Sai Vamshi… ✍️
బెంగాలీలు అవార్డుల కోసమే సినిమాలు తీస్తారని, బెంగాలీ సినిమాలంటే సాగతీత అని అనేదెవరో ఇటురండి! వీపు మీద ఒక్కటి చరిచి ఈ సినిమా చూపిస్తాను. ‘ఉత్సవ్'(Utsab)(2000) అనే ఇలాంటి సినిమాలకు కదా ఆస్కార్ రావాలి. గంటా యాభై ఐదు నిమిషాల నిడివి. ఎక్కడా బోర్ కొట్టలేదు. మరికొంత ఉంటే ఏం పోయింది అనిపించింది.

ఒకే ఇల్లు. 5X3=15 మంది నటీనటులు. అందరికీ రకరకాల ఆలోచనలు, వ్యక్తిత్వాలు, సమస్యలు, నిర్ణయాలు. నేపథ్యంలో ‘దుర్గాపూజ'(విజయదశమి). ఎట్లా? ఎట్లా వచ్చింది ఇలాంటి ఆలోచన రితూపర్ణోఘోష్ అనే మహాదర్శకుడికి. అందరిచేతా అంత Subtle Acting తీసుకోవడం వెనుక ఎంత శ్రమ ఉంది? ఎంత పనితనం ఉంది? ఎంత మన్నికైన సృజన ఉంది? లాజవాబ్!
వైజయంతి మాల అధ్యక్షురాలిగా ఉన్న జాతీయ చలనచిత్ర అవార్డుల కమిటీ ఆయనకు ఉత్తమ దర్శకుడిగా పురస్కారం ఇచ్చి సరిపుచ్చింది. అబ్బే! ఏమాత్రం చాలదనిపించింది ఈ సినిమా చూశాక. ఒక్కటంటే ఒక్క ఎక్ట్రా షాట్ లేదు. అనవసరమైన సన్నివేశం లేదు. 60 ఏళ్ల వయసు నుంచి ఆరేళ్ల పిల్లాడి దాకా అందరి ఆలోచనలకూ అద్దం పట్టేలా కథ రాసుకున్నారు.
Directors & Aspiring Directors, Actors & Aspiring Actors. దయచేసి ఈ సినిమా చూడండి. మీకు మీరు బోలెడంత మేలు చేసుకోగలిగే అవకాశం ఉంది.
Amazon Primeలో అందుబాటులో ఉంది.



