ప్రస్తుత కాలమంతా క్రియేటివ్ టైమ్. నువ్వెంత సృజనాత్మకంగా పనిచేస్తావో… ఆ సృజనాత్మకత జనాన్ని ఎంతగా ఆకట్టుకుంటుందో… ఎక్కడ మొనాటనీని రిపీట్ కానివ్వవో… అక్కడ ఆయా రంగాలను బట్టి డిమాండ్ సృష్టించుకోవచ్చు. అదే పని చేస్తున్నాడు బంటీ సజ్దేహ్.
ఇంతకీ బంటీ సజ్దేహ్ ఎవరంటారా..? ఇవాళ ఇండియన్ క్రికెట్ రన్ మిషన్ గా.. మాజీ కెప్టెన్ గా.. ఫిట్ నెస్ కు కేరాఫ్ గా… క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓస్థానాన్ని సృష్టించుకున్న విరాట్ కోహ్లీ అడ్వర్టైజింగ్ రంగంలోని అద్భుతమైన అవకాశాల వెనుక ఉన్న మేనేజర్. ఒక్క కోహ్లీ ఏంటీ… కరణ్ జోహార్ నుంచి మొదలుకుంటే… పీవీ సింధు, మన టాలీవుడ్ లైగర్ విజయ్ దేవరకొండ వరకూ ఇప్పుడంతా బంటీ సజ్దేహ్ వినియోగదారులే. అందుకే.. జనానికి తెలియని… సృజనాత్మక రంగంలోని ఆ బంటీ సజ్దేహ్ గురించి కాస్త చెప్పుకుందాం.

ఇవాళ విరాట్ కోహ్లీ ఆస్తుల విలువ నికరంగా 1050 కోట్ల రూపాయలని ఓ అంచనా! మరి విరాట్ ఇంతగా క్రికెట్ లోనే సంపాదించారా…? మరి విరాట్ లాగే ఎందరో క్రికెటర్స్… అందులోనూ ఆ స్థాయి స్టార్స్ కూడా ఉన్నా… వారెందుకు అంత సంపాదించలేకపోయారు…? ఇదిగో ఇలాంటి డౌట్స్ సర్వసాధారణమే!
కానీ, విరాట్ సంపద వెనుక కేవలం క్రికెట్ మాత్రమే లేదు. అంతకుమించి ఆయన మనకు నిత్యం టీవీల్లో ఏదో వస్తువుకో, సంస్థకో బ్రాండ్ అంబాసిడర్ లా వచ్చి… దాన్నెందుకు మనం సొంతం చేసుకోవాలో చెప్పి పోతుంటాడే… ఇంకా ఐపీఎల్ సమయంలో విరివిగా కనిపిస్తుంటాడే… అదిగో ఆ అడ్వర్టైజింగ్ రంగమే.. విరాట్ సంపద వెనుక ఉన్న మరో పెద్ద రహస్యం. ఆ రహస్యం వెనుకున్నది బంటీ సజ్దేహ్.
అసలెవరీ ట్యాలెంట్ మేనేజర్.. బంటీ సజ్దేహ్…?
1977, అక్డోబర్ 6వ తేదీన జన్మించిన 48 ఏళ్ల బంటీ సజ్దేహ్ ముంబైవాసి. అసలు పూర్తి పేరు అమిత్ అరుమ్ సజ్దేహ్. క్యాంపియన్ స్కూల్లో చదివాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోని బాండ్ విశ్వవిద్యాలయంలో పైచదువులకు వెళ్లి.. ముంబైకి తిరిగి వచ్చిన బంటీ కామర్స్ గ్రాడ్యుయేట్. 1998లో జీఎస్ వరల్డ్ ఎంటర్ టైన్ మెంట్ అనే ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. 2000-2005 వరకు పర్సెప్ట్ ట్యాలెంట్ మేనేజ్ మెంట్ సంస్థలో సీనియర్ మేనేజర్ గా పనిచేశాడు. 2005 నుంచి 2008 వరకు గ్లోబోస్పోర్ట్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ కు ఎదిగిపోయాడు. దాంతో బంటీ కెరీర్ ఓ మలుపు తిరిగింది. 2008లో కార్నర్ స్టోన్ అనే సంస్థను ప్రారంభించి.. కేవలం స్పోర్ట్ మేనేజ్ మెంట్ వ్యవహారాల వరకే పరిమితమయ్యాడు. కానీ, ఆ తర్వాత ధర్మ ప్రొడక్షన్స్ తో జతకట్టి.. ధర్మ కార్నర్ స్టోన్ పేరుతో… కరణ్ జోహర్ తో కలిసి.. స్పోర్ట్స్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగాడు బంటీ సజ్దేహ్.
బంటి బ్రాండ్ నేమ్ ప్రస్థానంలో ఓ కీలకమలుపుగా మారిన కోహ్లీ స్నేహం!
సుమారు దశాబ్దకాలంపాటుగా.. ఇప్పటికీ కోహ్లీతో సజ్దేహ్ అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్… బంటీ కజిన్ కాగా… ఆమెతో కలిసి కోహ్లీని చాలా బ్రాండ్స్ కు అంబాసిడర్ గా మార్చడంలో కీలకపాత్ర పోషించాడు బంటీ. అడిడాస్, ప్యూమా, టిస్సాట్, ఆడి వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలతో.. కోహ్లీ ఒప్పందాల వెనుక బంటీ సజ్హేహ్ దే కీలకపాత్ర. ముఖ్యంగా ప్యూమా వంటి సంస్థలతో సుమారు వంద కోట్ల ఒప్పందాల్లోనూ కోహ్లీ వెనుక సజ్దేహ్… ఆయన నిర్వహణలోని కార్నర్ స్టోన్ ది చురుకైన పాత్ర.
ఒక్క విరాట్ కోహ్లీనే కాదు.. సానియామీర్జా, కుల్దీప్ యాదవ్, పీవీ సింధు వంటి స్పోర్ట్స్ స్టార్స్ తో పాటు.. టైగర్ ష్రాఫ్, సారా అలీఖాన్, జాన్వీకపూర్, అనన్యపాండే, విజయ్ దేవరకొండ వంటి అగ్రశ్రేణి నటుల కెరీర్ ఎదుగుదలలోనూ… వారికి బిజినెస్ ఆర్గనైజేషన్స్ కు మధ్య అడ్వర్టైజింగ్ రంగంలో మధ్యవర్తిత్వం చేసి ఒప్పించడంలోనూ.. బంటీ ట్యాలెంట్ మేనేజ్ మెంట్ నే ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది.
బంటీ కెరీర్ లో మొదటి భార్య అంబికా చౌహాన్ కు విడాకులివ్వడం… నటి, వీడియాజాకీ రియా చక్రవర్తితో కొంతకాలం తిరగడం వంటి వ్యక్తిగత వివాదాలు మినహాయిస్తే… సృజనాత్మకంగా ఆలోచించి తన కార్నర్ స్టోన్ సంస్థను ఓ అద్భుతమైన ట్యాలెంట్ మేనేజ్ మెంట్ సంస్థగా తీర్చిదిద్దడం… తమ కెరీర్ ఆర్థికంగా ఎదుగుదలలో కోహ్లీ వంటి స్పోర్ట్స్ స్టార్స్ తో పాటు.. కరణ్ జోహార్ వంటి సినీస్టార్స్ కూడా బంటీ సజ్దేహ్ నే కోరుకోవడమంటే.. కచ్చితంగా ఇది అమిత్ అరుణ్ సజ్దేహ్ సాధించిన విజయంగా చెప్పుకోవాల్సిందే. కాస్త క్రియేటివ్ గా ఆలోచిస్తే.. ఇలాంటి రంగాల్లోనూ ఎలా ముందుకెళ్లొచ్చో చెప్పడానికి అమిత్ సజ్దేహ్ కథ ఓ ఉదాహరణ.


