సెలబ్రిటీలు సైతం క్రేజ్ కనబర్చే.. స్టాండప్ కమేడియనతను!

ఓ షో ఎప్పుడైపోతుందా.. ఎప్పుడు వెళ్లిపోదామా.. లేక, మధ్యలోనే మెల్లిగా లేచి బయటపడదామా అనుకునేవి కొన్నైతే.. అయ్యో అప్పుడే షో ఐపోయిందా అనుకునేవి కొన్ని. అందులో అలెగ్జాండర్ బాబు స్టాండప్ కామెడీ షో ఒకటి.

ఓసారి మెడలో హార్మోనియంతో దర్శనమిస్తాడు.. మరోసారి జస్ట్ కాంగో వాయిస్తూ.. ఒకే కాంగో రిథమ్ ప్యాటర్న్ పై సంగీత దర్శకులెలా జిమ్మిక్కులు చేయగలరో చూపిస్తాడు. సెన్స్ ఆఫ్ హ్యూమర్.. టైమింగ్.. ఈ రెండూ ఆ స్టాండప్ కమేడియన్ సొంతం. వాటికి తోడు ఎడ్యుకేటెడ్. బీటెక్ పూర్తి చేసి అమెరికా బాట పట్టి.. ఎంఎస్ చేసి.. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తిరిగి ఇండియాకు వచ్చి.. స్టాండప్ కమేడియన్ గా సెటిలైన అలెక్స్ స్టోరీ ఇది.

యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వంటివాటిల్లో వండర్ ల్యాండ్ పేరిట నిర్వహించే అలెగ్డాండర్ బాబు స్టాండప్ కామెడీకి ఫ్యాన్స్ కొల్లలు. తమిళనాట కోలీవుడ్ హీరోలను మించి అలెక్స్ స్టాండప్ కామెడీ షోలకు భలే గిరాకీ కూడాను. అయితే, అలెక్స్ టాప్ హీరోస్ ని, ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు.. ఇలా ఎవ్వరినీ వదలకుండా తన స్టాండప్ కామెడీ షోలకు వారిని వస్తువుగా చేసుకోవడంపై ఒకింత విమర్శలున్నప్పటికీ.. ఆ షోస్ చూస్తే అలెక్స్ కామెడీ వస్తువులైనవారు కూడా హహ్హహ్హా అని నవ్వుకుంటూ వెళ్లిపోతారు. అలెక్స్ తన కామెడీ షోస్ తో అలా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.

స్టాండప్ కమేడియన్ గా రాణించాలంటే.. కేవలం మాటలే కాదు.. పాటలూ రావాలి.. సంగీతం తెలియాలి.. ఛలోక్తులుండాలి.. వ్యంగం రంగరించాలి.. వెటకారం ప్రతిధ్వనించాలి.. ఇలా ఇవన్నీ అలెక్స్ స్పెషాలిటీ. కే.జే ఏసుదాసుపై అమెజాన్ ప్రైమ్ వీడియోలో అలెక్స్ ఇన్ వండర్ ల్యాండ్ పేరుతో చేసిన ఓ స్టాండప్ కామెడీ షో విపరీతమైన క్రేజును సంపాదించుకుంది. మాసీ మాస మాళాల అంటూ.. తెలుగులో ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. రాదే వెన్నెలమ్మ అన్న ఇళయరాజా పాటపై అలెక్స్ సెటైర్స్ సరదాగా సాగుతాయి. అదే సమయంలో బాలకృష్ణ వంటి హీరోలపై వేసిన సెటైర్స్ ఆయన ఫ్యాన్స్ కు కోపమూ తెప్పించాయి. అదే పాటలో కే. జే. ఏసుదాసు దాన్ని తమిళంలో పాడిన తీరు పూర్తి ఆధ్యాత్మిక రీతిలో ఎలా సాగిందో ఒకింత వెటకారం జోడిస్తే.. తెలుగులో ఎస్పీబీ పాడిన తీరుకు తానేం తక్కువా అన్నట్టు బాలయ్య వేసిన స్టెప్పులపైనా అలెక్స్ చమత్కారం ఒకింత వివాదాస్పదంతో పాటు.. మరింత నవ్విస్తుంది. ముఖ్యంగా ఒక్కసారి బాలకృష్ణ వేసే ఆ స్టెప్పులను.. ఆ పాటను మీరు చూస్తే.. ఎప్పుడూ ఆ పాటను మళ్లీ మళ్లీ చూడకుండా ఉండలేరంటూ ఒకింత వ్యంగ్యాన్ని జోడించి అలెక్స్ ఓ ఆటాడుకోవడం పెద్ద ఎత్తున వార్తల్లోకెక్కింది.

అలాగే ఎంఎస్ విశ్వనాథన్ డబుల్ బ్యాంగోస్ పై ఒక రిథమ్ ప్యాటర్న్ తో ఒక డ్యూయెట్ సాంగ్ ఎలా చేయగలడు, ఒక ప్యాథటిక్ సాంగ్ ఎలా తీర్చిదిద్దగలడు, ఒక రొమాంటిక్ పాటకు ఎలా ట్యూన్ కట్టగలడనేవీ వినిపిస్తూ.. ఎంఎస్ కు ట్రిబ్యూట్ గా.. ఆయన యాభై ఏళ్లపాటు ఎలా కేవలం చిన్న ట్రిక్కీ మ్యూజికల్ ప్యాటర్న్స్ తో సినిమా సంగీత పరిశ్రమను ఏలగల్గాడో చెబుతాడు అలెక్స్.

2014లో తన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కార్పోరేట్ జాబ్ కు రిజైన్ చేసిన అలెక్స్.. ఆ తర్వాత స్టాండప్ కామెడీ షోస్ పై ఫోకస్ చేశాడు. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, దుబాయ్, కువైట్ ఇలా ఇప్పుడు అలెక్స్ తన కామెడీ షోలతో తిరగని దేశం లేదు. తమిళనాడు రామనాథపురం జిల్లాలోని అందవూరని అనే ఓ గ్రామంలో పుట్టిన అలెక్స్.. అమెరికాలో పనిచేస్తున్నప్పుడే కర్నాటక సంగీతంలో కూడా శిక్షణ తీసుకున్నాడు. అది కూడా అలెక్స్ కు కలిసొచ్చింది. ఇప్పుడు అలెక్స్ కామెడీ షోసంటే జనానికి వేలంవెర్రి.

తన స్టాండప్ కామెడీ షోస్ తో చాలామందిని టార్గెట్ చేస్తాడనే అభిప్రాయమున్నా.. అలెక్స్ షోసంటే అదే స్థాయిలో క్రేజ్ ఉండటం కూడా అలెక్స్ ప్రత్యేకత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles