ఆ పాట పంచామృతం!

పదాలు పాటైతే పరవశిస్తాయి.. ఆ పాట విన్న శ్రోత అంతకంతకూ చెవులు రిక్కరిస్తాడు.. కానీ, ఓ గొంతున పడ్డ పాటే పులకరించి పరవశిస్తే.. అది కేవలం బాలు నోట మాత్రమే!

అందుకే ఆయన నోట పడ్డ ప్రతీ పాటా అదృష్టం చేసుకున్నట్టే!

ఆ అదృష్టం శ్రోతలకు దక్కడం ఆయనభిమానులందరికీ మరింత మహద్భాగ్యమే!

ఎలాంటి సంగీతానిభివేశం లేకుండా… పలికే ప్రతీ పదంపై పట్టు.. శృతిశుద్ధత.. తప్పని తాళం.. పలికించే భావం… వెరసి త్రాసులో వేసినట్టుండే సుస్వరం బాలు పాట!

1946, జూన్ 4-2020, సెప్టెంబర్ 25

స్వర స్థానాన్ని తప్పని అదుపూ.. దాన్ని మించి ఓ పాటను ఓన్ చేసుకుని కనబర్చే ఆధిపత్యం.. ఎందరో మహానుభావులున్నా అది కొందరికే సాధ్యం. అందులోనూ బాలుకు మాత్రమే ఇంకొంచెమెక్కువ సాధ్యం!

ఏ వస్తువైనా, వ్యక్తైనా, వ్యవస్థైనా.. ప్రతీదానికీ కొన్ని పరిధులు, ఎల్లలూ ఉంటాయి. కానీ, ఆనోటి నుంచి వచ్చే పాటకు మాత్రం నో బ్రౌండ్రీస్!

కొంత మంది ఇంటి పేరు కాదుర గాంధీ అన్నప్పుడు.. ఆ గరమనాభిలోంచి వచ్చే ఫోర్స్ వెంట్రుకలు నిక్కబొడ్చేలా చేస్తుంది. కలగా కల్పనగా ఓ లాలీ పాటతో జోల కొడుతూ నిద్ర పుచ్చుతుంది.

మందర స్థాయిలో ఆ పాట పంచామృతాన్ని పంచుతుంది… తారాస్థాయిలో గా మా ని అంటూ మొదలై.. గమగస మగస గస అంటూ మళ్లీ మంద్రానికొచ్చి.. ఆరోహణ, అవరోహణల్లో హంసానందిని ఇంకందంగా మారుస్తుంది.

అమావాస్య చీకట్లోనూ సెంచరీలు కొట్టే వయస్సు మాదంటూ హుషారైన పున్నమి వెలుగులు నింపే పాటది. తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో ఉదయించిన భూపాళమది. చిలకా ఏ తోడు లేక ఏటేవమ్మ ఒంటరి నడకా అంటూ భర్తను దూరం చేసుకున్న ఇల్లాలి మౌనవేదనను కళ్లకు కడుతుంది.

సురదేవతల మథనంతో అమృతం పుట్టిందన్నది పుక్కిట పురాణాలు చెప్పే కథైతే… తన గానంతో అమృతాన్ని చిలికిన గానగంధర్వుడు బాలు!

ఒక యాంకర్… ఒక యాక్టర్… ఒక ప్రొడ్యూసర్… ఒక మ్యూజిక్ డైరెక్టర్… ఒక సూపర్ వైజర్… ఒక సింగర్… వెరసి అతనో పాటల, మాటల మాంత్రికుడు!

అంజలీ అంజలీ అంటూ ఆ గొంతు ఆకాశాన్నందుకుంటుంది… ఓం నమ: లయల శృతులకు ఓం నమ: హృదయ లయలకు ఓం అంటూ యదలోతుల్లోని గుండె లబ్డబ్ ని హంసనాదం చేస్తుంది. అందుకే, ఆ గొంతు మిస్టర్ పెర్ఫెక్ట్.

ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలని ఎన్ని సార్లనుకున్నా… అందులో తనను మరింత గుర్తుంచుకునేలా, చేసుకునేలా… అసలు మర్చేపోకుండా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం.. ఇంత జాగా ఏర్పాటు చేసుకున్న గానం బాలు!

భాషతో సంబంధం లేదు… ఏ భాషైనా ఆ గొంతు తిప్పగలదు… స్థానికులకు నప్పగలదు… మొత్తంగా ఆ పాటే మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేయగలదు.

40 వేలకు పైగా పాటలతో జగద్వితమై… ఖ్యాతంటే ఇలా ఉండాలనేలా పరాకాష్ఠై… ప్రపంచం మొత్తం మెచ్చిన గానమది… ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా ఆరంభించాలో, ఎక్కడ ముగించాలో కూడా తెలియనంత మెస్మరైజ్ చేసి… మాటలకు, రాతలకందకుండా దివికేగిన పామరులు మెచ్చిన ఆ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యానికి అందిస్తున్న చిన్న అక్షర నివాళిది!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles