Nuri Bilge Ceylan’s ‘ About Dry Grasses’ also has, as his other films, lengthy single shots and lengthy conversations that keep going on in fixed frames.
……………………………………………………………………………………………………………….
Padmaja Suraparaju ✍️
కానీ ఒక్క మాటా, ఒక్క ఘడియ స్థిర చిత్రం కూడా ఈ చలనచిత్రంలో, పాత్రల మనో పార్శ్వాలను చూపించడానికే తప్ప.. వ్యర్థంగా లేదు అస్సలు.

కథ క్లుప్తంగా!
టర్కీలోని ఓ మారుమూల పల్లెటూరు, దాన్ని సంవత్సరంలో మూడువంతుల దినాలు మంచు ముంచుతుంటుంది, మరో నాలుగో భాగం రోజులు గ్రీష్మం కాలుస్తుంటుంది. అక్కడ బడిలో ఒక ఆర్ట్ టీచర్.
బళ్ళో ఆరో ఏడో చదువుతున్న పిల్ల ఆ art teacher తనతో misbehave చేశాడని చెప్పిందని ఆ school director అతన్ని మర్యాదగా పిలిచి ఘాటుగా చెప్తాడు బుద్దిగా ఉండు ఇహమీదట అని.
ఇదే కథతో పదిహేనేళ్ళ క్రితం, The Hunt అని ఒక Scandinavian సినిమా వచ్చింది. అందులో అయితే మరీ ఒకటో తరగతి చదివే ఆరేడేళ్ళ పిల్ల. ఆ మగ టీచర్ ను ఉద్యోగం లోంచి తీసేస్తారు. పరిచయస్థులు, స్నేహితులు చాలా దగ్గరి వాళ్ళు కూడా పిల్లనే నమ్ముతారు. ఒక్క కొడుకు తప్ప. అంతకు మునుపే అతను డివోర్స్డ్ సింగిల్ పేరెంట్. ఆయన జీవితం హఠాత్తుగా తలకిందులౌతుంది. మెల్లగా అతన్ని వెలివేసేసినంత పని చేస్తారు. చివర సీన్ లో అతను కొడుకుతో ఒక వైల్డ్ పార్క్ కు వెళ్తాడు కాస్త సద్దుమణిగింది గొడవ అని స్థిమితపడి. అక్కడ తిరుగుతుంటే ఉన్నట్టుండి వాళ్ళ దగ్గరగా ఒక గన్ షాట్ పేలుతుంది. మనమూ, అతనూ కూడా ఉలిక్కి పడతాం. నివ్వెరపోతాం ఈ ద్వేషానికి ఒక హద్దు లేదా అని..?
ఇంతకీ ఆ పిల్ల సినిమా మధ్యలో ఒక చోట ఒప్పుకుంటుంది “ఊరికే చెప్పాను అలా, ఆయన ఏం చెయ్యలేదు. రోజూ బాగా మాట్లాడేవాడు ఆ రోజు నన్ను పట్టించుకోలేదు, అందుకే అట్లా చెప్పాను . ఆయనంటే కోపం వచ్చింది.” అని .
వేటాడబడే అసహాయపు జంతువు కళ్ళల్లో కనపడే నిస్పృహ చూపు నిండిన అతని కళ్ళను చూపిస్తూ కథ ముగుస్తుంది.
అతని జత కళ్ళు కూడా ఇంకొన్నాళ్ళకి తన ముఖాన్ని మిగతా వేటాడే కళ్ళ తాలూకు persecution తోటే చూస్తాయేమో!
అంత శక్తి ఉంటుంది ఒక అనుమానానికి!
ఇప్పటి చేలన్ ఈ సినిమాలోని టీచర్ కు కేవలం మందలింపు మాత్రమే. వేరే ఎటువంటి నష్టమూ జరగదు, ఊర్లో ఈ మాట పొక్కుతున్నదేమో అనే ఒక ఇబ్బందైన apprehension తప్ప అతనికి.
ఇక్కడి టీచర్ కూడా ఆ అమ్మాయి భుజం మీద సాంతం చెయ్యి కూడా వెయ్యడు, ఆ పిల్ల తన చిన్నతనపు చేష్టలతో అతనికి మరీ దగ్గరగా వచ్చి అల్లుకుపోతున్నా.
ఈ కథా ఇతని వేటలానే నడుస్తుందా అని ఒక నిమిషం అనుకుంటాం.
కానీ ఇతన్ని ఎవరూ వేటాడరు.
అతనూ యే తప్పూ చేయడు అంతకుముందు ఆ తర్వాత కూడా ఆ పిల్ల పట్ల.
మరి మొదటి పది నిమిషాల్లో ఈ ఉదంతం అయిపోయాక మరో మూడు గంటల సినిమా యేం చూపించింది!
చెహొవ్ కథల్లో కథుంటుందా? ఇదీ అంతే.
మనిషి అహానికి ఒక చిన్న అదురుపాటు చాలు, ఎంత అతలాకుతలం అవుతాయో అతని మనసూ, ప్రవర్తనా కూడా.
గులకరాయీ, యేటిలో నీటి వలయాలూ, చాలా తక్కువ మోతాదు మనిషి పడే అలజడితో పోలిస్తే .
ఒకరనే కాదు సినిమాలో (?) మనుషులందరి వివిధ రూపాలు, మాటలు, చేష్టలూ ఒక్కొకటీ బయట పడుతుంటాయి.
అందరి కంటే ఎక్కువ గా ఈ art teacherవి.
అతన్ని totalగా artless అనలేం.
కానీ ఎవరూ కాదు ఆ మాటకొస్తే..?
మరి చివరకు ఎవర్ని చూసినా జాలే ఎందుకు కలుగుతుంది..??
చెహొవ్, చైలన్ అంతే!
ఈ సినిమాలో పాత్రలు విస్తారంగా మట్లాడి, మనలనూ మరింత మాట్లాడమని ప్రోత్సహించిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి.
మనిషి నిజ స్వభావం తను బయటకు చూపించేదే అయి ఉంటుందా? కాకపోతే ఎందుకు..?
మనిషి contribution ఏంటి సంఘానికి..?
కళ, కళాకారుడి బాధ్యత ఏంటి..?
మనిషికి కుటుంబంతో సంబంధం, దాని పట్ల బాధ్యత..?
వాడికి ఏమీ చెయ్యకుండా ఉండే హక్కు ఉందా..?
ఇలా చాలా!
సినిమా చూశాక మనకై మనకు తోచే ప్రశ్నలు:
అసలు మనిషి ఎందుకింత complex..?
మోసం చెయ్యడం సరే! మరో మనిషిని మభ్య పెట్టకుండా బ్రతకలేడా..?
ఏ అవసరమూ, కనీసం ఆ particular instinct లేకపోయినా మంచినీళ్ళు తాగినంత సులభంగా తప్పు ఎందుకు చేస్తాడు..?
ఉదాహరణకు, ఇందులో హీరోకు పెళ్ళి, రొమాన్స్, సెక్స్ ఇంట్రెస్ట్ లేదు. తనను చేసుకోమని తన హితుడు చూపించిన అమ్మాయిని తనతో పని చేసే మరొకతనికి పరిచయం చేసి వాళ్ళ స్నేహం పెరగటానికి మొదట్లో సాయం కూడా చేసిన వాడు, వాళ్ళు నిజమైన ఇష్టంలోకి, వీలైతే పెళ్లిలోకి దిగబోతున్నారని తెలిశాక ఆ అమ్మాయిని, ఆమె అంగీకారంతోనే అయినా మాటలతో మభ్యపెట్టి తనతో రాత్రి ఎందుకు గడుపుతాడు.. మాత్ర సాయంతో అయినా perform చేసి.. ? తనకు ఆమెపై నిలువరించలేని కోరిక ఆకర్షణ లేనప్పుడు!
కేవలం స్నేహితుణ్ణి బాధపెడ్తే వచ్చే సంతోషానికా..?
హత్య కంటే దారుణమైన నేరం కదా ఇది..?
ఈ చేష్టలకు పరమార్థం కాదు, అసలు ఏ అర్థమూ కూడా ఉండదు చూస్తే!
ఎంత విషాదం!
లోపలా బయటా చుట్టూ మనిషికి!
మనిషికి విషాదం అశాంతి వలన! ఆ అశాంతి తనలో లుప్తమై పోయింది అనుకుంటున్నదాన్ని బయట వెతుక్కోవటం వలన!!
అదీ, ఏ విధంగా..?
పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లు!
ఆ మంచు సమాధి వంటి ఊర్లోని స్కూల్లో ఆర్ట్ టీచర్, సెవిమ్ అనే ఆ పన్నెండేళ్ళ పిల్లను కామించలేదు.
“I lied that I regretted meeting you. But Now i am brain talking to you, Sevim, what was i looking for you in this lifeless, motionless lanscape?”
మనిషి ఎదిగే క్రమంలో పారేసుకున్న తన స్వంత శుద్ధ అస్తిత్వాన్ని, అందులో ఉండే ప్రదీప్తమైన ఆ అమలిన శక్తిని బయట వెతుకుతాడు తనలోకి సరఫరా చేసుకుంటాను అనుకుంటాడు.
కానీ అది మామూలు రక్తం కాదు కదా.. ఒక శరీరంలోంచి మరో శరీరానికి ఎక్కడానికి..?
చుట్టూ ఉన్న చైతన్యానికి నిత్యనూతనంగా మనస్ఫూర్తిగా స్పందించగల శక్తి గలిగిన తన లోపలి చైతన్యాన్ని వయసుతో పాటు ఎదిగే క్రమంలో నీవు చేది చేది బయటకు బక్కెట్లతో మురికి నీటిని పారబోసినట్లు పారబోసేసుకున్నాడు మనిషి.
యే బహిర్కాంతి అయినా నీకు అందించేది మొండి చెయ్యే, నీ లోపల ఎంత తృష్ణ దానికై ఉన్నా! “నీకూ నాకూ మధ్య అగాధం” అంటాడు. ఆ అగాధం సంఘమో, వయసు తారతమ్యమో మరోటో కాదు!
ఆ స్థితికీ ఇతని ఇప్పటి స్థితికీ స్థలకాలాల్లో గ్రహాంతర దూరం, యుగాంతర కాలం ఉంటాయి మధ్యలో.
ఎందుకంటే అది అతని గతం, చచ్చి గీ పెట్టినా, తోక నోట్లోకి చిక్కినా ఆ రోజుల సమయం తిరిగి మళ్ళీ రాదు.
ఆ పిల్ల విషయంలో అతడు నూరుశాతం నిరపరాధి.
అపరాధం మరి తనకు తానే చేసుకున్నాడు.
ఒకసారి కాదు చాలా సార్లు.

అందంగా కదిలించే క్షణాలను, మనుషులను క్లిక్ చేయడం ఇష్టమైన అలవాటు ఇతనికి.
కానీ అవన్నీ స్థిర చిత్రాలైపోతాయి కెమెరాలో బంధించగానే.
ఒక్క ఆ అమ్మాయి ఫోటోలో చివర్లో అతనికీ, మనకూ.. ఆ పిల్ల అందమైన జుట్టు అక్కడ్కడా పడిన మంచు బిందువులతో గాలికి ఊగుతూ కనిపిస్తుంది.
మనసు తలుచుకుంటే కదులుతున్నదాన్ని బంధిస్తుంది. అది సులభం ఎవరికైనా!
ఘనీభవించిన దాంట్లో చలనం చూడటమే కష్టం!
అతను ఆ సౌందర్యం చూడగలడు!
అదే విషాదం!!



