చీటీ రాసుకొచ్చి.. చితక్కొట్టాడు!

డా. మహ్మద్ రఫీ… ✍🏼

క్రికెట్ లో సెంచరీ చేస్తే హెల్మెట్ తీసి బ్యాట్ తో తోటి క్రికెటర్స్ కు, ప్రేక్షక అభిమానులకు అభివాదం చేయడం చూసాం! లేదా పిడికిలి బిగించి గిరాగిరా గాల్లో చెయ్యి తిప్పి పైకెత్తి సక్సెస్ చూపించడం చూసాం! సెంచరీ చేశాక చొక్కా విప్పి గాల్లో తిప్పింది చూసాం! భూదేవికి ముద్దు పెట్టింది చూసాం! ఆకాశానికి ముద్దులిచ్చింది చూసాం! బ్యాటర్లు ఇద్దరు ఒకరికి ఒకరు అభివాదం చేసుకుంది చూసాం! మెడలో వేలాడే లాకెట్ లో వున్న దేవుడికి దండం పెట్టుకున్నది చూసాం! కానీ, చీటీ రాసుకొచ్చి మరీ చితక్కొట్టి సెంచరీ అయ్యాక ఆ చీటీని చూపించడం నిన్న రాత్రి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో తొలిసారి చూసాం!

అదీ ఆత్మ విశ్వాసం అంటే! అదీ అనుకున్నది సాధించడం అంటే! అదీ సంకల్ప బలం అంటే! అవును, భారీ టార్గెట్ ఛేదన! ఎలాగయినా సన్ రైజర్స్ ఓనర్ కు కావ్యరెడ్డికి కాసింత ఆనందం ఇవ్వాలి! అందుకే ఆత్మవిశ్వాసం తో పట్టుదలతో సెంచరీ స్లిప్ రాసుకొచ్చాడు! ఈ సెంచరీ సన్ రైజర్స్ ఆర్మీ కి అంకితం అని రాసుకుని జేబులో పెట్టుకుని బరిలోకి దిగాడు! వస్తూనే చెలరేగిపోయాడు! చప్పట్లు కొట్టి కొట్టి జనానికి చేతులు మంటలు పుట్టాయి కానీ, అతను మాత్రం గ్యాప్ ఇవ్వకుండా కొడుతూనే వున్నాడు! 141 తరువాత ఇక చాల్లే అనుకుని వెను తిరిగాడు! అప్పటికే సన్ రైజర్స్ గెలుపు రాసేసాడు! అతనే అభిషేక్ శర్మ!

సన్ రైజర్స్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్ ను షేక్ చేసి షాక్ ఇచ్చి పడేసాడు! 55 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 10 సిక్సులు బాది 141 పరుగులు చేసి ఉప్పల్ స్టేడియంను ఊపేశాడు! మంచి బ్యాటింగ్ చూడాలని కరువులో వున్న హైదరాబాద్ క్రికెట్ ప్రేమికులకు పండగ చేశాడు! పంజాబ్ కుర్రాడు అభిషేక్ పంజాబ్ టీమ్ పైనే చెలరేగిపోవడం విశేషం!

గత ఏడాది వరల్డ్ పొట్టి కప్ లో అంతర్జాతీయ రంగ ప్రవేశం చేసిన అభిషేక్ జింబాబ్వె పై సెంచరీ చేసి భవిష్యత్ లో తానొక మంచి ఓపెనర్ కాబోతున్నట్లు చెప్పకనే చెప్పాడు! అతను బంతిని గింగిరాలు తిప్పించగల స్పిన్నర్ కూడా! ఈ ఏడాది ఫిబ్రవరి లో వరల్డ్ టి20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 135 పరుగులు చేసి ఏకంగా రికార్డు సృష్టించాడు! ఒకే ఇన్నింగ్ లో అన్ని పరుగులు చేసిన భారత్ బ్యాట్స్ మెన్ మరొకరు లేరు! అలాగే ఒకే ఇన్నింగ్స్ లో 13 సిక్సులు బాదిన రికార్డు కూడా అతనిదే! యువరాజ్ దగ్గర శిక్షణ పొందాడు! శుభమన్ గిల్ కు మిత్రుడు! ఇద్దరూ పంజాబ్ స్టేట్ టీమ్ ఓపెనర్లు! అండర్ 16లోనే సెంచరీ చేసి అందరి చూపు తన వైపు తిప్పుకున్న అభిషేక్ శర్మ వయసు జస్ట్ 24.

2018లో ఢిల్లీ డేర్ డెవిల్స్ అభిషేక్ ను 5.5 మిలియన్లకు కొనుగోలు చేసింది. 2022 నుంచి సన్ రైజర్స్ కు ఆడుతున్నాడు! 42 అత్యధిక సిక్సర్ల రికార్డు అతనిదే! 16 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన రికార్డు అతనిదే! ఈ సీజన్ లో ఇప్పటి వరకు సిక్సర్ కొట్టిన వీరుల్లో అత్యధిక దూరం 106 మీటర్లు బాదిన రికార్డు కూడా అతనిదే! చూస్తుంటే ఇలాంటి రికార్డులు అన్నీ తన పేటెంట్ చేసుకునేలా వున్నాడు అభిషేక్! అమృతసర్ లో జన్మించిన అభిషేక్ ఢిల్లీలో ఇంటర్ వరకు పూర్తి చేశాడు!

కావ్యరెడ్డి ఎంత లేపాలని చూస్తున్నా సన్ రైజర్స్ ఈసారి చతికిలపడుతూనే ఉంది! ప్రతి మ్యాచ్ లోను సెంచరీ కోసం దిగుతున్న అభిషేక్ వచ్చినంత వేగంగా పెవిలియన్ బాట పడుతూనే వున్నాడు! తొలి మ్యాచ్ నుంచి అతని జేబులో this one for orrange army అని చీటీ పెట్టుకునే బ్యాటింగ్ కు దిగుతున్నాడు! అది చెమటతో తడిచి ఇంక్ కూడా ఇంకిపోయింది! మొత్తానికి ఆరవ మ్యాచ్ లో సక్సెస్ అయ్యాడు! 40 బంతుల్లో సెంచరీ చేయగానే ప్యాంట్ జేబులోంచి ఆ చీటీ తీసి ఓనర్ కావ్యరెడ్డి కి చూపించాడు! ఆ తరువాత అభిమానులకు చూపించాడు! ఈ మ్యాచ్ కోసం రాసుకుని వచ్చాడనుకున్నారు అభిమానులు! తోటి ఓపెనర్ ట్రాన్స్ హెడ్ అసలు విషయం డ్రెస్సింగ్ రూమ్ లో చెప్పాడట! తొలి మ్యాచ్ నుంచి ఆ చీటి రాసుకున్నాడని! అది పట్టుదల అంటే! సక్సెస్ అవ్వాలనే కసి! మొత్తానికి సాధించాడు! సన్ రైజర్స్ ను కీలకమ్యాచ్ లో గట్టు ఎక్కించాడు! దటీజ్ అభిషేక్ శర్మ!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles