అలాంటివాళ్లందరికీ.. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు!

విశీ ( సాయివంశీ )… ✍🏼

………………………………………………..

వీళ్లందరికీ అంబేడ్కర్ జయంతి శుభాకాంక్షలు..

default

… ఇంటి వెనుక ఉండే పీటర్ కొత్తకారు కొనగానే ‘వీడూ, వీడి టెక్కులూ’ అని లోలోపల తిట్టుకునేవారికి..

… పక్కింటి లలిత మంచి చీర కట్టగానే, ‘ఇదీ, దీని సోకులూ’ అని ఈసడించుకునేవారికి..

… స్కూల్లో రమాకాంత్ కొత్త షూస్ వేసుకోగానే, ఈర్ష్యతో వాటి మీద ఇంకు పోయాలని చూసేవారికి..

… ఇంటర్ కాలేజీలో ఫాతిమాకి తిరుపతి ప్రసాదం ఇస్తే ‘తినను’ అనగానే ‘ఈ తురుకోళ్లంతా ఇంతే’ అని తీర్మానం చేసేవారికి..

… డిగ్రీ కాలేజీలో యశోదారెడ్డి బ్యూటీ పార్లర్ గురించి మాట్లాడితే ‘వీళ్లకెప్పుడూ అందం మీదే ధ్యాస’ అని ఫీలయ్యేవారికి.

… ఆఫీసులో శ్రీరామ్ అడ్డనామాలు పెట్టుకుని వస్తే, వింతగా చూసి వెక్కిరిస్తూ మాట్లాడే వారికి..

… ‘పెంటయ్య’ అనే పేరున్న వ్యక్తి కొత్తగా ఉద్యోగంలో చేరితే, అతని పేరు మీద చర్చలు చేసేవారికి..

… ఇంట్లో పనిమనిషి మెడలో బంగారు గొలుసు చూసి కుళ్లుకునేవారికి..

… కూరగాయలమ్మే మనిషి ఇంగ్లీషు మాట్లాడితే విచిత్రంగా చూసేవారికి..

… ఆటో డ్రైవర్ కొడుకు కాన్వెంట్‌లో చదువుతున్నాడంటే అనుమానపడేవారికి..

… సాదాసీదా బట్టలు వేసుకునేవారు నిరుపేదలు, DSLR Cameraతో ఫొటో షూట్ చేయించుకునేవారు ధనికులు అనే అడాలిసెంట్ అపోహ కలిగినవారికి..

… ‘దేవాదానం’, ‘దైవసహాయం’, ‘కృపాకరం’ అనే ఉద్యోగుల పేర్లు చూడగానే వాళ్ల మెరిట్‌ని శంకించి, ‘రిజర్వేషన్ క్యాండిడేట్స్’ అని అసూయపడేవారికి..

… లేడీ ఎంప్లాయికి ప్రమోషన్ రాగానే, ఆమె బాస్ రూంకి ఎన్నిసార్లు వెళ్లిందో లెక్కగట్టేవారికి..

… ‘ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు ఇస్తున్నారు’ అనే వార్తను పదిమందికి చెప్పి, పది రకాల నవ్వుకునేవారికి..

… సివిల్, క్రిమినల్ కేసులకు మగ లాయర్లు, విడాకుల కేసులకు మాత్రమే ఆడలాయర్లను సంప్రదించాలని సూచించే వారికి..

… హిందువులు ఇంత పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని బయటకు వెళ్తే ఏమీ అనకుండా, ముస్లింలు టోపీ, సుర్మా పెట్టుకురాగానే వింతగా చూసి, విచిత్రపోయేవారికి..

… చర్చికి వెళ్లే ప్రతి ఒక్కరూ మతమార్పిడులకు పాల్పడతారని, ‘ప్రభువా’ అన్న ప్రతి ఒక్కరూ పక్కవారిని మతం పుచ్చుకునేలా చేస్తారని ఫీలయ్యేవారికి..

… ముస్లింలు వారానికోసారి స్నానం చేస్తారనే దిక్కుమాలిన అపోహని నేటికీ ప్రచారం చేస్తున్నవారికి, దాన్ని మనసారా నమ్ముతున్నవారికి..

… ‘రెడ్డి’, ‘రాజు’, ‘శర్మ’, ‘వర్మ’ అని పేరున్న వారంతా తప్పక కులవివక్ష చూపుతారని,‌ వారికి తప్పకుండా కులాహంకారం ఉంటుందని నమ్మేవారికి..

.. పెద్ద హీరోల కూతుళ్ల గురించి, వాళ్ల భార్యల గురించి నానా చెత్తా వాగేవారికి, రాసే వారికి, అది చదివి అదే నిజం అనుకునేవారికి..

… సమంత విడాకుల గురించి, సునీత పెళ్లి గురించి, పవిత్రా లోకేశ్ కొత్త జీవితం గురించి, పార్టీ మారే మహిళా నాయకుల గురించి నీచాతినీచంగా మాట్లాడేవారికి, అలా మాట్లాడేవారికి మద్దతు ఇచ్చేవారికి..

… ‘స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం’ అనగానే అక్రమ సంబంధాలు, పడకటింటి వ్యవహారాలు గుర్తుచేసుకునేవారికి..

… ఇంట్లో భార్యకు సరైన గౌరవం ఇవ్వక, సమానత్వం గురించి స్టేజీలపై లెక్చర్లు దంచేవారికి..

… ఆడ, మగ పిల్లల పెంపకంలో తేడా చూపుతూ, సమానత్వం గురించి వ్యాసాలు రాసేవారికి..

.. టీవీ యాంకర్ల మీదా, న్యూస్ రీడర్ల మీద వెకిలి కామెంట్లు చేసి, నోరు పారేసుకునేవారికి..

… తమకు నచ్చని పార్టీని సపోర్ట్ చేసిన హీరోయిన్లను, వాళ్ల అమ్మలను దారుణంగా ట్రోల్ చేసేవారికి..

… ఇద్దరూ ఆడపిల్లలే పుడితే, తమదేదో వీరపాండ్య కట్టబ్రహ్మన వంశం అని, తమకు వంశాంకురం కావాలని, మగబిడ్డ కోసం భార్యని హింసించే వారికి‌‌..

… FBలో ఏదైనా రాయగానే, ‘ఇతను ఏ పార్టీ ఫాలోవరూ?’ అని సందేహించి, ప్రొఫైల్ చెక్ చేసేవారికి..

… ఇంకా బోలెడంత వివక్షని లోలోపల దాచుకున్నవారందరికీ.. అంబేడ్కర్ జయంతి శుభాకాంక్షలు. మనకోసమే ఈ రోజు.

అంబేడ్కర్ కేవలం కులవివక్ష దగ్గరే ఆగిపోలేదు. అన్ని రకాల వివక్షలనూ ఖండించారు. మేం అన్ని రకాల వివక్షలనూ చూపిస్తాం. కానీ కులవివక్ష చూపము. కాబట్టి మేం అంబేడ్కర్ చూపిన దారిలో నడుస్తున్నాం అంటే కుదరదు. కులం, మతం, జాతి, ప్రాంతం, భాష.. వివక్ష ఏ రూపంలో చూపినా వివక్షే! అది అంబేడ్కర్ ఏనాడూ హర్షించరు. జై భీం!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles