Maruthi Powrohitham… ✍🏼
మనోవిజ్ఞాన శాస్త్రం బాల్యదశలో పిల్లలు రెండు రకాలైన సంఘర్షణలు ఎదుర్కొంటారు అని చెబుతుంది.
1. ఇడిపస్ కాంప్లెక్స్ ( మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంచించడం. వీరు తండ్రిని ప్రత్యర్థి గా భావిస్తారు )
2. ఎలక్ట్రా కాంప్లెక్స్ (ఆడ పిల్లలు తండ్రిని లైంగికంగా వాంచించడం. వీరు తల్లిని ప్రత్యర్థి గా భావిస్తారు)
అయితే పరిసరాలతో జరిపే చర్య ప్రతిచర్యల వలన క్రమంగా ఆ భావనలు పిల్లలో తొలగిపోతాయి.
అయితే అసాధారణ పరిస్థితుల్లో కొందరిలో ఆ భావనలు కొనసాగుతాయి. అటువంటి ఒక మానసిక ఆపసవ్య స్థితిని ఆధారం చేసికొని తీసిన సినిమాయే “విముక్తి ”. ఈ సినిమాలో ఆధ్యాత్మిక చింతన ద్వారా మానసిక సంఘర్షణకు పరిష్కారాన్ని సూచిస్తాడు శేషాద్రి.

విముక్తి అనేది 2010లో విడుదల అయిన కన్నడ భాషా చిత్రం. దీనికి శేషాద్రి గారు దర్శకత్వం వహించారు. దీనిని నవ్యచిత్ర క్రియేషన్స్ నిర్మించింది. ఇందులో భావన మరియు రామకృష్ణ నటించారు . 56వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ కన్నడ చిత్రంగా “విముక్తి ” కి జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది .
ఈ సినిమాలో ప్రేమ సరే, మోహమెందుకు? అనే ఛాలెంజ్ విసిరాడు దర్శకుడు పి.శేషాద్రి . బెంగుళూరులో మొదలైన కథ, దూరంగా వారణాసిలోని ‘విముక్తి’ భవన్‌లో ముగుస్తుంది. అక్కడ మాధవి (కథానాయిక ) జనన, మరణాలకు మరో నిర్వచనం తెలుసుకొంటుంది! మొత్తం సత్యం కోసమే అన్వేషణ జరుగుతుంది. తనకంటే ఎక్కువగా ప్రేమించిన తండ్రి ప్రేమ తనకు మాత్రమే ఉండాలనే కూతురు స్వార్థం ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందొ ఈ మూవీ చూపిస్తుంది. చిత్తశుద్ధి గల కళాకారుడిగా రామకృష్ణ నటన వర్ణనాతీతం. పాప సానియా చక్కగా నటించింది.



