ఏ అకేషనైనా… ఏ ఘటనైనా.. ఏ ఉదంతమైనా… ఎవరో కొందరే హీరోలుగా గుర్తించబడుతారు. సేమ్ టూ సేమ్ మన ఇండియన్ సినిమాల్లో హీరోలకు మాత్రమే దక్కే పేరులాగా! కానీ అందులో కొన్ని క్యారెక్టర్లు లేకపోతే… సినిమానే నడవనట్టు… కొన్ని పాత్రలే సినిమాకు ఆయువుపట్టైనట్టు.. కొందరు అన్ సంగ్ హీరోల పేర్లు గుర్తుకులేకపోయినా… వారి క్రియేషన్సే వారికి గుర్తింపునిస్తుంటాయి. అలాంటి అన్ సంగ్ హీరోనే కెప్టెన్ రామ్ సింగ్ ఠాకూర్.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియన్ ఆర్మీని నడిపించిన ఓ పాట సృష్టికర్త రామ్ సింగ్ అని ఎందరికి తెలుసు..? స్వాతంత్ర్యపోరాటమంటే గాంధీ, నెహ్రూ, పటేల్, తిలక్, గోఖలే, ఠాగూర్ అలాంటి ఏవో కొందరి పేర్లు తప్ప.. చాలామంది అన్ సంగ్ హీరోస్ కు అంతగా గుర్తింపు దక్కలేదు. అలాంటి కోవలోకి చెందిన వ్యక్తే రామ్ సింగ్. ఇప్పటికీ దేశభక్తి గీతాలు వినిపించే చోట… ప్రముఖంగా వినిపించే పాట కదమ్ కదమ్ బదాయే జా సృష్టికర్తే రామ్ సింగ్.
స్వాతంత్ర్య పోరాట సమయాన ఓవైపు యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ… వందకోట్ల మంది జనాన్ని కదిలించేందుకు రామ్ సింగ్ ట్యూన్ చేసిన పాట కదమ్ కదమ్ బదాయే జా. అయితే రామ్ సింగ్ ఆ పాట సృష్టికర్త అని తెలియకపోయినా… ఆయన్నెవ్వరూ వ్యక్తిగతంగా గుర్తు చేసుకోకపోయినా… పాటరూపంలో మాత్రం రామ్ సింగ్ అందరి హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించాడు. 1927లో ధర్మశాల కంటోన్మెంట్ లో ఆర్మీలో జాయినయ్యాడు రామ్ సింగ్. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సింగపూర్ కు వెళ్లిన రామ్ సింగ్.. అక్కడ యుద్ధఖైదీగా బంధీ అయ్యాడు. కానీ తాను బంధీగా జైలులో ఉన్న కాలంలోనూ… తన పాటలతో అక్కడ ఆకట్టుకుని.. ఆ కటకటాల్లో ఇతర బంధీలను పెట్టే హింసల నుంచి తప్పించుకున్నాడు.
ఆతర్వాత జైలు నుంచి విడుదలైన రామ్ సింగ్ ను సుభాష్ చంద్రబోస్ తన నేషనల్ ఆర్మీని ఉత్తేజితం చేసే బ్యాండ్ మాస్టర్ గా ఎంచుకున్నాడు. తన పాటలతో మరింత చైతన్యవంతం చేసి సహచర సైనికుల్లో దేశభక్తిని రగిలించాడు రామ్ సింగ్. రామ్ సింగ్ కదమ్ కదమ్ బదాయే జా పాటకు ముందు సుభాష్ బోస్ ఒకే ఒక్క మాట చెప్పాడట. అప్పటి బ్రిటీషర్స్ బిల్డింగ్స్ ఆ పాట శబ్దానికి… ఆ సౌండ్ నుంచి వచ్చే ఉత్తేజపు చైతన్యానికి రెండుముక్కలై… వారికి చుక్కలు కనిపించేలా ఉండాలని సూచించాడట. అనుకున్నట్టే కదమ్ కదమ్ బదాయే జా పాట సృష్టితో రామ్ సింగ్.. బోస్ కోరుకున్నట్టు ఆ ఆకాశపు అంచును అందుకున్నాడు. ఎందరిలోనూ జాతీయతాభావపు స్ఫూర్తిని రగిలించాడు. ఆ పాటను సుభాష్ బోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ గీతంగా పెట్టుకున్నారు. ఏకంగా ఒక్కసారి ఐఎన్ఏ సైనికులు 30 లక్షల మంది కలిసి పాడిన ఆ పాట ప్రతిధ్వని స్ఫూర్తి అంతా ఇంతా కాదన్నది చరిత్ర చెబుతున్న సత్యం. అందుకుగాను సుభాష్ బోస్.. రామ్ సింగ్ ను గోల్డ్ మెడల్ తో సత్కరించగా… జనరల్ లోకానంద్ దాన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అధికారులందరి ముందూ రామ్ సింగ్ మెడలో వేశాడు. ఆ తర్వాత తాను సృష్టించిన కదమ్ కదమ్ బదాయే జా పాటను… ఏకంగా ఢిల్లీలో మహాత్మగాంధీ సమక్షంలో పాడే అవకాశమూ రామ్ సింగ్ కు దక్కింది.
తన తాత నాథూ చంద్ స్ఫూర్తితో సంగీతం నేర్చుకోవాలన్న కాంక్ష కల్గిన రామ్ సింగ్… ప్రఖ్యాతిగాంచిన బ్రిటీష్ సంగీతకారులైన హడ్సన్, డ్యానిష్ బ్రాస్ బ్యాండ్ లో చేరి శిక్షణ పొందాడు. రామ్ సింగ్ రవీంద్రుడు రచించిన జనగణమన జాతీయగీతానికి వెనుక బీటింగ్ ఏవిధంగా ఉండాలో కంపోజ్ చేశారు. 1947లో అప్పటి ఉత్తరప్రదేశ్ సర్కారు రామ్ సింగ్ ఠాకూరీకి ఎమెరిటస్ మ్యూజిషియన్ అవార్డ్ ను కూడా ఇచ్చి సత్కరించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్ట్ 15, 1914లో హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలకు సమీపంలోని బాగ్సు కనియారా అనే గ్రామంలో జన్మించి… హృదయాంతరాళాల్లో దేశభక్తిని నింపుకుని… పాటల రూపంలో తన సృజనాత్మకతను జోడించి… ఎన్నో అవార్డులకు అర్హుడైన రామ్ సింగ్ ఠాకూరీకి ఆ అవార్డ్ కేవలం చంద్రుడికో నూలుపోగులాంటిదే.



