సోషల్ మీడియా లేని కాలంలోనే తన పాటలతో ఉర్రూతలూగించిన ఓ గొంతు.. ఇప్పుడు బయోపిక్ గా వెండితెరపైకి!
ఇప్పుడో సినిమా పేరు హాట్ టాపిక్. అదే గరివిడి లక్ష్మి. అందులో పాటలు కూడా కాస్త ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఇప్పుడు చర్చగా మారి.. నాటి ఆ గొంతుకను మరోసారి జ్ఞప్తిలోకి తెచ్చింది.
ఒకప్పుడు ఉత్తరాంధ్రలో ఏ జాతర జరిగినా… ఏ పండుగ వచ్చినా… గరివిడి లక్ష్మి బుర్రకథ ఉండాల్సిందే. అంతే సంఖ్యలో జనం అక్కడి చేరేవారు.
ఆమె గొంతులోంచి జానపద గీతం జాలువారితే చాలు.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రేక్షకులు పాటల్లో లీనమైపోయేవారు. కథ చెబుతూనే పాట పాడటం, మధ్యమధ్యలో హాస్యం పండించడం, సామాజిక అంశాలను తన బుర్రకథలో భాగం చేయడం.. ఇలా తనదైన శైలిలో ప్రజలకు చేరువైన అరుదైన జానపద కళాకారిణే గరివిడి లక్ష్మి
15 ఏళ్లలో 10 వేలకుపైగా ప్రదర్శనలిచ్చిన గరివిడి లక్ష్మి పేరిట.. ఏకంగా పాటలు, బుర్రకథల బృందాలే ఏర్పడ్డాయి.

తన ఆట పాటలతో నాటి యువతను పిచ్చెక్కించిన ఆ జానపద కళాకారిణి మరి ఆ తర్వాత ఏమైపోయారు..?
గరివిడి లక్ష్మి అసలు పేరు రెడ్డి విజయలక్ష్మి. విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని గెడ్డపువల లక్ష్మి స్వస్థలం. 90ల కాలంలో బుర్రకథలతో వేదికపైకి అడుగుపెట్టిన ఈ కళాకారిణి ఉత్తరాంధ్ర జానపద కళారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. సోషల్ మీడియా, యూట్యూబ్, మీడియా ప్రభావం, ప్రచారాలు లేని కాలంలోనే 15 ఏళ్ల కాలంలో 10 వేలకు పైగా ప్రదర్శనలతో జనాన్ని తన బుర్రకథా వేదికల వద్దకు తీసుకొచ్చారు లక్ష్మి. కళాకారుల పాటైనా, కథైనా బయటకు వెళ్లాలంటే వారి ప్రతిభ.. అది విన్న జనం టాక్ ఆఫ్ మౌత్ ఇవే వారికి నాటి ప్రచారాస్త్రాలు. ఆ మార్గంలో ప్రయాణించి ఉత్తరాంధ్ర గర్వపడే జానపద కళాకారిణిగా ఎదిగారు లక్ష్మి.
లక్ష్మి పేరే ఓ బ్రాండ్!
గరివిడి లక్ష్మి విజయాన్ని ఆమె ప్రదర్శనల సంఖ్య ద్వారానో.. లేక ఆమె ఎంతకాలం ప్రదర్శనలిచ్చిందనే అంకెల ద్వారానో కొలవలేం. ఆమె బుర్రకథ చెప్పిన విధానం… ఓ సినిమాలో నవరసాలను ఏ విధంగానైతే జొప్పించి తీర్చిదిద్దుతారో.. అలాంటి నవరసాలతో తన బుర్రకథతో అలరించారామె. అందుకే ఆమే ఒక బ్రాండ్ గా మారారు. ఒక కళాకారిణి తన ప్రదర్శనలు తాను ఇవ్వడమే కాదు.. ఆమెను అనుకరించే బృందాలు తయారైనాయంటేనే అక్కడే ఆమె విజయం సాధించినట్టు. అదే గరివిడి లక్ష్మిలాటి కళాకారుల ప్రజాదరణకు ఉదాహరణ.
ఇప్పటికీ మారుమ్రోగే ఆమె పాటలు!
నల్ల జీలకర్ర మొగ్గ, అత్తరు సాయిబో రారా, మాలవారి మంగమ్మ వంటి జానపద పాటలతో ఆమె ప్రదర్శనలు విస్తృత ప్రాచుర్యాన్ని పొందాయి. గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించే ఆమె పాటల్లో ప్రేమ, హాస్యం, మరికొన్నిసార్లు ద్వంద్వార్థాలు వినపించేవి. అందుకే ఉత్తరాంధ్రలో అప్పట్లో గరివిడి లక్ష్మి పాటలంటే చెవి కోసుకునేవారు. పల్లెలను ఉర్రూతలూగించిన ఆ పాటలు నాటి యువతలోనూ క్రేజ్ సృష్టించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె పాటల కేసెట్ లేని ఇల్లే ఉండేది కాదంటారు.
ఆడియో క్యాసెట్స్ రూపంలో ఊళ్లకు చేరిన ఆమె జానపదాలు!
ఆ కాలంలో ఆమె పాటలు ఆడియో క్యాసెట్స్ రూపంలో ఉత్తరాంధ్ర పల్లెల్లో విరివిగా కనిపించేవి. 1996లో శ్రీమాతా కంపెనీ ద్వారా ఆమె బుర్రకథలు, పాటలు.. ఆడియా, వీడియోల రూపంలో కూడా విడుదలయ్యాయి. అంటే, నేటి డిజిటల్ మార్కెట్ కు ముందే గరివిడి లక్ష్మికి ప్రత్యేకమైన ఆడియో, వీడియో మార్కెట్ ఉండేదన్నమాట.
వినోదం కోసం బుర్రకథను ఎంచుకున్న కళాకారిణి!
మంచి ఫోక్ సింగర్ అయిన గరివిడి లక్ష్మి పాట పాడటంలో ప్రత్యేకతతోనే సరిపెట్టుకోలేదు. బుర్రకథ అనే సంప్రదాయ జానపద కళారూపాన్ని ఎంచుకుని గ్రామీణ ప్రజలతో మాట్లాడటం నేర్చుకుంది. ఇంకా గ్రామీణ సమాజానికి అప్పుడప్పుడే ఇంటర్నెట్, టెలివిజన్ వంటివి కొద్దికొద్దిగా పరిచయమవుతున్న దశలో.. ఆమె తన బుర్రకథలతో వినోదాన్నీ, సమాచారాన్నీ, సామాజిక వ్యాఖ్యానాన్ని అందించేవారు. అలా ఒక ఫోక్ సింగర్ గా పరిమితం కాకుండా.. ఒక పెర్ఫార్మర్ గా ఫుల్ ప్లెడ్జుడ్ ఆర్టిస్ట్ గా గరివిడి లక్ష్మి పేరు ఉత్తరాంధ్రలో ఓ బ్రాండుగా మారిపోయింది.
వెండితెర తలుపు తట్టిన ప్రతిభ!
గరివిడి లక్ష్మి జానపద గీతాలకు వచ్చిన గుర్తింపు చివరకు ఆమెను సినిమావైపు మళ్లించింది. ఆర్. నారాయణమూర్తి రూపొందించిన పీపుల్స్ వార్ సినిమాలో ఆమెతో సోదోయమ్మ సోది పాట పాడించారు. అలాగే, ఆ సినిమాలో ఆమె ఓ చిన్న క్యారెక్టర్ లోనూ నటించారు. గంగమ్మ జాతరలోనూ ఆమెతో జానపద గీతం పాడించారు. గ్రామీణ వేదికపైన ప్రారంభమైన ఆమె ప్రయాణం సినిమా వరకూ సాగింది. కానీ అదే సమయంలో ఆమె జీవితం.. మరో మలుపు తిరిగింది.
వెలుగులో ఉన్న మనిషి.. ఒక్కసారిగా చీకట్లోకి!
ఉత్తరాంధ్ర జానపదశైలిని తమ ప్రాంత ఎల్లలు దాటించిన లక్ష్మి కళా జీవన ప్రయాణంలో ఏం జరిగిందో ఏమో ఆమె మాయమైపోయారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఆమె ప్రదర్శనలూ తగ్గిపోయాయి. అయితే, ఆమె బయోపిక్ గా ఇప్పుడు వస్తున్న గరివిడి లక్ష్మి సినిమాలో కొంత ఆసక్తి కోసం మిస్టరీగా ఏదైనా చిత్రీకరించాలా, లేదా తెలియదుగానీ… ఆమె నిజ జీవితం మాత్రం కొంత మిస్టరీగా మారడం ఓ విషాదం.
ఇప్పుడామె కథ వెండితెరపైకి!
గౌరి నాయుడు జమ్ము దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆనంది.. గరివిడి లక్ష్మి పాత్ర పోషించారు. ఈనెల అక్టోబర్ 17వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్ లో ఉత్తరాంధ్ర గ్రామీణ వాతావరణం, బుర్రకథ, జానపద సంగీతం ప్రధానంగా కనిపిస్తున్నాయి. సినిమాలో ఏకంగా 16 పాటలున్నట్టుగా కూడా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పేర్కొన్నారు. మొత్తంగా ఓ కళాకారిణి బయోపిక్ గానే కాకుండా.. మరుగునపడ్డ ఓ కాలాన్ని తిరిగి గుర్తు చేసే ఓ ప్రయత్నంగా ఈ సినిమా అలరిస్తుందని ఆశిద్దాం.


