నోట్స్ చోరీ!
గతంలో ఎందరో సినీ సంగీత దర్శకులు… ప్రపంచ సంగీతంలో ఫోక్ నుంచి రాక్ వరకూ ఏదో ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని పాటలు చేసిన సందర్భాలున్నాయి. కానీ, గతంలో లేని వివాదాలు ఇప్పుడు మాత్రం చెలరేగుతున్నాయి. కాబట్టి కాపీ క్యాట్స్ కచ్చితంగా ఇప్పుడు అప్రమత్తంగా లేకపోతే.. ఈ సోషల్ మీడియా ఎరాలో ఇట్టే దొరికిపోతారు. అలాంటి వివాదాలు ఈ మధ్య మనం తరచూ చూస్తున్నాం. ముఖ్యంగా తన పాటల విషయంలో స్టేజ్ పైన తన అనుమతి లేకుండా పాడినవారికీ.. సినిమాల్లో వాడినవారికీ ఇళయరాజా లీగల్ నోటీసులు పంపిన ఘటనలూ వివాదాస్పంగా మారిన సంగతీ తెలిసిందే. ఇప్పుడదే బాటలో కౌశికీ చక్రవర్తి.. చిన్మయ శ్రీపాదకు లీగల్ నోటీసులు పంపించడమూ చర్చనీయాశంగా మారింది. ఏంటీ ఈ వివాదం..?
ఓ పాట పాడటమే కాదు.. దాని వెనుక ఉన్న ప్రతీ స్వరం, ప్రతీ పదం, సంగీత ప్రయోగం ఇవన్నీ తరచి చూసుకోవాల్సిన రోజులివి. ఇప్పుడు తమిళంలో వచ్చిన ఓ ఇండిపెండెంట్ సాంగ్ వాన్మతి అలాంటి వివాదాన్ని ఎదుర్కోవడమే అందుకో ఉదాహరణ.
ప్రముఖ హిందుస్తానీ శాస్త్రీయ గాయని కౌశికి చక్రవర్తి… గాయని చిన్మయి శ్రీపాదతో పాటే, సింగపూర్‌కు చెందిన గీత రచయిత, సంగీతకారుడైన షబీర్ సుల్తాన్ మధ్య ఈ వివాదం మొదలైంది. తన అనుమతి లేకుండా.. గుర్తింపు, క్రెడిట్ ఇవ్వకుండా తన ప్రదర్శనలోని స్వరాలాపనను వాన్మతిలో ఉపయోగించారన్నది హిందుస్థానీ వోకల్ కళాకారిణి కౌశికి ఆరోపణ. ఈ అంశంపై చిన్మయి, షబీర్ కు.. ఇప్పటికే కౌశిక్ లీగల్ నోటీసులు కూడా పంపించారు.

కౌశికి చక్రవర్తి ఎవరు..?
హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో ప్రముఖ గాయని. పటియాలా ఘరానాకు చెందిన ఈమె, ప్రఖ్యాత గాయకుడు అజయ్ చక్రవర్తి కుమార్తె. చిన్ననాటి నుంచే శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన కౌశికి.. ఖయాల్తో పాటు, ఠుమ్రీ, దాద్రా, భజన్ వంటి సంగీత ప్రక్రియల్లోనూ తనదైన ముద్ర వేసి జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్న కళాకారిణి.
2005లో ఈమెకు బీబీసీ త్రీ అవార్డ్స్ ఫర్ వరల్డ్ మ్యూజిక్ లో భాగంగా ఆసియా పసిఫిక్ విభాగంలో అవార్డ్ లబించింది. శాస్త్రీయ సంగీతాన్ని సంప్రదాయానికి కట్టుబడుతూనే ఆధునిక శ్రోతలకు చేరువవుతున్న గాయనిగా కౌశికి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
వాన్మతి అనే ప్రైవేట్ ఆల్బమ్ వివాదం నేపథ్యంలో ఇప్పుడు కౌశికి నేరుగా సోషల్ మీడియా వేదికగా… తను పాడిన పాటను ప్రదర్శిస్తూ.. ఆ తర్వాత వాన్మతిలో పెట్టిన పాటను కూడా కలిపి ఓ వీడియో పోస్ట్ చేశారు. అదిప్పుడు సంగీత లోకంలో చర్చనీయాంశంగా మారింది.
https://www.instagram.com/reel/Del8pS4TzqL/?obrf=dGxqbWlnN2hocXEw
మక్కీకి మక్కీ కాపీలా వినిపిస్తున్న స్వరాలాపన!
2015లోనే దర్బార్ ఫెస్టివల్ లో కౌశికి చక్రవర్తి చేసిన ఒక భిన్నమైన రాగాలాపన.. ఇప్పుడు వాన్మతి ఆల్బమ్ లో వినిపిస్తోంది. బీంప్లాస్ రాగంలో కొన్ని స్వర భాగాలను తన అనుమతి లేకుండా ఉపయోగించారనేది కౌశికి అభియోగం. ఆ ప్రదర్శనకు సంబంధించిన వీడియో కూడా వాన్మతిలోని సంబంధిత భాగాలను కంపేర్ చేస్తూ ఆమె సోషల్ మీడియాలో పెట్టారు.
తన పాటను కాపీ చేయడంపై కన్నా… కళాకారుల గొంతు, సుదీర్ఘ సాధనతో నేర్చుకునే ప్రత్యేకమైన సంగీత వ్యక్తీకరణలను ఉపయోగించేటప్పుడు కనీసం అనుమతి కూడా తీసుకోకపోవడం.. పైగా ఎలాంటి క్రెడిట్స్ ఇవ్వకపోవడం, గుర్తింపు దక్కకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే. ఓ కళాకారిణిగా ముందు చర్చల ద్వారా సమస్య పరిష్కరించేందుకు యత్నించానని.. ఫలించకపోవడంతోనే న్యాయపరమైన మార్గాన్ని ఎంచుకున్నట్టూ ఆమె తన సోషల్ మీడియా వీడియో పోస్టులోనూ పేర్కొన్నారు. పాటలో తన అనుమతి లేకుండా వాడుకున్న భాగాన్ని తొలగించాలని కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం.
మరి చిన్మయి జవాబేంటి..?
అసలు ఆ స్వరాలాపన గురించి తనకు ముందు తెలియదంటోంది చిన్మయి శ్రీపాద. కౌశికి లీగల్ నోటీస్ అందిందనీ… సోషల్ మీడియాలో ఆమె చేసిన ఆరోపణల గురించీ తెలుసుకున్నాననీ చెబుతోంది. అయితే, రికార్డింగ్ సమయంలో తనకు ఇచ్చిన భాగాలను మాత్రమే తాను పాడానని.. వివాదానికి కారణమైన ఆ స్వరాలాపన ఇంకెవరైనా పాడి ఉన్నారా అన్నది తనకు నిజంగా తెలీదంటోంది చిన్మయి శ్రీపాద. షబీర్ సుల్తాన్ తో తాను ఆ విషయం గురించి మాట్లాడినట్టు కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఆ విషయాన్ని న్యాయపరంగా షబీరే చూసుకుంటారని చిన్మయి చెబుతున్న మాట. అలాగే, ఇతరుల సృజనాత్మకత, సృష్టిని కాపీ చేయడం సంగీతపరమైన విలువలకు, గౌరవానికీ విరుద్ధమేనన్న మాటా చిన్మయి నోట వినిపిస్తోంది.
అసలు మరి వాన్మతి పాట సంగతేంటి..?
2026, సప్టెంబర్ 11న వాన్మతి అనే ఓ ప్రైవేట్ ఆల్బమ్ విడుదలైంది. షబీర్ సుల్తాన్ ఈ పాటకు సాహిత్యం, సంగీతం అందించారు. షబీర్ సుల్తాన్, చిన్మయి శ్రీపాద కలిసి వాన్మతి పాట పాడారు. తమిళ కవిత్వానికి ఆధునిక రిథమ్ అండ్ బ్లూస్, హిప్ హాప్, సింథ్ మ్యూజిక్ ను.. భారతీయ సంగీతంతో సమ్మిళితం చేసే ఓ సింఫనీ తరహా సంగీతమిది. పాటలో ఖరహరప్రియ, శుద్ధ ధన్యాసి వంటి రాగాల ప్రభావం ఉన్న సెమీ క్లాసికల్ భాగాలున్నట్టు కూడా పాట ప్రచార వివరాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
అలాంటి సంగీత ప్రయోగాలతో వచ్చిన వాన్మతి పాట.. ఇప్పుడు మరో కారణంతో వివాదాస్పదంగా మారి వార్తల్లోకెక్కింది.
ఈ వివాదాన్ని కేవలం పాట వరకు మాత్రమే పరిమితం చేసి చూడాలా..?
ఇక న్యాయపరమైన ప్రక్రియలోనే ఈ వ్యవహారం తేలాల్సి ఉంది. ప్రస్తుతం కౌశికి చక్రవర్తి చేసిన ఆరోపణలు ఒకవైపు.. చిన్మయి ఇచ్చిన వివరణ ఇంకోవైపు ఉన్నాయి. తుది నిర్ణయం వెలువడే వరకూ ఈ పాట మాత్రం కాపీరైట్ ఉల్లంఘనగా ప్రచారంలో మాత్రం ఉంటుంది. అలాగే, ఈ వివాదం ఓ ముఖ్యమైన ప్రశ్ననూ లేవనెత్తింది. సంగీతంలో ఓ కళాకారుడి సృజన నచ్చి.. తిరిగి దాన్ని వాడుకోవాలంటే ఆయా కళాకారుల అనుమతి తప్పనిసరి అనే విషయాన్ని ఈ వివాదం బోధిస్తోంది. అలాగే, వారికి రావల్సిన క్రెడిట్స్, గుర్తింపు అన్నింటిపైనా ఒప్పందముంటేనే ముందుకు వెళ్లాలి.. లేకుంటే, వాన్మతి పాటలాగానే వివాదాలకు కేరాఫ్ గా చర్చగా మారడం ఖాయం.
సంగీతంలో స్ఫూర్తి పొందడం తప్పు కాకపోవచ్చుగానీ.. మక్కీకి మక్కీ కళాకారుల సృజనను, వారి హ్కకులను చోరీ చేసినప్పుడు మాత్రం కచ్చితంగా ఇలాంటి కాపీ రైట్ వివాదాలు ఎదుర్కోవాల్సిందే.


