ఆమె ఓ అందాల రాణి. మిస్ సౌత్ అమెరికా టైటిల్ ను కైవసం చేసుకున్న హొయలు ఆమె సొంతం. టెక్సాస్ లో జరిగిన ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్ పోటీల్లో ఆ కిరీటం గెల్చుకున్న నవ్వయవ్వన మందాకిని. మిస్ యూనివర్స్ తరహా పోటీల్లో మిగతావారందరినీ తోసిరాజని.. టైటిల్ గెల్చుకుంది. అయితే, ఆమె మన భారతసంతతి బిడ్డ.. నెలోర్ బ్రీడ్… సారీ నెల్లూరు అనుకునేరు! కానీ, అదే మనకిప్పుడు గర్వకారణం.
ఇంతకీ ఆ బ్రీడ్ ఎవరనేగా…?
భారత సంతతికి చెందిన ఓ ఆవే ఆ అందాల రాణి. అవునూ, ఇప్పుడా ఆ ఆవు రికార్డుల మీద రికార్డులను కొల్లగొడుతోంది. మిస్ సౌత్ అమెరికాతో ఆగిందనుకుంటున్నారా…? ఆమె గిన్నీస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది.

ఇంతకీ ఆ అందాల ఆవు పేరేంటి..? దాని ప్రత్యేకతేంటి..?
వియాటినా-19 పేరు గల నెలోర్ బ్రీడ్ ఆవు 2024లోనే అమ్ముడైన ఆవుల్లో ఖరీదైన ఆవుగా… గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లోకెక్కింది. ఏకంగా 40 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడానికి అంతగా ఈ నెలోర్ బ్రీడ్ ప్రత్యేకతలేంటంటారా..?
53 నెలల వయసున్న నెలోర్ జాతి ఆవు బ్రెజిల్ లోని మినాస్ గెరైస్ లో ఆవుల వేలంపాటలో పాల్గొంది. దీని బరువు ఏకంగా 1 వెయ్యి 101 కిలోల బరువుండగా.. ఈ జాతి ఆవు బరువే సర్వసాధారణంగా మిగిలిన ఆవులకంటే రెండు రెట్లెక్కువ. అందుకే ఇప్పుడు పశుప్రపంచంతో పాటు.. మానవ ప్రపంచమూ మన నెలోర్ బ్రీడ్ ఆవు గురించి ముచ్చటించుకుంటుంది.
ఇది కేవలం ఆరోగ్యకరమైన ఆవుగా 40 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి గిన్నీస్ రికార్డ్సుకెక్కడమే కాకుండా.. మిస్ సౌత్ అమెరికా టైటిల్ ను కూడా గెల్చుకోవడంతో ఈ ఆవు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
ఆవు మూపురమొక్కటి చాలు… యాగంటి క్షేత్రం నుంచి బ్రెజిల్ లో వేలంపాట కోసం ఉరికివచ్చిన బసవన్నను తలపిస్తుంది. ఇక ఈ ఆవు కండరాల నిర్మాణం, జన్యుపరంగా వచ్చిన ఆరోగ్యం, దాంతోపాటే సొగసైన శ్వేతవర్ణంలోని శరీరం వంటివి.. ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్ పోటీల్లో న్యాయనిర్ణేతలను తెగ ఆకట్టుకున్నాయి. అందుకే ముచ్చటపడ్డ న్యాయనిర్ణేతలకు… ఇంకే ఆవూ మన నెలోర్ బ్రీడ్ లా కనిపించకపోయేసరికి.. మిస్ సౌత్ అమెరికా టైటిల్ ఇచ్చిపడేశారు.
ముఖ్యంగా ఉష్ణమండల వాతావరణంలో పెరగడంతో ఈ నెలోర్ జాతి బ్రీడ్ ఆవులకుండే వ్యాధినిరోధకత పాటు.. వీటి సంతానోత్పత్తి సామర్థ్యం వల్ల వియాటినా-19 పిండాలకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది.
బ్రెజిల్ కు చెందిన పశువైద్యురాలు లారానీ మాట్రిన్స్.. అసలు ఆరోగ్య పరిపూర్ణత అంటే ఎలా ఉండాలో ఈ నెలోర్ బ్రీడ్ ఆవును చూస్తే అర్థమైతుందంటారు. దీని యజమాని చాలా లక్కీఫెల్లో అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
మన నెలోర్ బ్రీడ్ ఆవులపై బ్రెజిల్ ఎప్పుడూ ముచ్చటపడుతూనే ఉంది. అందుకే, ప్రపంచంలోనే అత్యధిక నెలోర్ జాతి ఆవులు బ్రెజిల్ లో ఉన్నాయి. ఈ ఆవుల్లోనూ 80 శాతం జెబూ సంతతికి చెందినవి. శతాబ్దాల నుంచే ఈ జాతంటే బ్రెజిల్ వాసులకిష్టం.1868 నుంచే ఈ జాతి పశువులను మన నుంచి బ్రెజిల్ దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒంగోలు పశుపరిశ్రమలో ఈ నెలోర్ జాతి ఓ రకం. యూఎస్ లెక్కల ప్రకారం బ్రెజిల్ పశుపరిశ్రమ ఇలాంటి ఆవుల సంతతిని పెంచుతూ దాదాపు ఇప్పటికే 230 మిలియన్ల ఆవులను కల్గి ఉన్నట్టు ఓ అంచనా.
అదండి మనవాళ్లు అమెరికాలో, చైనా, రష్యాల్లో ఉంటే ఎంత గర్వపడుతున్నామో… మన దేశసంతతికి చెంది పశుపక్షాదులకు కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ను సంతరించుకుంటున్నాయంటే.. అసలిది కదా జీవవైవిధ్యం.



