చావా ‘ చితక్కొట్టాడు!
………………………………………………………………………………………………………
Narukurti Sridhar… ✍️
శివాజీ మహారాజ్ మరణ వార్త విని ఔరంగజేబు ఆనందించే లోపే బుర్హానపూర్ పైకి దండెత్తి వస్తాడు శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ. మరాఠా సైనికులు కోటలోకి రాకుండా పదిహేను అడుగుల వెడల్పు గల హర్డిల్ ని అడ్డంగా దింపుతారు మొఘుల్ సైనికులు. శంభాజీ ఒక్కడే తన గుర్రాన్ని ఆ హర్డిల్ పైనుంచి దూకిస్తూ వందలాది మంది మొఘల్ సైనికుల మధ్య ల్యాండ్ అవగానే, మిగతా సినిమాలో, ప్రేక్షకుడు తానేమి చూడబోతున్నాడో ఒక అవగాహనకి వస్తాడు. అరుపులు పెడబొబ్బలతో యుద్ధం మొదలవుతుంది. ఇంతలో యుద్ధం మధ్యలో ఏడుస్తూ తిరుగుతున్న ఒక చిన్న పిల్లాడిని శంభాజీ రక్షించి వాళ్ళమ్మకి అప్పచెబుతాడు. ఈ సన్నివేశం ఎందుకో ప్రేక్షకుడికి అర్థం కాదు. సినిమా చివర్లో మొఘల్ సైనికులు శంభాజీ రాజ్యంలో పిల్లల్ని కూడా చంపారని చూపిస్తూ, బహుశా శంభాజీ గొప్పదనాన్ని ఎలివేట్ చేయడం కోసం ఆ సన్నివేశం రాసుకున్నాడు డైరెట్రు.

ఆ పిల్లాడిని కాపాడేశాక అసలు సిసలు ఏడు అడుగుల యోధుడితో తలపడతాడు. అంతలోనే ఫ్లోర్ పై ఉన్న తలుపులు తెరుచుకోవడంతో పై అంతస్తు నుంచి కింద అంతస్తుకి పడిపోతాడు. అక్కడ ఆకలిగొన్న గ్రాఫిక్స్ సింహంతో తలపడతాడు. సింహం గొంతు చీల్చి పైకి వస్తాడు. ప్రేక్షకుడు తాను చరిత్ర చూస్తున్నాడో, పొరబాటున ఎన్టీఆర్ సింహగర్జన సినిమాకి వచ్చేసాడో తెలీక గందరగోళానికి గురై ఫోన్ లో శంభాజీ గురించి గూగుల్ తల్లిని అడుగుతాడు .
గూగుల్ తల్లి వికీ పీడియాకి పంపిస్తుంది. తన యవ్వనంలో అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఒక బ్రాహ్మణ యువతిని చెరిచాడని కోపించి, శివాజీ తన కొడుకుని ఒక కోటలో బంధించి ఉంచాడని, శంభాజీ ఆ తర్వాత మొఘల్ సైనికులతో కలిసి మరాఠాలతోనే పోరాడాడని, ఆ పై తండ్రి చనిపోయిన తర్వాత మరాఠా రాజు అయ్యాడని చెబుతుంది వికీ. తెరపై స్వరాజ్యం కోసం పోరాడే శంభాజీకి వికీపీడియా శంభాజీకి పోలికలు కుదరక ప్రేక్షకుడు తల పట్టుకుంటాడు .
అయ్యా, సినిమా కొద్దిసేపటికే బోర్ కొట్టి గూగుల్ కి వెళ్ళాను కానీ భారతీయ సినిమాలో చరిత్ర వెదుక్కునేంత అమాయకుడిని కాదు. సినిమాలో ఏ ఒక్క సన్నివేశానికి కనెక్ట్ కాకపోవడానికి కారణాలు వెదుక్కునే అమాయక ప్రేక్షకుడిని మాత్రమే ! సినిమా మొత్తం శంభాజీ అనే పాత్రని ఎలివేట్ చేయడానికి మాత్రమే రాసుకున్నాడు. ఆ పాత్రకి శారీరిక బలాన్నే కాకుండా కొన్ని తెలివితేటలు పెట్టి ఉంటే బాగుండేది .
సినిమాలో ఒక డైలాగు ఉంటుంది.
“ రాజా ఐదువేల మంది సైనికులు చుట్టుముట్టారు.. మనం నూటా యాభై మందిమి మాత్రమే ఉన్నాం … మీరు తప్పించుకుని రాయగఢ్ వెళ్లిపోండి ..”
“కుక్కల దండు వచ్చిందని సింహం ఎక్కడైనా పారిపోతుందా!” అంటూ శంభాజీ సింహంలా అరుచుకుంటూ శత్రుసైన్యం మీద పడతాడు .
అసలు వీళ్ళందరినీ మసాయి మారా తీసుకెళ్లి చూపించాలి. సింహం ఒంటరిగా ఉంటే హైనాల చేతిలో చస్తుంది. సింహం కూడా అలాంటి సందర్భంలో ఇరుక్కోకుండా ఉండటానికే ప్రయత్నిస్తుంది. పాపం చరిత్రలో శంభాజీ కూడా పారిపోవడానికే ప్రయత్నించి ఉంటాడు. ఈ దిక్కుమాలిన డైరెక్టర్లు మాత్రం అతనికా ఛాన్స్ ఇవ్వరు. అతను మనిషిలా కాకుండా ఒక క్రూరమృగంలా మాత్రమే ప్రవర్తించాలి. వేలాది మంది సైనికులపై ఒక్కడే పడి యుద్ధం చేయాలి.
అయ్యా , నేను సినిమాటిక్ లిబర్టీకి కూడా వ్యతిరేకిని కాదు. సినిమా లీనమయ్యేలా ఉంటే, ఫోన్ వైపుకి కాకుండా స్క్రీన్ వైపుకి తీసుకెళ్లి ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేసి ఉండేవాడిని కాదు. ఇదొక పరమ బోరింగు సినిమా. కనీసం హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ తీయడంలో కూడా విఫలం అయింది. ఎవడ్రా బీజీఎం ఓవర్ చేస్తున్నాడు అనుకున్నాం. రెహమాన్ అట. రెహమాన్ ని ఇలా వినడం బాధాకరం. అవసరం లేకపోయినా ఎమోషనల్ మ్యూజిక్ తో సినిమాని నింపేశాడు. దానితో అసలు సన్నివేశాల్లో ఏ ఎమోషన్ కలగకుండా చేసేశాడు.
పాపం విక్కీ కౌశల్ కి అరవడంతోనే సరిపోయింది. రష్మిక సో సో…
ఔరంగజేబు అక్షయ్ ఖన్నా అట… మేకప్ ఎక్కువయ్యి ఎవరో తెలియలేదు. సమస్య ఏమిటంటే ఆ మొహంలో ఫీలింగ్స్ అన్నీ మేకప్ లో కొట్టుకుపోయాయి .
ఆఖర్లో ఔరంగజేబు శంభాజీని అడుగుతాడు స్వరాజ్యం అంటే ఏమిటని ? అతనికే కాదు సినిమా అంతా అయిపోయినా ప్రేక్షకులకి కూడా అర్థం కాలేదు. పాపం శంభాజీకి అప్పట్లో తెలుసో ! లేదో!! తెలీదు .. స్వస్తి.
( Inglorious bastards అని tarantino మూవీ ఉంది . చరిత్రని మార్చి డ్రామా లా రాస్తాడు. దానిలో హిట్లర్ ని చంపేస్తారు. కనీసం ఆ technique వాడుకుని తీసినా బాగుండును. డబ్బుల కోసం అన్నిటినీ జై హింద్ మోడల్ లో వండుతున్నారు )


