వెస్ట్ బెంగాల్ టూ వెస్టర్న్ కంట్రీస్! ఆ విగ్రహాలకు ఎందుకంత డిమాండ్..?

వైభవోపేతమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు చిరునామా కలకత్తా. అలాగే, దుర్గా విగ్రహాలకు కేరాఫ్ కోల్ కత్తాలోని కుమార్తులి. మొత్తంగా దసరా పండుగకు.. శరన్నవరాత్రి ఉత్సవాలకు.. అలాగే, దుర్గా విగ్రహాల తయారీకి ఇలా ఓ అవినాభ సంబంధమున్న ప్రాంతం పశ్చిమబెంగాల్. మరి కుమార్తులి దుర్గా విగ్రహాల తయారీలో ఎంత పేరు తెచ్చుకుంది.. ఆ విశేషాలేంటి తెలుసుకుందాం రండి.

కాలిఫోర్నియా నుంచి సింగపూర్ వరకూ!

కుమార్తులి దుర్గా విగ్రహాలు.. ఇప్పుడు సముద్రాలు దాటి, ఎల్లలు దాటి విదేశాలకు ఎగుమతవుతున్నాయి. ఎక్కడ చూసినా బెంగాల్ తరహా దుర్గా పూజా సందడే కాదు.. విగ్రహాలూ వారివే.

మట్టిముద్దకు ప్రాణం పోసి దుర్గాదేవిని తయారుచేస్తారిక్కడ. అందుకే వీరి విగ్రహాల తయారీకి అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడింది. గత ఏడాది కుమార్తులి నుంచి 300కు పైగా దుర్గాదేవితో పాటు.. ఆమె పరివార దేవతల విగ్రహాలను విదేశాలకు పంపారు. ఈసారి ఆ డిమాండ్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఏటికేడు ఈ డిమాండ్ పెరుగుతోంది.

అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జపాన్, యూఏఈ, జర్మనీ, ఇటలీ, సింగపూర్, కెనడా, రష్యా వంటి దేశాల నుంచి విపరీతమైన ఆర్డర్స్ పోటెత్తడంతో అంతర్జాతీయ సమాజంలో దసరా వేడుకలకు ముందు కుమార్తులి పేరు మార్మోగిపోతోంది.

మట్టివే కాదు.. ఫైబర్ గ్లాస్ తోనూ విగ్రహాల తయారీ!

స్థానికంగా విక్రయించేందుకు మట్టి విగ్రహాలను తయారుచేసే కుమార్తులీ కళాకారులు.. విదేశాలకు పంపే విగ్రహాలను మాత్రం ఫైబర్ గ్లాస్ తో తయారు చేస్తున్నారు. మట్టి విగ్రహాలతో పోలిస్తే ఎక్కువ కాలం మన్నిక… సులభంగా ప్యాకింగ్ చేసి తీసుకెళ్లే అవకాశముండటంతో ఫైబర్ గ్లాస్ విగ్రహాలకు ఆదరణ పెరిగింది. సముద్రంలో 80 నుంచి 90 రోజుల పాటు ప్రయాణం చేస్తేనేగానీ కార్గోల్లో ఈ విగ్రహాలను పంపించలేరు. కాబట్టి, విగ్రహాల ఎగుమతికి సంబంధించిన రవాణా జనవరిలోనే ప్రారంభమవుతుంది.

సంప్రదాయ రూపానికే డిమాండ్ ఎక్కువ!

విదేశాల నుంచి షాబేకి విగ్రహ రూపాలనే ఎక్కువ కోరుకుంటున్నారట. షాబేకి అంటే సంప్రదాయ బెంగాలీ రూపంలోని దుర్గామాత విగ్రహాలన్నమాట. గత రెండేళ్ల క్రితం కొంత ఆధునకి థీమ్స్ తో ప్రయోగాలు చేసినప్పటికీ.. సంప్రదాయ పద్ధతికే మొగ్గు చూపడంతో మళ్లీ అద్భుతమైన బెంగాలీ కళాకారుల నైపుణ్యం ప్రదర్శించే దుర్గా మాత విగ్రహాలు ఇప్పుడు విదేశాలకు చేరుకున్నాయి.

కోల్ కత్తాలోని దుర్గాపూజలో ప్రతీ ఏడాది సామాజిక సమస్యలు, సమకాలీన ఘటనలను ప్రతిబింబించేలా ప్రత్యేక థీమ్స్ ఎంచుకోవడం ఆనవాయితీ. పందిళ్లు, విద్యుత్ వెలుగులతో అలంకరణ, విగ్రహాల తయారీలనూ ఈ అంశాలన్నీ ప్రస్ఫుటమవుతుంటాయి. కానీ, విదేశాల్లో మాత్రం ఇప్పుడు బెంగాలీ సంప్రదాయ విగ్రహ రూపాలకే ఆదరణ దక్కుతోందంటున్నారు కుమార్తులి కళాకారులు.

దేశం వీడినా.. పండుగంటే మక్కువే!

విదేశాల్లో నివశించే బెంగాలీలు దుర్గాపూజను తమకు అనుకూలమైన విధంగా నిర్వహిస్తారు. సాధారణంగా ఒక విగ్రహాన్ని కొన్నేళ్లపాటు ఉపయోగిస్తారు. పూజలు కూడా శాస్త్రాల్లో చెప్పిన ఐదురోజులకు బదులుగా వారాంతాల్లో నిర్వహించడం అక్కడి పరిస్థితులకనుగుణంగా మార్చేశారట. కానీ, పండుగలో అసలు భావం మాత్రం మారకుండా… చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకలా దసరాను జరుపుకుంటున్నారు.

కుమార్తులి కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకునే దుర్గమ్మలు సప్త సముద్రాలు దాటి విదేశాలకు చేరుతున్నాయి. అక్కడి భారతీయుల ఇళ్లల్లో, పూజా మంటపాల్లో మళ్లీ మన పండుగ వాతావరణాన్ని తీసుకొస్తున్నాయి. ఆరు నుంచి ఎనిమిది అడుగుల ఎత్తున్న విగ్రహాల ధర సుమార్ 1 లక్షా యాభై వేల వరకూ ఉండగా.. ప్యాకింగ్, రవాణా ఖర్చులు అందుకు అదనంగా తీసుకుంటారు. మొతమ్మీద కుమార్తులి దుర్గా విగ్రహాలు ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో విరివిగా కనిపిస్తూ పశ్చిమబెంగాల్ హస్త కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి.

వారసత్వ గుర్తింపు వల్ల పెరిగిన డిమాండ్!

2021లో కోల్ కత్తా దుర్గాపూజకు యునెస్కో అమూర్త సాంస్కృతిక వారసత్వ గుర్తింపు లభించింది. దీంతో ఇక్కడి విగ్రహాలకు మరింత డిమాండ్ పెరిగింది. విదేశాల్లోని బెంగాలీ సంఘాలు మరిన్ని విగ్రహాలను ఆర్డర్ చేయడం ప్రారంభించడంతో కుమార్తులి కళాకారుల పేరు అంతర్జాతీయంగా మార్మోగుతోంది. ఈ ఊళ్లో చేసే విగ్రహాలు ఇప్పుడు ఏకంగా 90 దేశాలకు ఎగుమతవుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles