంచి అధికారానికి దూరమైన బీజేపీని… 2025 అసెంబ్లీ ఎన్నికల్లో గద్దెనెక్కించి పాండా కమలవికాసానికి ముఖ్య కారకుల్లో ఒకడయ్యాడు.


