ఎంత చెట్టుకు అంత గాలి అంటారు పెద్దలు. ఇవాళ మెట్రోపాలిటన్ సిటీస్ లో పెరిగిన కాస్ట్ ఆఫ్ లివింగ్ చూస్తుంటే.. ఈ మాట ఎంత అక్షరాలా ఎంత నిజమో కళ్లకు కట్టాలనుకున్నాడు ఓ టెకీ. కానీ, తను సింపతీ పొందుతాననుకున్నాడో, నగర జీవనం వ్యయం గురించి చెప్పాలనుకున్నాడోగానీ.. వైరల్ గా మారిన పోస్ట్ మాత్రం ఆయన్ను తెగ ట్రోలింగ్ కు గురిచేస్తోంది. బెంగళూరుకు చెందిన ఆ ఇంజనీర్ ఇంతకీ ఏం పోస్ట్ చేశాడు..?
ఆస్ వోరా జైన్ అనే టెకీ లింక్డ్ ఇన్ లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ పై కనిపిస్తోంది. జైన్ ఏమంటాడంటే.. ఏడాదికి తాను ఏకంగా ఒక కోటి 80 లక్షల వేతనాన్ని పొందుతున్నాడు. అయినా, తనకు ఆ డబ్బు సరిపోవడంలేదన్నది జైన్ అసంతృప్తి.

జైన్ బెంగళూర్ లో ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మంచి పొజిషన్ లో పనిచేస్తున్నాడు. నెలకు కటింగ్స్ అన్నీ పోను 8 లక్షల 30 వేల జీతం తన చేతికందుతోంది. అయినా, జైన్ ప్రతీనెలా ఇంకా 57 వేల రూపాయల అప్పుతో ఆ నెలను ముగించాల్సి వస్తోంది.
అయితే, ఎంత చెట్టుకు అంత గాలి అనే విషయాన్ని వివరిస్తూనే… మెట్రోపాలిటన్ నగరాల్లో జీవితాలు ఎంత కాస్ట్లీగా మారిపోయాయి.. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంతగా భరించలేకుండా అయిపోయిందో చెప్పే ప్రయత్నం చేద్దామనుకున్నాడు. అయితే, తాను చెబుతున్న విషయానికి కన్విన్స్ అయ్యేవారి సంఖ్య కంటే… రివర్స్ పంచులతో జైన్ ను కడిగిపారేసే కామెంట్సే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయనకెదురవుతున్నాయి.
అన్ని ట్యాక్సెస్ మినహాయింపుతో కలిపి ఏడాదికి కోటి చొప్పున.. నెలకు 8 లక్షల 30 వేల చొప్పున డబ్బు చేతికొస్తున్నా… తనకెందుకు డబ్బులు మిగలడం లేదో కూడా జైన్ కూలంకషంగా వివరించాడు.
బెంగళూరులోని ఇందిరానగర్ లో అద్దె తీసుకున్న 3 బీహెచ్కే ఫ్లాట్ కు నెలకు 1 లక్షా 50 వేలు చెల్లిస్తున్నాడు జైన్. ఇక మరో లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. బీఎండబ్ల్యూ కారు కోసం సుమారు ప్రతీనెలా 80 వేల రూపాయల ఈఎంఐ చెల్లిస్తున్నాడు. ఇక ఇంట్లో తన బట్టలు ఉతకడం, ఇస్త్రీ కోసం ప్రతీనెలా ఓ 15 వేల ఖర్చవుతోంది. మరో 70 వేల రూపాయలు తానున్న బిజీ షెడ్యూల్ లో ఫుడ్ ఆర్డర్స్ చేయడంతో.. స్విగ్గీ, జోమాటోల ఆర్డర్స్ కు కలిపి ప్రతీనెలా 70 వేల రూపాయల వరకూ ఖర్చు చేస్తున్నాడు. ఇక 5 స్టార్ హోటల్స్ లో ఫ్రెండ్స్ తో కలిసి కాక్ టెయిల్ పార్టీలు, ఫైన్ డైనింగ్ కు కలిపి మరో 1 లక్షా 20 వేల రూపాయల ఖర్చుతో పాటు.. వారాంతంలో గోవా, దుబాయ్, హంకాంగ్ వంటి దేశాలకు వెళ్లివస్తుండటంతో కనీసం లక్ష రూపాయలు వాటికి ఖర్చవుతోందంటూ తన లెక్కలనూ వివరిస్తూ లింక్ట్ ఇన్ లో పోస్ట్ చేశాడు జైన్.
వీటికి తోడు బ్రాండెడ్ వైట్ టీషర్ట్స్ కు ఓ పదివేలు, ప్రీమియం ఆర్గానిక్ వైన్ కోసం మరో 50 వేలు, ఫిట్ నెస్ కోసం వెళ్లే జిమ్ ఖర్చులు, ఆ జిమ్ లో పర్సనల్ ట్రైనర్ కు కూడా చెల్లించే మొత్తం కలిపి మరో 12 వేలు, క్రిప్టో కరెన్సీతో పాటు, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులకు మరో లక్ష రూపాయలు.. ఇలా మొత్తం ఖర్చులన్నీ కలిసి 8 లక్షల 87 వేల వరకూ అవుతున్నాయి. దీంతో ప్రతీనెలా జైన్ సంపాదించేంది.. అన్ని కటింగ్స్ పోనూ తన చేతికొచ్చేది 8 లక్షల 30 వేల రూపాయలైతే… అదనంగా 57 వేల రూపాయలు జైన్ అప్పు చేయాల్సి వస్తోందని వాపోతున్నాడు.
ఇంత సంపాదిస్తున్నా.. తాను ఆర్థికంగా కుదురుకోలేకపోతున్నానని.. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయిందన్నది జైన్ ఏడుపు.
వారానికి 40 గంటలపాటు పనిచేసి ఏడాదికి 1 కోటి 80 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ… 57 వేల వరకూ ప్రతీనెలా అప్పు చేయాల్సి రావడంపైన జైన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ… అసలీ నగరానేకేమైంది అంటూ ఈ పోస్ట్ చేశాడు.
అయితే, మెట్రోపాలిటన్ నగర జీవితం ఎంత వ్యయంగా మారిందో చెప్పేందుకే జైన్ ఈ పోస్ట్ చేశాడా… లేక, ఇలా పోస్ట్ చేస్తే నెటిజన్స్ నుంచి ఎలాంటి ప్రతిస్పందనలు వస్తాయో తెలుసుకునేందుకే చేశాడా అన్నది తెలియదుగానీ.,.. ఊహించని వ్యంగ్య సమాధానాలు మాత్రం జైన్ పోస్ట్ పై వెల్లువలా వస్తూనే ఉన్నాయి.
నగరం తప్పేమీ లేదు.. మిమ్మల్ని విలాసవంతమైన జీవితాన్ని గడపమని నగరమెప్పుడూ అడిగి ఉండదు. ముమ్మాటికీ అది మీ తప్పే. మీ మనీ మేనేజ్మెంట్ నిర్వహణ ఎంత అస్తవ్యస్థంగా ఉందో పట్టి చూపే పరిణామమిది అంటూ ఒకరు పోస్ట్ చేస్తే… 30 వేలల్లో కూడా ముంబై, ఢిల్లీల్లో కూడా హాయిగా బతుకుతున్నవారున్నారు.. ఆర్థిక క్రమశిక్షణ లేకుంటే మీలాగా తయారవుతారంటూ మరికొందరు కౌంటర్స్ ఇస్తూనే ఉన్నారు.
దీపేందర్ గోయలే స్వయానా వచ్చి మీకు ఫుడ్ డెలివరీ చేస్తున్నట్టుంది మీ లెక్కలు చూస్తుంటే… ఉన్నదాంట్లో సంతోషంగా బతకడమెలాగో ఆలోచించండంటూ విభిన్నమైన సమాధానాలు జైన్ పోస్ట్ కు చెంపదెబ్బల్లా వచ్చిపడుతున్నాయి.
మీరు నెలకు డెబ్బై, ఎనభై వేల రూపాయల విలువైన భోజనం చేస్తుంటే… మిమ్మల్ని హృదయసంబంధ సమస్యలు కూడా అంతే త్వరగా ముద్దాడనున్నాయి.. అందుకు మీకు అభినందనలంటూ మరొకరు ఇలా సెటైర్స్ వర్షం కురుస్తోంది.
ఇక కొందరేమో టెక్ హబ్ గా పిల్చుకునే బెంగళూర్ పరిస్థితి ఇలా రాను రాను అధ్వానంగా తయారవుతోందంటూ.. కాస్ట్ ఆప్ లివింగ్ పై జైన్ పోస్ట్ ను సమర్థించే యత్నం చేయగా… మీరు దారిద్రరేఖకు దిగువన ఇక్కడ బతకడం సరికాదు.. మీకందే జీతం చాలా చిన్నమొత్తం కాబట్టి, మీరింకేదైనా టైర్ వన్ కంట్రీని వెతుక్కుని అక్కడికి మకాం మారిస్తే మీ జీవితం మారిపోవచ్చంటూ మరింత వెటకారాన్ని దట్టించారు.
భారతదేశంలో నగరాల్లో జీవనం ఎంత వ్యయంతో కూడుకుందో జైన్ పోస్ట్ చెబుతున్నా… అంతకుమించి, ఆర్థిక నిర్వహణలో సరిగ్గా లేకపోతే.. కోట్ల రూపాయలు సంపాదించినా చివరకు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ మిగలని పరిస్థితులెలా నెలకొంటాయో కూడా కళ్లకు కడుతుంది.



