చెట్టూ, పిట్టా, ఇల్లు! మొత్తంగా ఓ ఎకో ఫ్రెండ్లీ ఫ్యామిలీ స్టోరీ ఇది!!

ఓ పర్యావరణ ప్రేమికుడి ఇంటి కథ!

ఎక్కడైనా ఒక రోడ్డు వేసినా… ఇల్లు కట్టినా… అపార్ట్ మెంట్ లేపినా… కార్యాలయాలో, మార్కెట్ల నిర్మాణమో చేపట్టినా… చివరకు ఎలక్ట్రికల్ పోల్స్ వేసినా… అడ్డంగా ఉందని చెట్లను అడ్డంగా నరికే సంస్కృతి మనది. ఒక చెట్టు కొట్టేసినంత వీజీ కాదు… చెట్టు పెంచడమంటే! కానీ ఆ సోయి లేకుండా అవసరం లేనిచోట్ల కూడా అభివృద్ధి పేరిట అడ్డంగా నరికే మానవ సమాజాన్ని చూసే రోజుల్లో… ఆయన తన ఇంటి నిర్మాణానికి ఆ చెట్టు అడ్డుగా నిలుస్తున్నా… ఒక్క కొమ్మ కూడా ముట్టుకుండానే తాననుకున్న ఇంటిని నిర్మించుకున్నాడు. అలా వార్తల్లో వ్యక్తయ్యాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకీ ఎక్కాడు. ఇంతకీ ఎవరాయన…? అయితే ఈ స్టోరీ చదివేయండి.

ఇంట్లో లేవగానే ఓ పక్క విరగకాసిన మామిడికాయలు… కాసిన్నిరోజులైతే చెట్టుపైనే పండే మామిడిపండ్లతో పాటు… గూళ్లల్లోంచి బయటకు చూస్తున్న చిన్నచిన్న పక్షుల కిలకిలారావాలు కనిపిస్తే… అదెంతద్భుతం…? ఆ అనుభూతి మాటల్లో వర్ణించేదా…? ఏ ఊహలకో, కలలకో మాత్రమే పరిమితమయ్యే భావన కదా అది..?! లేదంటే ఏదైనా డిస్నీ సినిమాల్లో కనిపించే యానిమేటెడ్ స్టోరీ అయినా అయ్యుండాలి!! కానీ, అదే నిజజీవితంలో అనుభవంలోకి వస్తే…? దాన్ని నిజం చేసుకుంది ఇదిగో రాజస్థాన్ లోని అజ్మీర్ కు చెందిన బిజినెస్ మ్యాన్ కుల్ ప్రదీప్ సింగ్ కుటుంబం.

కుల్ ప్రదీప్ సింగ్ తాను నిర్మించుకున్న ఈ మూడంత్రాల ట్రీ బిల్డింగ్ లో… రెండు పడకగదులు, ఓ లైబ్రరీ రూమ్, కిచెన్, లివింగ్ రూమ్సుండగా.. ఈ ట్రీ హౌస్ ని ఉదయ్ పూర్ లో కట్టుకున్నాడు. తాను ఇల్లు కట్టుకున్న ప్రాంతంలో గతంలో ఇలాంటి చెట్ల సంఖ్య నాల్గువేలకు పైగా ఉండగా.. పెద్దఎత్తున మామిడికాయలు, పండ్లు అమ్ముకునేవారు ఇక్కడి ప్రజలు. రానురాను జనం పెరగడంతో… నివాసాలకై, విలాసాలకై చెట్లను నరికేస్తున్నారన్నది కుల్ ప్రదీప్ ఒకింత ఆవేదనతో చేసే ఫిర్యాదు. ఈ క్రమంలోనే తన ఇంటిని కట్టుకున్న కుల్ ప్రదీప్.. ఓ 80 ఏళ్ల మామిడి చెట్టునేమాత్రం కొట్టకుండా.. కనీసం ముట్టకుండా ఎంతో జాగ్రత్తగా నిర్మించిన తీరు చూడముచ్చటేస్తుంది.

1999లో సింగ్ ఉదయ్ పూర్ లో ఈ ప్లాట్ ను సొంతం చేసుకున్నాడు. అయితే ఇక్కడన్నీ చెట్లెక్కువగా ఉండటంతో… ప్రాపర్టీ డీలర్ కు తాను చెట్లను కొట్టి ప్రాపర్టీని అమ్మొద్దని చెప్పానని… కానీ తను తన మాట పెడచెవిన పెట్టేసాడంటాడు. ఆ కసితోనే… ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని ఇదిగో ఈ మామిడి చెట్టు కేంద్రంగా ఉన్న భూమిని తానే కొనుగోలు చేసి… దాన్ని కొట్టకుండానే ఇంటిని నిర్మించేందుకు ప్లాన్ చేశాడట కుల్ ప్రదీప్.

మొత్తంగా మొండిపట్టుదలతో చెట్టు కొట్టకుండా ఇల్లు కట్టుకోవాలన్న తపనతో… ఓ ఆర్కిటెక్ సాయంతో ప్రారంభించిన సింగ్ ఇల్లు ఏడాది తిరిగేసరికి పూర్తైపోయింది. అప్పటికే ఈ మామిడి చెట్టు 20 అడుగుల ఎత్తు పెరిగింది. ప్రారంభంలో ఇంటిని రెండత్రాలుగా నిర్మించారు. కింద 9 ఫీట్ల లోతు నుంచి మామిడిచెట్టు కాండము, వేర్లుండగా… దాన్నే బేస్ గా చేసుకుని పూర్తిగా స్టీల్ రాడ్స్ తో పాటు… ఇంటి గోడలు, ఫ్లోరింగ్ ను పూర్తిగా సెల్యులోజ్, ఫైబర్ షీట్స్ సాయంతో నిర్మించారు. అంతేకాదు, సర్వసాధారణంగా చెట్లెక్కువ ఉన్నచోట్లల్లో పిడుగులెక్కువ పడుతుండటం చూస్తుంటాం. ఈ క్రమంలో అలాంటి ప్రకృతి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా… చెట్టు చుట్టూ విద్యుత్ వాహకాలుగా ఆ పిడుగుపాట్లను అబ్జార్బ్ చేసే కండక్టర్లను నాల్గు పిల్లర్స్ గా ఏర్పాటు చేశారు.

ఇప్పుడు సింగ్ ఇంట్లో వంటగదితో పాటు… పడకగది, ఇతర గదులన్నీ.. చెట్ల కొమ్మలతోనూ… వాటిపై నివసించే పక్షులు, ఇతర చిన్న చిన్న జీవచరాలెన్నో కనిపిస్తుంటాయి. ఇప్పడివన్నీ కూడా తమ కుటుంబ సభ్యులేనంటాడు కుల్ ప్రదీప్. ఇతర జీవులు, పక్షులతో కలిసి సహజీవనం చేయడంపై ఈ ప్రకృతి, పర్యావరణ ప్రేమికుడి మాటల్లో ప్రేమ కనిపిస్తుంటుంది. సుమారు ఎనిమిదేళ్లపాటు విద్యుత్ శాఖలో పనిచేసిన కుల్ ప్రదీప్ ఇప్పుడు సొంతంగా వ్యాపారాన్ని కూడా ప్రారంభించాడు. అయిుతే ఈ ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చైంది వంటి లెక్కలను మాత్రం ఎవ్వరికీ చెప్పడానికి ఇష్టపడని 75 ఏళ్ల సింగ్… ఎదిగే చెట్టును అడ్డంగా నరికేయకుండా ఇంటిని నిర్మాణం చేయడం మాత్రమే తాను లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెబుతాడు.

ఇప్పుడు కుల్ ప్రదీప్ సింగ్ ఇల్లే ఓ పర్యాటక కేంద్రంగా తయారైపోయింది. చాలామంది ఇప్పుడు సింగ్ ను సంప్రదిస్తున్నారు. తనలాగా ఇల్లెలా కట్టుకోవచ్చో ఆరా తీస్తున్నారు. కానీ, చెట్టుకున్న ఒక్క ఆకు కూడా రాలకుండా ఇంటిని నిర్మించడమంటే అంత సులభం కాదు. దానికి ఆ చెట్టుపై మమకారముండాలి… ప్రకృతిని ప్రేమించే గుణముండాలి. అందుకే ఎవ్వరికీ కూడా ఎలాంటి సలహాలివ్వకుండానే… అదో కష్టసాధ్యమైన పనని చెప్పి పంపిచేస్తున్నానంటాడు సింగ్.

ఈ ఇంటి నిర్మాణాన్ని సింగ్ 2000 సంవత్సంలో చేయగా.. మొదట రెండంతస్తులున్న ఈ ఇల్లు.. ఇప్పుడు మూడంతస్తులకు మారింది. మామిడి చెట్టు కూడా 20 అడుగుల నుంచి 40 అడుగులకు పెరగడం విశేషం. మొదటి అంతస్తులో వంటగది, బాత్రూమ్, డైనింగ్ హాల్ ఉండగా… రెండో అంతస్తులో వాష్‌రూమ్, లైబ్రరీ,. బెడ్‌రూమ్స్ ఉన్నాయి. మూడో అంతస్తు పైకప్పుతో… కేవలం ఒకే ఒక్క గదితో ఓ పెంట్ హౌజ్ తరహాలో నిర్మించాడు. ఈ పెంట్ హౌజ్ కు వెళ్లి గది తలపులు తెరచి… బాల్కనీ వంటి ప్రదేశంలోంచి… ఈ మామిడి చెట్టుకున్న అందమైన కొమ్మలను చూస్తూ… ప్రకృతి ఒడిలో తన భార్య, కొడుకుతో కలిసి ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నాడు కుల్ ప్రదీప్ సింగ్.

తనను కొట్టకుండా ఇల్లు కట్టుకున్నందుకు.. ప్రతీ వేసవిలోనూ ఈ మామిడి చెట్టు తమకు విరగబూసిన మామిడికాయలనూ, పండ్లనూ బహుమతిగా ఇస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది ఇప్పుడీ సింగ్ కుటుంబం. ఇప్పుడు కుల్ ప్రదీప్ సింగ్ నిర్మించిన ఈ త్రిబుల్ స్టోర్ ట్రీ హౌస్… లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకెక్కింది. దీంతో ఇప్పుడు కుల్ ప్రదీప్ ఇల్లు ఓ పర్యాటక కేంద్రంగా మారిపోయింది. అందుకే ఎవరైనా ఉదయ్ పూర్ వెళ్లితే… అక్కడి అందమైన కోటలు, పక్షులు, రాజభవనాలతో పాటు.. ఇదిగో ఈ కుల్ ప్రదీప్ సింగ్ ట్రీ హౌస్ ను కూడా చూసొస్తే… జర్నీ మరింత ఫుల్ ఫిల్ అయినట్టే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles