అభినవ శ్రవణ కుమారుడు.. ఈ మోనూ!

అమ్మ కోసం అలుపెరుగని పరుగు!

నమ్మకాలు వేరు… వాస్తవాలు వేరు… కానీ, వాస్తవానికి స్థలం లేదనకున్నప్పుడు నమ్మకం వైపే మనసు మళ్లుతుంది. ముఖ్యంగా దేవుడిపై నమ్మకం పెట్టే ఆధ్యాత్మిక వేదభూమిలో.. తల్లి కోసం ఓ కుమారుడి పరుగు పందెం మొక్కు ఇది!

అమ్మ కోలుకోవాలని మొక్కుకున్నాడు… ఇప్పుడు 12 జ్యోతిర్లింగాల కోసం రోజు పరుగెడుతున్నాడు.

అమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది. వైద్యులకు చూపించినా తగ్గటం లేదు. అది కొడుకును బాధించింది. అమ్మ ఆరోగ్యం కోలుకుంటే దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలను పరుగెత్తి వచ్చి దర్శించుకుంటానని మొక్కుకున్నాడు. అమ్మ ఆరోగ్యం కుదురుకుంది. దేవుడు తన ప్రార్థన మన్నించాడనుకున్న ఆ కుమారుడు పరుగు పందెం లంకించాడు.

ఇది దేశమంతా పరుగు పెడుతూ చుట్టి వస్తున్న ఓ 19 ఏళ్ల యువకుడి కథ.

పేరు మోనూ మెటుర్‌బాలా. బీహార్‌లోని అరారియా జిల్లాకు చెందిన ఈ యువకుడు 2026, మార్చి 15న తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. వాహనంలో అయితే మనం చెప్పుకునేవాళ్లం కాదు.. కాళ్లనే చక్రాలు చేసి వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ జ్యోతిర్లింగాలను చేరుకుంటున్నాడు.

శివుణ్ని నమ్మిన కుమారుడు!

అమ్మ అనారోగ్యంపాలై మంచం పట్టడంతో… శివుడే మోనూ నమ్మకమైనాడు. దైవమైనాడు. అమ్మ కోలుకుంటే దేశంలోని 12 జ్యోతిర్లింగాలను కాలినడకతో దర్శించుకుంటానని అప్పుడే సంకల్పం చేసుకున్నాడు. ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆ మొక్కును మరచిపోలేదు. తన మాటను నిలబెట్టుకోవడానికి దేశవ్యాప్తంగా పరుగు యాత్రను ప్రారంభించాడు.

రోజుకు పదుల కిలోమీటర్లు!

భారతదేశంలో జ్యోతిర్లింగాలంటే చెట్టుకోటి, పుట్టకోటి అన్నట్టుగా వేల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. మరి వాటన్నింటికీ మోనూ సాధారణ తీర్థయాత్రికుడిలా రైలు, బస్సు, కారులో వెళ్లడం లేదు. రోజుకు దాదాపు పదుల సంఖ్యలో కిలోమీటర్లు పరుగెత్తుతూ తన లక్ష్యం వైపు సాగుతున్నాడు. మార్చి 15న ఆరంభమైన మోను తీర్థయాత్ర… ఇప్పటికే 8 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 12 జ్యోతిర్లింగాలలో ఐదింటి దర్శనం పూర్తైంది.

తన తొలి గమ్యస్థానాల్లో ఒకటైన జార్ఖండ్ లోని బాబా వైద్యనాథ్ దామ్, ఆ తర్వాత మహారాష్ట్రలోని పలు జ్యోతిర్లింగాలను దర్శించుకున్నాడు.

సోషల్ మీడియాలోనూ మోనూ చర్చ!

మోనూ తన తీర్థయాత్ర ప్రయాణానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. దీంతో ఇతడి కథ దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. దారిలో కలిసేవారూ అభినందిస్తున్నారు. ఆహారం, నీరు, విశ్రాంతి కోసం సాయం చేస్తున్నవారూ తారసపడుతున్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా మోనును ప్రోత్సహిస్తూ… తానూ కొంత దూరం మోనూతో కలిసి పాదయాత్ర చేయడమూ ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.

శ్రవణ కుమారిడితో పోలిక!

మోనూ తన తల్లి కోసం చేస్తున్న పరుగు పందాన్ని… శ్రవణ కుమారిడితో పోలుస్తున్నారు. భారతీయ ఇతిహాసాల్లో తల్లిదండ్రుల పట్ల అపారమైన భక్తికి శ్రవణ కుమారుడు ప్రతీక. మోనూ కథలోనూ తల్లి పట్ల ప్రేమ.. ఆమె అనారోగ్య సమయంలో తీసుకున్న సంకల్పం.. ఆ మాటను నిలబెట్టుకునేందుకు పడుతున్న కష్టం.. అతడి పట్టుదల ఇవన్నీ శ్రవణ కుమారిడితో అతణ్ని అంతా పోల్చేందుకు కారణమవుతున్నాయి.

మిగిలిన జ్యోతిర్లింగాలవైపు కొనసాగుతున్న పరుగు పందెం!

12 జ్యోతిర్లింగాల్లో ఐదింటిని దర్శించుకున్న మోనూ లక్ష్యం ఇంకా పూర్తికాలేదు. ఇంకా ఏడు జ్యోతిర్లింగాలు అతడి కోసం ఎదురుచూస్తున్నాయి.

సోమనాథ్, మల్లికార్జున, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, కేదార్‌నాథ్, భీమశంకర్, కాశీ విశ్వనాథ్, త్రయంబకేశ్వర్, వైద్యనాథ్, నాగేశ్వర్, రామేశ్వరం, ఘృష్ణేశ్వర్‌.. ఇవే సంప్రదాయంగా గుర్తించే 12 జ్యోతిర్లింగాలు.

మోనూ ఈ ప్రయాణంలో చార్‌ధామ్‌ యాత్రను కూడా చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమ్మ కోసం మోనూ మొక్కిన మొక్కు.. ఇప్పుడు కిలోమీటర్ల కంటే పెద్దదిగా కనిపిస్తోంది. అందుకే, మోనూ పరుగు పందాన్ని ఇప్పటికి కేవలం 8 వేల కిలోమీటర్ల ప్రయాణంగా చూడటమే కాదు… తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడు కొడుకు చేసిన ప్రార్థన.. ఆమె కోలుకున్న తర్వాత ఆ మాటను నిలబెట్టుకోవాలన్న పట్టుదల.. ఇప్పుడు అతడిని దేశంలోని అనేక రాష్ట్రాల మీదుగా పరుగెత్తిస్తోంది. కొన్ని ప్రయాణాలను కిలోమీటర్లలో కొలువవచ్చునేమోగానీ… అమ్మ కోసం ఈ కొడుకు చేస్తున్న ప్రయాణాన్ని మాత్రం ప్రేమతోనే కొలవాలి.

పిల్లల చదువు కోసం ఓ తల్లి పరిగెడితే.. తల్లి ఆరోగ్యం కోసం పరుగెత్తుతున్న కొడుకు మోను!

మరఠ్వాడా బీడ్ జిల్లాకు చెందిన రమాబాయి రణ్ వీర్ అనే మహిళ.. కూతుళ్ల చదువు కోసం తన 47 ఏళ్ల వయస్సులో పరుగు పందెంలో పాల్గొని గెల్చిన ఘటన ఈమధ్యే సోషల్ మీడియాతో చప్పట్లు కొట్టించుకుంది. రమాబాయి ఓ వంట మనిషి. భర్త చనిపోతే.. తానే, అమ్మా, నాన్న అయి పిల్లల్ని పెంచుతోంది. రోజూవారీ కూలీ డబ్బులతో కుటుంబాన్ని భారంగా లాక్కొస్తున్న మహిళ. కానీ, పిల్లల చదువులకు ఫీజులు కట్టాలంటే డబ్బులు కావాలి. ఆ ఆశతో కేవలం 3 వేల రూపాయల నగదు బహుమతి కోసం పరుగు పందెంలోకి దిగి యావత్ దేశం దృష్టినీ ఆకర్షించింది. ఇప్పుడు మోనూ తన తల్లి ఆరోగ్యం కుదుటపడినందుకు ఆ భగవంతుణ్ని చూసేందుకు పరుగెత్తుతున్నాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles