సంకల్పం ముందు అంగవైకల్యం చిన్నదని చాటిన ప్యారా ఒలింపియన్!
ఇబ్రహీం అల్ హుస్సేనీ హమాద్టో… ఈయన చూసేవాళ్ల కళ్లకు మాత్రమే వికలాంగుడు. కానీ ఆయన ఆట మొదలెట్టాడంటే… ప్రత్యర్థి కంటే బలవంతుడు. ఆయన జీవితంతో పాటే… ఆయనాడే టేబుల్ టెన్నిస్ లో ఓటములుండొచ్చు. కానీ ఆ ఓటములైనా… విజయం సాధించిన అజేయులను మించి ఆశ్చర్యపర్చడం ఇబ్రహీం ఆటలో కనిపించే మెస్మరైజేషన్. ఇబ్రహీం అలా ఓటమి వైపే ఒదిగిపోయిన రకం కాదు… మూడు సిల్వర్ మెడల్స్ ను సాధించి ప్రపంచంలో ఛాంపియన్ గా ఎదిగిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్. ఇప్పుడెందరో నవయువత వివిధ రకాలో గేమ్స్ లో భాగంగా ఒలింపిక్స్ లోకి ఎంటరై సత్తా చాటుతున్న వేళ.. ఇబ్రహీం స్టోరీ ఓ ఇన్సిపిరేషన్.

జస్ట్ పదేళ్ల వయస్సులో రైలు ప్రమాదంలో తన రెండు చేతులూ కోల్పోయాడు ఈ ఈజిప్షియన్ ఇబ్రహీం. వాస్తవానికి ఇబ్రహీంకు చిన్ననాటి నుంచే క్రీడలంటే ఉన్న అమితాసక్తితో ఫుట్ బాల్ ప్లేయర్ కావాలని ఉత్సాహపడ్డాడు. కానీ విధి వక్రించేసరికి.. రెండు చేతులూ కోల్పోయిన ఇబ్రహీంకు.. తన సాకర్ కల నెరవేరలేదు. అయినా, నిరాశతో వెనకడుగు వేయకుండా… రెండు చేతుల్లేకుంటే ఏం…? అని నోటితో రాకెట్ ను కర్చుకుని… టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. గతంలో జరిగిన ప్యారా ఒలంపిక్స్ లోనూ తన ఆటతో జనాన్ని సమ్మోహనపర్చాడు. ఇప్పుడు ఒలింపిక్స్ తో పాటు.. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకూ జరుగబోయే ప్యారా ఒలింపిక్స్ లోనూ మళ్లీ జయకేతనం ఎగురేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
ఏ అంశమైతే హాట్ టాపిక్ గా మారుతుందో… దేనికైతే క్రేజ్ ఎక్కువ ఉంటుందో… దేనికైతే రేటింగెక్కువో వాటి గురించే మాట్లాడే సమాజం మనది. అందుకే ఒలింపిక్స్ పై జరిగినంత చర్చ… సమాజంలో ప్యారా ఒలంపిక్స్ పై కనిపించదు. కానీ ప్యారా ఒలింపిక్స్ కు ఎన్నికై అక్కడ ఆడిన ప్రతీ ఆటగాడూ ఓ మెరుపు తునకే. ఓ తురుపుముక్కే. అందులోనూ అందరినీ ఆకట్టుకున్న టెబుల్ టెన్నిస్ ఆటగాడు… ఇబ్రహీం అల్ హుస్సేనీ హమాద్టో మరింత ప్రత్యేకం. ఎందుకంటే తన పదేళ్ల వయస్సులో రెండు చేతులను పూర్తిగా కోల్పోయిన ఇబ్రహీం… ఇవాళ 4 పదులు వయస్సు తర్వాత కూడా ఇంకా ప్యారా ఒలంపిక్స్ లో వీక్షకులకు కనువిందు చేస్తూనే ఉన్నాడు. సుదూరమైన ఆయన క్రీడా ప్రయాణం… అంతే పట్టు సడలని ఉక్కు సంకల్పంతో సాగుతున్న తీరు.. కాళ్లూ, చేతులు బాగుండి కేవలం ఏకాగ్రతతో కూడిన సంకల్పబలం కావల్సినవాళ్లకు ఓ స్ఫూర్తి
2011, 2013 ఆఫ్రికన్ ఛాంపియన్‌షిప్‌లతో పాటు.. 2013 ఈజిప్ట్ ఓపెన్‌లో కలిపి మూడు రజతాలను సాధించాడు హమాద్టో. రాకెట్ ను నోటితో పట్టుకుని… కాళ్ల వేళ్ల మధ్య బంతినుంచి… నేర్పుగా టేబుల్ టెన్నిస్ ఆడే ఇబ్రహీం ఆటతీరు ఒక విజువల్ వండర్. ఇబ్రహీం తన రైలు ప్రమాదం తర్వాత ఈ సమాజం చూపించే సానుభూతి, జాలి వంటి నెగటివిటీని తట్టుకోలేకపోయాడు. కొంతకాలం కేవలం రాత్రి వేళల్లో మాత్రమే బయటకొచ్చేవాడు. ఇవాళ తనాడుతున్నప్పుడు కేవలం తన కన్వర్సేషన్ ను బాల్ తో మాత్రమే చేయగల్గేంత ఏకాగ్రతను సాధించాడు. అందుకే టేబుల్ టెన్నిస్ ఆడుతున్నప్పుడు ఎదురుగా ఎంత గొప్ప ప్రత్యర్థి ఉన్నా… ప్రేక్షకుడికి మాత్రం హమాద్టోనే కింగ్ లా కనిపిస్తుంటాడు.
అయితే ఇద్దరు మిత్రుల ఇన్సిపిరేషనే ఇబ్రహీంను ఇవాళ స్టార్ ప్లేయర్ గా వార్తల్లో నిలిపింది. అందులో ఒకరు నెగటివ్ మోడ్ లో ఇబ్రహీంలో కసి పెంచితే… ఇంకొకరు తనను వెన్ను తట్టి ప్రోత్సహించిన వ్యక్తి. అప్పటివరకూ స్నేహితులతో ఫుట్ బాల్ ఆడుతూ హాయిగా గడిపిన జీవితంలో జరిగిన యాక్సిడెంట్ తో చేతులు కోల్పోయినప్పుడు… నువ్విక జీవితంలో ఎప్పటికీ ఆడలేవన్న ఓ ఫ్రెండ్ మాటలు ఇబ్రహీంలో కసి పెంచాయి. నువ్వేదైనా దృష్టి సారిస్తే అదయ్యేంతవరకూ వదలని పట్టుదల నీలో ఉంది.. కాబట్టి, ప్రయత్నించు అంటూ మరో స్నేహితుడు భుజం తట్టిన తీరు ఇబ్రహీంలో ఉత్సాహాన్ని నింపింది. సో నెగటివిటీలోంచీ… పాజిటివిటీలోంచి… అలా, రెండింట్లోంచీ పాజిటివిటీనే గ్రహించి… ఇవాళ ఎందరికో ఓ పాజిటివ్ స్టోరీ అయ్యాడు. సంకల్ప బలం ముందు అంగవైకల్యమెంత చిన్నదో ప్రపంచానికి చాటాడు.
అందుకే సవాళ్లకెదురీదేవారికిచ్చే మహ్మద్ బీన్ రషీద్ ఆల్ మక్తమ్ క్రియేటివ్ స్పోర్ట్స్ అవార్డ్ కూడా ఇబ్రహీంను వరించింది.



