లింగ నిర్ధారణ @ పుత్రోత్సాహం !
వేణు సేపూరి.. ✍🏻
ఓ కుటుంబం ఆనందంగా రోడ్డు మీదే స్వీట్లు పంచుకుంటున్నారు. వాళ్లకు ఏదో లాటరీ తగిలిందేమో అనుకున్నాను. కాసేపు వాళ్ళని చూస్తూనే ఉన్నాను. మనసు ఊరుకోలేదు. మెల్లిగా పక్కన నిల్చుని ఉన్న వాళ్ళ కారు డ్రైవర్ ను పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశాను. ఆయన తెలుగు వాడు కాదు. హిందీ మే బోలో అన్నాడు. సరే అని, ఎక్కడి నుంచి వచ్చారు. వాళ్ళు రోడ్డు మీదే స్వీట్లు ఎందుకు పంచుకుంటున్నారు అని ఆయన భాషలో అడిగితే.. అటూ ఇటూ చూసి ఎల్లో సారి కట్టుకున్న ఆవిడ ప్రెగ్నెట్ సర్ అన్నాడు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందని స్వీట్లు పంచుకున్నారు కావచ్చు అనుకుంటే… మొదటి కాన్పులో ఆడ పిల్ల పుట్టిందని, ఇపుడు కూడా ఆడ పిల్ల అయితే ఇబ్బంది అని స్కానింగ్ చేయించగా కడుపులో మగ బిడ్డ అని తేలినట్టు చెప్పాడు.

మగ బిడ్డ అనగానే వాళ్ళు ఎంతో సంతోషంతో ఉన్నారు. అమ్మాయి వాళ్ళ మామ ( భర్త తండ్రి) స్వీట్ బాక్స్ తేవడంతో అందరూ సంతోషంగా తింటున్న విషయం చెప్పాడు. వాళ్ళది మహారాష్ట్ర లోని నాందేడ్ కు సమీపంలోని ఊరు అని చెప్పాడు.
కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో నిన్నటి రోజున నేను చూసింది ఇది !
ఆడ పిల్ల అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశం అంతటా ఎంత వివక్ష ఉందో ఈ సంఘటనను చూస్తే అర్థం అవుతుంది.
కామారెడ్డి పట్టణంలో లింగ నిర్ధారణ ( స్కానింగ్) పరీక్షలు, భ్రూణ హత్యలు ( అబార్షన్లు ) విచ్చల విడిగా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడం, రాజకీయ నాయకులు అండగా నిలవడం వల్లే కామారెడ్డి లింగ నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ అగ్రభాగాన నిలుస్తోంది!



