అణుబాంబు విషాదాన్ని గుర్తు చేస్తూనే.. శాంతిని కాంక్షించే స్మారక చిహ్నమది!

హిరోషిమా, నాగసాకి అణుబాంబు ఘటన ఈ యావత్ ప్రపంచమెప్పుడూ మర్చిపోలేనిది. అలాంటి హిరోషిమా బాంబుదాడికి ఇప్పుడు సరిగ్గా 80 ఏళ్లు. ఈ సందర్భంగా జపాన్ లో కనిపించే ఓ స్టాచ్యూ నాటి చేదు జ్ఞాపకాల్ని ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది.

అమ్మా నేనింకా బతుకుతానా అన్నది ఆ చిన్నారి ఆవేదన. కానీ, అలా అడుగుతున్న బిడ్డకు ఏం చెప్పాలో తెలియక.. లోలోపలే కుమిలిపోతున్న ఆ తల్లిది ఎవరికి చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతుందో తెలియని ఆక్రందన. ఆట, పాటల్లో, చదువుల్లో హుషారైన ఆ సడాకోది జపాన్. ఆమెను చూపించని డాక్టర్ లేడు, తిప్పని ఆసుపత్రి లేదు. కానీ, అప్పటికే ఆ అమ్మాయికి లుకేమియా.. అంటే క్యాన్సర్ నిర్ధారణైంది. బాంబు పడినంత విషయం తెలిసిన ఆ చిట్టి తల్లి.. తనకు ఆ వ్యాధికి కారణమేంటని తల్లినడిగితే.. ఆపుకోలేని దుఖంతో హిరోషిమా అణుబాంబని చెప్పక తప్పని పరిస్థితి ఆ తల్లిది.

1945, ఆగస్ట్ 6 జపాన్ కు ఓ దుర్దినం. రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో యునైటెడ్ స్టేట్స్.. లిటిల్ బాయ్ పేరుతో హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు ఘటన ఆ దేశానికి ఎప్పటికీ ఓ మానని గాయం. ఆ తర్వాత నాగసాకిలోనూ అలాంటి దాడి తర్వాతే జపాన్ లొంగుబాటు జరిగి.. యుద్ధం ముగింపుకొచ్చింది.

అలాంటి పెను విషాద ఘట్టంలో.. వ్యక్తిగత విషాదాలూ జపాన్ నే కాదు.. యావత్ ప్రపంచాన్నీ కదిలించాయి. అలాంటి కథే మనం చెప్పుకుంటున్న సడాకో ససాకి కథ. ఎందుకంటే, ఆమె ఇప్పుడు హిరోషిమాలో ఓ స్మారక చిహ్నం.

హిరోషిమాపై అణుబాంబు ప్రయోగం జరిగినప్పుడు సరిగ్గా ఓ మైలు దూరంలోనే నివాసముండేది సడాకో కుటుంబం. అప్పుడామె వయస్సు రెండేళ్లు. ఎలాగోలా సడాకో కుటుంబం ఆ విషాద మారణహోమం నుంచి బతికి బట్ట కట్టి బయటపడగల్గింది. కానీ, సరిగ్గా దశాబ్దం తర్వాత చిన్నారి సడాకోకు 12 ఏళ్లు వచ్చాయి. దాంతో పాటే లుకేమియా జబ్బున్నట్టు నిర్ధారణైంది. అందుకు కారణం హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు వల్ల ఏర్పడ్డ రేడియో ధార్మికత. అదే ఆమెకు క్యాన్సర్ కు దారితీసింది.

క్యాన్సర్ సోకిన సడాకోకు ఇంకెన్నాళ్లు తాను బతుకుతానో తెలియదుగానీ.. ఆసుపత్రి బెడ్ పైనే ఎన్నో ప్రశ్నలుద్భవించేవి. అమ్మా ఎందుకు అణుబాంబు వేశారు..? ఇంత నష్టమెందుకు చేశారు…? ఇదిగో ఇలాంటి సందేహాలతో సడాకో తల్లి ఉక్కిరిబిక్కిరైంది. దేశాల మధ్య వైరాలు, యుద్ధాల్లో మనలాంటి సామాన్యులెలా బలవుతారో చెప్పింది తల్లి. అందుకు మరి ఇదంతా ఉండొద్దంటే.. శాంతి నెలకొనాలంటే ఏం చేయాలనడిగింది ఆ చిన్నారి. అందుకు ఏం చెప్పాలో తెలియక.. కాగితాలతో కొంగ బొమ్మలు చేసి ఆ దేవుణ్ని ప్రార్థించు తల్లి అని ఆ తల్లి చెప్పింది.

అదిగో ఆ బెడ్ పైనే సడాకో ససాకీ తనకు చేతనైనన్ని కాగితాల కొంగ బొమ్మలు తయారుచేస్తూనే ఉంది. అలా 1300 పైచిలుకు బొమ్మలు తయారుచేసింది. అదంతా ప్రపంచశాంతి నెలకొనాలన్న ఆ చిన్నారి ఆకాంక్ష. అయితే, 12 ఏళ్లకే సడాకో మరణించింది. కానీ, ఆమె ఆశయం ఇంకా సజీవంగా ఉండాలన్న తలంపుతో ఆమెకు హిరోషిమాలో ఏకంగా ఓ స్మారక చిహ్నాన్నే ఏర్పాటు చేశారు.

1958లో ఏర్పాటు చేసిన్నాట్నుంచి.. హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్ లోని సడాకో విగ్రహాన్ని ఇప్పటికే లక్షలాది మంది సందర్శించారు. ఆమె బొమ్మపై ఓ కాగితపు క్రేన్ మోస్తున్నట్టుగా ఆ రూపాన్ని మల్చారు. ప్రపంచశాంతి వర్ధిల్లాలని ఇవే మా అరుపులు, ప్రార్థనలన్న సందేశంతో కింద ఓ శిలాఫలకం కూడా కనిపిస్తుంది.

ఆగస్ట్ 6న హిరోషిమా ఘటనకు 80 ఏళ్లవుతున్న సందర్భంగా ఓసారి సడాకో ససామి యాది!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles