అవమానించాలనుకున్న ఒకే ఒక్క పదం… ఇప్పుడు పొల్టికల్ బ్రాండుగా ఎలా మారింది..?
అవును, ఇది కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమ ప్రయాణం!
ఒక సీజేఐ వ్యాఖ్యలు… వైరల్ పోస్టులు… ఆ తర్వాత సీజేపీగా పుట్టుకొచ్చిన పేరు… ఇప్పుడు ఢిల్లీని వణికిస్తోంది. రాజకీయ నిరసనలకు కేరాఫ్ గా మారింది. ప్రధాన ప్రతిపక్షాలు ఆలోచించేలోపే బుల్లెట్ దింపేస్తోంది.
కాక్రోచ్… బరిడె, జిర్ర పేరిట ఎవ్వరూ ఇష్టపడని ఓ పురుగు. ఆ పురుగులతో పోలుస్తూ యువతను తీసిపారేస్తే, అవమానిస్తే… రాజ్యాంగసంస్థలను నిలబెట్టి ఆదర్శంగా ఉండాల్సినవారే నోరు పారేసుకుంటే.. ఏం జరుగుతుందో ఇప్పుడు భారతమంతా చూస్తోంది. ఆ అవమానకర పదమే ఇప్పుడు కొత్త అర్థాన్ని వెతికే ప్రయత్నం చేస్తోంది. ప్రత్యామ్నాయ రాజకీయాలకు బాట వేసే కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతోంది. వ్యంగ్యంగా ఆరంభమైన ఒక సోషల్ మీడియా ప్రయోగం… కార్యరూపం దాల్చిన యువత ఉద్యమంగా మారింది. ఇప్పుడు ఎన్నికల వ్యవస్థపై పోరాటంతో రాజకీయ ఒత్తిడిని పెంచుతోంది.
ఈ కొత్త ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక 2025 మేలో పురుడుపోసుకున్న ఓ పసికందు. కానీ, ఆ పసికందు సీజేపీనే ఇప్పుడు చిచ్చరపిడుగైంది. ప్రధాన ప్రతిపక్షాలు, మేమే గ్లోబల్ లీడర్స్ అనుకున్న ప్రాంతీయ, జాతీయ స్థాయి నాయకులు సైతం నోళ్లు వెళ్లబెట్టేలా దూకుడు ప్రదర్శిస్తోంది.

సీజేఐ జారిన మాటకు వివరణ.. సీజేపీ అడుగు!
వ్యవస్థపై విమర్శలు చేసేవారిని ఉద్ధేశించి.. నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకుని ఉన్నతస్థానాల్లో ఉన్నవారి నుంచి కాక్రోచ్, పారాసైట్ వంటి పదాలు జారితే.. వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడు దేశం చూస్తోంది. ఒక సీజేఐ నుంచి వెలువడ్డ మాటలకు ఒక కౌంటర్ అటాక్ గా ఓ ప్రశ్న ఉద్భవించింది. వాట్ ఇఫ్ ఐ ఆల్ ది కాక్రోచెస్ కమ్ టుగెదర్ అంటూ బోస్టన్ నుంచి అభిజీత్ దీప్కే సోషల్ మీడియాలో వేసిన ఆ ప్రశ్నే… ఆ తర్వాత సీజేపీగా ఉద్భవించి… గతంలో నీట్ పై, ఇప్పుడు ఎస్ఐఆర్ పై స్ట్రీట్ ఫైట్స్ తో దేశవ్యాప్త సంచలనమైంది.
సీజేపీని వ్యతిరేకించేవారూ ఉన్నారు. సమర్థించేవారూ ఉన్నారు. తటస్థంగా ఏం జరుగుతుందో చూద్దామనుకునేవారూ ఉన్నారు. ఎవరేమనుకుంటున్నారని సీజేపీ ఆగడం లేదు. ప్రజా సమస్యల పట్ల.. ఆ సమస్యల తీవ్రత పట్ల ఆలోచిస్తోంది. ఓ ముందడుగు వేస్తోంది. గతంలో కేసీఆర్ వంటివారు కూడా పలు సమావేశాల్లో చెప్పారు.. జీడీపి, రూపాయి విలువ పడిపోయింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతోంది, ఆకలి కేకలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ఇండెక్స్ లో భారత్ పరువు పోతోందంటూ… యువత స్పందించాల్సిన అవసరముందని చెప్పారు. ఇప్పుడు సీజేపీ నిరసనలు, ఉద్యమాలు చూస్తే కేసీఆర్ మాటలు నిజమవుతున్నాయా అనిపిస్తుంది.
సీజేపీలో గతంలో పార్టీల్లో పనిచేసిన కాకలు తీరిన నాయకుల బృందాలు లేవు. సంప్రదాయ పార్టీల వ్యూహాలూ లేవు. ఎన్నికల ఎజెండా లేదు. ఒక అవమానకర పదాన్ని భుజానికెత్తుకుని యువత సత్తా ఏంటో చూపిద్దామనుకున్న ఒక పట్టుదల ఉంది. ప్రత్యామ్నాయ రాజకీయాలవైపు పడుతున్న అడుగులు కనిపిస్తున్నాయి. డిజిటల్ ఎరాలో వ్యంగ్యాత్మకంగా నాయకుల ఫ్యూజులు కొట్టేసే చురుకుదనం కనిపిస్తోంది.
అవమానాన్ని ఆయుధంగా మార్చిన యువత!
ఎవర్నైనా తిడితే… ఫలానా తిట్లతో ఫలానా వాళ్లు నన్ను తిట్టారనో, మమ్మల్ని తిట్టారనో ఎవ్వరూ దాన్ని బహిరంగంగా చెప్పుకోరు. కానీ, కాక్రోచ్ అనే పదాన్ని దాచిపెట్టకుండా… దాన్నే ఆయుధంగా చేసుకుని… దాన్నే పార్టీ సింబల్ గా మార్చుకుని.. నిరసనల్లో కాక్రోచుల మాస్కులు ధరించి.. మొత్తంగా కాక్రోచ్ జనతాపార్టీ ఇప్పుడు దేశంలో ఓ ప్రభంజనమవుతోంది.
ఏ లేబుల్ ను అయితే అవమానించేందుకు వాడారో అదే లేబుల్ ను ధరించి దాని అర్థాన్నే మార్చేస్తున్న ప్రస్తుత సీజేపీ కథ ఆసక్తికరంగా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా నేటితరంలో కనిపించే రీక్లెయిమింగ్ యాన్ ఇన్సల్ట్.. అంటే నువ్వు అవమానించడానికి మమ్మల్ని ఏ మాటైతే అన్నావో.. అదే మాటను మేం మా గుర్తింపుగా మార్చుకుంటామనే కొత్త సామాజిక వ్యూహానికి దగ్గరగా ప్రస్తుత సీజేపీ ఆలోచనలు, అడుగులు కనిపిస్తున్నాయి.
సింబాలిక్ గానూ సీజేపీ ఎందుకు ప్రభావవంతమైంది..?
ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా బతకగల్గడం కాక్రోచ్ ప్రత్యేకత. అందుకే ఆ పురుగే నేటి యువతకు ఓ వ్యంగ్య ప్రతీకగా మారింది. మమ్మల్ని ఎంత తక్కువ చూసినా మేమింకా మిగిలే ఉంటామనే ఓ సందేశం కాక్రోచ్ జనతా పార్టీ ఆలోచనల్లో కనిపిస్తోంది. ఈ సింబాలిజమే ఇప్పుడు సీజేపీ ఆకర్షణలో కీలకమైంది.
పార్టీ కంటే ముందే బ్రాండును సొంతం చేసుకున్న సీజేపీ!
సంప్రదాయ రాజకీయ పార్టీలకు ముందు కావల్సింది ఓ బ్రాండ్. కానీ, సీజేపీకి అది దాని పుట్టుకతోనే వచ్చేసింది. ఎందుకంటే.. పేరు, లోగో గుర్తుండిపోయేలా ఉన్నాయి. మీమ్ గా మార్చుకునేలా ఉంది. వీడియోలను ఓపెన్ చేయించే బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. యువత భాషలో కనెక్టవుతోంది. పోస్టర్స్ తో ఒక్క మాటలో తమ ఎజెండా ఏంటో చెబుతోంది. సోషల్ మీడియా యుగంలో కావల్సిన కమ్యూనికేషన్స్ అన్నీ ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు సీజేపీ సొంతం.
ఒక ఆన్లైన్ వేదికగా ఆరంభమైనప్పటికీ… అనతికాలంలోనే నిరుద్యోగం, విద్య, అవినీతి, ప్రభుత్వ వ్యవస్థల నియంతృత్వ ధోరణులు, యువతలో ఉన్న అసంతృప్తి ఇలాంటివాటికెన్నింటికో ఇప్పుడు సీజేపీ నెక్స్ట్ ఆర్టర్నేట్ గా… ఆబ్సల్యూట్ ఆల్టర్నేట్ గా అవతరిస్తోందా అనే ఆలోచనను రేకెత్తిస్తోంది.
మీమ్స్ నుంచి మైదానం వరకు!
సోషల్ మీడియాలో మొదలైన కాక్రోచ్ ప్రచారం జూన్ లో జంతర్ మంతర్ కు చేరింది. పరీక్షా పత్రాల లీకులు, విద్యావ్యవస్థలో లోపాలు, నిరుద్యోగంపై వీధి పోరాటానికి దిగింది. పైగా సీజేపీ నిరసనల శైలి కూడా ఫక్తు రాజకీయ పార్టీల శైలికి భిన్నంగా సాగింది. ప్లకార్డుల్లో మీమ్స్, స్లోగన్స్ లో ఇంటర్నెట్ భాష, బాలీవుడ్ రిఫరెన్సెస్, సెటైరికల్ పోస్టర్స్, సోషల్ మీడియా వీడియోలతో ఆ భిన్నత్వాన్ని చూపింది సీజేపీ.
ఉదాహరణకు: మేక్ ఇన్ ఇండియా బదులు… లీక్ ఇన్ ఇండియా! అంటే కొత్త తరం రాజకీయ నిరసనల్లో మీమ్ కూడా ఓ రాజకీయ భాషగా ఎలా తయారవుతుందో ఇప్పుడు సీజేపీ నిరసనలతో సంప్రదాయ పార్టీలు నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఓ వ్యంగ్య వేదికగా సోషల్ మీడియాలో ఏర్పాటై… ఢిల్లీ జంతర్ మంతర్ లో పేపర్ లీకులపై ఉద్యమంచి… తన ఉద్యమ లక్ష్యమైన కేంద్ర విద్యాశాఖా మంత్రి రాజీనామాను సాధించింది సీజేపీ. అదే సీజేపీ ప్రస్థానంలో కీలక మలుపుగా మారింది. అంతర్జాతీయ మీడియా సీజేపీ ఉద్యమంలో కేంద్రమంత్రి రాజీనామా ఓ పెద్ద విజయంగా విశ్లేషించింది.
ఇక అక్కడి నుంచి కాక్రోచ్ ఓ మీమ్ కాదు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే యువతకు వేదికైంది.
ఇప్పుడు ఎన్నికల వ్యవస్థపై గురి!
అంతా చూసిందే. చూస్తున్నదే. మళ్లీ ఢిల్లీ వీధుల్లోకి కాక్రోచులు పోటెత్తాయి. ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు, సీఈసీ రాజీనామానే ఈసారి ప్రధాన లక్ష్యాలు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీని తక్కువగా భావించని కేంద్ర ప్రభుత్వం.. అందుకు తగ్గ భద్రతా ఏర్పాట్లు చేసుకుంది. ఉద్యమానికి ముందే సీజేపీ నాయకులైన దీప్కేతో సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే పరోక్షంగా ప్రభుత్వమే సీజేపీని పతాకశీర్షికల్లో నిలబెట్టే తప్పటడుగులేస్తోందన్నమాట. మరో విషయమేంటంటే… ప్రభుత్వ చర్యలతో కేవలం సోషల్ మీడియా వ్యంగ్య పోస్ట్ పెట్టిన అభిజిత్ దీప్కే.. ఇప్పుడు దేశంలో నిరసనలను సమర్థవంతంగా నడిపే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడం కూడా ప్రస్తుత పరిణామంలో గమనించదగ్గది.
గతకాలపు రాజకీయాల్లో గుర్తింపు కోసం చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ, సోషల్ మీడియా యుగంలో అది త్వరగానే లభిస్తోంది. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకుంటే సీజేపీ అనుకున్న లక్ష్యాల వైపు అడుగులేయొచ్చు.
కానీ, అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది!
సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వేరు.. వీధుల్లో జనాన్ని సమీకరించడం వేరు. ప్రభుత్వంపై, వ్యవస్థలపై ఒత్తిడి తేవడం వేరు.. సుస్థిరమైన ఉద్యమాలను, రాజకీయాలను నడపడం వేరు. అందుకు మరింత స్పష్టత, విభిన్న వర్గాలను కలుపుకోవడం ఇవన్నీ జరగాల్సి ఉంది. ఎనీ హౌ సీజేపీ ఓ అడుగైతే వేసింది. అదీ దేశమంతా తనవైపు కళ్లు తిప్పుకు చూసేలా!
మరి సీజేపీ ఇలా ఉద్యమపార్టీగా తన పోరుబాటను కొనసాగిస్తుందా… రాజకీయ పార్టీగా అవతరిస్తుందా… రాజకీయాల్లో అడుగులు కలిసొస్తాయా అన్నవి భవిష్యత్ చెప్పాలిక!


