విషాదం నుంచి విజయం వరకు!
ఐదేళ్ల క్రితం అతడో యాసిడ్ బాధితుడు… ఇప్పుడు రొనాల్డోనే నిలువరించి ఫిఫా కప్ లో ప్రత్యేక ఆకర్షణగా నిల్చినవాడు.
పేరుకు ఒలింపిక్స్ పెద్ద గేమ్ అయినప్పటికీ… అలాంటి క్రేజే మనం వింబుల్డన్ వంటి క్రీడలతో పాటు, ఈ మధ్య కాలంలో క్రికెట్ లోనూ చూస్తున్నప్పటికీ… ఆదాయపరంగా, ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అభిమానులను అలరించేది మాత్రం ఫిఫా ఫుట్ బాల్ టోర్నీనే.
ఇప్పుడీ టోర్నీలో తన అద్భుతమైన పునరాగమనంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిల్చాడు యోవానే విస్సా.

1974లో జైర్ పేరుతో తొలిసారి ప్రపంచకప్ లో పాల్గొన్న డీఆర్ కాంగో టీం.. సుమారు 52 ఏళ్ల తర్వాత ఫిఫా వంటి వరల్డ్ కప్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. అలాంటి వరల్డ్ కప్ చరిత్రలో తలతో బాల్ ను నెట్స్ లోకి పంపి తొలి గోల్ సాధించి… గోల్ కోసం ఆటగాళ్లంతా నిరీక్షిస్తున్న ఆ క్షణాన్ని నిజం చేశాడు యోవానే విస్సా.
పోర్చుగల్ గోల్ కీపర్ డియోగో కోస్తాకు షాక్ ఇచ్చిన ఆ గోల్ తో… ఫుట్ బాల్ స్టార్ ఆటగాడైన క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని టీంతో ఒకటి ఒకటి గోల్స్ తో డ్రా చేసుకుని వార్తల్లో నిల్చాడు.
విస్సా సాధించిన ఈ గోల్ వెనుక ఒక విషాదకరమైన వ్యక్తిగత పోరాటముంది. ఫుట్ బాల్ మైదానం బావురుమన్న ఒక కలవరముంది. ఐదేళ్ల క్రితం వరకూ తను వరల్డ్ కప్ లో ఆడటానికి ప్రయత్నాలే మొదలుపెట్టలేదు. కోల్పోయిన చూపును తిరిగి తెచ్చుకునే పనిలో ఉన్నాడు. తన జీవితం కోసం, కుటుంబ భద్రత కోసం పోరాడుతున్నాడు. అలాంటి వ్యక్తి ఐదేళ్లు తిరిగే సరికి… పోర్చుగల్ స్టార్ ఆటగాడు.. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ప్లేయర్ రొనాల్డోకే షాక్ ఇచ్చాడు.
ఐదేళ్ల క్రితం యోవానే విస్సాకు ఏమైంది..?
ఫ్రాన్స్ లోని లోరియెంట్ లో ఒక భయానక ఘటన జరిగింది. 2021 జూలై మాసంలో విస్సా వయస్సు అప్పటికి కేవలం 24 ఏళ్లు మాత్రమే. ఫ్రెంచ్ క్లబ్బులో లోరియెంట్ తరపున లీగ్ లో అద్భుతంగా ఆడుతున్నాడప్పుడు. ఆ ప్రతిభతో ప్రీమియర్ లీగ్ క్లబ్ బ్రెంట్ ఫోర్డ్.. అతడిని 8.5 మిలియన్ పౌండ్స్ కు అతడికి ఆఫర్ చేసి ఆడించడానికి ఒప్పందం కుదిరింది.
కానీ, ఓ మహిళ విస్సా జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. నాశనం చేసింది. అభిమాని పేరిట ఆటోగ్రాఫ్ కోసమంటూ వచ్చి తలుపు తెరిచిన వెంటనే విస్సా ముఖంపై యాసిడ్ పోసింది. తర్వాత విచారణలో ఆ మహిళ లక్ష్యం విస్సా చిన్న కూతురును కిడ్నాప్ చేయడమని తేలింది. ఆ దాడితో విస్సా ముఖంపై తీవ్రమైన గాయాలయ్యాయి. అతడి రెండు కళ్లకూ అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. అనంతరం వాన్స్ కోర్టులో సదరు మహిళకు శిక్ష పడి… 18 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
విస్సా ఆరోజు కోర్టుకు ఏం చెప్పాడు..?
నేను తలుపు తెరిచాను వెంటనే ఎవరో నా ముఖంపై ఓ ద్రవం పోశారు. నేను అరుస్తూ ఊపిరి కూడా పీల్చుకోలేకపోయాను. నా భార్య ఎమర్జెన్సీ సర్వీస్ కి ఫోన్ చేసింది. వారు నా కళ్లను నీటితో కడగమన్నారు. ప్రతీ గంటకూ ఎవరో ఒకరు వచ్చిన నా కళ్లను శుభ్రం చేయాల్సి వచ్చేది. అది తల్చుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఓ భయంకర ఘటన. అదో కలైతే బాగుండననిపిస్తుంటుందన్నాడు కోర్టు విచారణలో విస్సా.
రోజూ ఐ డ్రాప్స్ తప్పనిసరిగా వేసుకోవాల్సిందే.. దాదాపు కళ్లు పోయినంత పనైపోయింది. ఇక అప్పట్నుంచి ఫుట్ బాల్ ప్లేయర్ గా ఆలోచించడం ఆపేసి విస్సా… తాను అంధుడిగా మారినా సరే తన పిల్లల రక్షణే ప్రాధాన్యతనుకున్నాడు.

తిరిగి నిలబడి పోరాటం!
ఆ దాడి యోవానే విస్సా కలనే నాశనం చేసింది. బ్రెంట్ ఫోర్డ్ కు వెళ్లాలన్న ఆలోచన కాస్తా ఆలస్యమైపోయింది. అలా 2012 ప్రీ సీజన్ మొత్తం తను కోల్పోయాడు. లండన్ కు చికిత్స కోసం చేరుకున్నప్పుడు శారీరకంగా బలహీనంగా… మానసికంగా తీవ్ర ఒత్తిడిలోనే గడిపాడు. పెద్ద శబ్జాలకు భయపడటం, అపరిచితుల మధ్యన ఉండలేకపోవడం వంటి సమస్యలతో పాటే.. ట్రామా ఉన్నట్టుగా కూడా వైద్యులు గుర్తించారు.
యాసిడ్ దాడికి ముఖంపై అయిన గాయాల కోసం కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలని పలువురు సూచించినా విస్సా వినలేదు. తన జీవిత కథలో అదో భాగమని ఎదుటివారిని సమాధానపర్చాడు. కానీ, పట్టు మాత్రం వదల్లేదు. అతడి పట్టుదలే విస్సాను మళ్లీ నిలబెట్టింది. మెల్లిగా మళ్లీ ఫుట్ బాల్ కదనరంగంలోకి అడుగు పెట్టాడు. ఫామ్ ను తిరిగి సాధించాడు. బ్రెంట్ ఫోర్డ్ లో కీలక ఆటగాడిగా మళ్లీ పునర్వైభవం సాధించాడు. నాల్గు సీజన్లలో ఆ క్లబ్ తరపున ఆడి 45 గోల్స్ చేశాడు.
న్యూ క్యాజిల్ ట్రాన్స్పర్ నుంచి వరల్డ్ కప్ హానర్ వరకూ!
విస్సా అద్భుత ప్రదర్శనతో 2025లో తనకు న్యూక్యాజిల్ యునైటెడ్ నుంచి ఆహ్వానమందింది. టైన్సైడ్ క్లబ్బులో ప్రతిష్థాత్మకంగా భావించే 9వ నంబర్ జెర్సీ తన సొంతమైంది. అదే నంబర్ జెర్సీని గతంలో ఇంగ్లాండ్ దిగ్గజమైన అలన్ షీరర్ వేసుకున్నాడు.
అయితే మొదట్లో మోకాలి గాయం కారణంగా సీజన్ లో కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాడు. 13 మ్యాచులాడితే ఒకే ఒక్క గోల్ మాత్రమే చేశాడు. అయినప్పటికీ నిరుత్సాహపడలేదు. పోరాట స్ఫూర్తిని వీడలేదు.
డీఆర్ కాంగోకు ప్రాతినిథ్యం!
మళ్లీ తిరిగి పుంజుకుని 2026 ప్లే ఆఫ్స్ లో డీఆర్ కాంగో తరపున ఆడి ఫిఫా టోర్నమెంట్ కు తమ జట్టు అర్హత సాధించేందుకు ప్రధాన కారకుడయ్యాడు.
ప్రపంచవేదికను తనవైపుకు తిప్పుకున్న గోల్!
పోర్చుగల్ పై జరిగిన మ్యాచులో ఒంటరి స్ట్రైకర్ గా విస్సా బాధ్యత నిర్వర్తించాడు. స్టార్ డిఫెన్స్ ను ఎదుర్కొని ఒత్తిడిని జయించాడు. సరైన సమయంలో సమయస్ఫూర్తితో పరుగు లంకించి ఒక హిస్టారికల్ గోల్ చేశాడు. హ్యూస్టన్ స్టేడియంలో చేసిన ఆ గోల్ కేవలం ఒక్క ఫుట్ బాల్ గేమ్ కే పరిమితమైన గోల్ కాదు.. అది యోవానే విస్సా తిరిగి నిలబడ్డ చరిత్రకు.. అతడి పట్టువదలని విక్రమార్కుడి తత్వానికి ఓ నిదర్శనంగా నిల్చింది.
చూపును కోల్పోయి.. కెరీర్ ఎమైపోతోందో తెలియని అయోమయంలో.. కుటుంబాన్ని దాదాపు కోల్పోయిన ఓ మనిషి చీకటి నుంచి వెలుగులోకి చేసిన ప్రయాణం యోవన్నా విస్సా ఫుట్ బాల్ జర్నీ.
మనిషిని కూల్చివేసే పరిస్థితులెదురైనా… తిరిగి నిలబడవచ్చని నిరూపించాడు కాబట్టే యోవన్నా విస్సా గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవడం.



