ఫోటోగ్రఫీ దినోత్సవాన.. ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో ముచ్చట!
ఫోటో ఓ మధురమైన యాది. ఓ జ్ఞాపకంతో ముఖాముఖి. చరిత్రను భవిష్యత్తులోనూ కళ్లకుకట్టే క్లిక్కది. అందుకే ఫోటోకు అంత విలువ. ఏ బర్త్ డే పార్టీ అయినా… పెళ్లైనా… షష్ఠిపూర్తైనా… పార్టీ మీటింగైనా… కార్పోరేట్ సెమినారైనా.. కాలం మారినా… గతం తాలూకు అనుభవాలకు ఫోటో ఓ మెమరీ. అలాంటి ఫోటోగ్రఫీకీ ఓ దినోత్సవాన్నేర్పాటు చేసుకున్న రోజున.. ఓ బాలీవుడ్ యాక్టర్ ఫోటో గురించి కాస్త చెప్పుకుందాం.

ఇదిగో ఇక్కడ చూస్తున్న ఈ ఫోటోలోని ఈమెవరో గుర్తుపట్టారా..? అసలు ఈమెనా… అతడా…? ఏంటీకన్ఫ్యూజననుకుంటున్నారా…? ఆమె రూపంలో ఉన్న అతడు కాబట్టే ఈ పాత ఫోటో ప్రస్తావన! పేరు ప్రాణ్ కృష్ణ సికంద్… బాలీవుడ్ సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అంతకుమించి విలన్ గా… అంతెందుకూ కొదమసింహం వంటి కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించిన ప్రాణ్ సినీప్రేమికులందరికీ బహుశా పరిచయస్థుడే! సుమారు నాల్గువందల సినిమాల్లో ఆరు దశాబ్దాల పాటు నటించిన ఆ ప్రాణే… ఈమె!!
ప్రాణ్ అన్నకు పెళ్లయ్యాక… వాళ్ల సోదరుడి లవర్ గా… ఆయన వదిన్ని ఆశ్చర్యపర్చే… ఒకింత అనుమానాన్ని రేకెత్తించేందుకు ప్రాణ్ చేసిన కొంటెపనే ఈ అందమైన అమ్మాయి వేషం. స్టన్నింగ్ బ్యూటీ వేషంలో ప్రాణ్ ని చూసి వచ్చిన బాబీ లోలోపల ఒకింత షాక్ కు కూడా గురైందట. 1920లో జన్మించిన ప్రాణ్… 2013లో 93 ఏళ్ల వయస్సులో కన్నుమూయగా… గతేడాది ఆయన వందో జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన కొడుకు సునీల్ సికంద్ వాళ్లింట్లో ఆల్బమ్ లోని ఓ పాత ఫోటోని మధురమైన జ్ఞాపకంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పటికీ ఈ ఫోటో వైరల్ గా తిరుగుతూనే ఉంది.
షిమ్లాలో వేసిన రామ్ లీలా నాటకంలోనూ ప్రాణ్ కు సీత పాత్రను పోషించిన అనుభవముండగా… ఆయనకు జతగా అప్పుడు మరో ప్రముఖ నటుడు ది గ్రేట్ విలన్ అమ్రీష్ పురీ సోదరుడైన మదన్ పురీ రాముడిగా నటించాడట. కాస్త నిశితంగా పరిశీలించినట్టైతే మీకు ఈ ఫోటోపై కుమారి ప్రాణ్ అని కూడా రాసుండటం కొసమెరుపు.



