ఇల్లాలు – ప్రియురాలు
…………………………………………..
కథ.. మాటలు..పాటలు..ఆటలు
పరేష్ తుర్లపాటి ✍️
“యావండీ..ఎప్పుడూ అలా దగ్గుతూ కూచోటమేనా? పిల్లాడి పెళ్లి చేసే ఆలోచన ఏవన్నా ఉందా ?” చిరాగ్గా అడిగింది జయంతి
“వాడు పిల్లాడేంటి జయంతీ..పెళ్లిచేస్తే ఈపాటికి నలుగురు పిల్లలకి తండ్రి అయ్యేవాడు..” దగ్గుతూ అన్నాడు గుమ్మడి
“సర్లే మీ దగ్గు జోకులాపి ముందు వాడి పెళ్లిసంగతి చూడండి”

“అందుకే నేను కూడా నిన్న రాత్రంతా దగ్గి దగ్గి మన శోభన్ బాబుకి మా ఫ్రెండు ప్రభాకర రెడ్డి కూతురు శారద కిచ్చి పెళ్లిచేద్దామని కఠోర నిర్ణయం తీసుకున్నా”
“ఆ పిల్ల ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుందని టాకు కదండీ” గుడ్లనీరు కక్కుకుంటూ అడిగింది జయంతి
“పర్లేదులే జయంతీ..నీ ఏడుపుకి నేను అలవాటు పడలా? అలాగే మెల్లిగా మనవాడూ అలవాటు పడతాడులే”
కట్ చేస్తే ,
గుమ్మడి శోభన్ బాబుని పిల్చి ,
“బాబూ శోభన్ బాబూ.. ఎన్నాళ్ళని ఆ మారుతీ కారు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని నెత్తిమీద రింగుని రింగు రింగులుగా తిప్పుకుంటూ వైజాగ్ బీచులనీ ఊటీ పార్కులనీ తిరుగుతావ్? నిన్ను తండ్రిగా చూడాలని మాకు మాత్రం ఉండదా ?” అని చిన్నగా దగ్గాడు
“నన్ను ఆశీర్వదించండి నాన్నగారు..త్వరలో తండ్రిగా మీ ముందుకు వచ్చి మీ కోరిక తీరుస్తా..” ఉత్సాహంగా శోభన్ బాబు
“బాబూ శోభన్ బాబూ.. తండ్రిగా నిన్ను చూడాలనుందంటే నీకలా అర్ధమైందా? తప్పు నాయనా..తొందరపడకు..నేనంటుంది..నిన్ను పెళ్లిచేసుకోమని..నా ఫ్రెండు ప్రభాకర్ రెడ్డి కూతురు శారద తో నీ పెళ్లిచేద్దామని నేనూ జయంతీ నిర్ణయం తీసుకున్నాం నాయనా..అఘోరించు..”
కట్ చేస్తే ,
శారద తో శోభన్ బాబు పెళ్ళి అయ్యింది
పెళ్లి మండపంలోనే గుమ్మడి తాళాలగుత్తి శోభన్ బాబు చేతిలో పెడుతూ ,
“బాబూ శోభనా..ఇదిగో ఊటీలో మన ఎస్టేట్ తాళాలగుత్తి..శారద ను తీసుకుని అలా హనీమూన్ వెళ్ళిరా నాయనా ? వచ్చేటప్పుడు నేను చెప్పిన పని పూర్తి చేసుకురా..అసలే నాకు ఈ మధ్య దగ్గు ఎక్కువైంది..ఈ జయంతికి ఏడుపు ఎక్కువైంది” ఆయాసంగా అన్నాడు
తాళాలు తీసుకుని శోభన్ బాబు ,
“నాన్నగారూ..ముందు నేను ఊటీ వెళ్లి అక్కడ పవర్ కట్ ఉందా లేదా?ఉంటే ఏ టైంలో కరెంట్ తీస్తారు?..వర్షాలు పడుతున్నాయా లేవా ? పడితే మెరుపు మెరుస్తుందా లేదా? ఇలాంటివన్నీ కనుక్కుని అప్పుడు శారద ను తీసుకెళ్తా” హుషారుగా అన్నాడు
శోభన్ బాబు జాగ్రత్తలకి గుమ్మడి.. ప్రభాకర రెడ్డి ఆనంద బాష్పాలు కార్చారు
జయంతి.. శారద లు గుడ్లనీరు కక్కుకుని ఏడ్చారు
కట్ చేస్తే ,
శోభన్ బాబు ఊటీలో గుమ్మడి ఎస్టేట్ లో గెస్ట్ హౌస్ లో దిగి టవల్ కట్టుకుని షవర్ కింద స్నానం చేసి అశోకా శాండల్ పౌడర్ డబ్బా మొత్తం ఒంటికి పట్టించి తెల్ల గ్లాస్కో లాల్చీ పైజామా వేసుకుని కిటికీ దగ్గరికి చేరి ఆకాశం వంక చూట్టం మొదలెట్టాడు
దట్టంగా మబ్బులు పట్టాయి
వర్షం స్టార్ట్ అయ్యింది !
కరెంట్ పోకపోతే మెయిన్ కట్టేద్దామని బాక్స్ వంక చూసాడు
లక్కీ..మెయిన్ కట్టేయకుండానే కరెంట్ పోయింది
అప్పుడు మెయిన్ డోర్ వంక చూసాడు
ఎవరో టక్ టక్ మని తలుపు కొడుతున్నారు
ఆత్రంగా తలుపు తీసాడు
బయట వర్షంలో తడుస్తూ శ్రీదేవి ,
లోపలికి రావొచ్చా అండీ అనడిగింది
అందుకేగా నేను ఊటీ వచ్చింది అనుకుంటూ మరింత ఆత్రంగా లోనికి దారి వదిలాడు
సరిగ్గా అప్పుడు ఎక్కడో మెరుపు మెరిసింది !
కట్ చేస్తే ,
శోభన్ బాబు పిల్లొడ్ని ఊటీలోనే బళ్ళో వేసి శ్రీదేవికి గెస్ట్ హౌస్ లో మకాం ఏర్పాటు చేసి హైద్రాబాద్ తిరుగు ప్రయాణం అయ్యాడు
కట్ చేస్తే ,
ఇంట్లోకి వెళ్ళగానే గుమ్మడి పిడుగులాంటి వార్త చెప్పాడు
లండన్ నుంచి వచ్చిన డాక్టర్ జగ్గయ్య శారద కు క్యాన్సర్ అని ..ఏడుపు పాటలేవన్నా ఉంటే త్వరగా పాడుకోమని చెప్పాడని
శోభన్ బాబుకి మళ్లీ పెళ్లి చెయ్యమని ఏడుస్తూ శారద ఆఖరి కోరిక కోరింది
గుమ్మడి కూడా ఘాట్టిగా దగ్గి బెడ్డెక్కి శోభన్ బాబుని తండ్రిగా చూడాలని ఆఖరి దగ్గు కోరిక కోరాడు
శోభన్ బాబు ఆనందంగా ఊటీ ఎస్టీడీ కాల్ చేసి శ్రీదేవిని రైలెక్కి హైద్రాబాద్ రమ్మన్నాడు
శ్రీదేవి వచ్చిన తర్వాత ‘పిల్లాడ్ని మెట్రో ఎక్కించి రౌండ్ కొడుతూ ఉండు బాబూ మళ్ళొచ్చి నిన్ను ఇంటికి తీసుకెళ్తా ‘అని వాడ్ని మెట్రో ఎక్కించి శ్రీదేవిని ఒక్కదాన్నే తీసుకెళ్లి శారద ముందు తాళి కడతాడు
అది చూసి శారద ఏడుస్తూ సెలవు తీసుకుంటుంది
శోభన్ బాబు మళ్లీ మెట్రో స్టేషన్కెళ్లి బాబు ని తీసుకుని గుమ్మడికి చూపించి వీడి తండ్రిని నేనే..నేనే..నేనే అని గర్వంగా మూడుసార్లు చెప్తాడు
అది చూసి గుమ్మడి కూడా పెద్దగా దగ్గి సెలవు తీసుకుంటాడు
ఈ విషాద సమయంలో శ్రీదేవి శోభన్ బాబులు ఓ యుగళ గీతం అందుకుంటారు
శుభం
(సెకండ్ రిలీజ్)
(సినిమా చూశారుగా ఇగ రివ్యూలు రాసుకోండి )



