హ్యూమన్ రీప్లేస్ మెంట్ లో ఆబ్సల్యూట్ ఆల్టర్నేటివ్ కాకపోయినా… ఆల్టర్నేటివ్ గానైతే ఇప్పటివరకూ సంచలనాలు నమోదు చేస్తోంది రోబోటిక్ టెక్నాలజీ. రోబోలకు మనిషిలా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేకపోవచ్చుగానీ… ఏదైతే ప్రాంప్ట్ చేస్తామో దాన్ని నిర్వహించడంలో చాలావరకూ రోబోలు సక్సెస్ అవుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ కూడా చూస్తున్నాం. అయితే, ఈ టెక్నాలజీ మీద అత్యధికంగా ప్రయోగాలు చేస్తున్న దేశాల్లో చైనాది ముందువరుస.
రోబోలన్నీ కలిసి మనుషుల్లా మారథాన్ చేయడం నుంచి భవన నిర్మాణ కార్మికుల్లా పని చేయడం వరకూ… హోటళ్లల్లో సర్వ్ చేయడం నుంచి వంటింట్లో హెల్పర్ లా ఉపయోగపడేవరకూ అన్నింటా ఇప్పుడు రోబోలు డామినేట్ చేస్తున్నాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో మనిషి మనుగడకు, ఉపాధికే ముప్పనే చర్చా జరుగుతున్నదే.

ఇదంతా ఎందుకంటే, చైనాలో ఇప్పుడు రోబోలు భిక్షగాళ్ల వేషంలో అడుక్కోవడమే ఈ చర్చ మళ్లీ తెరపైకి రావడానికి ప్రధాన కారణం.
అయ్యా నీ కాళ్లు మొక్కుతా దొరా.. బాంచనే ఇంత బిచ్చమేయండంటూ ఓ రోబో అడుక్కోవడం అందరినీ ఆశ్చర్యపర్చింది.
సిచువాన్ ప్రావిన్స్ లో ఒక హ్యూమనాయిడ్ రోబో వీధిలో మోకాళ్లపై కూర్చుని భిక్షాటన చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనను రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బు లేదంటూ పాదాచారుల నుంచి విరాళాలడుగుతున్న ఆ వీడియోపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చైనాలో ఇకపై భిక్షగాళ్లు కూడా గంటల కొద్దీ వీధుల్లో కూర్చునే బదులు రోబోలతో ఇకపై భిక్షాటన చేయించే ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారా అనేదే ఈ చర్చ.
అడుక్కుంటూ వైరలైన చైనా రోబో దగ్గర… విరాళాలందించేవారికోసం ఓ ప్లేట్, క్యూఆర్ కోడ్ బోర్డ్, అలాగే, ఓ బ్యాగ్ కనిపించాయి. తనను తాను ఛార్జింగ్ చేసుకోవడానికి కావల్సిన విద్యుత్ ఖర్చుల కోసమంటూ అది అడుక్కోవడం కొందరిని ఆకట్టుకుంటే… చాలామందిని అవాక్కయ్యేలా చేసింది. అయితే, ఆ రోబోను అక్కడ ఏ భిక్షగాడైనా పెట్టి ఉంటారా… లేక, ఇంకెవరి పనా అన్న సందేహాలుండగా… యూనిట్రీ రోబోటిక్స్ వారు తయారుచేసిన జీ1 హ్యూమనాయిడ్ రోబోగా గుర్తించారు.
హ్యూమనాయిడ్ రోబోల సామర్థ్యాలపై ఇప్పటికే విమర్శలు!
తాజాగా వెలుగులోకొచ్చిన భిక్షాటన రోబో కంటే ముందే గత ఏప్రిల్ నెలలో బీజింగ్ యిజువాంగ్ హాఫ్ మారథాన్ లో మూడువందలకు పైగా హ్యూమనాయిడ్ రోబోలు పాల్గొన్నాయి. అయితే, చాలా రోబోలు మారథాన్ ఆరంభం కాగానే కొద్దిసేపటికే కుప్పకూలిపోయాయి. మరికొన్ని బ్యాలెన్సింగ్ గా కనిపించకపోవడం.. అడ్డువచ్చినవాటిని ఢీకొట్టడం వంటి ఘటనలు కనిపించాయి. దాంతో హ్యూమనాయిడ్ రోబోల మారథాన్ ఎగతాళి కార్యక్రమంగా మారిపోయింది. ఆ తర్వాత ఎక్స్పర్ట్స్ నుంచీ రోబోలు కేవలం గంతులు వేయడానికి తప్ప పనికిరావడంలేదనే విమర్శలూ వెల్లువెత్తాయి.
రోబోలను నడిపించే కీలక కంప్యూటింగ్ చిప్స్ అన్నీ దాదాపు 95 శాతం తైవాన్ లో తయారయ్యే సెమీకండక్టర్సే కావడంతో.. ఇప్పుడు రోబోల పనితీరుపై వస్తున్న విమర్శలపై అక్కడి ఇండస్ట్రీ కూడా ఆత్మావలోకనంలో పడింది.
చైనాలో భిక్షగాడి అవతారమెత్తిన రోబో వీడియో నిజమా…? వ్యంగ్యోక్తమైన నాటకమా..?
చైనా వీధుల్లో చక్కర్లు కొడుతూ వైరలైన భిక్షగాడి రూపంలోని రోబో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… అది నిజమైన ఘటన అయ్యి ఉండదనే భావన వ్యక్తమవుతోంది. కేవలం ఒక వ్యంగ్య ప్రదర్శనగా కూడా అనుమానిస్తున్నారు. రాబోయే రోజుల్లో రోబోలే అన్ని పనులూ చేసేస్తే… ఇక మనుషులంతా బిచ్చమెత్తుకోవడమేనన్నదానికి ఓ మెటాఫర్ గా కూడా అభివర్ణిస్తున్నారు. మరికొందరు ఏఐ అభివృద్ధిపై జరుగుతున్న ప్రచారానికీ, ఆర్థిక అవసరాలు, వాస్తవాలకు మధ్యనున్న వ్యత్యాసాన్ని ప్రతిబింబించే ఓ సింబాలిక్ ప్రదర్శన అనేవారూ కనిపిస్తున్నారు.
ప్రపంచవ్యాప్త గుర్తింపు సంపాదించుకున్న యూనిట్రీ రోబోటిక్స్!
పరిశోధకుల కోసం మార్కెటింగ్ చేస్తున్న తన రోబోటిక్స్ సిస్టమ్ లో ఎన్విడియా యూనిట్రీ రోబోటిక్స్ ను ఎంపిక చేసుకుంది. సుమారు 6 అడుగుల ఎత్తున్న హ్యుమనాయిడ్ రోబోలతో పాటే… యూనిట్రీ రోబోటిక్స్, ఎన్విడియాకు కావల్సిన రోబోటిక్ సాంకేతిక సహకారం అందించింది.
రాబోయే రోజుల్లో ఫిజికల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందన్న అంచనాలూ ఉన్నాయి. యూనిట్రీ సంస్థ గత ఏడాది ప్రపంచంలోనే అత్యధిక హ్యూమనాయిడ్ రోబోలు విక్రయించిన సంస్థగా పేరు సంపాదించింది. స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ కూ సిద్ధమవుతోంది.
పలు వివాదాల్లోనూ యూనిట్రీ హ్యూమనాయిడ్ రోబోలు!
యూనిట్రీ సంస్థ రూపొందించిన 35 కిలోల బరువున్న హ్యూమనాయిడ్ రోబో ఈక్వెడార్ లోని చింబోరాజో అగ్నిపర్వత శిఖరాన్ని అధిరోహించింది. భవిష్యత్తులో తమ హ్యూమనాయిడ్ రోబోతో ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కించే పనిలో యూనిట్రీ భాగమైంది.
ఇక గత మార్చ్ నెలలో ఇదే యూనిట్రీ రోబో చైనాలో ఓ వృద్ధ మహిళను భయపెట్టింది. పోలీసులు దాన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా వార్తలొచ్చాయి.
మరోచోట ఓ ప్రజాకార్యక్రమంలో ఓ చిన్నారిని హ్యూమనాయిడ్ రోబో పొట్టలో తన్నడం కూడా వివాదానికి తెరలేపింది.
మరోచోట యూనిట్రీ జీ1 రోబో నియంత్రణ కోల్పోయి పడిపోయే క్రమంలో ఓ వ్యక్తి ముక్కుకు గాయాలయ్యాయి.
భిక్షగాడి రూపంలో తాజాగా వెలుగులోకొచ్చిన హ్యూమనాయిడ్ రోబో వీడియో వైరలవ్వడంతో ఇప్పుడు మళ్లీ హ్యుమనాయిడ్ రోబోల భద్రత, ఉపయోగం, వాటి సామర్థ్యంపై మరోసారి చర్చ ఆరంభమైంది.



