పరేష్ తుర్లపాటి ✍️
“పరేష్ బాబూ..వంగవీటి రంగా గారు స్కూటర్ మీద వస్తున్నారు” ఆయాసంతో పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు నా మిత్రుడు
నేను ఆశ్చర్యంతో ఆంధ్ర రత్న భవన్ బాల్కనీలోకి వచ్చి కిందకు చూసా
అప్పటికే కింద రంగా గారు స్కూటర్ దిగుతూ కనిపించారు
నా కళ్ళను నేనే నమ్మలేకపోయా
అప్పటికే ఆయన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే ఏంటీ ?స్కూటర్ మీద రావడం ఏంటీ ?
పైగా అప్పటికే ఆయన ప్రత్యర్ధుల హిట్ లిస్టులో ఉన్నారు అని విస్తుబోయేలోపలే రంగా గారు చకచకా మేడ మెట్లు ఎక్కుతున్నారు
అసలు వంగవీటి అంత ఆదరాబాదరాగా స్కూటర్ మీద ఆంధ్ర రత్న భవన్ కు రావలసిన అవసరం ఏంటని తెలుసుకోవాలంటే చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి
నేను జ్యోతి కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ లో ఉండటంతో కాలేజీ విషయాలు మాట్లాడటానికి ఆయన ఉంటున్న ఇంటికి ( అందరూ డాబా అనేవాళ్లు) వెళ్ళి విషయం చెప్తే ” కుర్రాళ్ళు అందరూ వస్తారు కదా.. ఇక్కడ ప్లేస్ లేదు.. అందుకని సాయంత్రము నాలుగు గంటలకు ఆంధ్ర రత్న భవన్ కు వచ్చేయండి.. అక్కడే మాట్లాడుకుందాం ” అన్నారు
గవర్నర్ పేట రాఘవయ్య పార్క్ దగ్గరలో ఉండే వంగవీటి మోహన రంగా ఇళ్లు ఇప్పటి ఎమ్మెల్యేల ఇళ్ళలా కార్పోరేట్ స్టైల్లో కాకుండా చాలా సాధారణంగా ఉండేది
మేడ మెట్లు ఎక్కి మొదటి అంతస్తులోకి వెళ్తే ముందు చిన్న వరండా వస్తుంది
ఆ వరండాలో చిన్న చెక్కబల్ల వెనక చెక్క కుర్చీ.. పక్కన వచ్చినవాళ్ళు కూర్చోవడానికి నాలుగు రేకు ఫోల్డింగ్ కుర్చీలు ఉండేవి
అదే ఎమ్మెల్యే ఆఫీసు
ఎంతమంది వచ్చినా ఆ చిన్న వరండాలో ఆయన్ని కలిసి సమస్య చెప్పుకుని వెళ్ళిపోయేవారు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో వంగవీటి సిటీ కాంగ్రెస్ కన్వీనర్ అయ్యారు
అప్పట్నుంచి ఆయన మీటింగులు ఆంధ్ర రత్న భవన్ ( సిటీ కాంగ్రెస్ ఆఫీసు ) లో పెట్టుకునేవారు
అందుకని ఆయన చెప్పిన టైమ్ ప్రకారం ఆంధ్ర రత్న భవన్ కు వచ్చి నేను నా మిత్రులు వెయిట్ చేస్తున్నాం
ఈ లోపు వంగవీటి స్కూటర్ మీద రావడం జరిగింది (అనుచరుడు ఆయన్ని డ్రాప్ చేశాడు)
అప్పట్లో ఎమ్మెల్యేలకు గన్ మెన్ సౌకర్యం లేకపోవడంతో సింగిల్ గానే రిస్క్ తీసుకుని వచ్చారు
అసలు కారు ఉండగా అంత హడావుడిగా స్కూటర్ మీద ఎందుకు వచ్చారో అని మనసులో నాకొచ్చిన డౌట్ కు సమాధానం ఆయనే చెప్పారు
అదేంటో తెలుసుకోవాలంటే మళ్లీ ప్రస్తుతానికి రావాలి
వంగవీటి హాల్లోకి వస్తూనే ” సారీ అయ్యా.. లేట్ అయ్యిందా? సమయనికి కారు బయటికి వెళ్ళింది.. మన కుర్రాడ్ని డ్రాప్ చెయ్యమని చెప్పి స్కూటర్ మీద వచ్చేసాను ” అని నవ్వుతూ చెప్పారు
ఆ కమిట్మెంట్ కు మేమంతా నోరెళ్ళబెట్టాం
ప్రత్యర్ధుల నుంచి ప్రాణహాని ఉందని తెలిసి కూడా,
ఏదో ఒక చిన్న కాలేజీ కుర్రాళ్ళ కోసం ఎమ్మెల్యే అయి ఉండి కూడా యెటువంటి భేషజాలకు పోకుండా అంత సింపుల్ గా స్కూటర్ మీద రావడం చూసిన తర్వాత వంగవీటి నాయకుడిగా అంత త్వరగా ఎందుకు ఎదుగుతున్నాడో అర్ధమైంది
ఆయన ఎమ్మెల్యే కాకముందు పాత అంబాసిడర్ ఉండేది
ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యేలకు ఇచ్చే వెహికల్ లోన్ తో మహీంద్రా జీప్ కొనుక్కున్నారు
ఎక్కడికి వెళ్ళాలన్నా ఉన్నది అదొక్కటే వాహనం
ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానంటే అప్పట్లో ఆయన దగ్గర శిష్యరికం చేసిన చాలామంది ఈరొజు అద్దాల మేడల్లో ఉంటూ ఫార్టూనర్ కారుల్లో తిరుగుతుంటేనూ…
రోజులెప్పుడూ ఒకలా ఉంటాయా ఏంటీ ?
నేటి రాజకీయనాయకులు అప్డేట్ అయిపోయారు
అదీ సంగతి!


