దశాబ్దాల కరవును పారద్రోలిన కలెక్టర్ పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు!

ఉద్యమంలా చేసిన ఓ మంచి పని ఎప్పటికీ నిల్చిపోతుంది. ఆ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నవారిని ఎప్పుడూ తల్చకునేలా చేస్తుంది. అలా ఓ కలెక్టర్ ఆరేళ్ల క్రితం చేసిన పని ఇప్పుడు మళ్లీ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పుణ్యమా అని వార్తల్లోకెక్కింది. అయితే, ఆ ఐఏఎస్ ఎవరో కాదు.. మన తెలుగువాడు… అందులోనూ ఖమ్మం వాడు.. ప్రస్తుత తెలంగాణా ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు పోషిస్తున్నవాడు.

దేవరకొండ కృష్ణభాస్కర్… ప్రస్తుతం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఖమ్మంవాసైన కృష్ణభాస్కర్ పెరిగిందంతా హైదరాబాద్ లోనే. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి తన బాల్యం చదువు ప్రారంభం కాగా.. ఖరగ్ పూర్ లో ఐఐటీ చేసి, ఆ తర్వాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ పూర్తి చేశారు. కానీ, తన గోల్ మాత్రం సివిల్ సర్వీసెస్. ఆ క్రమంలో కృష్ణభాస్కర్ 2011లో సివిల్స్ లో ఆల్ ఇండియా 90 ర్యాంక్ సాధించి ఐపీఎస్ కు సెలెక్టయ్యాడు. కానీ, ఐఏఎస్ అయి తీరాలన్న పట్టుదల ఆయన్ను మళ్లీ పరీక్ష రాయించింది. అంతే.. సరిగ్గా ఏడాది తిరగ్గానే 2012లో ఐఏఎస్ కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ ఇండియా 9వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ కు సెలక్టయ్యాడు.

కృష్ణభాస్కర్ తల్లిదండ్రులిద్దరూ సివిల్ సర్వీసెస్ కావడం.. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు పోషించినవారు కావడంతో.. వారిని చూస్తూ పెరిగిన కృష్ణభాస్కర్ కూ సివిల్స్ అంటే మోజు ఏర్పడింది. కృష్ణ భాస్కర్ తండ్రి భాస్కర్ ఎకనామిస్ట్ గా, ఐఏఎస్ ఆఫీసర్ గా ప్రత్యేక గుర్తింపు పొందగా.. ఆయన తల్లి లక్ష్మీపార్థసారధి కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కావడంతో.. కృష్ణభాస్కర్ కుటుంబమే సివిల్స్ కుటుంబమన్నట్టుగా ముద్రపడిపోయింది.

ఇంతకీ కృష్ణభాస్కర్ ఇప్పుడు మళ్లీ ఎందుకు వార్తల్లోకొచ్చారు..?

కరవు కళ్లకు కడుతుంటే… ఆ కరువులో నాల్గు బొట్లు రాలుద్దామంటే కన్నీటి చుక్కలు కూడా రాల్చలేని దయనీయమైన ప్రాంతంలో వాటర్ రెవల్యూషన్ కు తెరతీశాడు కాబట్టే కృష్ణభాస్కర్ పేరు మారుమోగింది. ఇప్పుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి తన X ఖాతాలో షేర్ చేయడంతో తెరపైకొచ్చింది.

కృష్ణభాస్కర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా కంటే ముందు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్ గా పనిచేశారు. అక్కడ ఆయన సంస్కరణలు ఆ జిల్లాల్లో ఎన్నో మార్పులకు కారణమయ్యాయి. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేలలు పర్రెలు వాసి నీటి జాడ కోసం మనిషి నోరు తెరిచి చూసినట్టుగా కనిపించేవి. అలాంటి సమయంలో, 2020 ప్రాంతంలో భూగర్భజలాలను ఏకంగా ఆరు అడుగుల ఎత్తుకు పెంచడంలో నాటి కలెక్టర్ గా కృష్ణభాస్కర్ చొరవ అనన్య సామాన్యమైనది. అందుకు, నాటి విజనరీ మంత్రి కేటీఆర్ మద్దతు కూడా పుష్కలంగా ఉండటంతో.. కరవు తాండవించిన నేలపై బోర్లు వేస్తే చిమ్మికొట్టేలా నీళ్లు పడేంత భూగర్భజలాలను సాధించి కృష్ణభాస్కర్ రికార్డ్ సృష్టించాడు.

వ్యవసాయాధారిత దేశంలో నీటి నిల్వల క్షీణత ఓ పెను విషాదం. దానికి పరిష్కార మార్గాలు చూపలేని దైన్యమైన పరిస్థితులు అంతకన్నా విచారకరం. వ్యవసాయమే ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నై నిల్చే దేశంలో.. జూదంలా మారిన వ్యవసాయానికి పుష్కలమైన నీటినందించే పరిష్కారం చూపినందుకు కృష్ణభాస్కర్ ను కొనియాడుతూ ఆనంద్ మహీంద్రా X లో పోస్ట్ చేశారు.

భూగర్భ జలాలను పెంపొందించడంలో దేశం ఎదుర్కొంటున్న సమస్య మనందరం చూస్తున్నదే. అలాటి సమస్యలు అధిగమించలేనివేం కావని కృష్ణభాస్కర్ చూపించారు. ఏకాభిప్రాయంతో కూడిన దృఢసంకల్పముంటే ఏదైనా సాధించొచ్చనేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన వాటర్ వండరే ఓ దృశ్యరూపమన్నట్టుగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ సాగింది.

మరి కృష్ణభాస్కర్ అసాధ్యన్నెలా సుసాధ్యం చేశాడు..?

ట్యాంకులను అప్ గ్రేడ్ చేయడం, గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరించడం, వర్షపు నీటితో నింపిన చెరువుకు తూములు ఏర్పాటు చేసి వ్యవసాయ పొలాల్లోకి సాగునీరు వెళ్లేలా చేసిన ప్రయత్నాలు, పైపుల ద్వారా నీటిని మళ్లించడం, జలాశయాల ఏర్పాటు కోసం భూములను సేకరించడం, చెక్ డ్యాముల నిర్మాణం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, నీటి సంరక్షణలో స్థానిక సంస్థలు, మహిళాసంఘాలను పాత్రధారులను చేయడం, కందకాలు తవ్వించడం, ఊళ్లల్లోని చిన్న చెరువుల నుంచి మొదలు పెద్ద చెరువుల వరకూ పూడిక తీయించడం వంటి ఎన్నో కార్యక్రమాలను కృష్ణభాస్కర్ యుద్ధప్రాతిపదికన చేపట్టి విజయవంతమయ్యాడు. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు సాధించి జాతీయస్థాయిలో అవార్డులందుకున్నాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 699 చెరువులను గుర్తించింది నాటి కలెక్టర్ కృష్ణభాస్కర్ నేతృత్వంలోని అప్పటి అధికారుల బృందం. అందులో 450 చెరువులను పూర్తి సామర్థ్యంతో నింపేలా పూడిక తీసి చుట్టూ కరకట్టలతో పునరుద్ధరించారు అధికారులు. వేములవాడ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రమున్న ప్రాంతంలోని గుడిచెరువును విస్తరించి నిత్యం వచ్చే భక్తులకు నీటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు కృష్ణభాస్కర్. అందుకుగాను, చెరువును విస్తరించే క్రమంలో భూసేకరణను కూడా సమర్థవంతంగా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పూర్తి చేసి నాటి ప్రభుత్వానికి, ప్రభుత్వంలో కీలకమైన మంత్రి కేటీఆర్ కు ఎలాంటి బరువైన బాధ్యతల్లేకుండా అన్నీ తానై నడిపించారు.

కృష్ణభాస్కర్ ట్రాక్ రికార్డ్స్!

2019, 2020 రెండు సంవత్సరాల్లో వరుసగా ప్రజా పరిపాలనలో కలెక్టర్ గా అత్యుత్తమమైన ప్రధానమంత్రి అవార్డ్ అందుకున్నారు కృష్ణభాస్కర్. 2019లో సిద్ధిపేట జిల్లాలో భారత ప్రభుత్వ పథకం మిషన్ ఇంద్రధనుష్ ను సమర్థవంతంగా అమలు చేసినందుకు మొదట కృష్ణభాస్కర్ కు ఆ అవార్డ్ లభించింది. మరుసటి ఏడాది 2020లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజా సేవల పంపిణీ, ఫిర్యాదుల పరిష్కార విధానాలను మెరుగుపర్చడంలో ఆయన కృషికిగాను అదే అవార్డ్ మళ్లీ దక్కింది.

అప్పుడెప్పుడో తాను కలెక్టర్ గా సాధించిన విజయాలు ఎప్పటికీ చిరస్మరణీయ విజయాలుగా కృష్ణభాస్కర్ జీవనయానంలో నిల్చిపోతాయనేందుకు తాజా ఆనంద్ మహీంద్రా పోస్ట్ ఓ ఉదాహరణ.

కొసమెరుపేంటంటే… ఐఐటీ, ఐఐఎం, ఐపీఎస్, ఐఏఎస్ ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న మన కృష్ణభాస్కరుడు మంచి సంగీత విద్వాంసుడు. వీణవాద్యంలోనూ మంచి పట్టు సంపాదించిన సంగీత ప్రియుడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles