బిల్లా రంగాను మళ్లీ తెరపైకి తెచ్చిన రాఖ్!

రాఖ్… ఇప్పుడీ సీరీస్ హాట్ టాపిక్. గ్రిప్పింగ్ గా తెరకెక్కించే యత్నం. కానీ, తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి ఒర్జినాలిటీ పేరుతో వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం భావదారిద్ర్యం. ఇళ్లల్లో పెద్దవాళ్లు కూడా కనీసం చూడలేని వీధి రౌడీ భాష. మరి ఒర్జినల్ హిందీ భాషలో ఆ తీవ్రత ఉందో, లేదో తెలీదు. పైగా ఇదేం కొత్త కథేం కాదు. మళ్లీ ఓసారి స్క్రీన్ పైకి ఆకట్టుకునేలా తీసుకురావడం మాత్రమే.

1978 ఆగస్ట్ 26న ఢిల్లీలో ఓ ఘటన సంచలనం రేపింది. ఇవాళ మనం మాట్లాడుకుంటున్న నిర్భయకు ముందు అంత భయంకరమైన ఘటన. చేసినవాళ్లిద్దరూ బిల్లా రంగా. ఈ పేరుతో చిరంజీవి, మోహన్ బాబు మెయిన్ క్యారెక్టర్స్ తో తెలుగులోనూ సినిమా వచ్చింది. హిందీలో రంగాఖుష్ పేరుతోనూ ఇదే క్రైమ్ ఇతివృత్తం తెరకెక్కింది.

ఇది 16 ఏళ్ల గీతాచోప్రా, ఆమె తమ్ముడు 14 ఏళ్ల సంజయ్ చోప్రా కథ. వీరిద్దరూ ఢిల్లీలో యువవాణి అని రేడియోలో పాటల ప్రోగ్రామ్ కోసం బయల్దేరారు. వారికి ఆ వర్షం పడుతున్న వేళ మధ్యలో కారులో లిఫ్ట్ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులే బిల్లా రంగా. వారిద్దరూ చిల్లర గూండాలు, సైకోలు. ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్న నేరగాళ్లు. గీత, సంజయ్ ని కిడ్నాప్ చేసి వారి తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూల్ చేయాలన్నది ఆ గూండాల ఉద్ధేశ్యం. కానీ, అది ఆ తర్వాత అత్యాచారం, హత్యగా మారి సంచలనం రేపింది. యావత్ దేశాన్నీ కుదిపేసింది. దాంతో బిల్లా రంగా అనే ఇద్దరు క్రిమినల్స్ పేరు మారుమ్రోగిపోయింది.

గీతా, సంజయ్ తండ్రి ఓ నావికాదళంలో ఓ కెప్టెన్. పేరు చోప్రా. రేడియోస్టేషన్ కు వెళ్లి యువవాణిలో పాల్గొని తిరిగి వచ్చేటప్పుడు చోప్రా ఇద్దరినీ తీసుకొస్తాడని తల్లి చెప్పి పంపుతుంది. కానీ, బయట భారీ వర్షంతో ముందుకు కదల్లేకపోయిన ఇద్దరు పిల్లలు.. దారిలో కనిపించిన కారులో లిఫ్ట్ అడిగి ఎక్కడమే పాపమైపోతుంది. ఆ తర్వాత యథావిధిగా అనుకున్న ప్రకారమే చోప్రా ఆకాశవాణి స్టేషన్ కు వెళ్లితే అసలు అక్కడికి గీతా, సంజయ్ రానేరాలేదనే విషయం చెబుతారు. దాంతో చోప్రాలో టెన్షన్ మొదలైతుంది. పోలీస్ కేసు నమోదవుతుంది. ఢిల్లీతో పాటు, ఇతర ప్రాంతాల పోలీసుల సహకారంతో నేర పరిశోధన ఆరంభమవుతుంది.

సుదీర్ఘ గాలింపు తర్వాత బిల్లా రంగా పోలీసులకు చిక్కారు. రంగా వాంగ్మూలంలో తామే అత్యాచారం హత్యలకు పాల్పడ్డట్టు ఒప్పుకున్నాడు. ఈ విషయం అప్పట్లో విద్యార్థీ లోకంలోనూ ఆందోళనకు కారణమైంది. జీసస్ అండ్ మేరీ కళాశాల విద్యార్థుల వద్దకు వెళ్లిన నాటి విదేశాంగమంత్రి వాజ్ పేయ్ పైనా రాళ్ల దాడి జరిగింది. అందులో ఆయనకూ స్వల్పగాయాలయ్యాయి. అలాంటి బిల్లా రంగా స్టోరీనే మళ్లీ రాఖ్ పేరిట వెబ్ సీరిస్ గా తెరపైకెక్కించారు ప్రోసిత్ రాయ్.

గతంలో పాతాళలోక్ వంటి సక్సెస్ ఫుల్ వెబ్ సీరిస్ తో మురిపించిన ప్రోసిత్ రాయ్… రాఖ్ చిత్రీకరణను గ్రిప్పింగ్ గా మల్చారు. అయితే, అదే సమయంలో ఎనిమిది ఎపిసోడ్స్ నడిపించే క్రమంలో కాస్త ల్యాగ్ కనిపిస్తుంది. మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్ ఇన్స్ పెక్టర్ పాత్ర… సైకో గూండాల్లా ఆకాశ్ మఖీజా.. బాబు పాత్రలో.. అలాగే, రమణ్ దీప్ యాదవ్.. రజ్జో పాత్రలో పెర్ఫెక్ట్ ఫిట్టింగ్. సోనాలిబింద్రే మృతులైన పిల్లల తల్లిగా పెర్ఫార్మెన్స్ కనబర్చినప్పటికీ పాత్ర నిడివి తక్కువ ఉండటం.. క్రైమ్ ఎలిమెంట్స్ తో పోల్చినప్పుడు అంత ఫోకస్డ్ గా తన పాత్రకు గుర్తింపు కనిపించదు.

సీజన్ వన్ గా తెరపైకొచ్చిందంటే… సీజన్ టూగా మరింత పొడగింపు భరించాలని డైరెక్టర్ చేసిన మరో హెచ్చరిక బహుశా! క్రైమ్ ఇష్టపడేవారు ప్రైమ్ లో చూడొచ్చు. కానీ, తెలుగు అవాయిడ్ చేసి హిందీలో చూడటం బెటరేమో! అర్థం కాకుంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఎలాగూ ఉండనే ఉండె.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles