Vaddadi Srinivasu గారి ఎప్బీ వాల్ నుంచి….
అభయ్ ఎందుకు భయపడ్డాడంటే….?
.……………………………………………………………..
– వడ్డాది శ్రీనివాస్… ✍️✍️
——————————————–

అతను అభయ్…
భయం లేనివాడు అని అర్థం…
నిజమే ఆయుధం చేతబట్టి అన్న వెంట అడవులకు వెళ్ళేటప్పుడు భయం లేదు…
ఆచరణ సాధ్యంకాని సిద్ధాంతం విషంగా మారి నరనరాన ఎక్కుతుంటే భయం లేదు…
వ్యర్థ భావావేశం రగిలించి ఎందరో యువతను గమ్యం లేని ప్రయాణం వైపు నడిపించినప్పుడు భయం లేదు…
ఎంతో భవిత ఉన్న యువత అడవుల్లో దిక్కులేని చావు చస్తుంటే భయం లేదు…
పోలీసులు, రాజకీయ నేతలు, కోవర్టుల పేరుతో సామాన్యులను తాను చంపుతున్నప్పుడు భయం లేదు…
శవాలుగా పడి ఉన్న బిడ్డల్ని చూసి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిన ఎందరో తల్లుల కడుపు కోత చూసినప్పుడూ భయం లేదు…
భర్తలను కోల్పోయిన ఎందరో భార్యలు గుండెలు బాదుకుని రోదిస్తుంటే భయం లేదు…
అమ్మా నాన్నలను కోల్పోయి దిక్కులేని వాళ్ళుగా మిగిలిన పిల్లల్ని చూసీ భయం లేదు…
తన సహచర కామ్రేడ్లు ఒక్కొక్కరూ నేలరాలుతుంటే భయం లేదు….
కానీ…
అంతటి భయం లేని అభయ్ కు కూడా భయం వేసింది….
“ఆపరేషన్ కగార్ “లో తన వంతు వచ్చింది అని తెలిసే సరికి భయం వేసింది…
70 ఏళ్ల తన ముసలి ప్రాణం మీద తీపితో భయం వేసింది…
గుడ్డిదో నడ్డిదో నమ్మిన సిద్దాంతం కోసం “అమరుడిని’ కావల్సి వస్తుందేమోనని భయం వేసింది…
తన జీవితం ఎక్కడ అడవుల్లోనే ముగిసిపోతుందేమోనని భయం వేసింది…
తన తల మీద రూ.6 కోట్ల రికార్డు ఉందని హఠాత్తుగా గుర్తుకు వచ్చి భయం వేసింది..
తాను చేసిన హత్యలను తూకం వేసి ప్రభుత్వం లెక్కగట్టిన ఆ భారీ మూల్యం తనకు దక్కకుండా పోతుందేమోనని భయం వేసింది…
అందుకే… అందుకే…
అభయ్ భయ పడ్డాడు….
భయంతో బిక్కుబిక్కుమంటూ రాజ్యం శరణు కోరాడు..
పక్తూ రాజకీయ నేతలకు తీసిపోని డ్రామా కు తెరతీశాడు…
ఎందరినో చంపి ప్రస్తుతం చావు భయం తో కొట్టుమిట్టాడుతున్న వందమందికిపైగా సహచరులకు కూడగట్టాడు…
ఓ ముఠా నేత తరహాలో హోల్ సేల్ ప్యాకేజీతో డీల్ కుదుర్చుకున్నాడు…
మూఢ ఉద్యమానికి ఉనికిగా ఉన్న తన ఆయుధాన్ని ప్రజాస్వామిక పాలకుల పాదాక్రాంతం చేశాడు…
ప్రతిగా దేశ సార్వభౌమాధికారానికి ప్రతీకగా ఉన్న రాజ్యాంగ ప్రతిని స్వీకరించాడు…
తాను చంపిన ఎందరో అభాగ్యుల చావు కేకలు చెవుల్లో మార్మోగుతున్నా పట్టనట్టు వేదిక దిగి వెళ్ళిపోయాడు
తనకు దక్కిన రివార్డ్ రూ.6 ఆరు కోట్లలో కొన్ని నోట్లను చెవుల్లో కుక్కుకుని హాయిగా నిద్ర పోయాడు…
ఇప్పుడు అతను అభయ్ కాదు… మల్లోజుల వేణుగోపాల రావు



