మొఘలుల చరిత్ర.. అనార్కలీ కుర్తా ప్రత్యేకత!
మొఘలుల రాచరిక వారసత్వం అంతమై ఉండొచ్చునేమో… కానీ, వారి గత చరిత్రకు సాక్షీభూతంగా నిల్చే తాజ్ మహల్, ఏక్ మినార్, ఎర్రకోట, ఫతేపూర్ సిక్రీ, హ్యూమాయున్స్ టూంబ్స్, షాలిమార్ గార్డెన్స్, ఆగ్రా ఫోర్ట్… ఇలా ఎన్నో వారి కాలాన్ని కళ్లకు కడుతూనే ఉంటాయి. అయితే, కేవలం రాజప్రసాదాలుగా వెలుగొందుతున్న కట్టడాలే కాదు… ఆ చరిత్రలో సలీం-అనార్కలీ పాత్రలెంత అపురూపమో… అనార్కలీ కుర్తా కూడా అంతే ప్రత్యేకం. ఇవ్వాల్టికీ అనార్కలీ కుర్తాకెందుకంత ప్రాధాన్యత మరి..?

ఆ కుర్తాలో అనార్కలీ గాంభీర్యం.. హుందాతనమే… సలీంను అనార్కలీ వైపు ఆకర్షించే విషయాల్లో ఓ ముఖ్యమైన అంశమంటుంటారు కొందరు చరిత్రకారులు. అందుకే అనార్కలీ కుర్తాకు ఇప్పటికీ క్రేజ్ కొనసాగుతూనే ఉంది. శతాబ్దాల తర్వాత కూడా అది కొత్త డిజైన్లతో కొంత నూతనత్వాన్ని సంపాదించుకుంటుందే తప్ప… దాని ఉనికి మాత్రం ఇంకా అలాగే కొనసాగుతోంది. మొఘల్ రాజవంశ సాంస్కృతిక వారసత్వానికి, కళానైపుణ్యానికి చిహ్నంగా ఇప్పటికీ అనార్కలీ కుర్తా అంటే గంతులేసే యువతులెందరో.
అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో నాట్యగత్తెగా ఉన్న అనార్కలిని.. దానిమ్మ తోటలో నాట్యమాడుతుంటే చూసిన అక్బర్ కుమారుడు సలీం మోహంలో పడతాడు. అనార్ తోటలో నాట్యమాడుతున్న ఆమె పేరు ఆ తర్వాత అనార్కలీగా మారడమెంత నిజమో.. ఆమె వేసుకున్న కుర్తాలో కనిపించిన ఆకర్షణా సలీంను ఆమె మోహంలోకి దింపడమూ అంతే వాస్తవం. అందుకే మొఘలుల కాలంలో ఎప్పుడో అనార్కలి ధరించిన కుర్తా.. ఇప్పటికీ ఆమె పేరుతో ట్రెండింగ్ లో ఉండటం విశేషం.
అనార్కలీతో సలీం ప్రేమపై సైన్యాధిపతైన ఆయన మేనమామ మాన్ సింగ్ హెచ్చరిస్తాడు. అసలు సలీం అక్బర్ కొడుకన్న విషయం తెలియకుండానే అనార్కలీ కూడా సలీంను ప్రేమిస్తుంది. అక్బర్ కూడా అనార్కలీతో కొడుకు సలీం ప్రేమను అంగీకరించడు. ఏకంగా తండ్రీకొడుకులైన అక్బర్, సలీం మధ్యే యుద్ధం జరిగుతుంది. ఆ యుద్ధంలో సలీం ఓడిపోతాడు. ఆ తర్వాత సలీంను కాపాడేందుకు తన ప్రాణాలను త్యాగం చేసిన అనార్కలీని సలీం కళ్లముందే అక్బర్ చక్రవర్తి సజీవ సమాధి చేస్తాడు. అనంతరం మరణశిక్ష పడ్డ తన కుమారుడు సలీంను అక్బర్ వదిలేస్తాడు. ఈ ప్రేమకథ ఎంత అజరామరమో.. చాలామందికి ఇంతకుముందే తెలిసిందే. కే. ఆసిఫ్ వంటి దర్శకుల చేతిలో నిర్మితమైన మొఘల్ ఈ ఆజమ్ వంటి సినిమాల్లో చూసిందే.
అయితే, సలీం-అనార్కలీ ప్రేమకథకు ఎంత కథ ఉందో.. అనార్కలీ వేసుకున్న కుర్తాకు కూడా అంతే కథ ఉండటం.. ఆ కుర్తా ఇప్పటికీ పాప్యులర్ డ్రెస్ గా మగువల మనసులు దోచేంత ట్రెండ్ క్రియేట్ చేయడం విశేషం.
సిల్క్, షిఫాన్, బ్రోకేడ్ కలంకారీ వంటి విలాసవంతమైన గార్మెంట్స్ కాంబినేషన్ లో డిజైన్ చేసిన అనార్కలీ కుర్తాలో కనిపించే ఎంబ్రాయిడరీ వర్క్, మైన్యూట్ గా తీర్చిదిద్దిన అలంకరణలు… మగువ శృంగారాన్ని పట్టిచూపేలా నేసిన నేతలతో… అనార్కలీ కుర్తా అంటే ఓ స్పెషల్. అందుకే, నాటి మొఘల్ చక్రవర్తులందరినీ అంతగా ఆకట్టుకునేదట. అలాంటి కుర్తా కోసం.. ఆ తర్వాత డిమాండ్ బాగా ఏర్పడి.. మొఘలుల రాజస్థానాల్లోని రాణులు, ఇతర మహిళలు కూడా ఆ వస్త్రాలను ధరించేందుకే మక్కువ చూపేవారట.
అయితే, అప్పటివరకూ క్రేజ్ సంపాదించుకున్న అనార్కలీ కుర్తాకు.. షాజహాన్ చక్రవర్తి కాలంలో జ్యుయెల్లరీ, రాజభవనాల నిర్మాణం, గార్డెన్స్ ఏర్పాటు వంటివాటితో కొంత ఆదరణ తగ్గినట్టనిపించినా… ఆ తర్వాత కాలంలో అనార్కలీ కుర్తా తన రాజదర్పాన్ని కొనసాగిస్తూనే.. తన క్రేజ్ ను నిలుపుకుంది. శతాబ్దాలుగా మొఘలుల రాజవంశ ప్రభావానికి గురైన భారతదేశంలో.. ఇప్పుడు వారి రాచరిక వారసత్వం కనిపించకపోయినా… అక్బర్ ఆస్థానంలోని అనార్కలీ ధరించిన నాటి కుర్తా మాత్రం ఇంకా వారి సాంస్కృతిక వారసత్వ చిహ్నంగా ప్రజాదరణను కల్గి ఉండటం మాత్రం విశేషమే.
పండుగలు, వేడుకలు, రోజూవారీ దుస్తులేవైనా.. అనార్కలీ కుర్తాలు సంపన్న కుటుంబాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. మొత్తంగా నాటి కాలపు ప్రతిష్ఠను మూటగట్టుకున్న అనార్కలీ కుర్తా… రాజులు, రాజ్యాలు అంతరించిపోయినా.. తన ప్రత్యేకతను నిలుపుకుంది. మొఘలుల కాలంలోని హస్తకళకు, కళానైపుణ్యానికి నిలువెత్తు రూపమై.. ఓ నేతవస్త్రంగా ఎందరో మగువల మనసులను ఇప్పటికీ దోస్తూనే ఉంది.



