కపటప్రేమ కాటుకు మూగబోయిన పాట: THE SONG OF SCORPIONS!

పూదోట శౌరీలమ్మ, మియాపూర్, హైదరాబాద్ ✍️

…………………………………………………………………………………………………….

The Song Of Scorpions ( ది సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్)

ఇది ఆగస్టు 2017లో స్విట్జర్లాండ్ 70వ ఫిల్మ్ ఫెస్టివల్ లో విడుదలైన రాజస్థానీ చిత్రం. అదే సమయంలో స్విస్, ఫ్రెంచ్, సింగపూర్ దేశాల భాషల్లోగూడా ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా రచన, దర్శకత్వం అనూప్ సింగ్.

సుమారు రెండు గంటలు(11 నిమిషాలు) నడిచే ఈ సినిమా మనదేశంలో 2023లో విడుదలైంది. కత విషయానికొస్తే హీరోయిన్ నూరన్( ఫర్హాని.. ఇరానియన్, ఫ్రెంచ్ నటి) తన అమ్మమ్మతో( వహీదా రెహమాన్) కలిసి థార్ ఎడారుల్లో వున్న ఒక గిరిజన గ్రామంలో నివసిస్తూ వుంటుంది.


ఎడారి ట్రైబల్ తెగకు చెందిన వీరు, ఎడారుల్లో వుండే విషపూరితమైన తేళ్ళు, పాములు, ఇతర పురుగులు కుట్టినప్పుడు వారిని తమ తరతరాల సాంప్రదాయ మూలికావైద్యంతో ప్రాణాపాయం నుండి కాపాడుతూ వుంటారు. వారు మూలికల పసరు తేలు కుట్టిన చోట రాస్తూ, నాడిని పరీక్షిస్తూ, శ్రావ్యమైన తమ గొంతుతో ఎడారిపాటలు పాడుతూ వుంటారు.

మూలికలు, ఆ పాటల ప్రభావంతో రోగి విషవిముక్తుడై ప్రశాంతంగా నిద్రపోతాడు. రోగి బంధువులు సంతోషంతో ఇచ్చిన తృణమో, ఫణమో తీసుకుంటారు. నూరన్, తన అమ్మమ్మ నుండి ఈ వైద్యవృత్తిలో మెలకువలు నేర్చుకుంటుంది. రాత్రుల్లో ఆ ఇసుక తిన్నెల మీద నిలబడి, గొంతెత్తి నూరన్ ఆలపించే ఆ ఎడారిగీతాలు, ఎడారంతా ప్రతిధ్వనిస్తూ, అక్కడివారిని సమ్మోహితులను చేస్తుంటుంది. నూరన్ తన స్నేహితురాలు మున్నీ తోనూ, తనను ఎంతో ప్రేమించే అమ్మమ్మ తో కలిసి జీవితాన్ని ఆనందంగా గడుపుతూ వుంటుంది.


హీరో ఆదం ( ఇర్ఫాన్ ఖాన్) ఒంటెల వ్యాపారి. థార్ ఎడారిలో ఒంటెల క్రయవిక్రయాలు చేస్తూ ఉంటాడు. ఎలాంటి సంకోచాలు లేకుండా ఎడారుల్లో స్వేచ్చగా తిరిగే నూరన్ పాటలు వింటూ, ఆమెను గమనిస్తూ వుంటాడు. ఆమెతో చూపులు, మాటలు కలపాలని, ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని చూస్తూ వుంటాడు. కానీ నూరన్ ఇవేమీ పట్టించుకోదు. రెండు ముఖాలు( స్వభావాలు) కలిగిన ఆదమ్.. నూరన్ పై ప్రేమ నటిస్తూ, సమయం కోసం వేచి చూస్తుంటాడు.


ఒక రాత్రివేళ, ఒక పిల్లవాడి పిలుపుతో.. తేలు కుట్టిన అతని అన్నను కాపాడటానికి నూరన్ ఒంటరిగా వెళుతుంది. లాంతరు వెలుగులో, ముందువెనుకe ఆలోచించకుండా.. అమ్మమ్మ మాట కూడా వినకుండా.. ఆ ఇసుకతిన్నెల్లో పడి వేగంగా వెళ్తుంది. అక్కడ ఆదమ్ పన్నిన ఉచ్చులో చిక్కు కుంటుంది. అది ఆదమ్ పన్నిన ఉచ్చు అని తెలుసుకోలేకపోతుంది.

అతని ప్రేమ.. నటన అని తెలుసుకోలేక, ఆ ఉచ్చులో ఇరుక్కుంటుంది. ఆదమ్ నీచబుద్ధి, అతని కుట్ర తెలియక.. పర పురుషుని బలత్కారానికి గురై, గర్భిణీ అయిన నూరన్ ఏమి చేసింది? ఎలా ప్రతీకారం తీర్చుకుంది.? అత్యాచారానికి గురైనపుడు మూగబోయిన ఆ గొంతులో మళ్ళీ ఎడారిపాట వినిపించిందా, లేదా..? మాయమైపోయిన అమ్మమ్మ ఏమైంది? నూరన్ ప్రతీకారం తీర్చుకోవడంలో ఎడారి తేళ్ళు ఎలా ఉపయోగపడ్డాయి. ఇవన్నీ కలిసి ఓ ఉద్వేగంతో సాగే ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది.. కత, సినిమాటోగ్రఫీ. “ద గ్రేట్ ఇండియన్ డిజర్ట్” థార్ లో ఎలాంటి సెట్టింగులు లేకుండా.. సహజంగా తీసిన సినిమా ఇది. విస్తారమైన ఇసుకతిన్నెలు, చీకట్లో వెలిగిపోయే ఆకాశం, నక్షత్రాలు, ఎడారి పల్లెలు, ఒంటెల బేహరులు ఇసుకదిబ్బల్లో వేసే నెగడుల్లో, చీకటి వెలుగుల్లో భయ సౌందర్యంతో మెరిసిపోయే బంగారు రంగు ఇసుకదిబ్బలు, అక్కడి మనుషుల అనుబంధాలు, రేయంతా వినిపించే వారి పాటలు, సంగీతం, నృత్యం, ఒకదాని వెనుక ఒకటి బారులు తీరి వెళ్ళే ఒంటెల సౌందర్యం.

మనం చూడని థార్ ఎడారి సౌందర్యాన్ని అంతా ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్ పియ ట్రో(Pietro) రాసి పోసి చూపించారు. ప్రైమ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వుంది. ఎడారి పట్ల వున్న ప్రేమతో స్వయంగా థార్ ఎడారిలో పయనించిన నాకు.. ఈ సినిమా ఎంతగానో నచ్చింది. ఈ సినిమాలో చూసిన ఎడారిని కనులార కూడా చూసినందుకు ఎంత ఆనందంగా వుందో!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles