కౌన్ బనేగా కరోడ్ పతి షో చూస్తుంటాడు… ఆన్సర్ రాంగైతే తిట్టి మన్నుపోస్తాడు.. రైటైతే చప్పట్లు చరుస్తాడు… కట్ చేస్తే, బాత్రూంలో పడి ఉన్న శవాన్ని కైమా చేసి ఆ ముక్కల్ని గోనె సంచీలో కట్టి డ్రెయిన్ లో పడేస్తాడు… ఇదీ స్థూలంగా సెక్టార్ 36 సినిమాలో ఓ సైకో కిల్లర్ స్టోరీ!

నాటకీయ జోడింపు సరేసరి! కానీ, స్టోరీ మూలం గురించి తెలుసుకోవాలంటే మాత్రం ఉత్తరప్రదేశ్ కు వెళ్లిరావాలి. 2006లో నోయిడాలో జరిగిన వరుస హత్యల కథేంటో తెలుసుకోవాలి. అలా నోయిడాలో సెక్టార్ 31కు వెళ్లొచ్చి… మళ్లీ ఓటీటీ తెరపైన ఆవిష్కృతమైన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సెక్టార్ 36 గురించి కూడా కాస్త చెప్పుకుందాం.
నోయిడా వరుస హత్యల వెనుక ఏం జరిగింది..?
నిఠారీ… నోయిడా సరిహద్దు గ్రామమది. 2005-06 మధ్య సెక్టార్-31లోని వ్యాపారవేత్త మొనీందర్ సింగ్ పంధేర్ ఇంట్లో చోటుచేసుకున్న వరుస హత్య ఘటనలు.. నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ ప్రభుత్వాన్నే షేక్ చేశాయి. మొత్తం 16 వరుస కిడ్నాప్, రేప్, హత్య, కేసుల్లో… మోనీందర్ సింగ్ అనే వ్యాపారిపై ఐదు కేసులు నమోదయ్యాయి. మిగిలిన కేసులు పదహారింటిలోనూ ఇక ప్రధాన నిందితుడు… సురీందర్ కోలీ. మోనీందర్ అనే వ్యాపారి ఇంట్లో.. సురీందర్ కోలీ పని చేసే వర్కర్. ఈ ఇద్దరికీ కూడా మరణశిక్ష విధించారు.
నిఠారీ సెక్టార్ 31లోని డీ5 కెనాల్ లో మానవ అవశేషాలు బయటపడటం.. అంతకుముందు వరుసగా మిస్సింగ్ కేసులు నమోదవుతున్నా పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం. కానీ, ఒత్తిడి పెరిగేసరికి రాజ్యం స్పందించింది. అలా, 2006, డిసెంబర్ 29న తప్పిపోయిన కొందరి అస్తిపంజరాలు డ్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్నాక… పోలీసులు మోనీందర్ సింగ్, కోలీలను అరెస్ట్ చేశారు.

ఆ తర్వాత సీబీఐ కూడా ఈ వరుస కిడ్నాప్, రేప్, మర్డర్ కేసుల విచారణలోకి ఎంటరైంది. 19 మంది వరుస మిస్సింగ్ కేసుల్లో మోనీందర్, కోలీ ఇద్దరిపై 19 ఎఫ్ఐఆర్స్ బుక్ చేసింది. ఈ కేసులో 16 మందిపై ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. 2009, ఫిబ్రవరి 13న బాధితుల్లో ఒకరైన 14 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో కోలీ, మోనీందర్ కు ప్రత్యేక సీబీఐ కోర్ట్ మరణశిక్ష విధించింది. అయితే 2023లో… అలహాబాద్ హైకోర్ట్ సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ 12 కేసుల నుంచి కోలీని, రెండు కేసుల్లో మోనీందర్ ను నిర్దోషులుగా తేల్చేసింది. కానీ, మిగిలిన కేసుల్లో ఇంకా విచారణ కొనసాగుతోంది. తన శిక్షను తగ్గించాలంటూ అలహాబాద్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పును కోలీ సవాల్ చేయగా.. ఆ కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లోనే ఉంది.
నిఠారీ కథను తన మొట్టమొదటి డెబ్యూ ఫిలిమ్ కు వస్తువుగా ఎంచుకున్నాడు దర్శకుడు ఆదిత్య నింబాల్కర్. netflix వేదికగా క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఓ మాంచి ఛాయిస్ ఈ సినిమా!
ఇక సినిమా విషయానికొస్తే!
12th ఫెయిల్ లో అమాయకత్వానికి కేరాఫ్ లా స్వాతిముత్యమనిపించుకున్న విక్రాంత్ మాసే.. ఓ సీరియల్ సైకో కిల్లర్ పాత్రలో ప్రేమ్ సింగ్ గా అంటే ఆశ్చర్యపోతాం! బహుశా.. అసలా విషయం సినిమా తీసేవాళ్లనే అబ్బురపర్చి ఉండొచ్చు! కానీ, ఆ ఆశ్చర్యాలకు చెక్ పెట్టేలా విక్రాంత్ నటన ఉంటుంది. సినిమా చివర్లో వచ్చే ఒక ఇంటరాగేషన్ సీన్ చాలు… అతడు మనసు పెట్టి నటించాడనడానికి! అదే సమయంలో సినిమాలో విలన్ క్యారెక్టర్ ఇంకా బలంగా ఉండుంటే.. ఇంకా బాగుండునేమోనన్న ఒకింత అసంతృప్తీ కనిపిస్తుంది. ఆ భయంకరమైన కన్నింగ్ నెస్ ఇంకా విక్రాంత్ కు అంతగా యాప్ట్ కాలేదా అనే సందేహాన్ని మన ముందుంచుతుంది. అయితే, సినిమాను మొత్తం డామినేట్ చేసిన రోల్ ఏదంటే మాత్రం ఇన్స్ పెక్టర్ రామ్ చరణ్ పాండే. పోలీస్ ఆఫీసర్ పాత్రలో దీపక్ డోబ్రియాల్ నటనే మొత్తంలో హైలెట్. అదే సెక్టార్ 36 సినిమా.
నెగటివిటీకి మార్కెట్ ఎక్కువై.. నేరాలు, ఘోరాలు, మానభంగాలు, హత్యలు, కిడ్నాపులే ఇప్పుడు కథా వస్తువులైపోతున్న వేళ… వాటిని తెరకెక్కించే విషయంలో కచ్చితంగా డైరెక్టర్ చాలా సున్నితంగా స్క్రీన్ ప్రెజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రిమోట్ చేతుల్లో ఉన్న వ్యూయర్.. ఏ కాస్త ఏదెక్కువైనా మరో ఆప్షన్ కు వెళ్లే అవకాశాలెక్కువ. పైగా ఇలాంటి సినిమాలు సెన్సార్ కత్తెర్లకు బలికాకుండా… వివాదాలకు కేరాఫ్ కాకుండా.. అనుకున్న విధంగా జనంలోకి రావాలంటే అదో పెద్ద టాస్క్. ఆ జాగ్రత్త మాత్రం మనకు ఆదిత్య నింబాల్కర్ దగ్గర కనిపించింది.
రామ్ చరణ్ పాండేగా… ముందు ఓ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ పాత్రనొకవైపు… తనకిష్టమైన నాటకాలు వేస్తూ.. రావణాసురిడి క్యారెక్టర్ మరోవైపు.. రెండూ దీపక్ డోబ్రియాల్ క్యారెక్టర్ లో ప్రతీకాత్మకంగా డామినేట్ చేసేలా పాత్రను తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక చివరగా ఇన్ స్పెక్టర్ రామ్ చరణ్ పాండే, నిందితుడు ప్రేమ్ సింగ్ మధ్య నడిచే ఇంటరాగేషన్ సీన్ చిత్రీకరణతో పాటు… తన కూతురు మిస్సైందంటూ బల్బీర్ సింగ్ బస్సీ పాత్రలో నటించిన ఆకాష్ ఖురానా ఇంటికి వెళ్లి గొడవకు దిగే వ్యక్తికీ, రామ్ చరణ్ పాండేకు మధ్య సన్నివేశాలు ఈ సినిమాలో హైలెట్. ఇలాంటి సీన్స్ మరికొన్ని కూడా సినిమాలో కనిపిస్తుంటాయి. వాటిని సినిమా చూసే ఎంజాయ్ చేస్తే బెటర్.
పూర్తిగా హింసాత్మకమైన సెక్టార్ 36ను ఎంతవరకూ తాను సున్నితంగా డీల్ చేయగలనన్నదే తనకు పెద్ద ఛాలెంజింగ్ గా మారిందంటూ కొన్ని మీడియా సంస్థలకు దర్శకుడు ఆదిత్య ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అతడు స్క్రిప్ట్ ను లీడ్ చేసే క్రమంలో తీసుకున్న జాగ్రత్తలను మనకు ఈ సినిమా పట్టి చూపిస్తుంది.
అయితే, ఎంత లేదన్న పూర్తిగా మానభంగాలు, కిడ్నాపులు, హత్యల నేపథ్యంతో తీసిన సినిమా అవ్వడంతో అక్కడక్కడా కొంత భరించలేని హింసాత్మక దృశ్యాలు ఒకటో, రెండూ ఇబ్బంది పెడుతాయి. కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా అస్సల్ కాదు.
కానీ, క్రైం థ్రిల్లర్ ప్రేమికుల కోసం.. మురికివాడల నరమాంస భక్షకుల కథగా… ఒర్జినల్ స్టోరీ నేపథ్యంతో తెరకెక్కిందే సెక్టార్ 36. కొసమెరుపేంటంటే… చివరకేమవుతుందని ఆసక్తిగా ఎదురుచూసిన వీక్షకుడికి.. ఆ ప్రశ్నకు సమాధానం దొరక్కుండానే శేషాన్ని మిగిల్చే విశేషం ఈ సినిమా ముగింపు!



