కదిలించిన తండ్రి మరణం!
స్వచ్ఛభారత్ వంటి ఎన్ని కార్యక్రమాలు వచ్చినా… మనిషి తాత్కాలిక ఆనందాల వెల్లువలో దీర్ఘకాలంలో సంభవించబోయే విపత్తులను పట్టించుకోవడంలేదనే సంగతి.. ఇప్పటికీ బాధ్యతారాహిత్యమైన సమాజతీరుతో చాలాచోట్ల కళ్లకు కడుతూనే ఉంది. మరీ ముఖ్యంగా మానవ జీవితంతో బంధాన్ని పెనవేసుకున్న ప్లాస్టిక్ భూతం.. అదే మానవ జీవన సర్వనాశన హేతువవుతోందనీ తెలిసినా పొరపాటే అలవాటుగా మారిన తత్వం మనిషిది. ఈ క్రమంలోనే ఆ ప్రమాదాన్ని పసిగట్టి.. పర్యావరణ హితం కోసం పాటుపడుతున్న ఓ మనిషి గురించి చెప్పుకోవాలి. ఆ యువకుడే బిలాల్ అహ్మద్ దార్.

క్యాన్సర్ తో తండ్రి మరణంతో.. కశ్మీర్ కు చెందిన బిలాల్ అహ్మద్ కు కుటుంబ భారం పైబడటంతో పాటే… తండ్రి మృతి చెందిన తీరు కదిలించింది. విషపూరిత నీళ్లల్లో జారిపడ్డప్పుడు అయిన గాయం పెద్దదై క్యాన్సర్ కు దారితీసిన ఘటన మర్చిపోలేని అహ్మద్… తండ్రి కుటుంబాన్ని పోషించేదుకు ఏ ఉపాధినైతే నమ్ముకున్నాడో… నమ్ముకుని ఏ బాటలోనైతే అసువులు బాసాడో… అదే దారిలో మళ్లీ వెళ్లడమే అహ్మద్ చేస్తున్న ఆ విశేషపని! మరి తండ్రి మృత్యుబాట పట్టిన బాటనే మళ్లీ అహ్మద్ తన ఉపాధిగా ఎందుకెంచుకున్నాడు..?
అహ్మద్ బిలాల్ తండ్రిది చెత్త సేకరించే పని. ఆయనకు అహ్మద్ తో పాటు… భార్య, మరో ఇద్దరు కూతుళ్లు కూడా ఉండగా… అదే వారి కుటుంబాన్ని పోషించడానికి ఉపాధైంది. చెరువులు, కుంటలు, ఇతర చెత్త లభించే ప్రాంతాలే అహ్మద్ బిలాల్ తండ్రి ఉపాధి కేంద్రాలు. ఆ క్రమంలో ఉత్తర కశ్మీర్ లోని బందిపోరా జిల్లా లహర్వార్ పొరాలోని వూలర్ చెరువును శుభ్రపరుస్తూ… అందులో ఉన్న చెత్తనంతా సేకరించి అమ్ముతుండగా అహ్మద్ తండ్రి కాలుజారి చెరువులో పడి గాయాలయ్యాయి. ఓవైపు స్కూల్ చదువు కొనసాగిస్తూనే తండ్రి వెంట అహ్మద్ కూడా చెత్త సేకరించేందుకు వెళ్లేవాడు. ఆ సమయంలో పర్యావరణ హితం, నీటిని శుభ్రపర్చడానికి గల కారణాలు వంటివాటి గురించి అహ్మద్ కు చెబుతూ పెంచాడు బిలాల్ తండ్రి. అయితే చెరువులో గాయపడ్డ అహ్మద్ తండ్రి కాలికి క్యాన్సర్ అని తేలింది. ఆ కారణంగా ఆ లెగ్ క్యాన్సర్ తో అహ్మద్ ఎనిమిదో ఏటనే తండ్రిని కోల్పోయాడు. తల్లి, పెళ్లీడుకొచ్చిన సోదరీమణులు మొత్తంగా తన కుటుంబ భారం బిలాల్ పై పడింది. అయితే బిలాల్ అప్పుడు కుటుంబ పోషణ కోసం ఇంకేదైనా ఉపాధిని వెతుక్కుని కష్టపడి పనిచేయొచ్చు. కానీ అలా చేస్తే మనం బిలాల్ గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకుంటాం..?

పర్యావరణ హితం పట్ల తండ్రి కల్గించిన స్పృహ… సామాజిక బాధ్యత తన మెదడును తడుతూనే ఉన్నాయి. దాంతో తన తండ్రి ఏదైతే సాఫ్ సఫాయి కార్యక్రమాన్ని చేపట్టి… తనవంతు బాధ్యతను నిర్వర్తించాలనుకున్నాడో అదే పనిని మళ్లీ అహ్మద్ కూడా తండ్రి వారసత్వంగా మొదలుపెట్టాడు. తల్లీ, తోడబుట్టినవాళ్లిద్దరూ వద్దని వారిస్తున్నా… తండ్రి ఆ విషపూరిత చెరువు నీళ్లల్లో జారిపడటంతోనే క్యాన్సర్ బారిన పడి చనిపోయాడని చెబుతున్నా… మళ్లీ ఆ బాటనే ఎంచుకున్నాడు. కారణం తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చాలన్న ఓ సంకల్పం… తన తండ్రి తనకు నేర్పించిన సామాజిక బాధ్యత. అలా ఎనిమిదేళ్ల వయస్సులో 2013లో ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తూ తాను తండ్రి వలే చెత్త సేకరించే పనికి శ్రీకారం చుట్టి… వూలర్ చెరువును స్వచ్ఛ చెరువుగా మార్చి పతాక శీర్షికలకెక్కాడు అహ్మద్. 2017లో మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్రమోడీ కూడా కొనియాడిన బిలాల్ దార్… శ్రీనగర్ మున్సిపాలిటీ బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. జలాల్ ఉద్దీన్ బాబా అనే ఓ ఫిల్మ్ మేకర్.. బిలాల్ దార్ డాక్యుమెంటరీని నిర్మించగా.. అది ముంబై, యూఎస్ లో పలు అవార్డ్స్ ను గెల్చుకుంది. అలా బిలాల్ దార్ పేరుకు మరింత గుర్తింపు వచ్చింది. ఆవిధంగా తన తండ్రి కలను నెరవేరుస్తున్నాడు.
బిలాల్ దార్ కు శ్రీనగర్ మున్సిపాలిటీ తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుని ఒక ప్రత్యేకమైన డ్రెస్ తో పాటు, వెహికల్ కూడా అరేంజ్ మెంట్ చేసింది. అలా శ్రీనగర్ లో ప్రతీ ఇంటికీ, దుకాణానికీ వెళ్లి చెత్త సేకరించే పనికి… ఓ బ్రాండ్ అంబాసిడర్ గా అవతరించి.. సాఫ్ సఫాయికి కూడా ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు బిలాల్ దార్. తాను సమాజానికి, పర్యావరణహితంతో చేస్తున్న సేవ చూసి తరించిన అప్పటి ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోదరుడు తసాదఖ్ ముఫ్తీ ఒక స్పెషల్ బోట్ ను చెత్త సేకరణ కొరకు బిలాల్ దార్ కు బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఓ ఇంటి నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం 50 వేల రూపాయలనూ మంజూరు చేసింది.
వూలర్ చెరువు కశ్మీర్ కో, భారత్ కో మాత్రమే పరిమితమైన అందం కాదు.. ప్రపంచాన్నే ఆకర్షిస్తున్న ఓ పెద్ద సరస్సు. వాస్తవానికి 273 కిలోమీటర్ల పరిధిలో ఉండాల్సిన సరస్సు ఇప్పుడు కేవలం 72 కిలోమీటర్స్ కి కుచించుకుపోయింది. ప్లాస్టిక్ భూతంతో పాటు.. కార్ల విడిభాగాలు, ఇతర చెత్తాచెదారమంతా ఆ సరస్సులో పేరుకుపోవడంతో పాటు.. గొలుసుకట్టు చెరువుగా ఓ అద్భుత సుందర దృశ్యంగా కనిపించాల్సిన వూలర్ సరస్సు నిర్వీర్యంగా మారే పరిస్థితికి వచ్చింది. అయితే, అదే చెరువు కారణంగా తన తండ్రి చనిపోయినా.. తన తండ్రి ఆశయానికి మాత్రం చావుండొద్దన్న ఒక సామాజిక స్పృహ బిలాల్ దార్ ను సాఫ్ సఫాయిగా నిలబెట్టింది. యావత్ భారతం కొనియాడే స్థాయికి ఎదిగేలా చేసింది. చెత్త ఏరే పనికి కూడా సమాజం గౌరవమిస్తుందని చాటి చెప్పేలా చేసింది. అదే సమాజం ఇంకోవైపు తాము చేస్తున్న పనికి తల వంచుకుని సిగ్గుపడేలా.. ఇంకోవైపు తనను గౌరవించేలా కూడా ఇప్పుడు బిలాల్ సగౌరవంగా నిలబడ్డ స్వచ్ఛభారత్ బిడ్డడయ్యాడు.
వూలర్ చెరువును సాఫ్ సఫాయి చేసే క్రమంలో అక్కడ చెత్తను కొనే కబాడీవాలాకు ఏకంగా 12 వేల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను చెరువులోంచి తీసి అమ్మాడు అహ్మద్. అంతేకాదు… తన స్నేహితుల సాయాన్నీ తీసుకున్నాడు. మొత్తంగా వూలర్ చెరువును ఓ శుభ్రమైన చెరువుగా తీర్చిదిద్ది… ఎందరి ప్రశంసలకో అర్హుడయ్యాడు. అంతేనా… ఓ సోదరి పెళ్లి కూడా జరిపించిన అహ్మద్ బిలాల్ దార్… తన తల్లి కల గన్న తీరులో ఓ అందమైన భారీ భవంతి నిర్మాణం చేయాలన్న తలంపుతో పాటు.. మరో సోదరికి మంచి చదువు చెప్పించేందుకు… తన చెత్త సేకరించే పనిని కొనసాగిస్తున్నాడు. రాబోయే మూడేళ్ల కాలంలో కశ్మీరంతా కలియతిరిగి క్లీన్ అండ్ గ్రీన్ లో తనవంతు సామాజిక బాధ్యతను నిర్వర్తించడమే తన పని అంటున్నాడు. అందుకే ఇప్పుడు బిలాల్ అహ్మద్ దార్ పై ఏకంగా అక్కడ డాక్యుమెంటరీలే నిర్మాణానికి నోచుకుంటున్నాయి మరి! ఇది కదా… మరి పర్యావరణంపై సామాజిక బాధ్యత అంటే..?!!



