ఆధునిక శాస్త్రజ్ఞులనే తబలా ఎందుకు ఆశ్చర్యపర్చింది..?

MUSICAL DRUMS WITH HARMONIC TONES!

భారతీయ సంగీతంలో.. ముఖ్యంగా హిందుస్థానీ సంగీత ప్రక్రియలో తబలాది కీలకపాత్ర. అయితే ఈ తబలా.. శతాబ్దాల పాటు వినికిడి ఆధారంగా జరిగిన ఓ ప్రయోగం మాత్రమే కాదు… ఆధునిక శాస్త్రాన్నే కచ్చితత్వంతో ఆశ్చర్యపర్చిన వాద్య ప్రక్రియ.

తబలా జంటలో డగ్గ (బయాన్) కాకుండా కుడివైపు పెట్టుకుని వాయించే వాద్యం పేరు డయాన్. వాస్తవంగా అరబిక్ పదం తబ్ల్ నుంచి పుట్టుకొచ్చిన తబలాలో… డయాన్ సౌండింగ్ ఆధునిక కాలపు సైంటిస్టులను కూడా విస్తుగొలిపింది. ప్రపంచంలోని ఇతర వాద్యాలన్నింటికంటే కూడా భిన్నమైన దీని ధ్వనిని శాస్త్రవేత్తలు శాస్త్రీయ పద్ధతుల్లో అంచనా వేసి ఆశ్చర్యపోయారు.

సాధారణంగా తాళ వాద్యాలు కొట్టినప్పుడు, కదిపినప్పుడు అవి శబ్దాలు చేయడం సహజమే. కానీ, తబలాలోని డయాన్ అనే కుడివైపు పరికరాన్ని కళాకారుడు తాకినప్పుడు వెలువడే సంగీతం నిర్ధిష్ఠ స్వరాన్ని కూడా కల్గి ఉండటమే శాస్త్రజ్ఞులు ఈ డయాన్ పై పరిశోధనలు చేయడానికి గల ప్రధాన కారణం. దీని స్వరాలు నిర్ధిష్ఠమైన నాద సంపదను కల్గి ఉండి సితార్, ఇతర తంత్రి వాద్యాల తరహా మాధుర్యాన్ని గుర్తు చేయడమే ఆశ్చర్యపర్చే విషయం.

తబలా గాయకుడితో కలిసి శ్వాస తీసుకుంటుంది. భౌతిక శాస్త్రం ప్రకారం అసాధ్యమైన ప్రక్రియను క్రీస్తుపూర్వమే తబలా తయారీతో సుసాధ్యం చేశారు తబలా వాద్య తయారీదారులు. వాస్తవానికి వృత్తాకారంలో ఉండే ఏ డ్రమ్స్ అయినా సరే లయ కోసం మాత్రమే పని చేస్తాయి. అలాగే, వాటినుంచి వెలువడే కంపనాల వివిధ ఫ్రీక్వెన్సీ లెవల్స్ వేర్వేరుగా ఉండటంతో స్పష్టమైన సంగీత స్వరాలను అవి ఉత్పత్తి చేయలేవనేది ప్రధానంగా నెలకొన్న భావన. కానీ, భారతీయ తబలా తయారీదారులు ఈ భావనను తప్పని నిరూపించారు.

ధ్వని నియమాలనే తిరగరాసిన డ్రమ్ డయాన్!

భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం చాలా డ్రమ్స్ అకాస్టికల్లీ డిఫెక్టివ్. అంటే శబ్దపరంగా లోపభూయిష్టమైనవనే భావన ఉంది. ఇదేదో వాటిని పనికిరావని చెప్పడానికి కాదు.. శాస్త్రీయ వివరణలు చెప్పే మాట. ఎందుకంటే, ఒక డ్రమ్ ను కొట్టినప్పుడు ఒకే విధంగా కంపించదు. ఒకేసారి అనేక కంపనాలు ఉత్పత్తవుతాయి. జస్ట్ లైక్ చెరువులో రాయి వేస్తే అనేక అలలు వ్యాపించినట్టు. డ్రమ్ ను వాయించినప్పుడూ అలాంటి తరంగాలే ఉత్పత్తవుతాయి. ఇక ప్రతీ కంపనానికీ ఓ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సెకన్ లో ఎన్నిసార్లు కంపిస్తే ఆ కంపనాలను హెర్ట్జ్ లో కొలుస్తారనే విషయమూ కాస్తో కూస్తో సైన్స్ పరిజ్ఞానం ఉన్నవాళ్లకు తెలిసిందే.

ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. సితార్, వైలిన్, వీణ వంటి తంత్రీ వాద్యాల్లో ఫ్రీక్వెన్సీ ఒక క్రమబద్ధతతో హార్మోనిక్ గా పూర్ణసంఖ్యల నిష్పత్తితో వినిపిస్తూ… శ్రావ్యతనిస్తాయి. కానీ, సాధారణ వృత్తాకార డ్రమ్ ప్లే చేస్తే మాత్రం అందుకు పూర్తి భిన్నమైన సౌండ్స్ వినిపిస్తాయి. బెస్సెల్ ఫంక్షన్స్ అనే గణిత శాస్త్ర సమీకరణాల గురించి కొంచెం తెలిసుంటే… వాటి ఫ్రీక్వెన్సీ ప్రకారం ఇవి అసంపూర్ణ సంఖ్యల నిష్పత్తితో స్వరాలు ఒకటికొకటి ఘర్షణ పడుతున్నట్టు అసహజమైన ధ్వనికి కారణమవుతాయి. అందుకే చాలావరకు డ్రమ్స్ అనే వాద్యం కేవలం లయకు మాత్రమే ఉపయుక్తం తప్ప.. రాగాన్నీ పలికించలేవు.

చాలా మంది శాస్త్రవేత్తలు కూడా ఈ డ్రమ్స్ పైన పరిశోధనలు చేసినా… వాటిని కేవలం తాళానికే పరిమితమైన వాద్యాలుగా భావించారు. అంతకే పరిమితం చేశారు. కానీ, 1919లో సీవీ రామన్ కోల్ కత్తాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ లో పనిచేస్తున్న సమయంలో.. క్లాసికల్ సంగీత కచేరీలకు హాజరయ్యేవారు. ఆ సమయంలో శాస్త్రం చెప్పినదానికి భిన్నంగా తబలా, మృదంగం స్వరాలు వినిపిస్తుండటం ఆయన్ను ఆలోచింపజేసింది. దాంతో తన సహచరుడు శివకాళి కుమార్ తో కలిసి శాస్త్రీయ పరిశోధనలు మొదలుపెట్టారు సీవీ రామన్.

1920, జనవరి 15వ తేదీన వారి పరిశోధన ప్రపంచ సుప్రసిద్ధ పత్రిక నేచర్ లో మ్యూజికల్ డ్రమ్స్ విత్ హార్మోనిక్ ఓవర్ టోన్స్ అనే శీర్షికతో ప్రచురితమై చర్చకు తెరలేపింది.

తబలాలోని డయాన్.. అలాగే, మృదంగంలో ఉత్పత్తయ్యే సౌండ్స్ పరిపూర్ణ హార్మోనిక్ నిష్పత్తిలో ఉన్నాయని నిరూపిస్తూ ఆ పరిశోధన వెలువడింది. అంటే ఒక డ్రమ్ కేవలం లయకు మాత్రమే పరిమితం కాకుండా.. తంత్రి వాద్యాలు ప్రొడ్యూస్ చేసే స్వరాన్ని కూడా వెలువరించగలవని.. అందుకు తబలాలోని డయాన్, మృదంగం ఏ విధంగా ఉదాహరణలో ఆ పరిశోధన లోకం ముందుంచింది.

ఒక డ్రమ్ లో హార్మోనిక్ శ్రేణి ఎలా సాధ్యమైంది..?

ప్రపంచంలోని పలువురు శాస్త్రవేత్తలు డ్రమ్స్ నుంచి వచ్చే శబ్దాలు కేవలం తాళానికే పరిమితం కాని… హార్మోనిక్ టోన్ లో రాగాన్ని పలికించలేవని తీర్మానిస్తే.. మరి ఇండియన్ సైంటిస్ట్ సీవీ రామన్ ఏంటి ఇలా చెబుతున్నారు..? ఎలా సాధ్యమైందనే ప్రశ్నలూ ఉత్పన్నమైనాయి.

పూతలో దాగున్న మేధస్సు!

నల్లటి పూతలో దాగున్న మేధస్సే ప్రపంచ శాస్త్రవేత్తలను అబ్బురపర్చడానికి కారణమైంది. తబలాలోని డగ్గ కాకుండా డయాన్ అని పిల్చుకునే.. కుడివైపు పెట్టుకుని కళాకారులు వాయించే ఆ వాద్యంపైనా, అలాగే, మృదంగంపైనా కనిపించే స్యాహీ అనే నల్లటి వృత్తాకార పూతనే ఇందుకు కారణమని సీవీ రామన్ బృందం తేల్చింది.

స్యాహీని ఐరన్ ఆక్సైడ్, పిండి, నీటి మిశ్రమంతో తయారుచేస్తారు. ఒకేసారి కాకుండా తబలాపైనా, మృదంగంపైనా పొరలు పొరలుగా దాన్ని మధ్యలో మందంగా అంటిస్తారు. అంటించే క్రమంలో మధ్యలో మందంగానూ.. అంచులకు చేరుకునేసరికి పలుచగానూ ఈ స్యాహీ కనిపిస్తుంది.

స్యాహీనే అసలు రహస్యం!

సాధారణ డ్రమ్స్, కాంగోస్ వంటివి పరిశీలించినప్పుడు అవి స్వేచ్ఛగా కంపనాలను విడుదల చేయడంతో ఒక లయ మాత్రమే వినిపిస్తుంది. కానీ స్యాహీతో అంటించిన తబలాలోని డయాన్, మృదంగం మధ్యలోని ఆ అధిక బరువుతో ఆ వాద్యాన్ని వాయిస్తున్నప్పుడు తరంగాలు నెమ్మదిస్తాయి. జస్ట్ లైక్ భారీ లోలకం తేలికపాటిదానికంటే నెమ్మదిగా ఊగినట్టన్నమాట. అలా నెమ్మదించిన కంపనాలు ఒక క్రమపద్ధతిలో హార్మోనిక్ నిష్పత్తుల్లోకి మారిపోతాయి. వేర్వేరు కంపనాలు ఒకే ఫ్రీక్వెన్సీకీ చేరుకుంటాయి. అలా పరస్పరం బలపర్చుకుని వెలువడే శ్రావ్యతనే సూపర్ పొజిషన్ అని కూడా పిలుస్తుంటారు.

శాస్త్రం కూడా ఊహించలేని పరిష్కారాన్ని చూపిన భారతీయ వాద్య కళాకారులు, తయారీదారులు!

స్యాహీని తయారు చేసిన తబలా, మృదంగాల తయారీదారులెవ్వరూ గణిత సమీకరణాలేం చదువుకోలేదు. సిద్ధాంతాలనూ అధ్యయనం చేయలేదు. వారు చేసిందొక్కటే. డ్రమ్ ను కొట్టడం వినడం ఆ తర్వాత పూత పూయడం. మళ్లీ వినడం మళ్లీ పూత పూయడం. అలా ఒక సుస్వరాన్ని వెలువరించేవరకూ చేపట్టిన ప్రక్రియలో భాగమే తబలా, మృదంగమనే సంప్రదాయ వాద్యాల తయారీకి పురుడైంది.

తరాలుగా కొనసాగుతున్న ప్రక్రియ!

శతాబ్దాల పాటు వినికిడి ఆధారంగా జరిగిన ప్రయోగాలు చివరికి ఆధునిక శాస్త్రాన్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసేంత కచ్చితత్వాన్ని సాధించాయి. ఐఐటీ మద్రాస్ పరిశోధకులు ఆధునిక కంప్యూటర్ విశ్లేషణల ద్వారా రామన్ ఫలితాలను ధృవీకరించారు. 1920లో ఆయన కొలిచిన పద్ధతిలోనే హార్మోనిక్ గా, వినసొంపుగా తబలా, మృదంగాలు పనిచేస్తున్నాయని నిర్ధారించారు.

సిద్ధాంతాన్ని మించి నిలబడిన సంప్రదాయం!

ఓ హిందుస్థానీ కళాకారుడు తబలాను తన శైలిలో తాకుతున్నప్పుడైనా… ఓ కర్నాటక శాస్త్రీయ మృదంగ విద్వాంసుడు కృతికి అనుగుణంగా వాయిస్తున్నప్పుడైనా వెలువడే మధురమైన తోలు వాద్యాల తయారీ వెనుక శతాబ్దాల అనుభవపూర్వకమైన సౌండ్ ఇంజనీరింగ్ కనిపిస్తుంది.

శబ్ద శాస్త్ర ఆవిష్కరణలో అద్భుతమైన స్యాహీ!

స్యాహీ అనేది మానవ చరిత్రలో అత్యంత అద్భుతమైన శబ్ద శాస్త్ర ఆవిష్కరణల్లో ఒకటి.

ప్రయోగశాలలు, సమీకరణాలు, కంప్యూటర్లు ఏవీ లేకుండానే కేవలం వినికిడి, పరిశీలన, పరిపూర్ణ ధ్వని కోసం పడ్డ తపన ఆధారంగా ఒక తబలా, ఒక మృదంగం వంటి భారతీయ సంప్రదాయ వాద్యాలు రూపుదిద్దుకున్నాయి.

1920 నాటికిగాని ప్రపంచంలోని శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగల్గారుగానీ… భారతదేశ కళాకారులు శతాబ్దాలకు మునుపే ఇలాంటి సృష్టి చేశారు. ఆ తర్వాత వచ్చిన భౌతికశాస్త్రం అప్పటికే ఆవిష్కృతమైన అద్భుతాన్ని జస్ట్ వివరించిందంతే.

డిస్ క్రెయిమర్: ఇద్దరు సినిమాలో శశివదనే పాట విని చూడండి… లేదా, ఎల్లా వెంకటేశ్వర్ రావు ప్రయోగాలను యూట్యూబ్ లో ఓసారి పరిశీలించండి. తబలా, మృదంగాలు కేవలం లయకు మాత్రమే పరిమితం కాకుండా… తంత్రీ వాద్యాల తరహాలో స్వరాన్నీ ఎలా పలుకుతాయో అర్థం చేసుకోవచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles