బీహార్ లోని ఓ యదార్థ గాధ: జర్నలిజం శక్తిని చూపించే సినిమా భక్షక్!

గోపాలక్రిష్ణ చెరుకు…✍️
9885542509

జర్నలిస్ట్…ఈ మాట వినగానే ఏ పార్టీ మనిషి అని ఠక్కున అడిగే రోజులివి. కానీ నిజంగా ఓ జర్నలిస్ట్ అంటే ఏంటి…?జర్నలిస్ట్ అనుకుంటే ఏం జరుగుతుంది…??

గత కొన్ని రోజుల క్రితం జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్దులు వరుసగా పాము కాట్లతో హాస్పిటల్ లో చేరారు. చనిపోయారు కూడా. అయితే, పాము కాటు అనే విషయాన్ని దాచేందుకు అక్కడి సిబ్బంది విశ్వప్రయత్నాలు చేశారు. కానీ జర్నలిస్టులు మాత్రం ఆ పాయింట్ వదల్లేదు. ఇంకాస్తా లోతుగా ఆరా తీస్తూ పాముకాటు వల్లే పిల్లలు చనిపోయారా అనే ప్రశ్నని కొన్ని రోజులపాటు బతికించారు. ఆ యాంగిల్ లోనే వార్తలు రాశారు. ఆ తరువాత ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా కదలడంతో ఆ ప్రాంతంలో పాముల పుట్టలు, పదుల సంఖ్యలో పాము పిల్లల ఆనవాళ్లూ కనిపించాయి. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అక్కడికి వచ్చి మరి హాస్టల్లో పరిస్దితి ఆరా తీసేదాక వెళ్లింది వ్యవహారం

ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే.. ఇదిగో నెట్ ఫ్లిక్స్ లోని భక్షక్ అనే ఓ సినిమా చూస్తే… జర్నలిస్ట్ అంటే ఇలా కదా పనిచేయాలనిపించింది. బీహార్ లో జర్నలిజం మీద ఆసక్తితో యూట్యూబ్ చానల్ పెట్టుకుని ప్రజాసమస్యలను చూపిస్తూ ఉంటుంది వైశాలి అనే జర్నలిస్ట్. ఓ సోర్స్ ద్వారా సంక్షేమశాఖ పర్యవేక్షణలో ఉండే ఓ ఎన్జీవో వసతి గృహంలో చాలామంది ఆనాద ఆడపిల్లలుంటారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రి అండదండలతో ఆ ఆడపిల్లల్ని శారీరకంగా ఇష్టానుసారం వాడుతూంటారు. కనీసం మనుషులు అనే కనీస విజ్ఘత కూడా లేనంతగా వారి చర్యలుంటాయి. ఈ విషయం ఓ సోర్స్ ద్వారా తెలుసుకున్న జర్నలిస్ట్ వైశాలి.. ఆ వార్తని ప్రసారం చేయాలనుకుంటుంది. కానీ అది పసిగట్టిన సదరు దుర్మార్గులు ఆమెని బెదిరిస్తారు. బంధువులపై దాడి చేసి ఆమెని కృంగదీస్తారు. నీదో చిన్న యూట్యూబ్ చానల్.. నీ వార్తలెవరు చూస్తారంటూ అవమానిస్తారు..

చివరికి భర్త కూడా.. రూపాయి సంపాదించలేని ఆ జర్నలిజం అవసరమా అంటూ ఆమెని నిలదీస్తాడు. కానీ జర్నలిజం చేస్తోంది డబ్బుకోసం కాదు… తృప్తి కోసమంటూ మరింతగా ముందుకు సాగుతుంది జర్నలిస్ట్ వైశాలి. ఆమె పట్టుదలతో చివరికి ఆ పిల్లల్ని ఎలా రక్షిస్తుందన్నదే ఈ భక్షక్ సినిమా కథ.

నిజానికి ఈ సినిమా కథంతా 2018 లో నిజంగా వెలుగులోకి వచ్చిన ఓ యథార్దం. నిజంగానే బీహార్ రాష్ట్రంలోని ముఝాఫర్ పూర్ లో జరిగిన ఘటన. అనాడు దేశంలో ఓ సంచలనం ఈ వార్త. హాస్టల్ లో ఉన్న 42 మంది బాలికల్లో 38 మందిపై లైంగిక దాడి జరిగినట్టుగా నాడు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆ ఎన్జీవో నిర్వహిస్తున్న బ్రిజేష్ అనే వ్యక్తితో పాటు, 11 మందిపై పోక్సో కేసులు నమోదు చేశారు. ఆ కేసు ఆదారంగానే తీసిన సినిమా భక్షక్. 2024లోనే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. కానీ ప్రతి జర్నలిస్ట్ ఒకసారి చూడాల్సిన సినిమా.

జర్నలిజం అంటే నిజంగానే జీతం కోసమో.. లేదా, ఏ పార్టీయో ఇచ్చే ఫండింగ్ కోసమో చేసేది కాదు.. ఓ ప్యాషన్ తో చేసేదని చెబుతుంది ఈ సినిమా. అవతలి వ్యక్త కష్టానికో, బాధకో స్పందించే హృదయమే జర్నలిజం. ఓ జర్నలిస్ట్ రాసిన వార్తతో ప్రభుత్వం కదిలింది అంటే ఆ జర్నలిస్ట్ పొందే తృప్తి వేల కోట్లు సంపాదించినా రాదు. యూట్యూబ్ ఛానలా.. లేక, ఏదైనా పేరు మోసిన పేపరో, ఛానలా అన్నది కాదు. రాస్తున్న అక్షరాల్లో “జర్నలిజం” అనేది ఉందా లేదా అనేదే పాయింట్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles