భార్య యాదిలో! తోటకే గిటార్ రూపునిచ్చిన భర్త!!

ఆ గిటార్ తోటే.. తన భార్య యాది!

కొన్ని చిత్రాలు భలే చిత్రంగా ఉంటాయి. చూడగానే హత్తుకుంటాయి. రిథమిక్ గా వినిపించే గిటార్ సంగీతమంత అందంగా కనిపించి… చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అగో అలాంటి ఓ ప్రకృతి రమణీయ పచ్చని గిటార్ చిత్రం గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతోంది. సంగీత వాద్యమైన పచ్చని గిటారేంటి… ప్రకృతి రమణీయతేంటి… అసలా రెండింటికీ సంబంధమేంటనేగా…? షాజహాన్ ముంతాజ్ జ్ఞాపకార్థం తాజ్ మహల్ నిర్మిస్తే… అర్జెంటీనాకు చెందిన ఓ భర్త… ఓ భార్య స్మృతిలో సృష్టించిన ఆ వండరేంటో కూడా చెప్పుకోవాల్సిందే మరి!

అర్జెంటీనాకు చెందిన పెడ్రో మార్టిన్ యురేటా అనే రైతు తన వ్యవసాయ పొలంలో ఒక కిలోమీటర్ పొడవున కనిపించేలా ఏడువేల చెట్లను ఏకంగా మ్యూజికల్ ఇనుస్ట్రుమెంటైన గిటార్ ఆకారంలో నాటాడు. చూపరులను ఇట్టే ఆకట్టుకుంటున్నాడు. పంప్రాస్ ప్రాంతంలో ఉన్న ఆ గిటార్ ఆకారపు చెట్లపై నుంచి వెళ్తున్న విమానాల నుంచి ఆ చెట్లను పరిశీలించిన పర్యాటకులు కూడా గ్రాఫిక్స్ లాగా ఫీలవుతూ ఔరా అనేలా కనిపించే ఆ చిత్రం ఇప్పుడు గూగుల్ మ్యాప్ లోనూ కనిపిండం విశేషం.

అయితే 71 ఏళ్ల పెడ్రో మార్టిన్ కు నల్గురు పిల్లలు కాగా… భార్య చనిపోయింది. ఆమె జ్ఞాపకార్థమే ఈ సైప్రస్, యూకలిప్టస్ చెట్లను ఆమెకిష్టమైన గిటార్ రూపంలో తన పిల్లలతో కలిసి నాటి ఇప్పుడందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. అందుకు ఓ ప్రేరణ కూడా ఉంది. ఓసారి మార్టిన్ తన భార్య గ్రెసీలా య్రైజోజ్ తో కలిసి విమానంలో ఆకాశ మార్గాన వెళ్తున్నప్పుడు… ఓ రైతు తన పొలంలో చెట్లను పాలు పితికి పోసే ఓ గిన్నె ఆకారంలో నాటిన చిత్రం గ్రెసీలాను ఆకట్టుకుందట. అయితే, అంతకన్నా బాగుండేలా తమ పొలంలో కూడా అలా చెట్లను నాటాలని… అందుకు ఆమెకిష్టమైన సంగీత పరికరమైన గిటార్ ఆకారాన్ని పోలి ఉండేలా ఆ చెట్లను పెంచాలని భర్తను కోరిందట గ్రెసీలా. కానీ దురదృష్టవశాత్తూ గ్రెసీలా 25 ఏళ్ల వయస్సులోనే మరణించింది. దాంతో ఆమె యాదిలో ఏదైనా చేయాలనుకున్నాడు పెడ్రో మార్టిన్. అందుకు ఆమె ఉండగా కోరిన కోరిక మేరకు… తన పొలంలో గిటార్ రూపంలో చెట్లను నాటి ఆమె స్మృత్యార్థం ఆ గిటార్ తోటను ఆకట్టుకునేలా రూపుదిద్దాడు.

తన భార్యకు ఇష్టమైన గిటార్ ఆకారంలో తన పొలంలో చెట్లను నాటే క్రమంలో చాలామందిని కలిశాడు. ఎలా చేయాలో అర్థం కాని సమయంలో ఎందరినో సంప్రదించాడట పెడ్రో. కానీ అనుకున్నంత స్థాయిలో ఎవ్వరి నుంచీ అంత పెద్దగా స్పందన కనిపించకపోవడంతో.. తన నల్గురు పిల్లలతో కలిసి ఆ గిటార్ తోటకు తానే అంకురార్పణ చేశాడు. తన పిల్లల్నిఒక వరుసలో నిలబెడుతూ కొలతల ప్రకారం పెర్ ఫెక్ట్ స్కెచ్ వేసుకుని యూకలిప్టస్, సైప్రస్ చెట్లతో ఓ గిటార్ తోటనే తయారుచేశాడు పెడ్రో మార్టిన్. ఇప్పుడు పెడ్రో మార్టిన్ తోట ఎందరినో ఆకట్టుకుంటూ… తన భార్య గ్రెసీలా య్రైజోజ్ స్మృత్యార్థం.. తన భార్య పట్ల తనకున్న ప్రేమకు ఓ పరాకాష్ఠగా… ఓ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles