లైఫ్ సర్కిల్.. మ్యాక్స్ వంద.. ఎవరికో కొందరికి అంతకన్నా పైబడి.. యావరేజ్ గా అరవై, డెబ్బై. ఈ వందేళ్ల జీవితమైనా.. నేటి అరవై, డెబ్బై ఏళ్ల యావరేజ్ బతుకైనా కొంత సమయం తర్వాత.. బరువులు, బాధ్యతలు, మార్పు కనిపించని మొనాటనీతో మోక్షం లభిస్తే బాగుండనిపించేవారు ఎందరో. కానీ, ఆఫ్టరాల్ వందేళ్లేనా.. జీవితం..? ఇంత సాంకేతికత పెరిగింది.. ఇన్ని హంగులను మానవుడు ఏర్పర్చుకున్నాడు.. సృష్టికి పున: సృష్టి చేస్తూనే ఉన్నాడు.. కనీసం వెయ్యేళ్లో, ఆపైనో, లేక, ఇన్ఫినిటీనో ఉంటే బెటర్ కదా అనుకునేవాళ్లూ కొందరుంటారు.
అలా జీవితంపై ఎవరి అనుభవాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతులను బట్టి వారికి కొన్ని ఊహలుంటాయి. అలా ఒకాయన తనకెంత వయస్సు వచ్చినా మార్కండేయుడిలా కనిపించేందుకు పడుతున్న తపన ఇప్పుడు చాలామందిలో కొంత క్యూరియాసిటీని పెంచుతోంది. ఆయనేం సామాన్యుడు కాదు.. ఓ కంపెనీకి ఏకంగా సీఈవో. తనకు ఎన్నేళ్లు వచ్చినా.. మార్కండేయుడికి పదహారేళ్లన్నట్టుగానే.. తను 18 ఏళ్ల కుర్రాడిలా కనిపించాలని తపన పడుతున్నాడు. అందుకు, ఏటా 16 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఎవరాయన..?
వృద్ధాప్యాన్ని అసలు జయించొచ్చా..?

వెనిస్ వాసి అయిన బ్రయాన్ జాన్సన్.. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఓ సంపన్న వ్యాపారవేత్త. జాన్సన్ వయస్సు 45 ఏళ్లు. కానీ, జాన్సన్ లో వయస్సుతో పాటు తన శరీరంపై వచ్చే మార్పులను జయించాలన్న తపన పెరిగింది. అందుకే, యముడు యమపాశం వేసినప్పుడు శివుణ్నే పట్టుకున్న మార్కండేయుడిని ఆ ఈశ్వరుడే రక్షించి.. మార్కండేయుడికి మరణం లేకుండా.. తన వయస్సును 16 ఏళ్ల వద్దే కట్టిపడేసినట్టు.. ఇప్పుడు జాన్సన్ ఆలోచలను కూడా సాగుతున్నాయి. అందుకే 45 ఏళ్ల జాన్సన్.. తాను వయస్సు పెరుగుుతున్న కొద్దీ ఆ మార్పు తనలో కనిపించకుండా కోట్ల రూపాయలు ఏటా ఖర్చు చేస్తున్నాడు.
బయోలాజికల్ గా తన శరీరంలో వస్తున్న మార్పులను నిరోధించడానికి.. తానిప్పుడు 45లో ఉన్నా… మరో ఐదేళ్ల తర్వాత 50 ఏళ్లకు చేరినా.. తాను కనిపించడం మాత్రం 18 ఏళ్ల కుర్రాడిలానే ఉండాలనే కోరికతో.. తరచూ వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నాడు. అందులో భాగంగా కొలెస్ట్రాల్, గుండె వేగం, బ్లడ్ సర్క్యులేషన్ వంటి పరీక్షలతో పాటు.. ఎంఆర్ఐ వంటి డయాగ్నసిస్ చేయించుకుంటుంటాడు. అంతేకాదు.. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో విద్యుదయస్కాంత పల్స్ నుంచి కండరాలను మెరుగుపర్చే కొన్ని రకాల ప్రత్యేక వైద్యం కూడా ఆయన అపాయింట్ చేసుకున్న వైద్యులందిస్తున్నారు. మొత్తంగా తన ఏజింగ్ ను తక్కువ చూపించడానికి ప్రస్తుతం రోజుకు 111 పిల్స్ మింగుతున్నాడు జాన్సన్.
బ్రయాన్ జాన్సన్ కు చేస్తున్న ఈ వైద్యానికి ప్రాజెక్ట్ బ్లూప్లింట్ అని పేరు పెట్టగా.. జాన్సన్ వైద్యం కోసం 30 మంది ప్రఖ్యాత వైద్యుల బృందం పనిచేస్తోంది. ఆ 30 మంది వైద్యుల బృందంలో ఆలివర్ జోల్మాన్ అనే 29 ఏళ్ల ప్రధాన వైద్యుడు.. అవయవాల పునరుత్పత్తి ఔషధ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. జాన్సన్ ప్రతీ అవయవంలోనూ వృద్ధాప్య ప్రక్రియనే తిప్పికొట్టేలా ఈ వైద్యం జరుగుతుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఇలాంటి అవయవాల పునరుత్పత్తి అంటే రీజనరేట్ చేసే వైద్యానికి.. జోల్మాన్ వంటి వైద్యులు ఏకంగా గంటకు వెయ్యి డాలర్ల చొప్పున వసూలు చేస్తారంటే.. ఈ వైద్యమెంత కాస్ట్లీనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.
ఈ మొత్తం వ్యవహారాన్ని బ్లూమ్ బర్గ్ నివేదిక బహిర్గతం చేసింది. ప్రస్తుతం వయస్సును తగ్గించే ఈ వైద్యప్రక్రియలో.. 45 ఏళ్ల జాన్సన్ గుండె.. 37 ఏళ్ల మనిషికి ఉండే స్థాయిలో పనిచేస్తుండగా.. చర్మం 28 ఏళ్ల వ్యక్తిలాగా.. ఊపిరితిత్తులు ఏకంగా 18 ఏళ్ల యువకుడంత సామర్థ్యాన్ని కల్గిఉన్నట్టు ఈ నివేదిక వెల్లడిస్తోంది. దీంతో ఇప్పుడు మొత్తంగా జాన్సన్ తన వయస్సు 45 కంటే కనీసం ఐదారేళ్ల చిన్నవాడిలా కనిపించేలా వైద్యం ఇప్పటికే విజయవంతమైంది.
అయితే, ఇప్పటివరకూ తాము సాధించింది వెంట్రుకవాసి కూడా కాదంటోంది జాన్సన్ కు వైద్యమందిస్తున్న డాక్టర్ల బృందం. ఇంకా చాలా పెద్ద ఫలితాలను సాధించే ప్రాక్టీస్ కొనసాగుతోందంటున్నారు.
అయితే, తనకు జరుగుతున్న వైద్య ప్రక్రియపై బ్లూమ్ బర్గ్ తో మాట్లాడిన జాన్సన్.. ఇదంతా క్రేజ్ అనుకునేవారుండొచ్చు. కానీ, నేను శరీరం క్షీణించిపోవడం అనివార్యమైన ప్రక్రియ అనేదాన్ని.. మానవుడు ఛేదించగలడని నిరూపించేందుకే ఈ ప్రయోగానికి సిద్ధమైనానంటాడు. జాన్సన్ వయస్సు తగ్గించుకోవాలనకుంటున్న ఈ ప్రక్రియపై ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున విమర్శలు వస్తున్నా.. తన ప్రయోగం సక్సెస్ అవుతుండటంపై తన ప్రాజెక్టును కొనసాగిస్తున్నాడు.
బ్లూమ్ బర్గ్ రిపోర్టర్ ఆష్లీ వ్యాన్స్ జాన్సన్ ఇంటికి వెళ్లినప్పుడు.. జాన్సన్ చేస్తున్న ఈ ప్రయోగ ప్రక్రియ జీవితాన్నే నాశనం చేసేదిగా భావించారట. ఎందుకంటే, ఆష్లీ వ్యాన్స్ ఇంటికెళ్లేసరికి… జాన్సన్ కు ఫ్యాట్ ఇంజెక్షన్ ఫేస్ ప్రొసీజర్ అనే వైద్యప్రక్రియ నడుస్తోంటే.. అది అతడి శరీరాన్ని, ముఖ్యంగా ముఖాన్ని మరింత ఎలర్జిటిక్ గా మారుస్తున్నదనే భయం, ఆందోళన ఆష్లీలో కల్గిందట. కానీ, జాన్సన్ మాత్రం.. అదేం లేదు.. ఈ ప్రక్రియ తర్వాత నేను మరింత యవ్వనంగా కనిపిస్తానంటూ బదులివ్వడం తాను చేస్తున్న ప్రయోగంపై తనకున్న నమ్మకంలా కనిపించింది.
తాను ఫిట్ గా, యవ్వనంగా ఉండేందుకు.. తన కల సాకారం చేసుకునేందుకే ఈ పని చేస్తున్నానని… నేటి వైద్యవిధానంలో వచ్చిన సాంకేతిక మార్పులను అందుకోసం ఉపయోగించుకుంటున్నానని.. ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదంటాడు జాన్సన్. అయితే, ఈ ప్రయోగ ప్రక్రియలో జాన్సన్ జీవితం మొత్తం కఠిన సవాళ్లనెదుర్కోవాల్సి ఉంటుందంటున్నారు హార్వర్డ్ విశ్వవిద్యాలయ జన్యు శాస్త్రవేత్తలు.
ఒకవైపు ప్రపంచ దేశాల్లో చాలామంది పేద, మధ్యతరగతి జనాలకు వైద్యసాయమే అందని రోజుల్లో… అందుకు పూర్తి కాంట్రాడిక్టరీగా జాన్సన్ 30 మంది వైద్య బృందం సాయంతో తన వయస్సును తగ్గించుకునేందుకు చేస్తున్న ఈ ప్రయోగంపై భిన్నరకాల వాదనలు చర్చోపచర్చలకు తెర లేపుతున్నాయి.
ప్రస్తుతానికి తన వయస్సు తగ్గించుకునే ప్రక్రియలో తానెన్ని సవాళ్లెదుర్కొన్నా కూడా జాన్సన్ మాత్రం.. ఈ బయోలోజికల్ ప్రాసెస్ ను సరదాగా ఎంజాయ్ చేస్తుండటం విశేషం. అదే సమయంలో, వృద్ధాప్యాన్ని జయించాలని తనలా అందరూ భావించలేరని.. ఇది ధనముంటేనే సాధ్యమనీ నర్మగర్భంగా చెబుతున్నాడతను. రాబోయే రోజుల్లో ఇలాంటి కొత్త వైద్య పద్ధతులకు శ్రీకారం చుట్టే క్రమంలో.. తాను వేసిన అడుగు మరెందరికో నాంది అవుతుందంటున్నాడు. ఆ నమ్మకంతో.. తన అడుగులు ముందుకేస్తూ మార్కండేయుడిగా అవతరించేందుకు తపిస్తున్నాడు.. ఈ నడివయస్కుడు.



