తల్లీదండ్రి చచ్చిపోయి… పిల్లలు పుట్టకముందే ప్రవర్తన నచ్చక పెళ్లాం వదిలేసి.. ఇంట్లో ఒక్క కొడుకే అవడం వల్ల ఒంటరిగా మిగిలిపోయి.. తండ్రి సంపాదిస్తున్న ఆస్తులను కరిగిస్తూ జులాయిగా తిరిగే ఏకాంబరం… తన కాళ్లపై తాను నిలబడేందుకు వంటలు చేసుకుంటూ.. వంటలు చేసుకోవడం వల్లే తన పేరు అలా మారి బతుకు వెళ్లదీస్తున్న కుక్కాంబరం.. ఇద్దరూ విడదీయరాని మంచి స్నేహితులు. ఇద్దరూ రోజూ సాయంత్రం అలా సరదాగా కలిసి గోదారి గట్టుంది.. గట్టు మీదు ఓ టీ స్టాలుంది.. అందులోన ఛాయుంది.. ఆ ఛాయ్ తర్వాత ఓ దమ్ము లాగాలానుంది అని పాడుకుంటూ వెళ్లి.. పిచ్చాపాటి మాట్లాడుకునేందుకు తెగ ముచ్చటపడే టైపు.
అయితే, ఇద్దరూ మంచి స్నేహితులైనప్పటికీ… ఇద్దరికీ ఒకరి గురించి ఇంకొకరికి లోతుపాతులూ తెలిసినప్పటికీ.. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఒకింత అసూయ, అంతకుమించి అనుమానం మాత్రం కనిపించేవి. కానీ, ఇద్దరూ మిగిలిన ఊరి ముచ్చట్లెన్ని పిచ్చాపాటీగా మాట్లాడుకున్నా… వాళ్ల అసూయను మాత్రం బయటపెట్టుకునేవారు కాదు. ఒకరిని చూస్తే ఇంకొకరికి ఆ అనుమానం మాత్రం కల్గేది. తమకు తెలిసిన ఏ విషయాన్నైనా బయటకు పొక్కకుంటే లోపలంతా ఉబ్బి పోతారేమోనన్నంత కంగారు కనిపించే ఏకాంబరం, కుక్కాంబరం ఆ అసూయ అనే ఉబ్బును మాత్రం ఒత్తిపట్టుకుని అలాగే ఆపుకుంటూ తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.
అయితే దాన్ని ఆపుకోలేని స్థితి రావడంతో.. ఓరోజు వాళ్లిద్దరికీ మ్యూచువల్ ఫ్రెండైన నిరాడంబరానికి తమ గోడు చెప్పుకోవాలనిపించింది. ఎందుకు తను ఏకాంబరం గురించి అసూయ పడాల్సి వస్తుందో కుక్కాంబరం.. అలాగే, కుక్కాంబరం గురించి అసూయ విషయంలో ఏకాంబరం ఫిర్యాదుకై ఇద్దరూ నిరాడంబరాన్ని కలిశారు. అయితే, అనుకోకుండా ఇద్దరూ ఒకేసారి నిరాడంబరాన్ని కలిసేసరికి.. మళ్లీ ఆ ఉబ్బును అలాగే ఆపుకోవాల్సి వచ్చింది. అలా ఆర్నెల్లు కలిసుంటే వారు వీరవుతారన్నట్టుగా… నాల్గైదుసార్లు ఏకాంబరం ఏ సమయంలో నిరాడంబరాన్ని కలవడానికి వెళ్దామనుకుంటున్నాడో.. అదే సమయానికి అక్కడికి యాదృచ్ఛికంగా కుక్కాంబరం వస్తుండటంతో ఇటు ఏకాంబరంలోనూ.. అటు కుక్కాంబరంలోనూ ఇదంతా నిరాడంబరమే లీక్ చేస్తున్నాడా అనే సందేహానికి ఆస్కారమేర్పడింది.
దాంతో ఒకరిపై ఒకరు ఎందుకు అసూయ పడుతున్నారనే విషయాన్ని ఒకరికొకరు చెప్పాలనుకున్నది కాస్త పక్కదారి పట్టి.. పేరుకే నిరాడంబరంగానీ.. ఇంత లీకు వీరుడా మన నిరాడంబరం అన్న భావన మొదలైంది. మేమిద్దరం ఏం చెబుదామనుకుంటున్నామన్న దానిపై ఆసక్తి కనబర్చకుండా.. మేమిద్దరం ఒకరికొకరమే పరస్పరం తనతో కంప్లైంట్ చేసేందుకు వస్తున్నామని నిరాడంబరం అంత కచ్చితంగా ఎలా పట్టేశాడా జుట్టు పీక్కున్నా అర్థం కావడంలేదు ప్రాణస్నేహితులై ఒకరిపై ఒకరు అసూయ అనే అనుమానంతో రగిలిపోతున్న ఏకాంబరం, కుక్కాంబరానికి!
ఏదో లీలగా కూనీరాగాలు తీస్తూ తన ఇంటిముందు నుంచే వెళ్తున్న నిరాడంబరాన్ని చూసి.. అంబరమంత ఆనందంతో.. అప్పటికప్పుడే నిరాడంబరాన్ని పిల్చేసి తన లోపల బాధేంటో చెబితే పనైపోతుంది కదా.. అంతేకాదు, ఇప్పటికిప్పుడు నిరాడంబరం నేను తనను కలుస్తున్నాననీ ఏకాంబరానికి ఎలాగూ చెప్పలేడనుకుని.. అనుకుందే తడవుగా కుక్కాంబరం.. ఇంటి బయటకొచ్చి నిరాడంబరం నిరాడంబరం అని అరిచాడు. ఆ పిలుపు కంటే కూడా కుక్కాంబరం వేసిన పోపు ఘాటు ముక్కుపుటాలను తగిలి వెనక్కి తిరిగిన నిరాడంబరం.. హాయ్ చెప్పాడు. అలా దూరం నుంచే కుక్ కుక్కాంబరం పిలవడంతో.. నిరాడంబరం కుక్కాంబరం ఇంటి బాట పట్టాడు.
ఇంకేం, అవకాశం దొరికిందే అదనుగా.. నిరాడంబరం ఎప్పుడు నిన్ను పర్సనల్ గా కలిసి ఓ ముచ్చట చెప్పుదామనుకున్నా.. మన ఇద్దరి స్నేహితుడైన ఏకాంబరం కూడా నేను వచ్చిన సమయంలోనే నీ దగ్గరకు ఎలా వస్తున్నాడని.. లీకు వీరుడు నిరాడంబరమేనా, కాదా అనేది తేల్చుకునేందుకు మొదటి ప్రశ్న సంధించాడు కుక్కాంబరం. దానికి బదులుగా అదేంలేదు.. కవల పిల్లల్లో ఒకరిని కొడితే ఒకరికి నొచ్చినట్టుగా… మీరిద్దరూ ప్రాణస్నేహితులైనందు వల్ల.. ఒకరి రాక ఒకరికి తెలిసి మీరిద్దరూ ఒకే సమయానికి పలుమార్లు రావడం యాదృచ్ఛికమై ఉండొచ్చేమోనన్నాడు నిరాడంబరం. ఇంకాస్తా గట్టిగా నిలదీశాడు కుక్కాంబరం. ఆ అవును! మీ ఇద్దరినీ చూసినప్పట్నుంచీ ఎప్పుడూ కలిసుండే మీరు.. ఏ పనైనా కలిసి చేసే మీరు.. నన్ను మాత్రం ఏకంతంగా ఒకరు లేకుండా ఇంకొకరు కలవాలని అనుకోవడంతో నాకు సందేహం కల్గిన మాట వాస్తవమేనంటూ అసలు నిజం బయటపెట్టాడు నిరాడంబరం. నిరాడంబరం అంతర్గత ఆలోచనల లోతు తెలియని కుక్కాంబరం.. పేరుకే నిరాడంబరం తప్ప.. చానా ఉందే మనోడిదగ్గర అని మనసులో అనుకున్నాడు కుక్కాంబరం. ఎంత నిరాడంబరమని పేరు పెట్టుకున్నా.. ఎదుటివాళ్ల మనస్సులో ఏముందో ప్రిడిక్ట్ చేయగల నేర్పరితనం నిరాడంబరం ప్రత్యేకత. దాంతో తన గురించి కుక్కాంబరం లోలోపల ఏం నసుగుతున్నాడో నిరాడంబరం కాస్తా ఊహించి ఓ అంచనాకొచ్చాడు.
అప్పుడుగానీ.. తానింతకాలం ఏకాంబరం గురించి లోపల దాచుకుని కడుపంతా ఉబ్బి నిరాడంబంరంకు చెప్పాలనుకున్న విషయం కుక్కాంబరం నుంచి బయటకు రాలేదు. ఏకాంబరం లేకుండా నిరాడంబరం ఏకాంతంగా దొరికినందుకు మనసులోనే ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ.. ఓవైపు నిరాడంబరాన్నీ అనుమానిస్తూ.. తనకు ఏకాంబరంపై ఎందుకు అసూయో చెప్పుకున్నాడు కుక్కాంబరం. ఓస్.. ఇంతేనా..? ఈ మాత్రం దానికే నువ్వు ఇంత మథనపడ్డావా…? అయితే, నీ ప్రాణ స్నేహితుడైన ఏకాబంరమూ ఇందుకోసమే ప్రయత్నిస్తుండవచ్చు.. అందుకే తానూ నన్ను ఒంటరిగా కలవాలని యత్నిస్తుండవచ్చునంటూ కుక్కాంబరంలో మరిన్ని డౌట్లకు ఆజ్యం పోశాడు నిరాడంబరం. ఏకాంబరాన్ని కలిసి తానేం చెప్పదల్చుకున్నాడో తెలుసుకుని.. మళ్లీ మీ ఇద్దరినీ పిల్చి నేనే మర్యాద రామన్ననైపోతా.. ఈ మాత్రం దానికే ఎందుకింత ఫికర్ చేస్తున్నావంటూ తీవ్రంగా ఆలోచిస్తున్న కుక్కాంబరం ఆలోచనలను లైటర్ వేలో బలహీనపర్చే యత్నం చేశాడు మిత్రుడిగా నిరాడంబరం.
ఇంకేం, కుక్కాంబరానికి నేను వెళ్లి వస్తా.. ఈరోజుతో మీ ఇద్దరి అసూయా సందేహాలను పటాపంచలు చేసేస్తా.. మీ ఇద్దరికీ ఓ దారి చూపిస్తానంటూ.. తన దారిలో తాను పోతూ పోతూ మార్గమధ్యంలో తానే ఏకాంబరం ఇంట్లోకి జొర్రాడు నిరాడంబరం. వెతుకబోయిన తీగ కాలికి తగిలినట్టు.. తన స్నేహితుడు కుక్కాంబరం లేకుండా.. నిరాడంబరం ఒంటరిగా తనకు తానుగా తన ఇంటికి వచ్చి ఏకాంతగా కలవడంతో ఏకాబంరం ఆనందం ఆకాశ అంచులు కూడా దాటి అవధుల్లేకుండా పోయింది. నిరాడంబరానికి తమ గోడు చెప్పడానికి వెళ్లిన ప్రతీసారీ తన స్నేహితుడు కుక్కాంబరం కూడా వస్తుడటంతో.. లీకువీరుడు నిరాడంబరమేనన్న భావన ఏకాంబరంలోనూ కుక్కాంబరం తరహాలోనే ఉన్నప్పటికీ.. నిరాడంబరం తనకు తానుగా తన ఇంటికి రావడంతో.. కుక్కాంబరంలా లీకుల ప్రశ్నడక్కుండా.. మర్యాద రామన్నకివ్వాల్సిన గౌరవాన్నిస్తూ.. తానూ కుక్కాంబరంపై ఎందుకు అసూయ పడాల్సి వస్తుందో నిరాడంబరం ముందుంచాడు ఏకాంబరం. దానికి మళ్లీ నిరాడంబరం నుంచి సేమ్ డైలాగ్! ఓస్ ఇంతేనా..? ఈ మాత్రం దానికే మీరిద్దరూ ఇంతలా ఒకరిపై ఒకరు అసూయ పడుతున్నారా అని నిరాడంబరం పెదవివిరుపుతో చెప్పేసరికి.. మళ్లీ ఏకాంబరంలో.. తనను కలిసేకంటే ముందే నిరాడంబరాన్ని కుక్కాంబరం కలిశాడా అన్న డౌట్ రెయిజ్ అయింది. సరే, ఏదైతే అదైంది మన గోడుకు ఓ పరిష్కారం దొరికితే పాయె అనుకుని మౌనంగా ఉండిపోయాడు ఏకాంబరం. మీ ఇద్దరూ సాయంకాలానికి రోజూ కలిసే గోదారి గట్టుపైనున్న ఛాయ్ కొట్టు వద్దకు రండి అని చెప్పి వెళ్లిపోయాడు నిరాడంబరం.
ఇదే విషయాన్ని ఏకాబంరం కుక్కాంబరానికి సమాచారమిచ్చాడు. అన్నా.. నా దగ్గరకే వచ్చాడనకున్నానే నిరాడంబరం.. ఏకాంబరాన్నీ కలిశాడా అన్న సందేహంతో పాటు.. నన్ను కలిసేకంటే ముందే ఏకాబంరాన్ని కలిసుంటాడా.. లేక, తనను కలిసి వెళ్లాక ఏకాంబరంతో మాట్లాడుంటాడా అనే కొత్త డౌటూ ఉదయించింది కుక్కాంబరంలో. ఏదైతే అదైంది.. సమస్యకు పరిష్కరం దొరికితే పాయె అని ఏకాంబరం తరహాలోనే ఒకింత నిర్వేదంతో కుక్కాంబరమూ ఊరుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.
ఇంకేం, కట్ చేస్తే ఏకాంబరం, కుక్కాంబరం.. మధ్యలో నిరాడంబరం.. వీరు ముగ్గురూ కలిసి గోదారి గట్టు.. గట్టుపైనున్న ఛాయ్ కొట్టులో మీటయ్యారు. ఇంకేం కుక్కాంబరం, ఏకాంబరం మాట్లాడేదేమీలేకపోగా.. ఇద్దరి సందేహాలూ అప్పటికే నిరాడంబరం చెవిన పడటంతో.. నిరాడంబరమే పెదవి విప్పి.. వారిరువురికీ ఒకరిపైనున్న అసూయ మరొకరికి పోవాలంటే ఏంచేయాలో చిట్కా చెప్పాడు. కొన్నాళ్లు ఏకాంబరం ఆస్తులను అనుభవిస్తూ నువ్వే ఏకాంబరమైపో అంటూ కుక్కాంబరానికీ… కొన్ని రోజులు కుక్కాంబరంలా సొంత కాళ్లపై నిలబడాలనుకుంటున్న నువ్వు కుక్కాంబరంకు వచ్చే ఆర్డర్లు తీసుకుంటా కుక్కాంబరంగా రూపాంతరం చెందంటూ ఏకాంబరానికి సూచించాడు నిరాడంబరం. అరె.. ఇదేదో బాగుందే అనుకున్నారు ఇద్దరూ. ఇంతకాలం కష్టపడిన కుక్కాంబరం ఏకాంబరం ఆస్తులను అనుభవిస్తూ హాయిగానే ఉండొచ్చు. కానీ, తాతలు సంపాదించిన ఆస్తులు కరిగిస్తూ ఇంతకాలం ఎంజాయ్ చేసిన ఏకాంబరానికి మాత్రం కుక్కాంబరంలా కుక్కింగ్ రాదుగా వంటల ఆర్డర్లు పట్టుకోవడానికి…? మళ్లీ రెయిజ్ అయిన ఈ కొత్త డౌట్ కీ మధ్యేమార్గంగా.. నీకు వంటలవసరం పడ్డప్పుడల్లా కుక్కాంబరం సలహాలు, సూచనలిస్తుంటాడు.. నాల్గు వంటలు ఫెయిల్ చేశావంటే నల్గురిని చంపాక డాక్టరైనట్టుగా.. నువ్వూ మంచి పాకశాస్త్ర నిపుణుడివైతావంటూ ఏకాంబరంలో కాన్ఫిడెన్స్ ప్రోది చేసే యత్నం చేశాడు నిరాడంబరం.
అలా నిరాడంబరం చెప్పినట్టుగా.. ఎంతకాలం ఈ వంట కష్టాలని నిట్టూర్పూలిడుస్తున్న ఏకాంబరం ఆస్తులననుభవిస్తూ కుక్కాంబరం.. కుక్కాంబరం కుక్కింగ్ ను ఒంటబట్టించుకుని సొంత కాళ్లపై నిలబడాలన్న ఆకాంక్ష నెరవేరిన సంతృప్తితో ఏకాంబరం.. నిరాడంబరం సలహా, సూచనతో హాయిగా అదలుబదులైపోయారు. కానీ, చివరగా కథ కంచికి.. నిరాడంబరం ఇంటికీ చేరుకున్నాక… ఈ మాత్రం దానికే నిరాడంబరాన్ని మధ్యవర్తిగా పెట్టేందుకు అన్నిసార్లు ఇద్దరమూ ఒంటరిగా కలవాలనుకోవమేంటన్న కొత్త డౌట్.. గోదారి గట్టులోని ఛాయ్ కొట్టులో ఊదిన పొగల్లోంచి పుట్టుకొంచ్చింది ఏకాంబరానికీ, కుక్కాంబరానికి.


