బ్యూరోక్రాట్ నుంచి కార్టూనిస్టుగా… ఓ ఐఏఎస్ ప్రయాణం!

ఒక బ్యూరోక్రాట్‌ … కార్టూనిస్ట్‌గా ఎలా మారాడు?
……………………………………………………………….

Shyammohan , Cartoonist, Journalist… ✍️

‘ మనం ఎక్కువగా విషయాలను acute angle లో చూసే ప్రయత్నం చేస్తాం, అంటే విమర్శాత్మక దృష్టితో. కానీ ప్రతి సంఘటనలో ఒక ‘‘విస్తృత కోణం’’ ( obtuse angle ) ఉంటుంది, దానినే కార్టూనిస్టులు అన్వేషిస్తారు… అదే హాస్యభరితమైన, వినోదాత్మక కోణం.’ అంటారు తన తొలి కార్టూన్‌ సంకలనం ముందుమాటలో బీపీ ఆచార్య.

ఈ ఆలోచనే నా బాల్యం నుంచే నన్ను ప్రేరేపించింది. ప్రఖ్యాత కార్టూనిస్టులు ఆర్కే లక్ష్మణ్‌, మారియో, కుట్టి మరి కొందరు ఇండియన్‌ కార్టూనిస్టుల అద్భుతమైన స్ట్రోక్స్‌ను అనుకరించే ప్రయత్నం చేసాను. the Illustrated Weekly of India లో ఆర్కే లక్ష్మణ్‌ వేసిన ఆకర్షణీయమైన కారికేచర్స్‌ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. వ్యక్తుల గుణగణాలను చక్కగా ప్రతిబింబించిన ఆయన సరళమైన గీతలు నన్ను మెస్మరైజ్‌ చేశాయి.వ్యక్తుల ముఖాలను వివిధ హావభావాలతో గీయడమనే అలవాటు ను లక్ష్మన్‌ ద్వారా నేర్చుకున్నాను.అదే నన్ను కార్టూనిస్టుగా ఎదగడానికి ఉపయోగపడింది.’ అని వినయంగా అంటారు బీపీ ఆచార్య.

ఆయన అనుభవాల ప్రయాణం చూపించే తొలి కార్టూన్‌ సంకలనం “Obtuse Angle” జనవరి 24, 2025న హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ సందర్భంగా హైటెక్‌సిటీలోని సత్వా నాలెడ్జ్‌ సిటీలో విడుదల కానుంది. రాజకీయ,ఆర్ధిక ,సామాజిక అంశాల పై వేసిన 100కు పైగా కార్టూన్‌లు ఈ పుస్తకంలో ఉన్నాయి.

ఆవిష్కరణ కార్యక్రమాన్ని అవార్డు విన్నింగ్‌ జర్నలిస్టు దినేశ్‌ శర్మ నిర్వహిస్తారు. ఈ బుక్‌ విడుదల సందర్భంగా కార్టూనిస్టుగా మారిన బ్యూరో క్రాట్‌ జీవన చిత్రం ఇది.
………………………….
పాలనాధికారిగా ప్రత్యేక ముద్ర

ఒడిశా రాష్ట్రానికి చెందిన బీపీ ఆచార్య 1983 వ బ్యాచ్‌ సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి. 1985లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోని భద్రాచలంలో సబ్‌ కలెక్టర్‌ గా పనిచేయడంతో ఆయన ఉద్యోగ జీవితం మొదలయింది. అప్పట్లో గోదావరి వరదలు వచ్చినపుడు ప్రజలకు నష్టం కలుగకుండా ఆచార్య తీసుకున్న ముందు జాగ్రత్తల వల్ల ప్రాణ నష్టాన్ని నివారించారు. ఆ తరువాత వరంగల్‌ జిల్లా డిడిఓగా, కలెక్టర్‌ గా 7 ఏళ్లు పని చేసి, తీవ్రవాద సమస్యల నుండి ప్రజలను కాపాడి జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. కాకతీయ ఉత్సవాలను నిర్వహించి తెలంగాణ సంప్రదాయాలను గౌరవించారు. వినూత్నంగా అక్షర దీపిక కార్యక్రమాన్ని రూపొందించి నిరక్షరాస్యతను గణనీయంగా తగ్గించారు.
ప్రపంచ స్థాయి పారిశ్రామిక క్లస్టర్‌లు
………………………………………………………


అనంతరం పరిశ్రమలు , వాణిజ్య శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆయన చేసిన కృషి అపారం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 20 కి పైగా ప్రపంచ స్థాయి పారిశ్రామిక క్లస్టర్‌ల అభివృద్ధికి కృషి చేశారు. పలు పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సులభతరం చేశారు. ఈ క్లస్టర్లు నేడు వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తున్నాయి.

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిని ఎదుర్కోనేందుకు భారత్‌ సిద్ధమైన వేళ భారతదేశంలోని కోవిడ్‌ టీకా కోవాక్సిన్‌ ఉత్పత్తి హైదరాబాద్‌ లోని, జీనోమ్‌ వ్యాలీ లో జరిగింది. ఈ సంస్థ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి ఆచార్య.

భారతదేశం కోవాక్సిన్‌ని ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు యావత్‌ జనావళి ముకుళిత హస్తాలతో మనదేశానికి అభివాదం చేశారు. పరిశ్రమల శాఖ అధికారిగా ఆయన చేసిన కృషి వల్లనే భారత్‌ బయోటెక్‌ ఏర్పాటయింది.

తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి ప్రాజెక్టులకు భూమిని కేటాయించడమే కాకుండా నీటి సరఫరా, నిరంతర విద్యుత్‌ , రహదారి కనెక్టివిటీ వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలను కల్పించడంలో కూడా సహకరించారు.

కళలన్నా ,కార్టూనిస్టులన్నా అభిమానం.
…………………………………………
2001 లో హైదరాబాద్‌లో ‘ఫోరం ఫర్‌ పొలిటికల్‌ కార్టూనిస్ట్స్‌’ దేశంలోనే తొలి సారిగా నిర్వహించిన జాతీయ కార్టూన్‌ ఫెస్టివల్‌ విజయవంతం కావడానికి ఆచార్య గారు ఎంతో కృషి చేశారు. భారతీయ ప్రముఖ కార్టూనిస్టులందరినీ హైదరాబాద్‌ ఆహ్వానించి గౌరవించారు. నీటి సమస్యలు, మహిళావివక్ష, టెక్నాలజీ మీద నిర్వహించిన అంతర్జాతీయ కార్టూన్‌ పోటీలకు ప్రఖ్యాత కార్టూనిస్టు బాపు గారితో కలిసి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
…………………………………………………..
బ్యూరో క్రాట్‌ నుండి కార్టూనిస్టుగా ఎలా మారారు?

‘ముస్సూరీలో శిక్షణ అనంతరం, గ్రామీణ ప్రాంతాల్లో ఫీల్డ్‌ పోస్టింగ్‌ల పనిలో పడి నా ప్రియమైన కార్టూనింగ్‌ హాబీకి తగిన సమయం దొరకలేదు. అయినప్పటికీ కార్టూన్లు గీయడానికి సంవత్సరానికి ఒక రోజు కేటాయించాను. ప్రతి కొత్త సంవత్సరం శుభాకాంక్షల కోసం బంధువులను మిత్రులకు ప్రత్యేకంగా ఒక కార్టూన్‌ గ్రీటింగ్‌ గీసి పంపడం అలవాటు చేసుకున్నాను.’ అన్నారు.

ఆచార్య కార్టూన్‌ శైలిలో ఆర్కే లక్ష్మణ్‌ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.

లక్ష్మణ్‌తో పాటు మారియో మిరాండా ప్రత్యేక శైలీ కూడా నాకు చాలా ఇష్టమైంది. వియత్నాం యుద్ధం, బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటం జరిగిన కాలంలో, నాకు 9-10 సంవత్సరాల వయసు. అప్పటి పత్రికలు ప్రతి రోజు ప్రచురించిన కార్టూన్లు

నా ఊహాశక్తిని పెంచాయి. ఆ కార్టూన్‌లతో ఉన్న అనుబంధం, వాటి వెనుక ఉన్న హాస్యభావం, నా జీవితానికి ఒక ప్రత్యేక దిశను చూపాయి.’ అన్నారు తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆచార్య .
1990ల మధ్యలో, ఆంధ్రప్రదేశ్‌ IAS బులెటిన్‌లో‘ ” Obtuse Angle ’’ పేరుతో ప్రతినెలా ఒక కార్టూన్‌ ప్రచురించే అవకాశం కలిగింది. ఈ కార్టూన్లలో నిత్యజీవన సంఘటనలు, ప్రజలతో, సహచరులతో, రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాల చమత్కారాలను చూపించడానికి ప్రయత్నించాను.
అయితే, ప్రభుత్వ అధికారిగా ఉన్నాను కాబట్టి విధాన పరమైన ఆంక్షలను దాటకుండా, అత్యంత జాగ్రత్తగా సబ్జెక్టులు ఎంచుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత, 2012లో బులెటిన్‌ ముద్రణ నిలిచిపోయింది.
అదృష్టవశాత్తూ, 2008లో ముంబైకి చెందిన ఎకనమిక్‌ జర్నల్‌ Money Life కి చెందిన సుచేతా దలాల్‌, దేబాశిష్‌ బసు ఒక సందర్భంలో కలిశారు. నేను కార్టూన్లు గీయడం గురించి ప్రస్తావించగా, వారు ఆశ్చర్యంగా ‘‘మీ కార్టూన్లు మాకు ఎందుకు పంపించకూడదు?’’ అని అడిగారు. ఆ ఆఫర్‌ని నేను వెంటనే అంగీకరించాను, అయితే ఆర్థిక విషయాలపైనే కార్టూన్లు గీశాను.

2023లో, Hans India ఎడిటర్‌ వి. రాము శర్మ గారు “Medley” శీర్షికతో, ప్రతి గురువారం నా కార్టూన్లను ప్రచురించేందుకు అవకాశం ఇచ్చారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కార్టూన్లు గీయడం నాకు సులభం కావడంతో వారికి కార్టూన్లు ఇచ్చాను. వాటిల్లో కొన్ని కార్టూన్లు విడుదల కాబోతున్న obtuse angle పుస్తకంలోని చాప్టర్‌ 4 లో పొందుపరిచాం. నా పదవీ విరమణ సమయం దగ్గరపడుతుండగా, నాకు విశ్రాంతి మాత్రమే కాకుండా, నా హాబీని మరింత స్వేచ్ఛగా కొనసాగించడానికి గొప్ప అవకాశాలు కలిగిన భావన కలిగింది. 2020 ఆగస్టు లో, నా రిటైర్మెంట్‌కు కొన్ని నెలల ముందు, the Pioneer daily ఎడిటర్‌ బి కృష్ణ ప్రసాద్‌ గారు నాకు కాల్‌ చేసి, ప్రతి వారం కార్టూన్లు అందించాలని సూచించారు. ఆ విధంగా ‘ Obtuse Angle’’ పేరుతో నా కార్టూన్‌ కాలమ్‌ తిరిగి ప్రారంభమైంది.

మొదట నేను నల్ల తెలుపు కార్టూన్లను పంపించాను. కానీ అవి ఫ్రంట్‌ పేజీలో కలర్‌ ఫోటోలతో ప్రచురితమవుతున్నందున, రంగుల కార్టూన్లకు మారడం అవసరమని అనుకున్నాను. ఇలా, నా హాబీకి రంగులు అద్దాయి. పదవీ విరమణ తరువాత వేసిన కార్టూన్లు అన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి! ’ అని తన కార్టూనిస్టు జర్నీని వివరించారు ఆచార్య.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles