చిత్తూరు నాగయ్య మర్దలు రెండ్రోజుల పాటు భోజనం ఎందుకు మానేసింది..? ఆమెను బాధపెట్టిన వార్తేంటి..??

చిత్తూరు నాగయ్య మరదలిని బాధపెట్టిన ‘వార్త’

……………………………………………………………………….

తోట భావనారాయణ (9959940194)…. ✍️

ఆమె నటి, గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్, బిలియర్డ్స్ నేషనల్ ఛాంపియన్. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ నుంచి నాటక కళా ప్రపూర్ణ బిరుదు అందుకున్నారు. ‘చెన్నపురి ఆంధ్రమహాసభ’ అనే పేరుమోసిన సాంస్కృతిక సంస్థను అప్పటికే 40 ఏళ్ళపాటు నడిపిన అనుభవం ఆమెది. సుప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్యకు ఆమె సొంత మరదలు. దాదాపు 30 ఏళ్ళ కిందట ‘వార్త’లో వచ్చిన ఒక వార్త ఈ ప్రముఖురాలిని బాధించింది. ఆ బాధలో రెండ్రోజులు భోజనం చేయలేదు. ఆమెను అంతగా బాధించిన వార్త నేను రాసిందే. అ ఘటన పూర్వాపరాలు చెప్పటానికే ఈ పోస్ట్.

*****

దక్షిణ భారతదేశంలో తొలి ‘పద్మశ్రీ’ గ్రహీతగా, 300 కి పైగా సినిమాలు తన ఖాతాలో వేసుకోవటంతోబాటు నటుడిగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా పేరుమోశారు వుప్పలదడియం నాగయ్య శర్మ. సినీరంగంలో చిత్తూరు వి. నాగయ్యగా అందరికీ తెలిసిన ఆయన దర్శకుడు, నిర్మాత, స్వాతంత్ర్య సమరయోధుడు కూడా. ఆయన అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడని చెబుతారు. అంత సంపాదించినా ఆయన దానధర్మాలకే ఖర్చు చేసేవారంటారు. అలా ఒకరోజు మైలాపూర్ లో ఒక కచేరీకి బయలుదేరి భారీ వర్షం కారణంగా ఆగిపోవాల్సి వచ్చిందట. అప్పటికప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఫలితంగా రూపుదిద్దుకున్నదే జిఎన్ చెట్టి రోడ్ లో ఉన్న వాణీ మహల్. రంగస్థలం నుంచి వచ్చిన నటుడు కావటంతో తనకు తారసపడిన ఎంతోమంది కళాకారులను ప్రోత్సహించారని చెబుతారు.

అలా ఒక సారి చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో సన్మాన సభకు వెళ్ళిన చిత్తూరు నాగయ్య గారి సమక్షంలో పదేళ్ళ అమ్మాయి ప్రార్థనాగీతం పాడింది. ఆ అమ్మాయి పేరు తోట గోవిందమ్మ. స్వయంగా గాయకుడైన నాగయ్య గారు ఆమె పాడిన తీరుకు ఎంతో ముచ్చటపడి ఆ అమ్మాయిని మద్రాసు తీసుకువెళ్ళి సంగీతంలో రాటుదేలేలా చేయాలనుకున్నారు. గోవిందమ్మ తండ్రి తన పెద్ద కూతురిని నర్సింగ్ కాలేజ్ లో చేర్చాలని, చిన్న కూతురికి సంగీతం నేర్పాలని కోరారు. సరేనన్నారు నాగయ్య. దుర్గాబాయ్ దేశ్ ముఖ్ నడిపే ఆంధ్ర మహిళా సంఘం వారి నర్సింగ్ కాలేజీలో చేర్చటం, గోవిందమ్మకు పాటలు పాడే అవకాశం ఇప్పించటం ఆయనకేమీ కష్టం కాలేదు. అప్పటికే వరుసగా ఇద్దరు భార్యలు చనిపోయి ఉన్న నాగయ్యగారు ఆ తరువాత కాలంలో గోవిందమ్మ అక్క జయమ్మను పెళ్లి చేసుకున్నారు.

సినిమాల్లో పాడటానికి, నటించటానికి కూడా అవకాశాలు వచ్చాక గోవిందమ్మ తన పేరు కమలాదేవిగా మార్చుకున్నారు. అయినా సరే, అసలు పేరులోని పొడి అక్షరాలను మాత్రం వదులుకోకుండా టీజీ కమలాదేవిగా పేరుపొందారు. కళారంగంలో ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. సినిమా పాటలు, ఆకాశవాణిలో పాటలు, నటన , డబ్బింగ్ అన్ని అవకాశాలూ వాడుకుంటూ ఆమె ఎదిగారు. ఒక నాటకం సందర్భంగా పరిచయమైన సహనటుడు ఆవుల చంద్రబాబు నాయుడితో పెళ్ళయ్యాక ఆమె ఎ. కమలా చంద్రబాబుగా మారారు.

ఎప్పుడూ చురుగ్గా ఉండే కమలాదేవి మద్రాసులో చెన్నపురి ఆంధ్ర మహాసభ అనే సాంస్కృతిక సంస్థలో సభ్యత్వం తీసుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్ళు కార్యదర్శిగా, కొన్నాళ్ళు అధ్యక్షురాలిగా పనిచేస్తూ వచ్చారు. అక్కడే ఆమె బిలియర్డ్స్/స్నూకర్ నేర్చుకొని రోజూ ప్రాక్టీస్ చేసేవారు. సరదాగా మొదలైన ఆ వ్యాపకం ఎంతదాకా వచ్చిందంటే ఆమె మహిళా స్నూకర్ క్రీడాకారిణిగా జాతీయ స్థాయి ఛాంపియన్ షిప్ గెలుచుకునే దాకా. ఎక్కడ పోటీలు జరుగుతున్నా వెళ్ళాల్సిందే. కప్పులు గెలుచుకోవాల్సిందే.

*****

కమలాదేవి గారిని కలుసుకోవాలని అనుకుంటూనే ఐదారు నెలలు గడిచాక 1995 లో ఒకరోజు చెన్నపురి ఆంధ్రమహాసభకు వెళ్ళా,. మద్రాస్ సెంట్రల్ స్టేషన్ పక్కనే లోకల్ రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడే పేరుమోసిన మూర్ మార్కెట్ కూడా ఉంటుంది. . ఆ పక్కనే చెన్నపురి ఆంధ్ర మహాసభ భవనం, దానికి మరో పక్కన రిప్పన్ బిల్డింగ్ అని పిలుచుకునే చెన్నై కార్పొరేషన్ కార్యాలయం. ఆంధ్రప్రభలో పనిచేసే రోజుల్లో నేనుండే విల్లివాక్కం వెళ్ళటానికి ఆ వైపే వెళ్ళాలి కాబట్టి అలా ఒకరోజు ఆమెను కలిస్తే చాలా బాగా మాట్లాడారు. అక్కడ గతంలో ఎన్నెన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవో చెప్పారు. అష్టావధానాలు, నాటకాలు, పండితుల ప్రసంగాలు .. వీటన్నిటికంటే మిన్నగా ఏటా తెలుగు నేల నుంచి వచ్చే కళాకారులు పాల్గొనే పౌరాణిక నాటక పోటీలు ఎంత పేరు తెచ్చిపెట్టాయో అంతా ఏకరవు పెట్టారు. ఈ సమాచారంతో అప్పట్లో ఆంధ్రప్రభలో ఒక వ్యాసం కూడా రాశా.

ఆ తరువాత కాలంలో ఆమె బిలియర్డ్స్ పోటీల్లో గెలుపు గురించి అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్పేవారు. వార్తలు రాసేవాణ్ణి. పానగల్ పార్క్ దగ్గర మాజీ రాష్ట్రపతి వీవీగిరి ఆవిష్కరించిన చిత్తూరు నాగయ్య విగ్రహాన్ని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఫిలిం జర్నలిస్టు ఇంటూరు వెంకటేశ్వరరావు, కమలాదేవి మాత్రం నాగయ్య గారి జయంతి, వర్ధంతులను క్రమం తప్పకుండా జరపటం ఆనవాయితీగా ఉండేది. ముందు రోజే వెళ్ళి విగ్రహాన్ని శుభ్రం చేయటం, తెలుగు పత్రికలవాళ్లకు ఫోన్ చేసి పిలవటం అలవాటు. రాళ్ళబండి కామేశ్వరరావు లాంటి నటులు ఒకరిద్దరు వచ్చేవాళ్ళు.

కొన్నాళ్ళ తరువాత వార్తలో ఉండగా ఒకసారి ఫోన్ చేశారు. వార్త ఆఫీస్ ఉన్న అన్నా నగర్ కు, ఆమె ఉండే షెనాయ్ నగర్ దగ్గరే. నేనూ, నా తోటి జర్నలిస్ట్ బొల్లం రాజు కలిసి వాళ్ళింటికి వెళ్ళాం. చెన్నపురి ఆంధ్రమహాసభ గురించి చెబుతూ, కొత్తతరం వాళ్ళకు ఆ సంస్థ గొప్పదనం తెలియటం లేదని బాధపడ్డారు. నగరం నడిబొడ్డున ఉన్న ఆ సంస్థను ఆమె సరిగా వాడటం లేదని ఎక్కువమంది సభ్యులు ఆమె మీద మండిపడుతున్నారట. అప్పటికే దాదాపు 40 ఏళ్ళు ఆమె ఆధ్వర్యంలోనే నడుస్తున్న సంస్థ అది. బిలియర్డ్స్ కోసం వచ్చేవాళ్ళు తప్ప ఎవరూ ఆసక్తి చూపటం లేదట. చెన్నపురి ఆంధ్ర మహాసభను కాపాడుకోవాలన్నా, తన బిలియర్డ్స్ ప్రాక్టీస్ కొనసాగాలన్నా వాళ్ళ మాటకు తలొగ్గక తప్పని పరిస్థితి ఆమెది. సాంస్కృతిక సంస్థగా కాకుండా ఒక క్లబ్ లా మార్చాలన్నది ఎక్కువమంది అభిప్రాయం.

మొత్తానికి వాళ్ళందరి కోరిక మీద భవనం పై అంతస్తులో ఒక షెడ్ వేసి లైసెన్స్ తీసుకొని బార్ ఓపెన్ చేశారు. ఆ మాటే చెబుతూ, “మెంబర్ షిప్ ఇస్తాం తీసుకో”మని కూడా అన్నారు. ఇప్పుడు సభ్యులు కుప్పలు తెప్పలుగా వస్తున్నారని, సాయంత్రమయ్యేసరికి ఆ ఆవరణ కళకళలాడుతోందని చెప్పారు. అలా కాసేపు మాట్లాడాక సెలవు తీసుకున్నాం. వార్త కంటే ముందు శీర్షిక రెడీ అయింది.

నాడు పద్యం హోరు – నేడు మద్యం జోరు

మా బొల్లం రాజు నవ్వి ఊరుకున్నాడు తప్ప నన్ను వారించటానికి ప్రయత్నించలేదు. మొత్తానికి అలాగే పబ్లిష్ అయింది. రెండు రోజుల తరువాత ఒక ఫోన్. “ నమస్కారమండీ. నేను కమలాదేవి గారబ్బాయ్ జయచందర్ ని మాట్లాడుతున్నా. మీ వార్త చదివి అమ్మ చాలా బాధపడ్డారు. రెండురోజులుగా పచ్చి మంచినీళ్లు ముట్టలేదు. మీరే వచ్చి నచ్చజెప్పాలి” ఇవే మాటలు కాకపోయినా, దాదాపుగా అదే అర్థం. “సరే”నని ఫోన్ పెట్టేశాక మా బొల్లం రాజుకు చెబితే ఆమెకు సర్ది చెప్పటం ఒక్కటే మార్గమన్నాడు.

*****

‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్” అంటారు. అంటే ఎప్పుడూ సత్యాన్నే పలకాలి. ప్రియ వచనాలనే పలకాలి అని. అంతవరకూ బాగానే ఉందిగాని,” న బ్రూయాత్ సత్యమప్రియం” అని కూడా అంటారు. అంటే, “సత్యమైనా అప్రియమైన మాటలను పలకరాదు” అని. అక్కడే ఇబ్బంది. ఆమెకు నచ్చకపోయినా, అక్కడ జరిగింది మాత్రం నిజం. ఎంతగా నచ్చజెప్పాలని చూసినా ఆమె ఒక పట్టాన ఆ వార్తను జీర్ణించుకోలేకపోయారు. అప్రియమని సత్యం చెప్పకూడదా? అని నాకు నేనే ప్రశ్న వేసుకున్నా. మరీ కాస్త ఘాటెక్కువైందని మాత్రం అనిపించింది. ఏమైతేనేం, “ఆమె కు ఇష్టం లేకపోయినా బార్ పెట్టేలా తీర్మానం చేశా”మని ఆ కమిటీ వాళ్ళతో చెప్పిస్తే అదే వార్తగా రాశా. ఆమె శాంతించారని వాళ్ళబ్బాయి మళ్ళీ ఫోన్ చేశారు.

*****

కమలాదేవి గారు 2012 లో చనిపోయారు. ఆ తరువాత మూడేళ్ళకే ఆ భవనం 99 ఏళ్ళ లీజు పూర్తయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చెన్నై కార్పొరేషన్ ఆ భవనాన్ని కూల్చేసి స్థలం లాక్కుంది. ఇప్పుడక్కడ ఎలాంటి ఆనవాళ్ళూ లేవు. ఆ విధంగా 1916 లో ఏర్పడ్డ చెన్నపురి ఆంధ్రమహాసభకు దాదాపు పదేళ్ళ కిందటే నూరేళ్ళు నిండాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles