కాలంతో పోటీ పడ్డ… కాలానికి సంబంధించిన కథొకటి చెప్పుకుందాం. కాలాన్ని తెలిపే గడియారంగా పరిచయమై.. పదికాలాల పాటు నిల్చున్న ఓ బ్రాండ్ వెనుక విశేషం ఇప్పుడు వెబ్ సీరిస్ రూపంలో తెరకెక్కింది. ఓ జర్నలిస్ట్ రాసిన పుస్తక స్ఫూర్తి.. ఆ బ్రాండ్ రూపకల్పన జరిగిన కసరత్తును క్యాన్వాస్ గా మార్చింది. బ్రాండ్ ఎదుగుదలను ఓ అడ్వర్టైజింగ్ ప్రమోషన్ లా కాకుండా మానవీయ కోణంలో చెప్పి ఆరు ఎపిసోడ్ల సీరిస్ ను రక్తి కట్టించాడు డెరెట్రు.
సీరిస్ పేరు.. ” మేడ్ ఇన్ ఇండియా: ఏ టైటాన్ స్టోరీ “
ఇండియన్ వాచ్ కంపెనీ బ్రాండ్లలో పేరుకు తగ్గట్టుగా నిల్చిన బ్రాండ్ టైటాన్! దీని వ్యవస్థాపకుడు జెర్క్సెస్ దేశాయ్. టాటా గ్రూపులోనూ ఇతను భాగస్వామి. పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరిగా గుర్తింపు పొందిన వాడు. తన ప్రతీ అడుగులోనూ జేఆర్డీ టాటా సంపూర్ణ మద్దతున్న పారిశ్రామికవేత్త.
భారతీయ మార్కెట్లో గడియారాల డిమాండ్ పెరిగి దిగుమతి చేసుకుంటున్న రోజుల్లో టైటాన్ ఎంట్రీ ఇచ్చింది. గడియారాల అక్రమ రవాణా కూడా విస్తరించడం, భారతదేశం నాణ్యమైన గడియారాలను తయారు చేయలేదన్న తక్కువ భావన స్విస్ తయారీదారుల్లో బలపడ్డ కాలంలో.. ఆ కాలాన్ని మనమెందుకు కొలమానంలో చూపలేపకోపోతున్నామనే కసి నుంచి పుట్టిందే టైటాన్.

వాస్తవంగా ఒక బ్రాండ్ గురించి పరిచయం చేయడమంటే.. అప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న కంపెనీ గురించి జస్ట్ అదో అడ్వర్టైజింగే. కానీ అంతకుమించి చూపించినప్పుడే… అది సినిమాగానో, సీరిస్ గానో రక్తి కడుతుంది. టైటాన్ పై ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆరు ఎపిసోడ్ల వెబ్ సీరిస్ ఇలాంటి క్యూరియాసిటీనే క్రియేట్ చేస్తోంది.
ఈ సీరిస్ లో నసీరుద్దీన్ షా, జిమ్ సర్భ్ ప్రధాన పాత్రలు పోషించారు.
ప్రముఖ జర్నలిస్ట్ వినయ్ కామత్ రాసిన టైటాన్: ఇన్ సైడ్ ఇండియాస్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కన్స్యూమర్ బ్రాండ్ పేరిట రాసిన పుస్తక స్ఫూర్తితో.. మేడ్ ఇన్ ఇండియా: ఏ టైటాన్ స్టోరీ పేరుతో ఆరు ఎపిసోడ్ల సీరిస్ గా రూపుదిద్దుకుంది.
ఓ సాధారణమైన అండర్ డాగ్ స్టోరీలా కాకుండా.. ఒకింత ఆశ్చర్యకరంగా, అంతకుమించి ఆసక్తికరంగా మల్చడం వల్లే ఈ సీరిస్ ఇప్పుడు వీక్షకుల దృష్టిలో పడింది.
ఎందుకంటే, టైటాన్ బ్రాండును పొగుడ్తూనో, వర్ణిస్తూనో సాగే కథనం కాదిది. ఒక కలను నిజం చేసిన బేహారుల ప్రయాణం. విదేశీ ఉత్పత్తులకే విలువ ఎక్కువైన కాలంలో.. ప్రపంచస్థాయి భారతీయ ఉత్పత్తిని సృష్టించాలనే పట్టుదల, ఆత్మవిశ్వాసం, అంతకుమించిన దూరదృష్టి ఈ కథలో ప్రధానాంశాలు.
మేడ్ ఇన్ ఇండియా: ఏ టైటాన్ స్టోరీని దర్శకుడు రాబీ గ్రేవాల్ టైటాన్ వ్యవస్థాపకుడైన జెర్క్సెస్ దేశాయ్ టాటా గ్రూపుతో చేసే ప్రయాణం నుంచి ఆరంభిస్తాడు. ఆ తర్వాత టైటాన్ ఆది నుంచి సక్సెస్ చూసే వరకూ సాగిన కఠిన ప్రయాణాన్నీ కళ్లకు కడుతాడు.
ప్రభుత్వ అనుమతులు లభించకపోవడం, రుణాలు తిరస్కరించడం, లైసెన్సింగ్ సమస్యలు, తయారీ లోపాలు, ఆరంభంలో తక్కువ అమ్మకాలు.. ఇలా సమస్యలన్నీ ఒక్కొక్కటిగా ఏకరువు పెడుతూ… ప్రతీ విజయం వెనుక ఎంత కష్టముందో చెబుతాడు.

వ్యాపార నిర్ణయాలను కూడా బోర్ లేకుండా ఆసక్తికరంగా చూపించిన విధానం రచనలోని బలం. బ్రాండుకు పేరు పెట్టడం నుంచి ప్రతిభావంతులైన సిబ్బంది నియామకం, గడియారాల తయారీలో క్రియేటివిటీ, మార్కెటింగ్ వ్యూహాలు ఇవన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి.
కాలమే మెటాఫర్ గా సీరిస్ రూపకల్పన!
టైటాన్ బ్రాండ్ అంటేనే కాలాన్ని తెలిపే గడియారమనేంతగా గుర్తింపు. కాబట్టి ఈ గడియారాల కథకు.. సమయాన్నే మెటాఫర్ గా కథ చెప్పే విధానం ఈ సీరిస్ కు ఎసెట్.
గడియారాల తయారీలో లక్ష్యంపై దృష్టి పెట్టిన జెర్క్సెస్ తన జీవితాన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తాడనేది చూపిస్తాడు దర్శకుడు.
వ్యక్తిగత జీవితం, కార్పోరేట్ వ్యవహారాలకు మధ్య.. భావోద్వేగాన్ని జోడించాడు. సీరిస్ ను ఒక బిజినెస్ కేస్ స్టడీలా కాకుండా.. మానవీయ కోణంలో నడిపిన తీరు ఆసక్తికరం. .
జెర్క్సెస్ దేశాయ్ పాత్రతో.. తన కెరీర్లోనే అత్యుత్తమ క్యారెక్టర్ లో అలరించాడు జిమ్ సర్భ్. అసాధ్యంగా కనిపించిన కలను నిజం చేయాలనే పట్టుదలతో ముందుకు సాగే వ్యక్తి తెలివితేటలు, మొండితనం, నమ్మకం.. అన్నింటినీ సరిగ్గా పలికించాడు.
జేఆర్డీ టాటా పాత్రలో హుందాగా కనిపిస్తాడు నసీరుద్దీన్ షా. పెద్ద పెద్ద సంభాషణలు అవసరం లేకుండా.. ఒక చూపు, లేదా ఓ చిన్న చిరునవ్వుతోనే భావాలు పలికించాడు ఈ సీరిస్ లో.


