ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. కానీ, అందరిలా ఉద్యోగాలు, కాపురం మాత్రమే చేస్తూ గడపడం మాత్రం వాళ్లకిష్టం లేదు. అందుకే, పెళ్లైన 15 రోజులకే రోడ్డుపైకొచ్చిన ఆ కొత్త జంట… భారతదేశంలోని మారుమూల కుగ్రాలన్నింటినీ సందర్శిస్తూ రెండేళ్లపాటు రోడ్డుపైనే గడపడమే ఈ కథలో విశేషం.

సంగీత్, కావ్య.. వీరిద్దరూ కేరళకు చెందిన జంట. వీరితో పాటు.. వారి పెట్ డాగ్ ను వేసుకుని బయల్దేరారు. వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డట్టే… పెళ్లికి ముందే ప్రేమించుకునే కాలం నుంచి పర్యావరణంతోనూ ప్రేమలో ఉన్న ఈ జంట ఏకంగా పదివేల మొక్కలను నాటుతూ తమ నూతన వివాహ దాంపత్య ప్రయాణాన్ని రోడ్లపై కొనసాగించారు.
https://www.instagram.com/reel/C-40NyQy_2V/?igsh=MW81aThyZXlkaDczdw==
ఇద్దరూ బెంగళూర్ లోని మంచి కార్పోరేట్ ఉద్యోగాలు వదిలేసి.. ఓ ఎస్యూవీ కారు వేసుకుని బయల్దేరారు. మంచి జీతాలు, ఓ సౌకర్యవంతమైన ఇల్లు, ఓ మంచి కారు.. ఇలా జీవితమంటే ఇంతేనని.. అదే పరిపూర్ణమని భావించేవారే ఎక్కువ కనిపించే రోజుల్లో.. ఇవన్నీ కల్గి ఉన్న ఓ నూతనజంట వాటన్నింటినీ కాదని… ప్రకృతి ప్రయాణంలో కొత్త జీవితాన్ని వెతుక్కున్న తీరు విశేషం.
మొత్తంగా రెండేళ్ల పాటు 15 రాష్ట్రాల్లో 45 వేల కిలోమీటర్లు ప్రయాణించింది సంగీత్, కావ్య జంట. లైఫ్ ఓన్స్ రోడ్స్ అనే వీరి ఇన్ స్టా పేజీకి 2 లక్షల 40 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారంటేనే… ఈ జంట ప్రకృతి ప్రయాణాన్ని ఎందరు ఫాలో అవుతున్నారో అర్థమైపోతుంది.
వారికి ప్రయాణమే గురువు!
పీహెచ్డీలు, మాస్టర్స్ చేసినంత మాత్రాన.. రోడ్డుపై ఏం నేర్పగలవన్నది ఈ జంట భావన. చాలా నిరాడంబరంగా జీవించడమెలాగో తెలుసుకున్నాం. తమకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్లే ఎలాంటి రందీ, రాపాటు లేకుండా సంతోషంగా బతుకుతున్నప్పుడు మేమెందుకు జీవించలేమన్నదే మా ఫిలాసఫీ అంటోంది సంగీత్, కావ్య జంట.
https://www.instagram.com/reel/CsliqwVJW3e/?igsh=bDVrZWd1bHV2d3Bv
సంగీత్, కావ్య కథ ప్రారంభమెలా అయిందంటే..?
కేరళ పాలక్కాడ్ జిల్లా పట్టాంబీకి చెందిన సంగీత్ ఎంబీఏ పూర్తి చేసి సేల్స్, మార్కెటింగ్ లో ప్రొఫెషనల్ గా ఎదిగాడు. కావ్య డెయిరీ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. ఇద్దరూ హైస్కూల్ నుంచే ఫ్రెండ్స్. సంగీత్ కు ఆది నుంచీ మోటార్ బైక్ పై రైడింగంటే తెగ ఇష్టం. అదే కావ్యకు కూడా నచ్చేసింది. అలా ఇద్దరూ ప్రయాణం పట్ల మక్కువ పెంచుకున్నప్పుడే… వీరి ప్రేమ ప్రయాణం మొదలై పెళ్లి వరకూ తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ బెంగళూరులో ఉద్యోగంలో కూడా ఒక్క చోటే పనిచేయడంతో… వీరి జీవన ప్రయాణం మరింత సులభమైపోయింది. ఉద్యోగాల్లో రిలాక్స్ అయ్యేందుకు వారాంతాల్లో ఇద్దరూ హైస్కూల్ తరహాలోనే వీకెండ్ ట్రిప్స్ తో ఎంజాయ్ చేస్తున్న తరుణంలో చిన్ననాట మొదలైన స్నేహం, ఇద్దరి ప్రేమను మరింత చిగురింపజేసింది.
ప్రతీ శనివారం వచ్చిందంటే చాలు.. సంగీత్, కావ్య బయటకెళ్లాల్సిందే. అలా వెళ్లి ఎక్కడో చుట్టూ కొండలు, వాగులు, వంకలు, పిచ్చుకలు, దట్టమైన అడవీ, సెలయేళ్లు… ఇలా క్యాన్వాస్ పై ఓ ఆర్టిస్ట్ చిత్రీకరించినట్టు కనిపించే ప్రాంతాలనెంచుకుని అక్కడే ఓ టెంట్ వేసేవారు. తమ ప్రయాణంలో వీరు బయట తినకపోవడం… వారి వంట వారే చేసుకోవడమూ ఓ విశేషమే!
అయితే, అన్ని ప్రాంతాలు ఒకే తీరుగా ఉండకపోవచ్చు. కొంత సాహసోపేతమైన ప్రయాణమే చేసింది సంగీత్, కావ్య జంట. ఆ క్రమంలో కొన్ని చోట్ల ఒకింత భయం, ఆందోళనతో పాటు… చాలాచోట్ల ఆనందానుభూతిని పొందమంటుంది ఈ జంట. అయితే, చిన్నగా ప్రారంభమై మెల్లిమెల్లిగా అలవాటైపోతే.. ఎలాంటి జంకూ బొంకూ లేకుండా ప్రకృతితో ప్రేమలో పడుతూ ప్రయాణించొచ్చంటున్నారు కావ్య, సంగీత్ పెయిర్.

కోవిడ్ సమయంలోనూ బయటకు ప్రయాణాలకు వెళ్లిన ఈ జంట.. సాయంత్రం ఐదు గంటల తర్వాత చాలా ఇబ్బందులు పడ్డామని చెబుతోంది. అయితే, ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేయాలని సంకల్పించుకున్న ఈ జంట.. తమ కుక్క డ్రోగోతో కలిసి ఒక ఏడాదిపాటు సుదీర్ఘమైన ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంది.
అలా తమ కారునే ఓ క్యారవాన్ లా తయారు చేసుకున్నారు. బయట చేయడానికి కనీసం 2 నుంచి 3 లక్షల మధ్య ఖర్చైతుందని తెలుసుకుని.. కేవలం 20 వేల రూపాయల ఖర్చుతో వారే తమకు అనుకూలమైన పద్ధతిలో తమ వాహనాన్ని డిజైన్ చేసుకున్నారు. అలా తమ కుక్కను కాపలాగా తమ వెంట పెట్టుకుని బయల్దేరిన కావ్య, సంగీత్… రోజూ 400 నుంచి 500 కిలోమీటర్ల ప్రయాణం చేసేవారు.
అలా తమ గమ్యంలేని ప్రయాణంలో ఎన్నో మారుమూల కుగ్రామాలకు వెళ్లడం.. అక్కడి జీవన సంస్కృతి గురించి తెలుసుకోవడం.. అక్కడి ప్రజల ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకోవడం.. ఆ ఊరికి దూరంగా స్థానికుల సూచన మేరకు ఓ టెంట్ వేసుకుని.. వారే వండుకుని కేవలం 200 రూపాయల నుంచి 300 రూపాయల మధ్య రోజూవారీ తిండి ఖర్చుతో కొత్త ప్రయాణ జీవితాన్ని ఆస్వాదించారు. ఈ క్రమంలో తమ వెంటే కావల్సిన వంట సామాగ్రి, ఓ పోర్టబుల్ పవర్ స్టేషన్, బాత్రూమ్ సెటప్, టెంట్ వంటి ప్రాథమికమైన సెటప్ ను వెంట పెట్టుకున్నారు.
అయితే, ఎక్కడికెళ్లితే అక్కడ చెత్త పడేయడం వంటివి కూడా చేయకుండా.. ఎంతో బాధ్యతను కూడా కనబర్చింది ఈ జంట. వేస్ట్ నంతా ఒక డస్ట్ బిన్ లో వేసి ఆ ప్రాంతంలోని డంప్ యార్డులో వేసేది. తమ ప్రయాణంలో వివిధ ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో వివిధరకాల వాతావరణ మార్పులు కూడా ఈ జంటకు ఓ సవాల్ గా మారినా.. అవన్నీ ఈ జంట ఇష్టం ముందు అసలు పరిగణనలోకే రాకుండా పోయాయట. అయితే, అదే సమయంలో భారతదేశంలో సవాల్ గా మారిన పర్యావరణ పరిస్థితులను చూసి చలించి… పదివేల మొక్కలు నాటాలని అప్పుడే నిర్ణయించుకుంది సంగీత్, కావ్య జంట. అలా తమ ప్రయాణంలో భాగంగా పదివేల మొక్కలను నాటింది ఈ ఎకో ఫ్రెండ్లీ జంట. అంతేకాదు, రాబోయే మరో ఐదేళ్లల్లో ఇంకో లక్ష మొక్కలు నాటాలన్న సంకల్పంతో మరో ముందడుగు వేస్తోందీ జంట.
మారుమూల గ్రామాలకే ఎందుకు..?
సహజంగా ఎవ్వరైనా కాసింత డబ్బుండి.. ఏదైనా యాత్రలకు వెళ్లాలనుకుంటే.. అయితే, అప్పటికే పాప్యులరైన విహారయాత్రలకో, లేదా తీర్థయాత్రలకో వెళ్తుంటారు. కానీ, అందుకు భిన్నమైన ఆలోచన కావ్య, సంగీత్ అనే ఈ భార్యభర్తలది. కోలంబస్ లా కొత్త ప్రదేశాల్ని కనుక్కుంటూ కుగ్రామాల్లో జనజీవన విధానాన్ని పరిశీలించాలనే మోటోతో మిగిలిన సమాజానికి భిన్నంగా ప్రయాణిస్తోంది ఈ జంట. ఈ ఆలోచనే సమాజంపైన మరింత లోతైన అవగాహన తమ ప్రయాణంతో సాధ్యపడిందంటున్నారు ఈ ఇద్దరు ప్రేమికులు.
కావ్య, సంగీత్ అనుభవాలు!
కావ్య, సంగీత్ ప్రయాణంలో మధ్యప్రదేశ్ లో ఓ ఆసక్తికర అనుభవమెదురైంది. ఈ జంట ఎవరో సెలబ్రిటీలై ఉంటారని జనం గుమిగూడారట. అలాగే ఉత్తరాఖండ్ లోని మున్సియరీ అనే గ్రామంలో ఓ చిరుతపులిని కూడా ఆ ప్రాంతంలో రాత్రి పూట చూడటం.. వారి వెంట ఉన్న కుక్క మొరుగుతుండటంతో ఒకింత ఆందోళనకు గురయ్యారు సంగీత్, కావ్య. అయితే, అదే విషయాన్ని స్థానికులనడిగినప్పుడు.. ఆ చిరుత తరచూ వస్తుంటుందని చెప్పారట అక్కడివారు ఈ జంటకు. అయితే, ఆ రాత్రంతా నిద్రలేని రాత్రి మిగిలిందని గుర్తు చేసుకుంటారు. ఇలా పలు సందర్భాల్లో అటవీ జంతువులను చూడటంతో ఒకింత ఆందోళనకు గురైనా… పట్టువదలని విక్రమార్కుల్లా ఈ జంట రోడ్డుపైనే తమ వివాహనంతర జీవన ప్రయాణాన్ని కొనసాగించిందేగానీ.. వెనుకడుగు మాత్రం వేయలేదు.
ఎన్ని సవాళ్లెదురైనా వెనుకడుగేయని జంట ప్రయాణం కావ్య, సంగీత్ ది!
వివిధ ప్రాంతాల సందర్శన.. ప్రయాణం జీవితంలో కొత్త అనుభవాలతో పాటు, ఎన్నో అనుభూతులను మిగులుస్తోందంటోంది సంగీత్, కావ్య జంట. తాము వెళ్లినప్పుడు మారుమూల కుగ్రామల్లో వారికి లభించే ఆహ్వానం, స్వాగతం వంటివాటితో పాటు.. తమ సోషల్ మీడియా ఖాతాల్లో తమ ప్రయాణంపై ఫాలోవర్స్ నుంచి వచ్చే కామెంట్స్, ప్రోత్సాహం కూడా తమను మరింత ముందడుగు వేయించిందంటోంది ఈ పెయిర్. అయితే, తమ ప్రయాణంలో తమ వెన్నంటి నిల్చిన తమ కుక్క డ్రోగోకు మాత్రం ఈ జంట పూర్తి రుణపడి ఉన్నట్టు చెబుతోంది. తమ మంచి చెడుల్లో తమతో ఉండటంతో పాటు… అటవీ జంతువులేవైనా వచ్చినా.. లేక, ఇంకే అలజడి అనిపించినా తమను అలర్ట్ చేసే తమ విశ్వాసపాత్రమైన కుక్క పాత్రను మరవలేమంటోంది కావ్య, సంగీత్ జంట.
నిజమైన ఆనందం మీరు సంపాదించే డబ్బు కన్నా… మీ అనుభవాల్లో మాత్రమే పొందగల్గుతారంటోంది సాహసం చేయరా డింభకా అన్నట్టుగా దేశమంతా తిరుగుతుకున్న ఈ నూతన జంట. ఇతరులకన్నా తక్కువ సంపాదించినా… ఒకింత ఆసక్తికరంగా, సాహసోపేతంగా, ఆనందంగా బతకడమే జీవిత పరమావధిగా తమ ప్రయాణం సాగుతోందంటోంది కావ్య, సంగీత్ పెయిర్.


