ఇప్పుడంటే వెదర్ యాప్స్! మరి అంతకుమునుపు..?

ఇవాళంటే ఉష్ణమండలాల్లో ఎలా ఉంటుంది… శీతల ప్రాంతాల్లో ఏం జరుగబోతోంది… వానల నెలవులో వర్షాలెలా కురుస్తాయనే అంచనాలు వేసే వెదర్ యాప్స్ బోలెడన్ని అందుబాటులోకొచ్చాయిగానీ… ఈ వాతావరణాన్ని అంచనా వేసిన భారతీయుల ప్రకృతి జ్ఞానం తరాలనుంచే కొనసాగుతోంది.

ఇప్పుడు పసిఫిక్ లో ఏర్పడ్డ సూపర్ ఎల్నినో ప్రభావంతో ఏరువాక ఆరంభమైనా… సాగుకు సరిపడా వర్షాల్లేక అన్నదాతలు ఆకాశంకేసి చూస్తూ వర్షాలకై ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణానికి సంబంధించిన యాప్స్ లో ఒక్కోదాంట్లో ఒక్కోవిధమైన సమాచారంతో ఒకింత గందరగోళమూ కనిపిస్తోంది.

అయితే ఇంత సాంకేతికత రాకమునుపే భారతదేశం పంచాగాలు, మబ్బుల స్వభావం, జంతువుల ప్రవర్తన, చెట్లు, మొక్కల్లో వచ్చే మార్పులు వంటి ప్రకృతి సంకేతాలను పరిశీలిస్తూ శతాబ్దాలుగా అంచనా వేస్తోంది. ఈ అంచనాలతోనే మన సమాజంలోని రైతాంగం ఇంతకాలం పంటలు పండిస్తున్నారు. గుజరాత్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా వంటి రాష్ట్రాల్లో ఈ సంప్రదాయ పద్ధతులు ఇప్పటికీ అనేకమంది రైతులకు మార్గదర్శకంగా పనిచేస్తూనే ఉన్నాయి.

భారత వాతావరణ శాఖ ఐఎండీ ఎల్నినో గురించి తన అధికారిక ప్రకటన విడుదల చేయకముందే… వెదర్ యాప్స్ పరిస్థితులను అంచనా వేయకమునుపే… గ్రామాల్లోని రైతులు ఎల్నినో ఎఫెక్ట్ ను గ్రహించారు.

ఏ విధంగా అన్నదాతలు వాతావరణాన్ని అంచనా వేస్తారు..?

సౌరాష్ట్రలోని ఓ గ్రామంలో చీమలు తమ గుడ్లను ఎత్తైన ప్రదేశాలకు వరుసగా మోసుకెళ్తున్నాయా, లేదా అని రైతులు గమనిస్తుంటారు. తెలంగాణా వంటి రాష్ట్రాల్లో కప్పలు రాత్రంతా బిగ్గరగా అరుస్తున్నాయా, లేదా పరిశీలిస్తారు. రాజస్థాన్ లో నెమళ్లు పురి విప్పి నాట్యం చేస్తున్నాయా, లేవా గమనిస్తారు. కదంబ పూలు వికసిస్తున్నాయా, లేదా అన్నది కేరళ పరిశీలిస్తుంది.

ఇవన్నీ ఆయా ప్రాంతాల ప్రజలు, రైతులు యాదృచ్ఛికమైన దృక్కోణంలో చూడరు. ఇవన్నీ వానలు సమీపిస్తున్నాయని ఇచ్చే సంకేతాలు.

వాతావరణ శాస్త్రానికి ముందే ఉన్న ప్రకృతి విజ్ఞానం!

ఇప్పుడంటే శాస్త్రీయ పద్ధతిలో మదింపు జరుగుతుండొచ్చుగానీ.. వాతావరణ శాస్త్రమన్నది పుట్టకముందే రైతులు ప్రకృతిని నిశితంగా పరిశీలించి అంచనాలు రూపొందించుకోవడం అనాదిగా వస్తోంది.

అయితే, వ్యవసాయం పూర్తిగా వర్షాధారితం. వానలు ఆలస్యమైతే విత్తనాలు వేసే సమయం ఆలస్యమవుతుంది. ముందే వేస్తే విత్తనాలు మాడిపోతాయి. మళ్లీ మళ్లీ పెట్టుబడులు పెట్టి విత్తనాలు వేయడం రైతుకు ఓ ఆర్థిక నరకం. ఇక అధికవర్షాలు వస్తే పంటలు నాశనమే.

అందుకే తరతరాలుగా రైతులు గాలి దిశ, మబ్బుల ఆకారం, జంతువుల ప్రవర్తన, మొక్కలు పుష్పించే సమయం, గాలిలో తేమలో మార్పులు వంటి అంశాలను గమనిస్తూ సాగు చేసుకుంటున్నారు. ఈ జ్ఞానం ఎక్కడో పుస్తకాల్లో లభించింది కాదు.. పక్కా ప్రాక్టికల్. క్షేత్రస్థాయిలో అనుభవాలతో ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించింది. కాలక్రమేణా స్థానిక వాతావరణాలపై అపారమైన జ్ఞానంగా మారింది.

ఆధునిక శాస్త్రీయ పద్ధతుల్లో వాతావరణ అంచనాలను వైడ్ యాంగిల్ చెబుతుంటారు. కానీ, సంప్రదాయ పద్ధతుల్లో మాత్రం గ్రామాల్లో, ఏకంగా వారి పొలాల స్థాయిలోనే అంచనా వేయగల్గడం అనుభవజ్ఞులైన అన్నదాతలకు వరితో పెట్టిన విద్య.

జంతువులు వాతావరణ సూచికలెలా అయ్యాయి..?

జీవ వైవిధ్యం కావాలని పర్యావరణ ప్రేమికులు ఎందుకు పట్టుబడుతారు..? ఎందుకంటే జంతువులు కూడా ప్రకృతి నియమాలను మనకు సూచించే దూతలుగా మనకు ఉపకరిస్తాయి.

చీమలు తమ గుడ్లను ఎత్తైన ప్రాంతాలకు తీసుకెళ్తే భారీ వానలు పడతాయనే నమ్మకం. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారమైతే.. నేలలో తేమ పెరగడం, గాలిలో పీడనం తగ్గడం వంటి మార్పులను చీమలు ముందే గుర్తించి తమ గుడ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాయి.

ఒడిశా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో టిట్టిభ (LAPWING) పక్షులు ఎత్తైన ప్రాంతాల్లో గూళ్లు కడితే ఆ ఏడాది వర్షాలెక్కువ పడతాయని విశ్వసిస్తారు.
ఇక రాజస్థాన్ లోనైతే నెమళ్లు పురి విప్ప నృత్యాలు చేస్తున్నాయంటే ప్రకృతి పులకరించబోతోందని అర్థం. తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా గిరిజన తాండాల్లో కప్పలు నిరంతరం అరవడాన్ని గాలిలో నిరంతరం పెరుగుతున్న తేమకు సంకేతంగా భావిస్తారు. తేమ ఎక్కువ ఉన్నప్పుడే కప్పలు సంభోగానికి అనుకూల పరిస్థితులేర్పడటంచో అవి మరింత చురుకుగా కనిపిస్తాయి.

ఇక కొన్ని ప్రాంతాల్లోనైతే ఆవుల ప్రవర్తన అసాధారణంగా మారడం, పక్షుల వలసలు, పాములు పుట్టల నుంచి బయటకు రావడం వంటి ఘటనలను కూడా వర్షసూచనలుగా పరిగణిస్తారు.

ఎందుకు జంతువుల ప్రవర్తనను బట్టి ప్రకృతి అంచనా వేయగల్గుతున్నారు..?

జంతువులు గాలి పీడనం, ఉష్ణోగ్రతలు, తేమలో వచ్చే సూక్ష్మమైన మార్పులను మనుషుల కంటే ముందే గుర్తించగల్గుతాయి.

మరి చెట్లు, మొక్కలు ఇచ్చే వర్ష సంకేతాలేంటి..?

మామిడి చెట్లు ముందుగానే పూత వేస్తే వర్షాకాలం సమీపిస్తోందని భావన. వేప చెట్ల కాయలు వచ్చే సమయం కూడా కాలానుగుణ మార్పులను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. అరుదుగా పూచే వెదురు పూలు కూడా వర్షపాతం, పర్యావరణ మార్పులను సూచిస్తుందనేది సంప్రదాయంగా వస్తున్న విశ్వాసం. తుపాన్లకు ముందు మర్రి, రావి చెట్ల ఆకులు ముడుచుకోవడం, వాటిపై తేమ పేరుకుపోవడం వంటి మార్పులనూ రైతులు గమనిస్తుంటారు.

ఇక కేరళలోనైతే కదంబ, కనికొన్న (క్యాసియా ఫిస్టులా) పూలు వికసించడం వల్ల వర్షాలు దగ్గర్లోనే ఉన్నాయని నిర్ధారణకొస్తారు. ప్రకృతిలోని ప్రతీ చెట్టూ ఒక రుతు సూచికగా పనిచేస్తుందన్నది గ్రామీణుల విశ్వాసం.

ఆకాశాన్ని సైతం చదివిన రైతులు!

సాంప్రదాయ భారతీయ వ్యవసాయంలో ఆకాశ పరిశీలన ప్రధానమైనది. చంద్రుడి దశలు, నక్షత్రాలు, గాలి దిశ, రాత్రిపూట ఆకాశంలో కనిపించే మార్పులను బట్టి రైతులు విత్తనాలు వేసే సమయాన్ని నిర్ణయించడం ఆనవాయితీగా ఈ లేటెస్ట్ టెక్నాలజికల్ యాప్స్ రాకమునుపు నుంచే కొనసాగుతోంది. ఇక కొన్ని నక్షత్రాల ఉదయాలు, అస్తమయాలు కూడా వానాకాలాన్ని సూచిస్తాయట. ఇప్పటికీ ఊళ్లల్లో అన్నదాతలు ఈ ఖగోళ పరిశీలనలతో వర్షాలను పోల్చి చూసుకోవడం సర్వసాధారణం.

సహదేవ – భడ్లీ సంప్రదాయమంటే ఏంటి..?

మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ సహదేవ – భడ్లీ అనే వ్యవసాయ పంచాంగాలను ఇంకా కొందరు రైతులు అనుసరిస్తుంటారు. ఈ పంచాంగం ప్రకారం గాలి దిశ, మేఘాల ఆకారం, ఉరుములు, గ్రహాల స్థానాల వంటి అంశాలను ఆధారంగా తీసుకుని రుతుపవనాలను అంచనా వేస్తారు. తరతరాలుగా మౌఖికంగా సంక్రమించిన ఈ జ్ఞానం ఇప్పటికీ గ్రామీణ నేపథ్యంగా కనిపిస్తూనే ఉంది.

కేరళ తీర ప్రాంతాల్లో ప్రత్యేక అంచనాలెలా వేస్తారు..?

మనకు భారత పశ్చిమ తీరం నుంచే వర్ష సూచనలు మొదలైతాయి. కేరళలో మత్స్యకారులు వలస పక్షుల రాక, చేపల కదలికలు, అరేబియా సముద్రంలోని గాలుల మార్పులను గమనిస్తూ వర్షాలను అంచనా వేస్తుంటారు. చంద్రుడి చుట్టూ కనిపించే కాంతి వలయాన్ని కూడా వర్ష సంకేతంగా భావిస్తుంటారు. గాలిలో ఉప్పుదనం పెరగడం, అలల తీరు మారడం, తీరప్రాంతాల్లో అకస్మాత్తుగా మబ్బులు కమ్ముకోవడం వంటి ఎన్నో వాతావరణ, ప్రకృతి పరిణామాలను ముఖ్యమైన సూచనలుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే తీర ప్రాంత ప్రజలకు సముద్రమే మొదటి వాతావరణ కేంద్రం.

గిరిజనుల్లో కనిపించే ప్రకృతి జ్ఞానం!

మన దేశంలోని అనేక గిరిజన తెగలు ఇప్పటికీ అడవులు, నదులు, స్థానిక జీవన వ్యవస్థల ఆధారంగా వానలను అంచనా వేస్తున్నాయి. ఒడిశాలోని కోరాపుట్ అటవీ ప్రాంతంలో భూమియా గిరిజనం పురాతన మట్టి గుంతల్లో నీటిమట్టాల్లో మార్పులను గమనించి వాతావరణ అంచనాలు వేస్తుంటారు. తెలంగాణాలోని కోలం గిరిజనులు కప్పల కదలికలను పరిశీలించి వానలపై అంచనాకొస్తారు. ఇక మధ్యభారతంలోని అడవుల్లోనైతే చెదపురుగుల పుట్టలు, పొదల పెరుగుదల, పక్షుల గూళ్ల నిర్మాణం వంటి ప్రాకృతిక మార్పులను వర్షసూచనలుగా భావిస్తారు. ఈ సాంప్రదాయలన్నీ తరతరాల పరిశీలన, అపారమైన అనుభవం, ప్రకృతితో స్నేహం వల్ల ఏర్పడేవి.

ప్రకృతే ఓ వాతావరణ అధ్యయన కేంద్రం!

మరీ శాస్త్రీయంగా ఆలోచిస్తే ఈ సంప్రదాయాలన్నీ జానపదుల విశ్వాసాల్లా మాత్రమే కనిపించొచ్చు. కానీ, ఆధునిక వాతావరణ శాస్త్రం కూడా అంచనా వేయలేని, అందించలేని… స్థానిక స్థాయిలో కూడా వాతావరణ మార్పులను గుర్తించే సామర్థ్యం గ్రామీణ రైతుల పరిశీలనలో, అనుభవంలో కనిపిస్తుంది.

ఓ వెదర్ యాప్ ఓ జిల్లాకో, రాష్ట్రానికో వర్ష సూచన ఎలా ఉంటుందో చెప్పగలదేమోగానీ… ఒక చిన్న లోయలోనో.. లేదా, తమ పొలాల్లోనో తేమ ఎలా పెరుగుతుందో అది ప్రతీసారి చెప్పలేకపోవచ్చు. కానీ, స్థానిక రైతాంగం విశ్వసించే ప్రకృతి నియమాలు ఆ మార్పులను పసిగడతాయి.

వాతావరణ అసమతుల్యతతో రుతుపవనాల దశ దిశ అనిశ్చితంగా మారుతున్న నేటి రోజుల్లో.. భారతదేశపు ఈ ప్రాచీన వర్ష అంచనా సంప్రదాయాలు మనకు… ప్రకృతే ప్రపంచంలో తొలి వాతావరణ కేంద్రమనే ఒక స్పష్టమైన సందేశాన్నైతే అందిస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles