హృషీకేష్ సిరిసిల్ల… ✍🏻
………………………………………………………………………
నౌకల్లో ఓ రారాణి టైటానిక్!
అది ప్రపంచం మరిచిపోలేని జల దుర్ఘటన!
శతాబ్దాలు గడిచినా మరిచిపోలేని విషాద జ్ఞాపకం!
టైటానిక్ నౌక ప్రమాదానికి సరిగ్గా 113 ఏళ్లు!
నాటి చరిత్రకారుల నుంచి నేటి ఏఐ హైటెక్ యుగం వరకు తరచి తరచి తెలుసుకునే చారిత్రక ఆసక్తికర అంశం టైటానిక్. అంతెందుకు, తమ పర్సనల్ సెర్చింగ్స్ మినహాయిస్తే ప్రపంచంలో అత్యధికంగా గూగుల్ లో సెర్చ్ చేసిన రెండో అంశంగా కూడా టైటానిక్ కే ఆ ఇంపార్టెన్స్ దక్కింది.
1997లో జేమ్స్ కామెరూన్, నాటి ప్రమాదానికి ఓ ప్రేమ కథను జోడించి నిర్మించడంతో టైటానిక్ యావత్ ప్రపంచానికి మరింత చేరువైంది.
అంతలా పెనవేసుకుపోయిన అందాల టైటానిక్.. అట్లాంటాలో జలసమాధైన విషాదానికి ఒక తాళంచెవి కారణమైందనేది చాలామంది నమ్మలేని ఓ చేదు నిజం!

ఎందుకు టైటానిక్ అంత ప్రత్యేకం…?
1909 ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్ నగరంలో “హార్లాండ్ అండ్ వోల్ఫ్” షిప్‌యార్డులో పర్యాటకుల కోసం ఒక కలల నౌక తయారైంది. థామస్ ఆండ్రూస్ డిజైన్ చేసిన నౌక.. అతని నేతృత్వంలో 3 సంవత్సరాల నిపుణుల కృషి, 15 వేల మంది కార్మికుల శ్రమతో White Star Line నిర్మించిన ఓ అత్యంత అద్భుతమైన నౌక. మూడంతస్తుల భవనాన్ని తలపించే రూపంతో, అద్భుతమైన ఇంటీరియర్ డిజైనింగ్ తో, స్విమ్మింగ్ పూల్, గ్రాండ్ స్టెయిర్ కేస్, ఆర్కెస్ట్రా, షాంపేన్, డిన్నర్… అలా అదో ఓడ కాదు… సాక్షాత్తూ సముద్ర అలలపై నడుస్తున్న ఓ రాజమహల్ ను తలపించేదన్నది అందులో ప్రయాణించిన నావికుల మాట.
Even God Himself cannot sink this ship అంటూ టైటానిక్ గురించి గట్టి ప్రచారం జరిగింది. ఆ స్థాయిలో నిర్మించారు ఆ నౌకను.
టైటానిక్ విషాదంలో అసలేం జరిగింది?
1912 ఏప్రిల్ 12న భారీ అంచనాలు, ఆశలతో ప్రయాణం ప్రారంభించింది టైటానిక్. 3 అంతస్తులు నిర్మించి ప్రయాణికుల్ని 3 తరగతులుగా విభజించారు. ప్రపంచ సుసంపన్నులు, శ్రీమంతులకు మొదటి శ్రేణిలో విలాసవంతమైన ఏర్పాట్లు చేశారు. టికెట్ ధర 4350 డాలర్లు. అంటే ఇప్పుడైతే 7000 డాలర్లతో సమానం. ఇండియన్ కరెన్సీలో అది 58 లక్షల 80 వేల రూపాయలు. అలాగే, మధ్యతరగతి వ్యాపారస్తులు, టీచర్లు. ఇతర చిన్న చిన్న ఉద్యోగుల కోసం మరో క్లాస్ ఏర్పాటు చేశారు. పేదల కోసమూ తృతీయ శ్రేణినీ ఏర్పాటు చేశారు. అలాంటి నౌకలో వలస జీవులు, కార్మికులు.. ఉపాధి కోసం, కొత్త జీవితం కోసం ఎన్నెన్నో కలలతో ఆరోజు అమెరికా పయనమయ్యారు.

సరిగ్గా 113 ఏళ్ల క్రితం.. ఇంగ్లాండ్ లోని నార్త్ సౌతాంప్టన్ నుంచి బయలుదేరింది టైటానిక్ షిప్. అమెరికాలోని న్యూయార్క్ నగరానికి వెళ్లడానికి ముస్తాబైంది. ఆకాశమంతా పందిరి వేసిన చందంగా కనిపిస్తూ.. అట్లాంటిక్ మహా సముద్రంపై బయలుదేరిన నౌక.. 3 రోజుల్లోనే ప్రమాదానికి గురై సముద్ర గర్భంలో కలిసిపోయి ప్రపంచాన్ని పెను విషాదంలో ముంచెత్తింది
మరి ప్రమాదానికి కారణమేంది..?
ప్రపంచ చరిత్రలో అత్యంత విషాదకరమైన నౌకా ప్రమాదాన్ని కాలం ముందే నిర్ణయించింది. అదే డెస్టినీ. మృత్యువు బలంగా గుంజుకెళ్లితే ఎవరు మాత్రం ఆపగలరు..? ఆ బలమైన కారణం, భయంకరమైన నిర్ణయం టైటానిక్ ప్రయాణానికి ఒక్కరోజు ముందే జరిగింది.
1912, ఏప్రిల్ 9వ తేదీ… అది ఐర్లాండ్ లోని బెల్ ఫాస్ట్ పోర్ట్. ప్రపంచంలోనే అతి పెద్ద నౌకైన టైటానిక్ ప్రయాణానికి ముందు పర్యవేక్షకులు నిశితంగా ఎప్పటిలానే అన్నీ పరిశీలించామనుకున్నారు. నౌక నిర్మాణం నుంచి అప్పటివరకూ అన్నీ తానై చూశాడు డేవిడ్ బ్లేర్ అనే ఓ కీలక అధికారి. ఆ తర్వాత ప్రయాణం కాబోతున్న టైటానిక్ జర్నీలో కూడా తానే ఉంటాననుకున్నాడు. కానీ, విధి వక్రిస్తున్న సమయంలో ఎవరెన్ననుకుంటే మాత్రం ఏం లాభం..? ఆరోజే ఆయన జీవితంలో నౌక నుంచి నిష్క్రమించాల్సి రావడంతో పాటు.. టైటానిక్ మునకకు బీజం పడింది. కానీ, ఆ అనూహ్య పరిణామాన్ని ఆయనతోపాటు, ఎవ్వరూ ఊహించలేకపోయారు. పై అధికారి ఆ రోజు ఉదయాన్నే డేవిడ్ బ్లేర్ చేతిలో ఓ కాగితం పెట్టాడు. ఆ లేఖతో అంతా కిందిమీదైపోయింది.
బ్లేర్ మీ స్థానంలో చార్లెస్ లైటోలర్ డ్యూటీలోకొస్తారు. మీ సేవలకు ధన్యవాదాలు. ఇక మీకు సెలవు అన్నది ఆ లేఖ సారాంశం.
ప్రమాదానికీ.. తాళంచెవికీ ఏంటీ సంబంధం..?
అది పైనుంచి ఆదేశం. కాబట్టి బ్లేర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. దాంతో బ్లేర్ ఇక ఓడపైకి వెళ్లే అధికారాన్నీ కోల్పోయాడు. ఒకింత బాధలోనే వెళ్లిపోతున్న బ్లేర్ జేబులో ఓ తాళంచెవిని తన తర్వాత వచ్చేవారికివ్వకుండానే వెళ్లిపోయాడు. అది బ్లేర్ కావాలనేం చేయలేదు. కానీ, అన్యమనస్కంగా వెళ్లిపోతున్న బ్లేర్ ఆ తాళంచెవిని అప్పజెప్పాల్సిన విషయాన్ని మర్చిపోయాడు.

అంతే! అదే టైటానిక్ మునకకు ప్రధాన కారణాల్లో ఒకటిగా ఆ తర్వాత గుర్తించబడింది. షిప్ నడిపే క్రమంలో రాత్రీ, పగళ్లు సముద్రంలో ఏమున్నాయో క్షుణ్నంగా దూరం నుంచే పరిశీలించే బైనాక్యూలర్స్ లాకర్ కు ఉండే తాళంచెవి అది. అందుకే, అది అంత కీలకంగా మారింది.
కానీ, దాన్ని పట్టించుకోలేదో, లేక మర్చిపోయారో, ఆ ప్రాధాన్యతను గుర్తించలేదో, లేక గ్రహించలేకపోయారో… ఆ క్షణంలో నౌక బయల్దేరింది. పర్యవసానం బ్లేర్ జేబులోనే మర్చిపోయిన తాళంచెవి… 15 వందల మంది ప్రాణాలను బలిగొన్న ఓ చీకటి అధ్యాయాన్ని మిగిల్చింది.
ఆ తర్వాత ఏం జరిగింది?
ప్రమాదానికి తాళంచెవి కారణం ఎలా అయింది?
అది తెలుసుకోవాలంటే… 1912 ఏప్రిల్ 10వ తేదీన లుక్‌ఔట్ టవర్ కు సంబంధించిన విషయాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది.
అసలు లుక్ఔట్ టవర్ అంటే ఏమిటి..?
నౌకలో ఎత్తైన ప్రదేశం నుంచి సముద్రాన్ని పరిశీలించే ప్రదేశమే లుకౌట్ టవర్. అక్కడి నుంచే సముద్రాన్ని ప్రతిక్షణం గమనిస్తూ కమాండర్ ద్వారా కెప్టెన్ కు వాతావరణ సమాచారం, ఆటుపోట్లకు గురయ్యే సముద్ర తీరు అందించడం లుకౌట్ గాడ్స్ పని. ఫ్రెడరిక్ ఫ్లీట్ తో పాటు, రీగనల్ లీ ఆ లుక్ఔట్ బాధ్యత నిర్వర్తిస్తున్నారు.
సముద్రాన్ని పరిశీలిస్తున్నప్పుడు.. పొగ మంచు కనబడింది. చూడటం కష్టమైపోతోంది. స్పష్టత కోసం బైనాక్యులర్స్ ఎక్కడ అని అడిగాడు ఫ్రెడరిక్.
బైనాకూలర్స్ ఎక్కడివి సార్? లాకర్ ఉంది కానీ.. తాళంచెవి లేదు… కనపడడం లేదన్నాడు లీ. ఇద్దరూ కలిసి టవర్ అంతా వెతికారు. కానీ, తాళంచెవి జాడ మాత్రం కనపడలేదు.
వెంటనే నేవీ కమాండర్ కు సమాచారం అందించారు. తాళంచెవి లేదు.. బైనాక్యులర్స్ లేకపోవడంతో చూడడం కష్టమవుతుందనే సమాచారమిచ్చారు. నౌకలో ఏ అధికారం అయినా కెప్టెన్ కే ఉంటుంది. బైనాక్యులర్ లాకర్ ను పగులగొట్టాలంటే కెప్టెన్ పర్మిషన్ కావాలి. రెండో రోజు షిప్ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. బైనాక్యులర్స్ లేకుండానే సముద్రాన్ని అంచనా వేస్తూ చాలా కష్టంగా పరిశీలిస్తున్నారు లుక్ఔట్ గాడ్స్.
ఫ్లీట్, లీ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు. బైనాక్యులర్స్ ఎలా అంటే ఎలా అనే చర్చ వారిద్దరి మధ్యా నడుస్తుందే తప్ప… వారికి పైనుంచి ఆదేశాలేమీ అందడం లేదు. పైగా నేవీ కమాండర్ సముద్రమంతా ప్రశాంతంగా ఉందనే చెబుతున్నాడు. కానీ, వారిద్దరికీ మాత్రం ఏదో తేడా కొడుతోంది.
ఫ్లీట్, లీ డ్యూటీలో ఉన్నారు. అప్పటికే నాలుగు రోజులు గడిచిపోయాయి. బైనాక్యులర్స్ ఇంకా అందలేదు. అధికారులెవ్వరూ సీరియస్ గా కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదు.

అప్పుడే రేడియో గదిలోని మర్సీ ఆపరేటర్ జాక్ ఫిలిప్స్ కు ఓ మెసేజ్ అందింది.
“Ice warning – multiple bergs sighted ahead. Proceed with caution.”
అంటే… మంచుకొండ ముందుంది జాగ్రత్త అనే హెచ్చరిక దాని సారాంశం.
ఆ మేసేజ్‌ను షిప్ లాగ్ బుక్‌లో నమోదు చేశారు. కానీ, అప్పటికీ కూడా కెప్టెన్ స్మిత్‌కు అది పూర్తిగా ప్రమాద సంకేతంగా కనినిపించడంలేదు. నిర్మలమైన ఆకాశం, స్థిరమైన సముద్రం… ఊహించని విధంగా అన్ని సానుకూలంగా ఉన్నాయి కదా అనుకున్నారాయన. నేను టైటానిక్‌ను ముందుండి నడుపుతున్నాను… ఏమీ జరగదంటూ కెప్టెన్ స్మిత్ తన బృందంతో విశ్వాసంగా చెబుతున్నాడే తప్ప.. కింది స్థాయి సిబ్బంది హెచ్చరికలను మాత్రం ఖాతరు చేయడం లేదు.
1912, ఏప్రిల్ 14.. రాత్రి సరిగ్గా 11 గంటల 39 నిమిషాలకు అట్లాంటిక్ మహాసముద్రంపై… చంద్రుడు కూడా లేని ఆ రాత్రి టైటానిక్ ముందుకు సాగుతోంది. దూరంలో కనిపించే మంచుకొండ మాత్రం ఎవరికీ స్పష్టంగా కనపడలేదు.
లుక్‌ఔట్ టవర్ నుంచి ఫ్రెడెరిక్ ఫ్లీట్ టెలిస్కోప్‌తో చూస్తున్నాడు. అతని చూపు ఓ తెల్లటి ఆకారంపై ఆగింది.
రీఫ్‌లా.. అంటే ఓ పగడపు దిబ్బలా ఏదో కనిపిస్తూ ఉంది.. కానీ కదలడం లేదు.. భయంతో బిగ్గరగా అరిచాడు ఫ్లీట్.
ICEBERG RIGHT AHEAD!” — ఫ్లీట్ గొంతు చించుకుంటూ మళ్ళీ మళ్లీ హెచ్చరిస్తూనే ఉన్నాడు.
వార్నింగ్ సైరన్ బెల్ మోగించారు. ఫోన్ ద్వారా వెంటనే కెప్టెన్ కు సమాచారం అందింది.
టైటానిక్ ప్రధాన అధికారి విలియం మర్డోచ్ హెచ్చరిక విన్న వెంటనే…
“HARD A-STARBOARD!”
“ENGINES FULL ASTERN!” అంటూ ఆదేశాలిచ్చాడు.
ఓడ దిశను మార్చే భారీ ప్రయత్నం జరిగింది. కానీ, అప్పటికే ఐస్‌బర్గ్ సమీపానికి టైటానిక్ వచ్చేసింది. నిమిషంలోపే భారీ శబ్దంతో మంచుకొండను ఢీ కొట్టింది టైటానిక్.
ఐస్‌బర్గ్ ను ఢీకొట్టిన నౌక కుడి వైపు భారీ కుదుపుతో స్టార్ బోర్డ్ హుల్ పై మెటల్ పేలినట్టుగా ముక్కలు చెల్లాచెదురై పడ్డాయి.
అత్యంత ముఖ్యమైన ఇంజనీరింగ్ చాంబర్లల్లోకి నీరు చేరింది. టైటానిక్ నడిపే 5 వాటర్ టైట్ కంపార్ట్మెంట్లలోకీ అప్పటికే నీరు ప్రవేశించింది.
షిప్ డిజైనర్ థామస్ ఆండ్రూస్.. కెప్టెన్ స్మిత్ పిలవటంతో ఆయన దగ్గరకు పరిగెత్తాడు. ఏంటీ పరిస్థితంటూ గంభీరంగా చూశాడు. అర్థం చేసుకున్న షిప్ డిజైనర్ భారమైన కళ్ళతో కెప్టెన్‌కు ఓ అంచనా చెప్పాడు… 3 నుండి 4 గంటల్లో టైటానిక్ మునుగుతుంది సార్ అన్నాడు.
ఒక అపారమైన నమ్మకాన్ని కోల్పోయిన క్షణమది!
అర్ధరాత్రి పెరుగుతున్న కొద్దీ ఓడ కింద నీటి ప్రవాహం తీవ్రమవుతోంది. బోటు మునుగుతోంది, ఒక్క సెకండ్ ఆలస్యం చేసినా ప్రయాణికుల ప్రాణాలపై ప్రభావం తీవ్రంగా ఉంటుందని కెప్టెన్ స్మిత్‌కు, థామస్ ఆండ్రూస్ దగ్గర నుంచి ఖచ్చితమైన సమాచారం అందింది.
లైఫ్ బోట్లతో ప్రాణాలు కాపాడాలని ఆదేశాలందుతున్నాయి. కానీ చూస్తే టైటానిక్‌లో lifeboats 20 మాత్రమే ఉన్నాయి. అవి 1178 మందికి మాత్రమే సరిపోతాయి.
కానీ ఓడలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి సుమారు 2200 మంది ఉన్నారు.
బాధాకరం ఏమిటంటే కనీసం మూడవ తరగతి శ్రేణి వారికి సరిగా సమాచారం కూడా ఇంకా అప్పటికి అందలేదు. సమాచారమందడంలోనూ వారిని మూడోశ్రేణిగానే చేసిన మరో కోణమూ ఆ ఫిప్ లోనూ ఆ సమయంలో ఆవిష్కృతమైంది. మరోవైపు, షిప్ లో ఓ అల్లకల్లోలమైన వాతావరణం కనిపిస్తోంది. హాహాకారాలు మిన్నంటుతున్నాయి. కానీ, ఆ చీకటి రాత్రి… వారందరికీ కాళరాత్రి కాకుండా ఆపే నాథుడెవరు..?
ఆ సమయంలో ఆందోళనతో అధికారులు తీసుకున్న నిర్ణయాలూ బెడిసికొడుతున్నాయి. ఓడకింద ఉండే వాళ్లను కనీసం మెట్లపైకి అనుమతించలేదు. అరుస్తూ కార్మికులు గేట్లను బద్దలు కొడితే దారి తెరుచుకున్నప్పుడు… అప్పటికే ఓడ పైభాగాలు నీటిలో మునిగిపోయాయి.
తెల్లవారుజాము 2 గంటల 20 నిమిషాల సమయం… చుట్టూ సంద్రం.. చిమ్మచీకటి… ఆర్తనాదాలు.. ప్రాణం కోసం తపించే అరుపుల మధ్య ప్రపంచ భారీ నౌక.. దుర్భేధ్యంగా నిర్మించిన షిప్.. మధ్య సముద్రంలో జల సమాధి అయింది.
కార్పేథియా అనే ఓడ దూరంలో వచ్చి ఆగింది. సురక్షితంగా ఉన్నవారిని లైఫ్‌బోట్లలో తీసుకెళ్ళడానికి చూస్తున్నాడు లుక్ఔట్ ఫ్రెడరిక్ ఫ్లీట్. అతడి ముఖంలో ఓ వర్ణించలేని బాధ… బైనాక్యులర్స్ ఉంటే మంచు కొండను ముందే చూసేవాడిని కదా, ఓడ గమనాన్ని మార్చేవారం కదానన్న ఆవేదన.. పై అధికారులపై అసహనం, ఆగ్రహం అన్నీ ఆ చీకటిలాగే అస్పష్టంగా ఫ్లీట్ ముఖంలో వ్యక్తమవుతున్న సమయమది.
తాళంచెవి కథ ఎలా వెలుగులోకి వచ్చింది.. ?
ప్రపంచ జల విషాదంపై బ్రిటిష్ పార్లమెంట్ విచారణకు ఆదేశించింది. 1912 ఏప్రిల్ 22న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లార్డ్ మెర్సీ నేతృత్వంలో నాలుగు నెలల పాటు విచారించింది. లండన్ లోని స్కాటిష్ డ్రిల్ లో జరిగిన విచారణలో సుమారు 100 మంది ప్రత్యక్ష సాక్షుల నుండి ప్రమాదానికి అనేక రకాల కారణాలను సేకరించారు.
పార్లమెంట్ విచారణలో లుక్ఔట్ ఎంప్లాయ్ ఫ్రెడరిక్ ఫ్లీట్ కన్నీళ్ళతో చెప్పిన వాంగ్మూలం అందులో ప్రాధాన్యత సంతరించుకుంది.
అదేంటంటే..?
“బైనాక్యులర్ ఉంటే తాము మంచు కొండను ముందే గమనించేవాళ్లం. ఆరోజు చంద్రుడు కనిపించని చీకటి రాాత్రి. కనీసం గాలి కూడా పెద్దగా వీయకపోవడం, అలలు బలంగా లేకపోవడంతో.. దూరంగా కనిపిస్తోంది ఓ నల్లని మబ్బులాంటి ఏదో అస్పష్టమైన పదార్థమని మాత్రం అర్థమవుతోంది. ఒకవేళ కాస్త చంద్రుడి వెన్నెల ఉండి, కాస్త గాలిగనుక వీచి ఉంటే.. ఆ మంచుకొండ తాలుకూ చల్లని గాలులతో పాటు, నీటితెమ్మెరలు కూడా మమ్మల్ని తాకుండేవి. దాంతో అక్కడ మంచుకొండ ఉన్నదనే విషయాన్ని ముందే పసిగట్టేవాళ్లం. కానీ, ఆకాశం, సంద్రం కలిసి ఉన్నట్టు కనిపిస్తున్న చోట అదేదో నల్లని మబ్బనుకున్నాం. కానీ రాను రాను దగ్గరకు వెళ్లాకగానీ.. అది మంచుకొండ అనే విషయం స్పష్టమైంది. అది ముందే తెలిసుంటే ఆ ప్రమాదాన్ని తప్పించే అవకాశం ఉండేది.
అందుకు బైనాక్యూలర్స్ లేకపోవడమే ప్రధాన కారణమైంది. బైనాక్యూలర్స్ ఉన్న లాకర్ కీ లేదని మేం పై అధికారులకు విన్నవించాం. ఆ లాకర్ పగులగొట్టినా ప్రమాదం తప్పేది. కానీ, పై అధికారులు అందుకు సహకరించలేదు. నిబంధనలే కొంపముంచాయి. అదే టైటానిక్ విషాద చరిత్రకు కారణమయ్యాయన్నాడు ఫ్రెడరిక్.
చివరకు ఫ్లీట్ ఆత్మహత్య వరకు..?
ఓడ మునిగిన శబ్దం… ఫ్లీట్ ను జీవితాంతం వెంటాడింది. ఆ బాధను మోస్తూ చివరకు 1965లో ఫ్లీట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రమాదానికి కారణం అతను కాకపోయినా… తుది గడియల్లో అందరి ప్రాణాలు పోతుంటే.. వారి ఆర్తనాదాలు వింటూ ఏమీ చేయలేని నిస్సహాయత తనను వెంటాడింది. వేటాడింది. ఆ మానసిక స్థితి నుంచి తనకు తాను బయటపడాలంటే ఇక మరణమే శరణమనుకున్న ఫ్లీట్ బలవన్మరణానికి ఒడికట్టాడు.
తాళంచెవి ఉండుంటే… ?
టైటానిక్ చరిత్ర ఇంకోలా ఉండేదేమో!



